29, ఆగస్టు 2026, శనివారం

అడవి మామిడి.. ఒక అపురూప వృక్షం

 ఆమ్రాతకం కషాయామామ్లమం బృహత్కంఠకర్షణం 

పక్వం తు మధురాంలాడ్యం స్నిగ్ధం కించిత్ కఫాపహం.

కొండ మామిడి లేదా అడవి మామిడి కాయలను " ఆమ్రాతకం " అనీ , కోశామ్రం అనీ పిలుస్తారు. కొండ అంటే హిమాలయాలనే. ఈ మామిడి కాయలను హిమాలయన్ మామిడి అని కూడా పిలుస్తారు. మన వైపు పండే మామిడిని శాస్త్ర పరంగా " మాంజిఫెరా ఇండికా" అని, హిమాలయాల మామిడిని " మాంజిఫెరా సిల్వాటికా" అని పిలుస్తారు. 

ఈ కాయ చివర కొస దేలి ఉంటుంది. సముద్ర మట్టానికి 600 అడుగుల ఎత్తున ఉండే చల్లని ప్రాంతాల్లోనే ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. దక్షిణ మధ్య, తూర్పు ఆసియా దేశాల లో , ముఖ్యంగా అసోం, బంగ్లాదేశ్, నేపాల్, కంబోడియా, మయన్మార్, అండమాన్ నికోబార్ దీవుల్లో వీటి వ్యాప్తి ఎక్కువ. 

మన మామిడి లాగానే జూన్,జూలై నెలల్లో ఈ కాయలు చేతికొస్తాయి. పర్యావరణ నిపుణులు ఈ అడవి మామిడి ని అంతరించిపోతున్న వృక్ష జాతులలో చేర్చారు.

పక్వానికి వచ్చినవి దొరికితే వాటిని వదలకండి. పలక బారి కండ పట్టిన కొండ మామిడి ఊరగాయ పచ్చళ్ళకు అనుకూలంగా ఉంటుందని చెప్తారు.పచ్చివి,లేతగా ఉన్న పిందెలు వగరు, చేదు,పులుపు కలిగి గొంతు నుస పెడతాయి. పలక బారిన కాయలు బాగా వేడి చేస్తాయి. కానీ, చర్మ వ్యాధులున్న వారికి మేలు చేస్తాయి. పండినవి రుచిగా ఉంటాయి. కఫాన్ని కొద్దిగా తగ్గిస్తాయని " భోజన కుతూహలం " గ్రంథంలో తెలిపారు. 

మనం చెత్త బుట్టలో పడేసే మామిడి టెంకే లోపలి జీడికి ఇప్పుడు ప్రపంచ మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. జీడి లో నుండి కొవ్వు పదార్థాలను వేరు చేస్తున్నారు. మన వైపు పండే మామిడి టెంకే లోని జీడి కన్నా ఈ అడవి మామిడి జీడిలో కొవ్వు ఎక్కువగా ఉంటుందని తేలింది. ఇటీవల నిర్వహించిన ఒక పరిశోధన లో చాక్లెట్ తయారు చేయడానికి ఉపయోగించే కోకో బటర్ తో సమానమైన కొవ్వు పదార్థం ఈ అడవి మామిడి జీడి నుంచి లభిస్తుందని , ఉత్పాదకత రీత్యా చూసినప్పుడు కోకో మొక్కల గింజల నుండి తీసే కొవ్వు కన్నా ఇది చాలా చవకగా లభిస్తుందనేది ఈ పరిశోధన సారాంశం . బంగ్లాదేశ్,భూటాన్ వంటి దేశాల్లో ఈ అడవి మామిడి ఎక్కువగా పండుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...