29, ఆగస్టు 2026, శనివారం

అడవి మామిడి.. ఒక అపురూప వృక్షం

 ఆమ్రాతకం కషాయామామ్లమం బృహత్కంఠకర్షణం 

పక్వం తు మధురాంలాడ్యం స్నిగ్ధం కించిత్ కఫాపహం.

కొండ మామిడి లేదా అడవి మామిడి కాయలను " ఆమ్రాతకం " అనీ , కోశామ్రం అనీ పిలుస్తారు. కొండ అంటే హిమాలయాలనే. ఈ మామిడి కాయలను హిమాలయన్ మామిడి అని కూడా పిలుస్తారు. మన వైపు పండే మామిడిని శాస్త్ర పరంగా " మాంజిఫెరా ఇండికా" అని, హిమాలయాల మామిడిని " మాంజిఫెరా సిల్వాటికా" అని పిలుస్తారు. 

ఈ కాయ చివర కొస దేలి ఉంటుంది. సముద్ర మట్టానికి 600 అడుగుల ఎత్తున ఉండే చల్లని ప్రాంతాల్లోనే ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. దక్షిణ మధ్య, తూర్పు ఆసియా దేశాల లో , ముఖ్యంగా అసోం, బంగ్లాదేశ్, నేపాల్, కంబోడియా, మయన్మార్, అండమాన్ నికోబార్ దీవుల్లో వీటి వ్యాప్తి ఎక్కువ. 

మన మామిడి లాగానే జూన్,జూలై నెలల్లో ఈ కాయలు చేతికొస్తాయి. పర్యావరణ నిపుణులు ఈ అడవి మామిడి ని అంతరించిపోతున్న వృక్ష జాతులలో చేర్చారు.

పక్వానికి వచ్చినవి దొరికితే వాటిని వదలకండి. పలక బారి కండ పట్టిన కొండ మామిడి ఊరగాయ పచ్చళ్ళకు అనుకూలంగా ఉంటుందని చెప్తారు.పచ్చివి,లేతగా ఉన్న పిందెలు వగరు, చేదు,పులుపు కలిగి గొంతు నుస పెడతాయి. పలక బారిన కాయలు బాగా వేడి చేస్తాయి. కానీ, చర్మ వ్యాధులున్న వారికి మేలు చేస్తాయి. పండినవి రుచిగా ఉంటాయి. కఫాన్ని కొద్దిగా తగ్గిస్తాయని " భోజన కుతూహలం " గ్రంథంలో తెలిపారు. 

మనం చెత్త బుట్టలో పడేసే మామిడి టెంకే లోపలి జీడికి ఇప్పుడు ప్రపంచ మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. జీడి లో నుండి కొవ్వు పదార్థాలను వేరు చేస్తున్నారు. మన వైపు పండే మామిడి టెంకే లోని జీడి కన్నా ఈ అడవి మామిడి జీడిలో కొవ్వు ఎక్కువగా ఉంటుందని తేలింది. ఇటీవల నిర్వహించిన ఒక పరిశోధన లో చాక్లెట్ తయారు చేయడానికి ఉపయోగించే కోకో బటర్ తో సమానమైన కొవ్వు పదార్థం ఈ అడవి మామిడి జీడి నుంచి లభిస్తుందని , ఉత్పాదకత రీత్యా చూసినప్పుడు కోకో మొక్కల గింజల నుండి తీసే కొవ్వు కన్నా ఇది చాలా చవకగా లభిస్తుందనేది ఈ పరిశోధన సారాంశం . బంగ్లాదేశ్,భూటాన్ వంటి దేశాల్లో ఈ అడవి మామిడి ఎక్కువగా పండుతుంది.

28, ఆగస్టు 2026, శుక్రవారం

సహజ సాంత్వన ఇచ్చే.. సహజ నూనెలు

 ప్రకృతి నుంచి లభించే రకరకాల మొక్కల బీర్లు వేర్లు గింజలు, కాండం, పువ్వులనుంచి సేకరించిన నూనెలను అరోమా తైలాలు అంటారు. వీటిలోని మేలు చేసే కొన్ని పదార్థాలు ముక్కు నుండి మెదడుకు చేరి రక్త ప్రసరణ, ఆలోచన కేంద్రాలు , ఊపిరి తిత్తుల మీద పని చేస్తాయి. వీటిలో చెప్పుకో దగినవి నీలగిరి , జాజి తైలాలు. వీటి లోని కొన్ని పదార్థాలు వాతావరణం లోని క్రిములను సంహరించడానికి ఉపయోగపడతాయి. 

నీలగిరి తో నొప్పులు దూరం..

కప్పు నీళ్లలో 6 చుక్కల నూనె కలిపి పుక్కిలిస్తే నోటి పూత, ఫంగల్ ఇన్ఫెక్షన్లు బాధించవు. జ్వరంతో బాధ పడేవారికి చల్లటి నీళ్లలో 6 నుంచి 10 చుక్కల నీలగిరి తైలం వేసి ఒంటిని తడిపితే జ్వరం త్వరగా తగ్గుతుంది. 

జలుబు, దగ్గు, సైనస్ వల్ల వచ్చే తలనొప్పి బాధిస్తుంటే చేతి రుమాలులో 4 చుక్కలు వేసి పీల్చితే ఉపశమనం లభిస్తుంది. చిన్న పిల్లలకు కఫం పెరిగి గురక పెడుతుంటే 6 నుంచి 10 చుక్కలు నీళ్లలో వేసి పీల్చేలా చూడాలి. 

ఫ్లూ జ్వరం ఉన్నవారికి నీళ్లలో 2,3 చుక్కలు వేసి తాగిస్తారు. కండరాల నొప్పి, నరం పట్టుకు పోయినపుడు కొబ్బరి నూనె లో కొద్దిగా తైలం కలిపి పై పూతగా రాస్తే సమస్య దూరమై హాయిగా ఉంటుంది. 

నల్లులు,పురుగులను నిర్మూలించాలంటే నీలగిరి తైలాన్ని టర్పంటైన్ తైలంలో కలిపి అందులో చిన్న చిన్న కాటన్ ఉండలు వేసి బయటకు తీసి వాటిని మంచాల మూలల్లో, దుస్తుల అల్మారా లో పెడితే వాటి బెడద తగ్గుతుంది. 

నీలగిరి తైలాన్ని తేనె తో కలిపి మొటిమల మీద రాస్తే అవి త్వరగా మానిపోతాయి. ఐతే 6 ఏళ్ల లోపు చిన్నారులకు నోటి ద్వారా ఇవ్వకూడదు. 

హాయి నిద్రకు జాజి నూనె..

మానసిక ఒత్తిడి,ఆందోళనలో ఉన్నవారు వాడితే మంచి గుణం ఉంటుంది.గుండె పనితీరును పెంచుతుంది. ఒంటి నొప్పులతో బాధ పడేవారు కొబ్బరి నూనె తో కలిపి రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి.

బకెట్ నీళ్లలో కొద్దిగా జాజి నూనె ను కలిపి బాలింతలు స్నానం చేస్తే చక్కగా నిద్ర పడుతుంది.మనసుకు హాయిగా ఉంటుంది. ఒత్తిళ్ళు తగ్గుతాయి. అలానే నెలసరి సమయంలో కడుపు నొప్పి అనిపిస్తే పొత్తి కడుపు మీద రాస్తే మంచిది.

తలలో పేలు బాధిస్తుంటే కొబ్బరి నూనె లో జాజి తైలాన్ని కలిపి రాస్తుంటే ఇబ్బంది ఉండదు. చెంచా పాల మీగడలో 4 చుక్కలు  చేర్చి మర్దన చేస్తే ముఖం మీద మచ్చలు తగ్గు ముఖం పడతాయి.

జాజి తైలం..జాగ్రత్తలు..

ఈ తైలాన్ని కొబ్బరి, ఆలివ్ నూనె,తేనె .. ఏదో ఒక దానితో కలిపి కొంచెం వాడితే మంచి ఫలితం ఇస్తుంది. సుగంధ తైలాల వాడకంలో వీటిని ఇతర నూనెలతో కలిపి వాడుకోవాలి. ఇవి ఘాటైన ద్రవ్యాలు కాబట్టి పరిమితంగా వాడాలి. ఉప్పు,నూనె, ఏదైనా పిండిలో కానీ వేసి వాడుకోవాలి. సుమారు 10 నుండి 12 చుక్కలు మించి వాడకూడదు.

చిన్నారులు, వాసన పడని వారు వీటికి దూరంగా ఉండాలి. ఒక్కో సారి ఈ నూనె వల్ల గర్భ స్రావం అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి గర్భిణులు వాడక పోవడం మేలు. కొందరికి పడక వాంతులు,తలనొప్పి సమస్యలు బాధిస్తాయి . కాబట్టి గమనించి వాడుకోవాలి.


24, ఆగస్టు 2026, సోమవారం

శక్తి దాత.. సీతా ఫలం..

 సీతా ఫలం అనగానే తీయని మృదువైన గుజ్జు గుర్తుకు వస్తుంది. దీని లోపలి గుజ్జు కస్టర్డ్ లా మెత్తగా ఉంటుంది కాబట్టి దీనిని ఇంగ్లీష్ లో కస్టర్డ్ ఆపిల్ అని పిలుస్తారు. 

భోజన కుతూహలం గ్రంథంలో సీతా ఫలం గుజ్జును తియ్యని, చలవ చేసేదిగా , పైత్య దోషాలను తగ్గించేదిగా పేర్కొన్నారు. 

సీతా ఫలం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటంటే..

అన్నం సహించక, నోటికి రుచి తెలియని వారికి సీతా ఫలం రుచిని కలిగిస్తుంది. ఇది తినటం వలన ఎక్కువ కఫం పెరగదు. 

మిగల ముగ్గిన సీతా ఫలం లో సహజ చక్కెరలతో పాటు పిండి పదార్థాలు , పీచు, విటమిన్ సి, బి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలున్నాయి. వీటి వల్ల శరీరానికి త్వరగా శక్తి అందుతుంది. పీచు జీర్ణ ప్రక్రియకు తోడ్పడుతుంది. 

సీతా ఫలం పచ్చి కాయను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు.అతిసారం , నీళ్ల విరోచనం తగ్గటానికి దీనిని ఉపయోగిస్తారు. 

కొన్ని ప్రాంతాలలో పచ్చి కాయను బాగా ఎండబెట్టి దానిని పొడిగా దంచుతారు. చర్మ సమస్యలకు ఈ పొడి మంచి మందుగా పనిచేస్తుంది. 

సీతా ఫలం గింజలు నల్లగా మెరుస్తూ ఉంటాయి.అందుకే ఈ మొక్కకు " కృష్ణ బీజ" అనే పేరు కూడా వచ్చింది. ఇవి తినడానికి పనికి రావు. కానీ సంప్రదాయ వైద్యంలో ఈ గింజల పొడి ని చుండ్రు తగ్గించడానికి , పేలను తొలగించడానికి వాడతారు. 

సీతా ఫలం వేడి శరీర తత్వం ఉన్న వారికి చలవనిస్తుంది. దీనికి పిత్త వికారాలు, దాహం, మంట వంటి వాటిని శాంతింప చేసే గుణం ఉంది. 

సీతా ఫలాలు ఎక్కువగా తినటం మంచిది కాదు.ముఖ్యంగా మధుమేహం , స్థూల కాయం ఉన్న వారు వీటిని మితంగా తింటేనే మంచిది. 

16, ఆగస్టు 2026, ఆదివారం

సొర ఆకుల కూర.. ఆయుర్వేదం

 ఆనప్పాదు అనేది తెలుగులో ఒక అందమైన పద బంధము. శాక రాజము అనదగిన సొర కాయకు ఇది ఒక పర్యాయ పదం. ఆహార కొరతను తీర్చే ఒక ప్రకృతి వర ప్రసాదం కూడా ఇంటి పైకాపు మీదకి సురతీగ పాకి పైనుంచి కాయ ఒకటి తెగి జారీ వచ్చి కింద ఉన్న మేక నెత్తిన పడిందట పుటుక్కు జరజర డుబుక్కుమే అని జానపదలు సరదాగా చెప్పుకుంటున్నారు దీనిని. 

రావి కొండల రావు గారు అనప్పాదు గురించి తెలుగు మీస్టారి పాత్రలో సైలెన్స్ అంటూ చేసిన కామెడీ పాత తరానికి ఇంకా గుర్తుండే ఉంటుంది. పొడవుగా ఉండే వాటిని సొరకాయలని, గుండ్రంగా చిన్న కుండలా ఉండే వాటిని ఆనప కాయలు అని అంటారని కొందరు చెప్తారు. కానీ సొర, ఆనబ అని రెండింటిని పిలుస్తుంటారు. తుంబీ , కుంభ తుంబీ అని సంస్కృతంలో పిలుస్తారు వీటిని.

మనకు సొరకాయ వాడకం గురించి వేద కాలము కన్నా ముందు నుండే తెలుసు. 2024లో అమెరికాలోని కార్నల్ విశ్వవిద్యాలయంలో 197 రకాల సొరకాయల జన్యువు లను పరిశీలించడం జరిగింది. దక్షిణాఫ్రికాలో సుమారు 12000 సంవత్సరాల క్రితం పుట్టి అక్కడినుండి ఆసియా, అమెరికా ఖండాలకు సొరకాయ మొక్క వ్యాపించింది అని తేల్చారు. 

సొర మొక్క కాయగూరే కాదు, ఆకుకూర కూడా. వాన కాలంలోనూ, ఆ తర్వాత వచ్చే కార్తీకమాసం ఆహార కరువు కాలంలోనూ పూర్వం మనవాళ్లు ఈ అనబ ఆకులను కూరగా వండుకొని కమ్మగా తినేవారు. తినటానికి పనికొచ్చేది ,పోషకాలను కలిగి పుష్టి, రుచిని కూడా ఇచ్చేది అయినప్పుడు దానిని తినడానికి మనకు నామోషీ ఎందుకు..

ఆనబ ఆకులను సన్నగా తరిగి, ఒక బాండీలోకి తీసుకొని తగినంత ఉప్పు వేసి నీళ్ల మూత పెట్టి మగ్గనిచ్చి ఉల్లి ముక్కలు వగైరా చేర్చి దానిపైన కొంచెం పెరుగు, కొద్దిగా చింతపండు రసం ,కాసింత మినప పిండి కొద్దిగా పొడి బెల్లం కలిపి నెయ్యి వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మెంతులు, ఆవాలు ,జీలకర్ర ,నువ్వు, మినప్పప్పు లాంటివి విడివిడిగా వేయించి మెత్తగా దంచిన పొడిని తగినంతగా ఈ కూరలో కలిపి బాగా మగ్గనివ్వాలి. చివరలో ఇంగువ తాలింపు పెడితే సొర ఆకుల కమ్మని కూర సిద్ధం అయినట్లే. సోరలాంటి తీయ కూరలను అనవసరమైన మసాలాలు, అధికంగా చింతపండు రసాలు కలపకుండా తీపి, పులుపు, ఉప్పు ,కారం ,వగరు, చేదు ఆరు రుచులు ఉండేలాగా నలుడు చెప్పిన విధానం ఇది. 

పాలకూరతో చేసుకున్నట్లే పప్పు ,పులుసు కూర, రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు. పాలక్ లాంటివి గాని, పకోడీలు, పరోటాలు గాని వండుకోవచ్చు. బచ్చలాకు లాగా, జిగురు తోటకూర లాగా వగరు ఉండవు కాబట్టి సోరాకులతో అన్నీ వండుకోవచ్చు. కంద- బచ్చలి లాగానే ఆవపెట్టిన కూర బాగుంటుంది .సోరాకుల సలాడ్ తింటే ఎసిడిటీ ,కడుపులో మంట ,ఇరిటేషన్లు తగ్గుతాయి. 

చింతపండు వేయకుండా పెసర లేదా కందిపప్పుతో కాచిన కట్టులు, సన్నగా తరిగిన సొర ముక్కలను, సొర ఆకులను కూడా కలిపి కాచిన పప్పుచారు లేదా సూపు పొట్టకు మేలు చేస్తుంది. సొర ఆకులను జ్యూస్  తీసి అందులో చారు పొడి వేసి కాచిన చారు చాలా రుచికరంగాను జీర్ణశక్తిని పెంచేదిగాను ఉంటుంది. 

సొరకాయ కున్న గుణాలన్నీ సొర ఆకులకు ఉన్నాయి. ఈ ఆకులలో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము పుష్కలంగా ఉన్నాయి. ఖనిజ లోపాలతో బాధపడే వారికి ఈ ఆకులు వరప్రసాదం అని చెప్పవచ్చు. అమితంగా చలవ చేస్తాయి, శరీరానికి మృదుత్వాన్ని కలిగిస్తాయి .

పశ్చిమ బెంగాల్లో దీపావళికి ముందు జరిగే భూత చతుర్దశి సందర్భంగా చేసే చద్దోశాక్ అనే సంప్రదాయ వంటకంలో 14 రకాల ఆకుకూరలతో పాటు సొర ఆకును కూడా తప్పనిసరిగా కలుపుతారు. సొరాకు ముదిరే కొద్దీ దానిమీద నూగు, ముల్లలాంటి రోమాలు ఏర్పడతాయి. వాటిని తొలగించడం పెద్ద పని అందుకని బాగా లేత ఆకులను మాత్రమే ఎంచుకోవాలి. ఎండ పడే చోట కుండీలో  సొర విత్తులు నాలుగు పాతండి  చాలు, వారానికి ఒకటి రెండు సార్లు మీ ఇంటిల్లిపాది సొర ఆకులను కమ్మగా వండుకుని తినవచ్చు.

16, మే 2026, శనివారం

చిక్కిపోయే వారికి సార పప్పు

 సారపప్పునే చార పప్పు అంటుంటారు మన వాళ్ళు. మొరలి పండు గింజ లోపల ఈ సార పప్పు ఉంటుంది. మొరలి మొక్కనే చార మామిడి అని కూడా కొన్ని తెలుగు ప్రాంతాల్లో పిలుస్తారు. హిందీ వాళ్ళు చిరోంజీ అని,సంస్కృతంలో ప్రియాల అనీ అంటారు. సార చెట్టు అడవి మొక్క. తెలంగాణ,ఆంధ్ర, కర్ణాటక అటవీ ప్రాంతాల్లో ఎక్కువ గా పెరుగుతుంది.దీని పండును యాప్రికాట్ అంటారు. సార పండ్ల కు ఔషధ గుణాలు ఎక్కువ. తీపి, పులుపు రుచులతో జిగురుగా ఉంటుంది. వీటి గుజ్జుని శరీరం క్షీణించి పోయే వ్యాధుల్లో ఇస్తారు.బాదం బంక లాగానే ఈ చెట్టుకీ తుమ్మ లాంటి జిగురు వస్తుంది. ఈ జిగురుని ఎండ బెట్టి అమ్ముతారు. కముకు దెబ్బల్లోనూ , కీళ్ల వాపుల్లోనూ ఈ జిగురుని కడుపులోకి తీసుకుంటే వాతపు నొప్పులు తగ్గుతాయి.బాదం పప్పు లాగే సార పప్పు తియ్యగా ఉంటుంది.ఇది శరీరంలో శక్తిని పెంపొందింప చేస్తుంది. వాతాన్ని,వేడిని తగ్గిస్తాయి.గుండెకి మంచి చేస్తాయి. అతిగా తింటే మల బద్ధకం పెంచుతుంది.ఆలస్యంగా జీర్ణం అవుతాయి. అజీర్తి తో బాధ పడే వారు అతిగా తింటే కీళ్ల వాతం పెరుగుతుంది.వీటి వాడకం మిఠాయిల తయారీ పరిశ్రమలోనే ఎక్కువ.వక్కపొడి, బూందీ మిక్చర్ ,పాయసంలోనూ ఈ గింజల్ని కలుపుతుంటారు.

శరీరానికి మృదుత్వాన్ని ఇస్తాయి.పేగుల కదలికలను పెంచుతాయి.అందుకని సరైన మోతాదులో తీసుకుంటే విరేచనం అయ్యేలా చేస్తాయి.

వేరుశనగపప్పు లాగే ఇది కూడా నూనె గింజ దీని నుంచి తీసిన నూనెను చిరంజి నూనె లేదా సార పప్పు నూనె అంటారు ఈ నూనె తలకు రాసుకుంటే వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడతాయి. 

ఈ గింజలను కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేగించి మిక్సీ పట్టిన పొడిని మసాలాలతో పాటు కలిపి వాడుతుంటారు శుష్కించిపోయే పిల్లలకు వేయించిన గింజల పొడిని పావు చెంచా నుండి అర చెంచా మోతాదులో గ్లాసు పాలలో కలపాలి ఆ పాలను రోజు ఇస్తుంటే ఎదుగుదల బాగుంటుంది బరువు తగ్గటాన్ని నిరోధిస్తుంది అలాగని స్థూలకాయాన్ని కలిగించదు. సార పప్పు వేడి వలన వచ్చే అలసటను పేగుల్లో పెరిగిపోయిన ఉడుకును తగ్గిస్తుంది న్యూరోపతి లక్షణాలతో బాధపడే వారికి మేలు చేస్తుంది అరికాళ్ళలో మంటలు జ్వరం తగ్గుతుంది పొట్ట నిండినట్టుగా ఉంటుంది అందువల్ల ఆహార ఆహారాన్ని తక్కువగా తీసుకోవడానికి వీలవుతుంది ఇది పరోక్షంగా షుగరు ఊబకాయం వ్యాధులు ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది.

2, మే 2026, శనివారం

వృద్ధాప్యాన్ని జయించే ఉసిరి

 ఆమలకం కషాయామ్లం మధురం శీతలం లఘు.. దాహపిత్త వమీ  మేహా శోషజ్ఞంచ రసాయనం..

అమలకి అంటే పుట్టనిండా పోషకాలు నిండిన అమృతభాండం అని అర్థము. పూర్వం కార్తీక మాసం సమయంలోనే అందుబాటులోకి వచ్చేవి ఇప్పుడు వివిధ ప్రాంతాలకు చెందిన ఉసిరికాయలు ఏడాది పొడవునా మార్కెట్లకు వస్తున్నాయి కాబట్టి రకరకాల పద్ధతులను తాజా ఉసిరికాయలను అనునిత్యం వాడుకునే అవకాశం ఇప్పుడు ఉంది. 

ఆమ్లకిని ఆహారానికి ముందు ఆహారంతో పాటు కానీ ఆహారంగానూ ఆహారం తర్వాత కూడా తీసుకోవచ్చు. కీళ్ల నొప్పులు నడుము నొప్పి పక్షవాతంలాంటి వాత వ్యాధులు ఉన్నవారికి గ్యాస్ ఉబ్బరం ఉన్నవారికి ఆమ్లకి దివ్య ఔషధం దీని గుజ్జులు ఒక చెంచా స్వచ్ఛమైన నువ్వుల నూనె కలిపి తీసుకున తర్వాత వేడి నీళ్లు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. 

స్థూలకాయం షుగర్ వ్యాధి ఉబ్బసం ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు రోజు ఒక ఉసిరికాయ తినడం వలన మేలు జరుగుతుంది ఉసిరికాయ గుజ్జులు పసుపు అల్లం మిర్యాల పొడి కొత్తిమీర పుదీనా లాంటిది కలిపి టీ తయారు చేసుకుని ఉదయం తాగితే ఉపయోగకరంగా ఉంటుంది. 

కడుపులో మంట అల్సర్లు వాంతి వేడి చేసిన లక్షణాలతో బాధపడే వారికి ఉసిరికాయ గుజ్జుతో తేనె కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. 

ఉసిరికాయల గుజ్జు దాల్చిన చెక్క పొడి పసుపు ఒక కప్పు నీళ్లలో కలిపి మరిగించి రోజు తాగుతూ ఉంటే ఊపిరితిత్తుల వ్యాధులలో ఉపయోగకరం దగ్గు తీవ్రమైన జలుబు పడిశ భారానికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

ఉసిరికాయలు అమితంగా చలవనిస్తాయి వేసవిలో దప్పిక తీరుతుంది వడదెబ్బ నుండి రక్షణ కలుగుతుంది జీర్ణశక్తిని పెంపు చేస్తుంది వెన్నపూసతో తీసుకుంటే పేగులకు చలవతో పాటు మృతుత్వం కలుగుతుంది కొద్దిగా బెల్లం ఉసిరికాయ గుజ్జు కలిపి ఒక కప్పు నీళ్లు పోసి మిక్సీ పట్టి తాగితే వెంటనే ఉపశమనం కనిపిస్తుంది మూత్రశయానికి సంబంధించిన సమస్యలన్నిటికీ ఉపయోగపడుతుంది. 

రోజు ఒక ఉసిరికాయ తీసుకుంటే మూత్రపిండాలు లేవారు ఆరోగ్యవంతంగా ఉంటాయి కలబంద ఆమ్లాకి కలిపి జ్యూస్ తీసుకుని అరకప్పు చొప్పున రోజు తాగుతుంటే లివర్ బల సంపన్నం అవుతుంది. 

ఆమ్లకి తీపి క్యాండీలు బజార్లలో దొరుకుతాయి పిల్లలకు రోజు రెండు లేదా మూడు క్యాండిల్ ఇస్తుంటే వారి శారీరక మానసిక ఎదుగుదల బాగుంటుంది 

ఉసిరి మన ఆరోగ్య సిరి తేనెతోను బెల్లం తోను రోజు కొద్దిగా ఉసిరి చూసి ఇస్తూ ఉంటే పిల్లల్లో మేధా సంపత్తి పెరుగుతుంది దురదలు అకారణంగా వచ్చే జ్వరాలు దప్పిక అరికాళ్ళ మంటలు అజీర్తి అన్న హితవు లేకపోవడం మలబద్ధకం లాంటి సమస్యలన్నీ తగ్గటానికి ఉసిరికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది ఆమ్లకితో పప్పు రోటి పచ్చడి చేసుకోవచ్చు చారు కాచుకోవచ్చు ఆమ్లకు పులిహోర కమ్మగా ఉంటుంది ఉసిరికాయ అంటే పోషకం మాత్రమే కాదు ముసలితనం ముంచు కు రాకుండా శరీర కాంతిని కాపాడుతుంది.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...