6, సెప్టెంబర్ 2026, ఆదివారం

ఎక్కిళ్ళు.. ఆయుర్వేద పరిష్కారాలు

 అమ్మ.. ఎక్కిళ్ళు ఆగడం లేదు, ప్రతి ఐదు నిమిషాలకు వస్తున్నాయి. నీళ్లు తాగుతున్నాను, గొంతుకి అమృతాంజనం రాసుకున్నాను, అయినా.. అబ్బా మళ్ళీ ఎక్కిళ్ళు.. అది కాదు, అదేంటి నీ తలపై అంత పెద్ద గడ్డ పుట్టుకొచ్చింది. . హఠాత్తుగా ఆశ్చర్యంతో అడిగింది. . ఆ అమ్మాయిని వాళ్ళమ్మ. గడ్డా.. ఎక్కడా.. ఆశ్చర్యంతో తలని చూసుకుంది ఆ అమ్మాయి. గడ్డలేదు కానీ ఎక్కిళ్ళు ఆగి పోయాయి. హఠాత్తుగా వచ్చే ఎక్కిళ్ళను , హఠాత్తుగా వినే సంగతులు ఆపు చేస్తాయి. 

ఎక్కిళ్ళు హఠాత్తుగా వస్తాయి .గుండెకు పొట్టకు మధ్య ఉండే పలుచని పొర ను డయాఫ్రమ్ అంటారు. అది అనుకోకుండా ముడుచుకుంటుంటే వచ్చే" హిక్ " అనే శబ్దం నోటి నుంచి బయటకు రావడాన్ని" ఎక్కిళ్ళు"  అంటారు.

ఈ డయాఫ్రమ్ చాలా సార్లు ముకులించుకోవడం వల్ల మన గొంతులో ఇరువైపులా ఉన్న శబ్ద గ్రంధులు మధ్య ఉండే దారి మూసుకొని గాలిని అడ్డగించడం వల్ల హిక్ లేదా ఎక్ అనే శబ్దం వస్తుంది. దాని దగ్గర ఉన్న నరాలు ఉద్రేక పడడం వల్ల గొంతు నుండి ఛాతీ దాకా చలించి ఈ ఎక్కిళ్ళు ఎక్కువవుతాయి. 

ఎక్కిళ్ళు చాలా కారణాల వల్ల వచ్చినా తాత్కాలికంగానే ఉంటాయి. కానీ కొన్ని వ్యాధుల వల్ల వచ్చే ఎక్కిళ్ళు ప్రమాదాన్ని సూచిస్తాయి. ముఖ్యంగా న్యుమోనియా , మూత్ర పిండాలు పాడై పోయిన వ్యాధులు , గుండె జబ్బులు వంటి వాటిలో ఇవి రాకూడదు. 

ఎందుకు ,ఎప్పుడు వస్తాయి అంటే..

రక్తంలో చెడు పదార్థం ఏదైనా తయారు అవుతున్నప్పుడు ఈ ఎక్కిళ్ళు వస్తాయి. ఈ హిక్ లేదా ఎక్ అనే శబ్దం ఆగకుండా అస్తమానం వస్తుండటానికి కారణం లారింక్స్ అనే గొంతు భాగాన్ని ఆనుకుని ఉన్న పలుచని పొర తెరుచుకుని మూసుకోవడం వల్ల జనిస్తుంది. మన ఉచ్చ్వాస నిశ్వాసాలను పైకీ కిందికీ క్రమ పద్ధతిలో కదల్చటం వల్ల డయాఫ్రమ్ అనే పొర క్రమ పరుస్తుంది.

ఈ క్రమంలో తాత్కాలికంగా కానీ , మరే ఇతర బలవత్తరమైన కారణం వల్ల కానీ అడ్డుపడితే నోటి నుండి హిక్ అనే శబ్దం వస్తుంది. అది తిరిగి సరి అయిన స్థితికి వచ్చే వరకు వస్తూ ఉంటుంది. ఇది కొద్ది నిమిషాలు ఉండవచ్చు. కొద్ది రోజుల పాటు ఉండవచ్చు. ఒక్కొక్కప్పుడు కొన్ని వారాల పాటు కూడా ఉండవచ్చు. 

ఈ ఎక్కిళ్ళు ఆగకుండా ఒక రోజు కన్నా ఎక్కువగా ఉంటే , అది మన శరీరంలో జరుగుతున్న ఏదో మార్పుకు లేదా వ్యాధికి సూచన అనుకోవాలి.. 

