అద్దం మన ముఖమునే కాదు ,దానిపై వస్తున్న నల్లని చారలు, కంటి కింద నల్లని మెరుపు, బుగ్గపై చిన్న చిన్న పొక్కులు... రంగు బారిన చెక్కిళ్ళు.. వీటన్నింటినీ చూపిస్తుంది .ఇవి మీరు అనుకుంటున్నట్లు చర్మవ్యాధులే కానక్కరలేదు, కౌమార దశలో ఉన్న పిల్లలలో హార్మోన్ల హెచ్చుతగ్గులను, నడి వయస్సులో, మధ్యలో మానసిక అశాంతిని ,కొంతమందిలో రక్త దోషాన్ని సూచిస్తుంది.
ప్రకాశవంతమైన ముఖ చర్మం ఆనందానికి దర్పణం వంటిది. ఇది మనం ఎక్కువగా పట్టించుకోము కానీ పట్టణాలలో, నగరాలలో నాడు, నేడు ఇలాంటి మచ్చలు రంగు మారడం, నలుపు చాయ రావడం లాంటివి రాకుండాను ,వచ్చినవి పోయి ముఖ చర్మం అందంగా , ఆకర్షణీయంగా ఉండాలని ఉంచుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు.
నైలునది నాగరికతలోనూ, పురాణకాల సంస్కృతిలోనూ, ఇతిహాస కాలంలో కూడా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రత్యేక చికిత్సలు, చికిత్స చేసే సుందరిమణులు ఆ కాలంలో ఉండేవారు. ఈనాటి రసాయనాలు ఉపయోగించే బ్యూటీ పార్లర్ల కన్నా సహజ సౌందర్య సాధనాలతో చేసే నిలయాలు అప్పుడు కూడా ఉండేది.
ఆధునీకులు తెల్లని చారికలు ఏర్పడటం, చర్మపు రంగు మారి మచ్చలు ఏర్పడటాన్ని బ్లిమిషెస్ అంటారు. ఈ బ్లిమిషెస్ లో పైన చెప్పినవే కాకుండా తెల్లని గట్టి మొటిమల లాంటివి, నల్లని, లేత ఎరుపు తో కూడిన పొక్కులు లాంటివి ఏర్పడటమూ ఉంటుంది.
క్రీములు కొనేటప్పుడు..
ఇందులో కొన్ని తెల్లని చారికలు లాంటివి ఏర్పడడం. దీనికి పుట్టుకతో వచ్చిన దోషం కారణం కావచ్చు .మరికొందరిలో మొటిమలు ,ఉబ్బిన చిన్న చిన్న పొక్కులు ఏర్పడతాయి. వీటికి కారణం కొంత హార్మోన్ల హెచ్చుతగ్గులు అయితే ఎక్కువ భాగం వారు వాడే రకరకాల క్రీములు, పౌడర్లు నూనెలు వంటివి. చర్మానికి ఇవి పడకపోతే ఇలాంటివి వస్తాయి .రాత్రులు చర్మానికి రాసుకునే క్రీములు ఇలాంటివి కలుగ చేస్తుంటాయి.
ఇలా చర్మానికి బిమిషస్ కలగజేసే క్రీములను ' comedo genics ' అంటారు. అందుచేత మీరు క్రీములను కొనేటప్పుడు వాటిపై 'non comedo genics' అని ఉందో లేదో చూసి కొనండి. వాతావరణంలో మార్పులు, ముఖ్యంగా కలుషితమైన గాలి, నీటిలో తేమ మీ చర్మ కాంతిని సౌకుమార్యాన్ని పాడు చేస్తాయి. ముఖంపై కురుపులు, చారికలు వంటివి, చర్మాన్ని ఉద్రేకపరిచే వెంట్రుకల రాపిడి, వాడే బట్టల రాపిడి ఎక్కువ చేస్తాయి.
మానసిక ఒత్తిడి, హార్మోన్లలో హెచ్చుతగ్గులు వీటికి ముఖ్య కారణాలుగా గుర్తించబడింది. ముఖ్యంగా ఆండ్రోజన్ అనే హార్మోను దీనికి ముఖ్య కారణంగ భావించ బడుతుంది. ఎలాగంటే ఈ హార్మోన్ల చర్మాన్ని రాపిడి సెబమ్ అనే సహజ స్నిగ్ధ పదార్థాన్ని పెంచుతుంది. ఈ నూనె పదార్థం ఒకచోట ఎక్కువగా చేరడం వల్ల సూక్ష్మ జీవులు చేరి చర్మాన్ని పాడు చేసి ఈ చిన్న చిన్న కురుపుల లాంటి వాటిని తీసుకొస్తాయి. ముఖ్యంగా స్త్రీలు, ఎదుగుతున్న పదహారేళ్ళ వయసు వారి నుండి నడి వయసు ఉన్న 30 ఏళ్ల వయసు వారి వరకు ఈ హార్మోన్ల హెచ్చుతగ్గులకు ఆలవాలం అవుతున్నారు.
