25, సెప్టెంబర్ 2026, శుక్రవారం

ఉలవ పునుగుల కూర.. ఆయుర్వేద ఉపయోగాలు

 లైంగిక శక్తిని పెంచే వాటిని "వాజీకర ద్రవ్యాలు" అంటారు. వాజీ అంటే గుర్రం అని అర్థం. అంతటి లైంగిక శక్తిని ,ఆసక్తిని గుర్రానికీ మనుషులకూ కూడా కలిగించేవి ఉలవలు. అందుకే వాటిని హార్స్ గ్రామ్ అన్నారు.. హార్స్ పవర్ పెంచుతాయి అని. ఉలవలు తెలుపు, నలుపు , ఎరుపు రంగుల్లో ఉంటాయి. ఏ రంగు ఉలవలు దొరికినా వండుకోవచ్చు. 

ఉలవలు శరీరానికి బలాన్నిస్తాయి. వాత వ్యాధుల్లో ఉపయోగ పడతాయి. కఫాన్ని తగ్గిస్తాయి. కొద్దిగా వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. గుండెకు బలాన్నిస్తాయి. ఐతే ఉలవలు కాస్త కష్టంగా అరుగుతాయి. అందువల్ల జీర్ణ శక్తి తక్కువగా ఉన్నవారు మితంగా తీసుకోవడం మంచిది. 

మన ఇళ్లలో ఉలవ చారు కాచుకోవడం సాధారణం .ఉడికించిన ఉలవలతో గుగ్గిళ్ళు చేసుకుని తింటారు. పప్పుగా వండుకుంటారు. కంది పొడి లాగే ఉలవ పొడి కూడా చేసుకుంటారు. 

ఐతే నల మహా రాజు ఉలవలతో పునుగులు చేసుకునే విధానాన్ని వివరించాడు. వాటిని వేడి అన్నంలో చామ దుంపల వేపుడు కూరలాగా తినవచ్చు అన్నాడు. ఇలా తినడం రాజ భోజనం అని వివరించాడు. 

ఉలవ పునుగులు..

ముందుగా ఉలవలు బాగా మెత్తబడే వరకు ఉడికించి , నీటిని వార్చి ఒక పక్కన ఉంచుకోవాలి. ఉడికించిన ఉలవలు ముద్దగా చేసి అందులో సైంధవ లవణం, వెల్లుల్లి, అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చ కర్పూరం , వీటితో పాటు బూడిద గుమ్మడి వడియాలను నలిపిన ముక్కలు కూడా కలిపి , గోలీ కాయలంత చిన్న ఉండలు కట్టాలి. వాటిని పునుగుల మాదిరిగా నూనెలోనో, నెయ్యి లోనో వేయించాలి. 

మసాలా పునుగులు..

ఒక వేళ ఉలవ పునుగుల్లో కారం మసాలా ఘాటు చాలదనుకుంటే మసాలా పునుగులను వేరే వండుకునే విధానాన్ని కూడా నలుడు వివరించాడు. శనగ పప్పు, మినప పప్పు ఈ రెండిటిని నానబెట్టి , వాటిలో జీలకర్ర, ధనియాలు, మిరియాలు , అల్లం, ఇంగువ, వెల్లుల్లి వంటి సుగంధ ద్రవ్యాలు కలిపి మెత్తగా రుబ్బి ఆ పిండితో గోళీ కాయలంత పునుగులు వేయించాలి. ఇవి ఘాటైన రుచిని కలిగి ఉంటాయి. 

ఈ రెండు రకాల పునుగులనూ చెరొకటి తీసుకుని అన్నంలో  నంజుకుని తింటుంటే మరింత రుచికరంగా ఉంటాయని నలుడు సూచించాడు. ఈ మిశ్రమం శరీరానికి, మనసుకు సుఖాన్నిస్తుందని , శుభ ప్రదం అనీ అన్నాడు. శుభ కార్యాల సందర్భాలలో వండుకోదగిన ప్రత్యేక వంటకమిది . ఒక విధంగా ఈ పునుగులు రెండింటి మిశ్రమాన్ని ఉలవ పునుగుల వేపుడు కూరగా చెప్పుకోవచ్చు. ఇది అన్ని దోషాలను హరించే వంటకం. ఐతే ఉలవలు కష్టంగా అరుగుతాయని ఆయనకు తెలుసు. అందుకే బలమైన జీర్ణ శక్తి లేని వారు జాగ్రత్తగా తినాలని హెచ్చరించారు. 

ఉలవ చారు..

ఉలవలు ఉడికించిన తర్వాత వార్చిన రసంతో ఉలవ చారు కాచుకోవచ్చునంటూ నలుడు ఆ రసంలో మిరియాల పొడి, ఇంగువ , తగినంత సైంధవ లవణం, మనకు నచ్చిన సుగంధ ద్రవ్యాలు కలిపి కొద్ది సేపు మరిగించమన్నాడు. ఉలవ చారు పలుచగా ఉంటేనే రుచికరంగా ఉంటుందన్నాడు. ఈ ఉలవ చారు తో పైన చెప్పిన ఉలవల పునుగుల కూరను నంజుకుంటే ఆ రుచే వేరు. 

ఉలవలు శక్తి దాయకాలు, స్థూలకాయం తగ్గించదానికి తోడ్పడే  గొప్ప ఆయుధాలు. మంచి ప్రోటీన్ వనరు. పీచు పదార్థం ఎక్కువ. రక్తంలో చక్కెర నియంత్రణకు తోడ్పడుతుంది. మొలకలు కట్టించి తింటే కొన్ని పోషకాల లభ్యత పెరుగుతుంది. చలి కాలం లో ఉలవ చారు, ఉలవ గుగ్గిళ్ళు , ఉలవ పునుగుల్లాంటి వంటకాలు శరీరానికి వేడి, శక్తిని అందించే ఆహారంగా ఉపయోగపడతాయి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...