కామెర్లు, తీవ్రమైన ఎలర్జీ వ్యాధులు , తీవ్ర అజీర్ణ వ్యాధులలోనూ , మూత్రాశయ వ్యాధులలోనూ ఇది ఒక్కొక్కప్పుడు ఉపద్రవ సూచిక. తొందర తొందరగా నమిలి తినడం వల్ల కూడా ఎక్కిళ్ళు రావచ్చు. ఆయుర్వేదంలో దీనిని " హిక్క" వ్యాధి అని పిలుస్తారు. 

చాలా వ్యాధులలో ఎక్కిళ్ళు వస్తాయి,కానీ ఆ ఎక్కిళ్ళు రావడానికి , ఆ వ్యాధికి అనుసంధాన కారణం కనిపించదు. మీరు తొందర తొందరగా తింటున్నప్పుడు ఎక్కువ గాలి తెలియకుండా లోపలికి వెళుతుంది. ఆ రెండింటి అవరోధం వల్ల తాత్కాలికంగా ఎక్కిళ్ళు వస్తాయి. 

ఎక్కువ మసాలా ఉన్నటువంటి మాంస పదార్థాలు , ఘాటుగా ఉన్న మద్యం తాగుతున్నప్పుడు మన డయాఫ్రమ్ చలించి ఎక్కిళ్ళు వస్తాయి. షుగర్ వ్యాధి వల్ల, ఎక్కువగా మందు తాగడం వల్ల, పొగ తాగడం వల్ల , నోటి లోపల పూత,క్యాన్సర్ వల్ల , మెడ నొప్పి వల్ల, ఏదైనా కారణంగా స్పృహ కోల్పోవడం , ఎక్కువ కారం తినడం వల్ల పలుమార్లు ఎక్కిళ్ళు వస్తాయి. 

మన గుండె కింద ఉన్న పొరలో తెలియని కదలికలు వచ్చినప్పుడు నోటి ద్వారా వచ్చే హిక్ శబ్దం ముఖ్యంగా నరాల కదలిక వల్ల కనక, హఠాత్తుగా చెప్పే మాట వల్ల ఒక్క అర క్షణం మన వ్యవస్థ ఆగి కదిలితే ఇది సమ స్థితికి రావచ్చు. కానీ ఇది సామాన్యంగా వచ్చే ఎక్కిళ్ళకు మాత్రమే ఉపయోగ పడుతుంది. 

ఒక రోజంతా ఆగకుండా ఎక్కిళ్ళు వస్తుంటే డాక్టర్ ను సంప్రదించాలి. సాధారణంగా ఎక్కిళ్ళు వైద్య పరంగా ప్రమాద సూచిక కాదు. కానీ ఆగకుండా రోజంతా వస్తూ రక్తపు చుక్కలు కనిపిస్తుంటే అది ఉపద్రవ సూచిక అని గ్రహించి వైద్యుణ్ణి సంప్రదించాలి. 

ఎక్కిళ్ళు ఆగకుండా వస్తుంటే..

కొద్ది సేపు ఊపిరి తీసుకుని బిగపట్టి ఉంచుకోండి.

గబ గబా గ్లాసుడు నీళ్ళు తాగండి.

ఉప్పుని వాసన చూడండి.

నాలుక చివర చేత్తో పట్టుకుని కిందికీ పైకీ లాగండి.

ఒక చెంచా పంచదార నాలుక కింద ఉంచుకుని చప్పరిస్తూ ఉండండి.

పెరుగులో ఉప్పు కలుపుకుని చెంచా తో తింటుంటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

చిన్న చిన్న ముక్కలుగా తరిగిన అల్లం ముక్కలు నములుతుంటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. 

యాలక్కాయలు తొక్కతో సహా నాలుక మీద పెట్టుకుని రసం మింగుతుంటే మంచిది. 

కళ్ళు మూసుకుని ఊపిరి బిగ పట్టి ఉంచండి.క్రమంగా కళ్ళు తెరవండి. ఎక్కిళ్ళు తగ్గుతాయి. 

ఆధునిక వైద్యంలో క్లోర్ప్రోమోజైన్ బ్యాక్లోఫెన్ వంటి మందులు వాడతారు. 

తీవ్ర వ్యాధిలో డయాఫ్రమ్ ను నియంత్రించే నరం ఫెరోనిక్ నర్వ్ చెడిపోయినప్పుడు ఆపరేషన్ అవసరం అవుతుంది. కానీ ఇది చాలా అసాధారణం. 

ఎక్కిళ్ళు చాలా వరకు తాత్కాలికం. వ్యాధులు ఉన్నప్పుడు వస్తే అశ్రద్ధ చేయవద్దు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...