పేల సమస్య.. ఆయుర్వేద పరిష్కారం
తల శుభ్రంగా..
సమయం చిక్కినప్పుడు కాకుండా వారంలో కనీసం మూడు సార్లు తల స్నానం చేయాలి. శిరోజాలు పూర్తిగా ఆరాకే జడ వేసుకోవాలి. చిన్నారుల జుట్టు సాధ్యమైనంత వరకు చిన్నగా ఉంటేనే మంచిది. జుట్టును మరీ బిగుతుగా కట్టడం వల్ల దురద అధికం అవుతుంది. ఇక సమస్య మరీ ఎక్కువగా ఉంటే కొబ్బరి నూనెలో తగినంత వెనిగర్ కలిపి ,షాంపుతో తల రుద్దుకున్నాక ఈ నూనెను పట్టించాలి. అరగంట అయ్యాక మళ్ళీ ఘాటైన షాంపుతో స్నానం చేయాలి. వెనిగర్ ప్రభావానికి పేలు పోతాయి.
మర్దన తో మేలు..
నోటి దుర్వాసనను దూరం చేసే మౌత్ వాష్ అందుబాటులో ఉంటే దాన్ని తలకు రాసి కాసేపయ్యాక కడిగేయాలి. దీని వల్ల పేలు పోతాయి. ఎంతో మార్పు ఉంటుంది. రాత్రి పూట గోరు వెచ్చని నూనెతో తలంతా మర్దన చేసి మర్నాడు తాజా నిమ్మ రసం మాడుకు పట్టించాలి. గంట తర్వాత తల దువ్వితే పేలు ఇవతలకు వచ్చేస్తాయి. ఐతే తలలో ఇన్ఫెక్షన్లు ,దద్దుర్లు బాధిస్తుంటే నిమ్మ రసానికి దూరంగా ఉండాలి.
వాడే వస్తువులు జాగ్రత్తగా..
పేలు ఉన్నవారు వాడే దువ్వెనలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. తల స్నానం చేసిన ప్రతి సారీ దువ్వెనలు, హెయిర్ బ్యాండ్ లు, క్లిప్పుల వంటివి డిటర్జెంట్ కలిపిన వేడి నీటిలో అరగంట పాటు ఉంచి శుభ్ర పరచుకొని ఆ తర్వాతే వాడుకోవాలి. పేల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు , ఇతర సమస్యలు దూరమవుతాయి. ఔషధ గుణాలు ఉన్న షాంపూ వాడకం వల్ల సమస్య తగ్గుతుంది. దాన్ని నీటిలో కలపకుండా జుట్టుకి రుద్ది , అర గంట తర్వాత కడిగేసుకోండి. ఇక ఇలాంటి వారు వాడే దిండ్లు,దుప్పట్లను ఎప్పటికప్పుడు శుభ్ర పరుస్తూ ఉండాలి.
ఉల్లితో ఉపశమనం..
ఉల్లి పాయలను సన్నగా తరిగి మిక్సీలో వేసి మెత్తని గుజ్జు చేసి దాన్నుంచి రసం తీయాలి. ఆ రసాన్ని తల స్నానం చేసిన మర్నాడు జుట్టుకు పట్టించాలి. నాలుగు గంటలు అయ్యాక శుభ్ర పరచుకుంటే దురద సమస్య బాధించదు. రెండు వారాలకోసారి ఇలా చేస్తే పేలూ తగ్గు ముఖం పడతాయి. సీతా ఫలం గింజలను ఎండ బెట్టి పొడి చేసి తగినన్ని నీళ్లు కలిపి తలకు పూతలా వేయాలి. రాత్రి తలకు వస్త్రాన్ని చుట్టి పడుకుని మర్నాడు షాంపూ తో కడిగేసుకుంటే సరి పోతుంది. దీంతో చుండ్రు సమస్య కూడా నియంత్రణలో ఉంటుంది.
వెల్లుల్లి తో సమస్య దూరం..
సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు .. వెల్లుల్లిని మెత్తగా చేసుకుని ఆ గుజ్జులో పావు కప్పు నిమ్మ రసం కలిపి తలకు రాయాలి. ఆ ఘాటు వాసన కు పేలు పోతాయి..అలాగే ఆపిల్ ను సన్నగా తరిగి మిక్సీలో వేసి గుజ్జుగా చేసి దాన్ని తలకు రాసి గంటయ్యాక తల స్నానం చేస్తే ఫలితం ఉంటుంది. ఆలివ్ నూనె ను మరగ కాచి రాత్రి పూట తలంతా మర్దన చేసి ఏదైనా వస్త్రాన్ని చుట్టాలి. ఇలా మూడు రోజులకోసారి చేస్తుంటే చుండ్రు, దురద వంటి సమస్యలు తగ్గిపోతాయి.
తులసి చేసే మేలు..
పది బాదం పలుకులను నానబెట్టి మర్నాడు మెత్తగా చేసి పావు కప్పు నిమ్మ రసం కలిపి తలకు పూతలా వేసుకుని, గంటయ్యాక చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది. గుప్పెడు చొప్పున తులసి, వేప ఆకులు తీసుకుని మెత్తని ముద్ద చేసి మాడుకు రాసి రెండు గంటలయ్యాక తల స్నానం చేయాలి. ఇలా పది రోజులకోసారి చేస్తుంటే క్రమంగా సమస్య పరిష్కారమవుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి