ఈనాడు ప్రపంచమంతటా ఆరోగ్య పరిరక్షణకు , దీర్ఘ కాలం ఆనందంగా జీవించడానికి ఏది మంచో , ఏది చెడో అన్న ఆలోచనలతో మానవ మేధస్సు ఎక్కువ ఆలోచిస్తోంది. పూర్వం దూరదృష్టితో చూసే పెద్ద వాళ్ళు మంచి, చెడు చెప్పేవారు.
ఇప్పుడు శాస్త్రం మనిషి వ్యక్తిగతంగానూ మారి తన శ్రేయస్సుకు ఏది మంచో చూస్తున్నాడు. అలాగే ఆరోగ్యానికి ప్రసిద్ధి చెందింది ఆలివ్ ఆయిల్.
ప్రపంచమంతటా ఇంత ప్రాచుర్యం పొందడానికి ఆలివ్ తో ఉన్న అనేక ప్రయోజనాంశాలు సమాజపరంగా, వైద్య పరంగా ముఖ్యంగా సహజ ఆహార పదార్థంలో ఉండే జీవ శక్తి వల్ల దీని ప్రాచుర్యం ఎక్కువైంది.
మెడిటరేనియన్ లో ప్రజలు అనాది నుంచి ఒక ఆహార పదార్థంగానే కాకుండా మంచి మందులా, మంచి అద్భుతంలా సౌభాగ్యానికి, అధికారానికి , కీర్తికి సూచికగా భావిస్తారు, అభిమానిస్తారు. ఈ చెట్టుని అపరిమితమైన శక్తికి , కీర్తికి , శాంతికి చిహ్నంగా భావిస్తారు.
ఈ చెట్టు విచ్చుకున్న ఆకులతో కూడిన ఆకృతిని స్నేహ పూర్వకంగా జరిగే ఆటలలో విజయ చిహ్నంగా ఉపయోగిస్తారు. రక్తం పారే యుద్ధాలలో శాంతికి ఆలవాలంగా పూర్వులు దీన్ని కీర్తించారు. దీని పండు నుంచి స్రవించే నూనె చరిత్రలో అసామాన్యులుగా కీర్తించబడ్డ చక్రవర్తుల తలలను అభ్యంగనం చేసింది.
గ్రీకు నాగరికతలో..
ఆలివ్ ఆయిల్ ప్రత్యేకత ఏమిటంటే జీవశక్తిని హరించే వాటిని నిర్మూలించే శక్తి ( యాంటీ ఆక్సిడెంట్స్) విటమిన్ ఎ, ఇ లు ఉన్నాయి. ఇవి మన శరీరంలో కాన్సర్ కలిగించే కారణాలను నివృత్తి చేస్తాయి.
ఇది మోనో అన్ సాచురేటెడ్ కనుక చెడును కలిగించే , LDL కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అదే సమయంలో మంచిని కలిగించే HDL ను తగ్గించదు. దీని వల్ల రక్త ప్రసారం సమగ్రంగా ఉండి బీపీ ని పెరగనివ్వదు. తద్వారా హృదయ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
ఈ మధ్య కాలంలో జరిగిన పరిశోధనల్లో ఆలివ్ ఆయిల్ రొమ్ము క్యాన్సర్, ఎముకల వ్యాధులు రాకుండా నివారించడంలో మంచి ఫలితాలు ఇస్తుందని తేలింది. ఇందులో ఉన్న అధిక ఒలియక్ యాసిడ్ మన రక్త వాహికలను ఆరోగ్యవంతంగా ఉంచేందుకు సహాయ పడుతుంది. అందువల్లనే పూర్వులు తమ ప్రత్యేక వంటలలో దీన్ని వాడేవారు.
జీవితమే మారిపోతుంది..
మరో ముఖ్య విశేషం ఈ ఆలివ్ ఆయిల్ ఉష్ణ సహన శక్తి. దీని వల్ల ఒక్క వేపుడు కూరలు తప్ప అన్ని వంటకాలలోనూ దీనిని వాడచ్చు. ఆలివ్ ఆయిల్ తో చేసిన పదార్థాలు చల్లని చోట్ల అంటే రిఫ్రిజిరేటర్ లో ఉంచితే సుమారు సంవత్సరం దాకా పాడవకుండా ఉంటాయి. అందుకే గ్రీకు నాగరికతలో దీన్ని ప్రత్యేకంగా చూసే వారు. మరో విశేషం ఈ ఒలియక్ యాసిడ్ అసాధారణంగా వచ్చే ALD వ్యాధిని ఎదుర్కునే ఒకే ఒక మందు. తలలోని తెల్ల పదార్థం శిధిలమయ్యే అసాధారణ వ్యాధి.
మీరు ఆలివ్ ఆయిల్ కొనేటప్పుడు శుద్ధమైనది కొనకండి. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కొనండి. ఎందుకంటే అది ఆలివ్ గింజలను నొక్కినప్పుడు వచ్చిన మొదటి నూనె కనుక. దానిలో చాలా తక్కువ ఆమ్లం ఉంటుంది. అలాగే ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. గుండెకు , జీవ శక్తి కి మంచిదైన ఈ ఆలివ్ ఆయిల్ మీ ఆహారంలో కొంచెమైనా చేర్చుకోండి.
నాలుకకి దీని రుచిని అలవాటు చేస్తే అది మీ గుండెను , మెదడును మొత్తం మీ జీవనాన్ని ఆహ్లాద పరుస్తుంది. మీ మాంసాహారం, చేపలు, రొట్టెలలో ఇది వాడడం మంచిది. ఆలివ్ ఆయిల్ ను ఎప్పుడూ స్టౌ పక్కన, ఎండలో ఉంచకండి. పాడైపోతుంది. వేడి, ఎండ లేని చోట ఉంచండి. ఆలివ్ ఆయిల్ సుమారు 700 రకాల గింజల నుండి సేకరించ బడుతుంది.
ఇది పచ్చగా ఉండవచ్చు,నీలంగా ఉండవచ్చు. దీని రుచి ఘాటుగా , తీయగా , జిడ్డుగా ఉండవచ్చు. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తొందరగా జీర్ణం అవుతుంది. కొవ్వుని కరిగిస్తుంది. విటమిన్లు ఏ, డి, కె వంటి వాటిని తొందరగా వంట పట్టిస్తుంది. ఇది కొన్ని కూల్ డ్రింకుల లో రంగు , రూపు నిలవడానికి ఉపయోగపడుతుంది.
మంచి రుచి కలిగిన ఆలివ్ ఆయిల్ అత్యుత్తమమైనది. ఇది సహజమైన ప్రకృతిలోని పళ్ళ నుండి నేరుగా తీసిన నూనె కనుక దాన్ని అలాగే వాడినా చెడు చేయదు. ఇంత వరకు జరిగిన పరిశోధనలో ఈ ఆలివ్ ఆయిల్ గుండె జబ్బులను నివారించడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తుందని తేలింది.ఎందుకంటే ఇంకా ఏ ఇతర సహజమైన నూనెలలో దీనిలో ఉన్నంత మోనో అన్ సాచురేటెడ్ శక్తి లేదు కనుక.
మన ఆమాశయంలో ( stomach) ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది .అందులో ఉండే పుండ్లు( అల్సర్స్), చీము ( gastritis) ను తగ్గిస్తుంది. బైల్ ఉత్పత్తిని పెంచుతుంది, గాల్ స్టోన్స్ ను తగ్గిస్తుంది.
ఆలివ్ ఆయిల్ కు మన అన్నవాహిక లో వచ్చే క్యాన్సర్ ను నివారించే శక్తి ఉన్నదని దీన్ని ఆహారంలో చేరిస్తే మంచి ఫలితాలు ఇచ్చిందని స్పానిష్ శాస్త్రజ్ఞుల పరిశోధనలలో నిరూపించబడింది.
ఆలివ్ ఆయిల్ ఎక్స్ట్రా వర్జిన్,వర్జిన్, ప్యూర్, ఎక్స్ట్రా లైట్ అని నాలుగు రకాలుగా దొరుకుతుంది.అందులో మొదటిది మంచిది.మనం రోజూ వాడే నూనెల్లో వేరు శనగ నూనె హితం కాదు. నువ్వుల నూనె ఒళ్ళు తగ్గడానికి, కీళ్ల నొప్పులు రాకుండా ఉండడానికి హితకరం. నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్ తలంటుకోవడం కంటే అభ్యంగన స్నానానికి,ప్రత్యేక వంటకాలకు హితకరం. అందుకే మన పెద్దలు ఇలా అంటారు " హితమైనది మితమైనా అప్పుడప్పుడు తీసుకోవాలి " అని .
