పొట్ట మీద, తొడల పైన, చంకల దగ్గర కాళ్ళు చేతుల పైన ఎర్రని పెద్ద పెద్ద మచ్చలు , విపరీతమైన మంట, దురద , తల దువ్వుకుంటే తెల్లని పొట్టు రాలుతూ ఉంటుంది. చూసుకుంటున్న తనకు, చూస్తున్న ఇతరులకు ఒక రకమైన విచారం.. అదే " సొరియాసిస్ ". ఇది మగవారిలోనే కాదు, స్త్రీలలో కూడా రావచ్చు. దురదృష్టమేమిటంటే ఇది ఆరంభంలో ఏదో చిన్న చర్మ వ్యాధి అని అశ్రద్ధ చేయడం వల్ల పెరుగుతుంది. పూర్తి స్థాయికి వచ్చిన తర్వాత దీనికి శాశ్వత పరిష్కారం ఉండదు.
కారణమేమంటే ఇంతవరకూ జరిగిన పరిశోధనల వల్ల వ్యాధి కారణమే పూర్తి అవగాహనకు రాలేదు. క్రిమి వల్ల కాదు, రక్తం చెడిపోయి కాదు, వైరస్ వల్ల కాదు , అంటువ్యాధి కాదు. కానీ కొన్ని కుటుంబాలలో ఇది వస్తుంది.
చర్మం పై ఉన్న కణాల్లో తెలియని తీవ్రమైన మార్పు ఈ వ్యాధికి కారణమని అంతర్జాతీయంగా విశ్వసించ బడుతోంది. ఈ వ్యాధి నెమ్మదిగా ప్రారంభమైనా తొందరగానే తీవ్ర స్థితికి చేరుతుంది.
ఇది ఏదో అసాధారణమైన వ్యాధి కాదు,సామాన్యమైన చర్మ వ్యాధి. మోకాళ్ళ పైన, మోచేతుల పైన , చంకల్లో, గజ్జల్లో, ఎర్రటి పెద్ద మెరుస్తున్న మచ్చలు ఏర్పడి తెల్లటి ద్రవంతో కారుతూ , ఎండిన ఆ తెల్లటి పొడి పొట్టులా రాలుతూ ఉబ్బి, మంట, నొప్పి, దురదలతో ఉంటుంది.
వంశ పారంపర్యమే కానీ..
తలపైన ముఖ్యంగా తల మధ్య భాగంలోను, తొడల పైన బొడ్డు చుట్టూ పొట్ట భాగంలో ఇవి ఏర్పడతాయి తర్వాత చాతి పైన ముఖం పైన వ్యాపిస్తాయి.
బాధలు రాత్రిపూట ఈ ఎండాకాలంలోనూ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా guttate అనే సొరియాసిస్ వ్యాధి పిల్లల్లో వస్తుంది. అది చీము, వాపులతో కూడుకుని మరీ బాధ పెడుతుంది. మరో ముఖ్య విశేషమేమంటే ఈ వ్యాధి ఏ వయసులోనైనా రావచ్చు.
వంశ పారంపర్యము కానీ , కాల మాన పరిస్థితులు కాని, దేశ నైసర్గిక వైరుధ్యాలు కానీ , పరిసరాల కాలుష్యం కానీ ఈ చర్మ వ్యాధికి కారణం కావు. లావుగా ఉన్న వారిలో ఇది మరీ బాధ పెడుతుంది.
ముఖ్యంగా చంకల్లోనూ, రొమ్ముల పైన వస్తే అది సామాన్యమైన చికిత్సకు కూడా తగ్గినట్లు కనిపించదు. Plaque psoriasis, guttate psoriasis, pustular psoriasis, inverse psoriasis, erythro dermic psoriasis అని ఈ వ్యాధి ఐదు రకాలుగా ఉంటుంది.
తలలో దురద,మంట,జుట్టు రాలిపోవడం , ఒళ్ళంతా గాయాలు, అందులోంచి నీరు కారడం , చేప పై పొట్టు లాగా పొట్టు రాలడం. గోరు చుట్టూ, మోకాళ్ళు, మోచేతుల నొప్పి, అర చేతిలో, అరి కాళ్ళలో పగుళ్లు. చర్మం లేచి పోవడం, ఒక్కొక్కప్పుడు జ్వరం గాలి తగిలినా, చెమట పట్టినా మంటగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి.
మరో విశేషం ఏమిటంటే అందరిలో అన్ని లక్షణాలు ఉండకపోవచ్చు.కొన్ని ప్రస్ఫుటంగా ఉంటాయి . మరో దురదృష్టం ఏమిటంటే రక్త పరీక్షలలోనూ ఎక్కడా చెడు కనిపించదు. ఏ కారణం కనిపించదు. నిండు ఆరోగ్యంగా ఉన్న వారిలో ఈ వ్యాధి వస్తే విపరీత పరిణామాలు చూపిస్తుంది. మరో విశేషం.. ఇది అంటువ్యాధి కాదు.
ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. ఈ వ్యాధి ఉన్న వాళ్ళ పిల్లలకు ఈ వ్యాధి రాదు. గర్భిణీ కాలంలో ఈ వ్యాధి ఉండడం వల్ల శిశువుకు కానీ ఆమె ఆరోగ్యానికి కానీ పెద్ద హాని ఉండదు.
ఆయుర్వేద రీత్యా ఇది ఆగంతుక వ్యాధి.అంటే ఏ కారణం లేకుండా హఠాత్తుగా వచ్చే వ్యాధి. విసర్ప వ్యాధులలో తీవ్రమైన విసర్ప వ్యాధిగా దీన్ని భావించవచ్చు.
శరీరంలో పిత్త శక్తి దూషించడం వల్ల ఈ వ్యాధి వస్తుంది.మిగతా వాత, కఫ శక్తులు కూడా ఈ వ్యాధిలో దూషించ బడతాయి. చర్మం, రక్తం, లసిక మాంసం .. ఈ ధాతువులు చెడడం వల్ల ఈ వ్యాధి వస్తుంది.
ఇది కష్ట సాధ్యమైనది కనుక పూర్తిగా తగ్గదు.కానీ మంచి ఉపశమనం ఇచ్చే చక్కటి చికిత్సలు ఆయుర్వేదంలో ప్రతిపాదించ బడ్డాయి. పసుపు కలిపిన నెయ్యి, వేపాకుతో కాచిన నీటితో స్నానం, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ప్రతి రోజూ చేయవలసిన ప్రక్రియలు.
ఉపశమన చికిత్సలు..
ఈ వ్యాధి ఉన్న వారు ఎక్కువ పులుపు, శెనగ పిండితో చేసిన వస్తువులు , వేరు శనగ నూనె, వంకాయ, కోడి మాంసం, గుడ్డు, చేప, పీతలు , పుట్ట గొడుగులు తీసుకోకూడదు. నువ్వులు, మినుములు, ఉలవలు , వెల్లుల్లి తగ్గించడం మంచిది.
వ్యాధి హరణ రసాయనం శారీభాద్యాసవం , చంద్రనాసవం,మంజిష్ట, హరిద్రాకల్పం , వంటి చక్కటి మందులు ఉన్నాయి. శరీరాన్ని శుద్ధి పరిచే శోధన చికిత్సలు , పంచ కర్మ చికిత్సలు చాలా ఉపకరిస్తాయి. ఈ చికిత్సలో అంతర్ శుద్ధి చేసి చర్మ కణాలను జాగృత పరిచే మందులతో శమన చికిత్స చేయించుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వైద్యుని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.
ఆయుర్వేదంలో ఈ సొరియాసిస్ పై అనేక ద్రవ్యాలు , వాటి ఉపయోగాలు ప్రస్తావించబడ్డాయి. దేశ విదేశాల్లో,కేరళ, వారణాసి విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరుగుతున్నాయి.
హరిద్ర ఆమ్లకి, విష్ణు క్రాంత, గోక్షుర , తులసి, గుడూచి, పిప్పలి వంటివి వివిధ పరిమాణాల్లో తయారు చేస్తే చక్కని ఫలితాలు ఉన్నాయని గుర్తించబడింది.
ప్రశాంతతే నివారణ..
ఇవి వ్యాధి మీద సూటిగా కాకుండా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడం వల్ల సొరియాసిస్ లో వచ్చే చీము , నీరు చేరడం, ఎలర్జీ, వాటి వల్ల వచ్చే జ్వరం, నొప్పి తగ్గడానికి చాలా ఉపకరిస్తుంది. తులసి, చిత్రకం ఎలర్జీని తగ్గించే శక్తి గలవని అనేక పరిశోధనల్లో గుర్తించబడింది.
చర్మం పై వచ్చే ప్రతీ పెద్ద మచ్చని సొరియాసిస్ అనుకోకూడదు.చిరకాలం నుండి ఉండి ఏ కారణం లేకుండా ఎర్రగా ఉండి తెల్లని పొట్టు రాలుతుంటేనే సొరియాసిస్ అని అనుకోవాలి. ఇది సాంక్రమిక వ్యాధి కాదు. ప్రమాదాన్ని కలిగించే వ్యాధి కాదు. ఒకరి తువాలు, దువ్వెన లాంటివి వాడడం వల్ల మరొకరికి ఇది వ్యాపించదు. ఇది తగ్గడానికి మందులతో పాటు మానసిక ప్రశాంతత చాలా అవసరం. ఈ వ్యాధి మనశ్శరీరాలకు సంబంధించినది.
మీ ఆహారంలో పులుపు,సెనగ పిండి, వేరు శనగ నూనె , మసాలా వస్తువులు తగ్గించుకుంటే ఈ బాధలు తగ్గుతాయి. మంచి గంధం పొడి, వేప పొడి కలిపి పైన రాసుకోవడం హితకరం. జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఉండడం సహజం . వాటికి విచారించేకన్నా, నయం చేసుకుని జీవితాన్ని ఆనంద మయంగా చేసుకోవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి