4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

మారేడు పూల హల్వా.. ఆయుర్వేద ఉపయోగాలు..

 నిహన్యాద్బిల్వజం పుష్పమతీ సారం తృషాం వమీం.. మారేడు చెట్టును శివుడిపై భక్తితో పెంచుకునే వారే ఎక్కువ.కానీ దాని పూలు, ఆకులు, కాయలు అన్నీ ఔషధ ప్రయోజనాలు కలిగించేవే.. 

మారేడు,మర్రి, రావి ఇవన్నీ వాతావరణం నుంచి ఎక్కువ కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకుని ఎక్కువ ఆక్సీజన్ ఇచ్చే చెట్లు. భోజన కుతూహలం గ్రంథంలో ఆహార యోగ్యమైన పువ్వుల గురించిన ప్రకరణం ప్రారంభిస్తూ మారేడు పూలను మొదటగా ప్రస్తావించారు. భక్తి ప్రాధాన్యత కాదు అది .. ఆరోగ్య ప్రాధాన్యత. మారేడు పూలు ( మారేడు - ఇండియన్ బేల్ ) విరేచనాలను తగ్గిస్తాయి. దప్పిక తీరుస్తాయి. వాంతుల్ని ఆపుతాయి అని భోజన కుతూహలం గ్రంథంలో తెలిపారు. 

మారేడు కాయ గుజ్జు అమీబియాసిస్ వ్యాధి నియంత్రణకు పని చేస్తుంది కానీ మారేడు పూలు అతిసార వ్యాధిని కూడా అరికట్టగలదని దీని తాత్పర్యం. బ్యాక్టీరియా కారణంగా పేగులలో వచ్చే వ్యాధులను అరికట్టడానికి మారేడు పువ్వులు ఉపయోగపడతాయి. మనం అప్పుడప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కు గురవుతుంటాము. బయట ఆహారం తినడం తప్పనిసరి అయిన వారు తరచూ మారేడు పూలు, కాయలు లేదా ఆకులు .. వీటిలో ఏది దొరికినా వాడుకుంటూ ఉండాలి. దీని వల్ల పొట్ట మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంది. 

ఇవి తాజాగానే ఉండాలని లేదు .. ఎండించి,దంచి , భద్రపరచుకొని రోజూ ఒక చెంచా పొడిని నీళ్లలో వేసి మరిగించి టీ లాగా తాగవచ్చు. మారేడును వాత వ్యాధులను తగ్గించే ఔషధమని చరకుడు ప్రముఖంగా పేర్కొన్నాడు. 

మారేడు వేరు దశ మూలాలలో ఒకటి. దశ మూలాలు వాత వ్యాధులను హరించేవిగా ప్రసిద్ధి. మారేడు పూలు చలవ నిస్తాయి. పైత్యాన్ని తగ్గిస్తాయి, అందువల్ల ఎసిడిటీ కారణంగా వచ్చే సమస్యలన్నిటిపైనా చక్కగా పని చేస్తాయి. మారేడు పూలను నెయ్యితో వేయించి , హల్వా తయారు చేసుకుని, ఫ్రిజ్ లో భద్ర పరచుకొని రోజూ ఒక చెంచా మోతాదులో తీసుకోవచ్చు. 

తీసుకున్న ఆహారం వంట బట్టక పోవడం,తినగానే విరేచనానికి వెళ్ళాల్సి రావడం , మల బద్ధకం, గ్యాసు, పేగు పూత, , కడుపులో నొప్పి, నీరసం , నిస్సత్తువ లాంటి లక్షణాలన్నీ ఇరిటబుల్ బెవెల్ సిండ్రోమ్ IBS అనే వ్యాధిని సూచిస్తాయి. దీని పైన మారేడు ఆకులు, పూలు, కాయ లోపలి గుజ్జు ఔషధంగా పని చేస్తాయి. ఇది చిట్కా వైద్యం కాదు. ఆయుర్వేదంలో బిల్వారిష్ట, బిల్వాది గుళిక లాంటి ఔషధాలు దీని పైన పని చేసేవి మార్కెట్ లో దొరుకుతున్నాయి. వైద్యుడి సలహా మేరకు వాడుకోవచ్చు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...