అలాగే ఋతుచక్రం ఆగిపోతున్న వయస్సులో అంటే 45 ఏళ్ల వయసులో ఈ హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల చర్మ సౌందర్యం పాడవుతుంది. గర్భిణీ కాలంలోనూ, నెలసరి వచ్చే సమయంలోనూ ఎక్కువ అవుతాయి. యాంటీ ఆండ్రోజన్స్ వంటి మందులు , కార్టికో స్టిరాయిడ్స్ వంటి మందులు వాడినా వాటి ఫలితం తో పాటు కొంత అసౌకర్యం కూడా ఉంటుంది. అందుకే సహజమైన చిన్న చిన్న వాటితో ఈ స్థితిని మనం దూరం చేసుకోవచ్చు.
ముఖానికి వెలుగునిచ్చేవి ఏమంటే..
బెల్లం ,నువ్వులు కలిపిన నువ్వుల ఉండలు ఆడపిల్లలు తినడం మంచిది. అన్నం మొదటి ముద్దలో నువ్వుల పొడి రెండు చెంచాలు కలుపుకొని తినడం, తలంటు పోసుకునేటప్పుడు ముఖానికి పసుపు, పెసర పిండితో నలుగు పెట్టుకోవడం, నువ్వుల నూనెతో వారానికి ఒసారైనా ఒంటికి గట్టిగా రాసుకుని నలుగు పెట్టుకుని వేడి నీటితో తలస్నానం చేయడం హితకరం. ఇవి స్త్రీ పురుషులు ఇద్దరికీ ఉపకరిస్తాయి.
మీరు ఒలుచుకొని పడేసే అరటిపండు తొక్క లోపలి భాగంలో అద్భుతమైన సౌందర్య సాధనము ఉంచాడు ఆ భగవంతుడు. దానితో కానీ బొప్పాయి పై తొక్కతో కానీ ముఖాన్ని రుద్దుకుంటే ఇలాంటి చారికలు తగ్గిపోతాయి.
బంగాళాదుంపలు పై పొరతో కూడిన దాన్ని ఒక గుడ్డలో ఉంచి నలగగొట్టి రసం తీయండి. ఆ రసంలో తొమ్మిది నిమ్మరసం చుక్కలు వేయండి. ఒక చెంచా తేనె వేసి కలియబెట్టండి. దాన్ని మీ ముఖం పైన రాయండి లేదా నల్లని చారికలు ఉన్నచోట కానీ ,మచ్చలు, మొటిమలు ఉన్నచోట కానీ రాయండి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. దీనిలో ఉన్న బ్లీచింగ్ ఏజెంట్స్ ముఖాన్ని చక్కగా చేస్తాయి. ముఖమంతా రాసుకుంటే మొటిమలు రావు.
మీరు ఇంట్లో ఎప్పుడైనా నారింజ రసం కానీ, నిమ్మ రసం కానీ ,బత్తాయి రసం గానీ చేసుకుంటే పుల్లకు దూది చుట్టి ఆ రసంతో కొంచెం ముఖానికి రుద్దుకొని కాసేపయ్యాక గోరు వెచ్చని నీటితో కడిగేసుకోండి. మీ ముఖం ప్రకాశ వంతంగా అందంగా మెరిసి పోతుంది.
మన ఇంట్లో ఉండే నిమ్మ కాయలు ముఖం మీద, చర్మం పై ఉండే ముడతలను, చారికలను తొలగించే అద్భుతమైన మందు. దాన్ని అలాగే రాసుకోవచ్చు. లేదా పసుపు, గంధపు పొడి కలిపి రాసుకోవచ్చు. 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖం ప్రకాశ వంతంగా మెరిసి పోతుంది.
పాత నిమ్మకాయ పచ్చడి తినడం,టొమోటో, పాల మీద మీగడ, పెరుగు పై తరకలు అందాన్ని అందించే అపురూప వరాలు. నాలుగు చెంచాల టమోటా రసం, 4 చెంచాల నిమ్మ రసం కలిపి దూదితో రోజూ ముఖం పైన రుద్దుకుని అరగంట తర్వాత కడుక్కోండి. దీన్ని ఎక్కువగా చేసుకుని ఫ్రిజ్ లో భద్ర పరిచి రోజూ రాసుకోవచ్చు. ఇది సహజ సౌందర్య సాధనం.
నిమ్మ కాయ రసం తీసిన తొక్కలపై కొంచెం పంచదార అద్ది ముఖానికి ప్రతి రోజూ రుద్దుకుని 10 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. ముఖం పై మొటిమలు తగ్గిపోతాయి. మంచి గంధం పొడి, రోజ్ వాటర్ తో కలిపి ముద్దగా చేసి దాన్ని ముఖానికి రాసుకోండి. ఇలా చేస్తే కళ్ళ కింద నల్లని చారలు పోయి చక్కగా ఉంటారు.
బాదం పలుకులు ఒక రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తేనె, నిమ్మ రసం కలిపి ముద్దగా చేసి చర్మం పై రాయండి. పావు గంట తర్వాత కడిగేసుకోండి. మీ ముఖం మృదువుగా , కాంతి వంతంగా ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి