ఆసేతు హిమాచలం ప్రతి గ్రామంలో, పట్టణ వీధుల్లో విరివిగా దొరికే మంచి ఆహారం, అందుబాటులో ఉండే పోషకాహారం జామకాయ.. ఇది అడవుల్లోనే కాకుండా పల్లెల్లోనూ పట్టణాలలో తినే తియ్యటి ఆహారమే కాదు, కొంత మంది కి మందు కూడా..
అనన్యమైన పోషక విలువలు,అద్భుతమైన వైద్య లక్షణాలు కలిగినటువంటి సామాన్యుని ఆపిల్ తియ్యనైన జామకాయ.
గుర్వా అని పిలవబడే ఈ జామకాయ సంప్రదాయంగా ఎన్నో యుగాల నుండి ఆహారంగానూ, ఓషధి గానూ గుర్తించబడింది. ప్రపంచమంతటా జరిగిన వివిధ పరిశోధనలు దీనిలో పోషక విలువలే కాకుండా రోగ నివారణ శక్తిని కూడా కలిగి ఉందని ధృవీకరించాయి.
ముఖ్యంగా మన దేశంలో, మిగతా ఆసియా దేశాల్లో విరివిగా పెంచబడుతున్న ఈ జామ పచ్చగా ఉండే గుండ్రని గుండె కాయ లాంటి పండు. పూర్తిగా పండాక పసుపు పచ్చని రంగులో నిగనిగలాడుతుంది.
జామ కాయలో ఎన్నో విటమిన్లు , మినరల్స్ తో పాటు మంచి పీచు పదార్థం ఉంది. ఇందులో ఉన్న ప్రత్యేక విటమిన్ వల్ల శుక్ర బీజం బలహీనంగా ఉన్న పురుషులకు ఇది తినడం చాలా మంచిది.
జామ ఆకులకు పుండు,గాయం మాన్ప గలిగిన శక్తి ఉంది.ఏదైనా గాయమైనప్పుడో , రోడ్డుపై ఏదైనా గీసుకుంటేనో ఏమీ దొరకనప్పుడు జామ ఆకుల పసరు పూయండి. అది తాత్కాలిక చికిత్స.
మంచి హితకారిణి..
జామలో రక్తాన్ని గడ్డ కట్టించే శక్తి ఉంది.ముక్కులోంచి , చిగుళ్ల నుంచి రక్తం స్రవించే వ్యాధి ఉన్నవారు జామకాయ తినడం, జామాకు పొడితో చిగుళ్ళను సున్నితంగా మర్దన చేసుకోవడం మంచిది.
తరచూ జిగట విరేచనాలు అవుతున్న వారు జామ తింటే ఇందులో ఉన్న శక్తి కారణంగా చిన్న ప్రేవులలో క్రిమిని అడ్డగించి , జిగురు పదార్థాన్ని తొలగిస్తుంది.
జామలో ఉన్న ఒక ప్రత్యేకమైన శక్తి వల్ల పెద్ద వయసులో వచ్చే మోకాళ్ళ నొప్పులు , తరచూ మరచిపోవడం వంటివి తగ్గుతాయి. అందుకే అరవై ఏళ్ళు పైబడిన వారు కొంచెం ఉప్పు రాసిన జామ కాయ ముక్కలను తినడం హితకరం.
ఉత్తర భారతంలోనూ, పశ్చిమ తీరాన రోజూ విరేచనం కాకపోతే రాత్రి జామపండుతో చేసిన మురబ్బా తింటారు. జామ తరచూ తినడం వల్ల జీర్ణాశయం శక్తిని పుంజుకుంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ ను పెంచే పదార్థం లేదు.
పచ్చి జామ కాయలు,లేత జామ ఆకులు కాచి తయారు చేసిన నీటితో స్నానం చేస్తూ దోర జామ కాయలు తింటుంటే చర్మ సౌందర్యం పెరుగుతుంది.
జామ కాయలు, ఆకుల కషాయం, శొంఠి,పసుపు కలిపి తీసుకుంటే ఎప్పుడూ బాధించే దగ్గు , జలుబు తగ్గుతాయి. ఈ మధ్య జరిగిన పరిశోధనలో జామ పండ్లు తినే వారిలో క్యాన్సర్ తక్కువగా వస్తుందని తేలింది.
జామ పండు. ఆస్తమా,మూర్ఛ, తల తిరగడం , రక్త పోటు, అధిక బరువు కలిగి ఉండటం , ఏ కారణం చేతనైనా శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేకపోవడం , చిగుళ్ళు వాయటం వంటి వాటిలో చాలా ఉపయుక్తం. దీంతో సహజమైన మందులు తయారు చేయవచ్చు. అందుకు ప్రయత్నాలు, పరిశోధనలు కూడా విరివిగా జరుగుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువ రోజులు ఆగకుండా ఉండే ఋతు స్రావానికి జామ చక్కటి మందుగా గుర్తించ బడింది.
జామకాయలో పోషక విలువలు అపారం.అందుకే జామను సామాన్యుని నిండు ఆహారం అంటారు. ఇందులో కాల్షియం 50 mg, కార్బోహైడ్రేట్స్ 20 mg, ఫైబర్ 8.9 gm, ప్రోటీన్, విటమిన్ సి ల వంటివి ఉన్నాయి. ఇందులో కొవ్వు పదార్థం 0.9 gm మాత్రం ఉండటం వల్ల ఒళ్ళు పెరగదు. అందుకే దీన్ని అందరూ ఆప్యాయంగా తినవచ్చు.
బాగా పండిన జామ పండ్లు అలాగే తినవచ్చు లేదా జామ్ లు, జెల్లీ ల రసం పానీయాల రూపం గానూ తీసుకోవచ్చు.ఉత్తర దేశాలలో జామ పళ్లతో చేసిన జెల్లీ లు పిల్లలు, పెద్దలు మంచి ఆహారం గా వాడతారు.
పూర్వం జామ ఆకుల రసం విరేచనాలు అరికట్టడంలో మంచి ఫలితాలు ఇచ్చేదని , పిల్లలకు కూడా ఇవ్వ వచ్చునని భావించే వారు. ప్రపంచమంతా వివిధ పరిశోధనలలో శాస్త్రజ్ఞులు దీనిపై విశిష్ట పరిశోధనలు జరుపుతున్నారు.
కాళ్లు లాగుతుంటే చాలా బాధ పడతాం.సాయంత్రం అయ్యేసరికి మోకాళ్ళ కింద పిక్కలు లాగుతున్నప్పుడు పిల్లల చేత నొక్కించుకుంటాం. ఎన్ని నొప్పి మాత్రలు వేసుకున్నా ఫలితం ఉండదు. అటువంటప్పుడు పది, పది హేను జామ ఆకులు ఒక కప్పు నీళ్లలో వేసి 20 నిమిషాలు కాచి వడపోయండి. ఆ నీళ్ళు రోజూ మూడు సార్లు తాగండి. పూర్తిగా తగ్గిపోతుంది.
ప్రకృతి ప్రసాదం..
క్రీడా కారుల్లో ముఖ్యంగా టెన్నిస్ ఆటగాళ్లలో మోచేయి నొప్పి ఎక్కువగా ఉంటుంది. దాన్ని టెన్నిస్ ఎల్బో అంటారు. దానికి కూడా ఈ జామ ఆకులతో తయారు చేసిన టీ అద్భుత నివారిణి.
నోటి చిగుళ్ల నుంచి రక్తం వస్తుంటే జామ ముక్కలపై ఉప్పు రాసుకుని కొంచెం కొంచెం కొరుకుతూ తినండి. ఎంతో ఉపకరిస్తుంది.
జామ చెట్టు బెరడు,ఆకులు,కాయలు,పండ్లు అన్నీ కూడా జీర్ణాశయం పై చక్కటి ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా నేటి సామాన్య వ్యాధి gastro enterities అనబడే గృహాణి లో జామ ప్రభావం మంచి ఫలితాలు సూచిస్తుంది.
అలాగే దానిమ్మ రసం,దానిమ్మ బెరడు చూర్ణం, జామ రసం జిగట విరేచనాలు నివారించడంలో మంచి ఫలితాన్ని ఇస్తాయి. సామాన్యంగా అందుబాటులో దొరికే జామ కాయ ముక్కలు ఉప్పు అద్దుకుని కానీ, పండు ముక్కలు తినటం కానీ అందరికీ మంచిది.
షుగరు వ్యాధి ఉన్నవారు దోర జామ కాయలు తినడం మంచిది.జీవనానికి జవసత్వాలు , జీర్ణాశయానికి జీర్ణ శక్తిని ఇచ్చేటువంటి అద్భుత ప్రకృతి ప్రసాదం జామ కాయ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి