నిర్గుండీ పుష్పం తిక్తోష్ణం కృమి వాత కఫాపహం
గుల్మ ప్లీహా రుచిం కుష్టం శోఫమ్ జయేత్కటు..
భోజన కుతూహలం పాక శాస్త్ర గ్రంథం వావిలి పూల గురించి పై శ్లోకంలో వివరించింది. వావిలి పూలు కొద్దిగా చేదుగా ఉంటాయి. చలవనిస్తాయి. వాత వ్యాధులు అన్నిటిపైనా పని చేస్తాయి. కఫాన్ని తగ్గిస్తాయి. కడుపులో ఏర్పడే అనేక వ్యాధుల పైన వీటి ప్రయోగం ఉంది. ముఖ్యంగా స్ప్లీన్ లో వచ్చే వ్యాధులన్నింటిపైనా బాగా పని చేస్తాయని భోజన కుతూహలం గ్రంథంలో తెలిపారు.
నోటికి రుచి తెలియకపోవడం , అన్న హితవు కలగక పోవడం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. వావిలి పూలను సేకరించి, నీడన ఆరనిచ్చి , కొద్దిగా నెయ్యి వేసి వేయించాలి.
ధనియాలు,జీలకర్ర, శనగ పప్పు,మిరియాలు, మినప్పప్పును కూడా పైపైన వేయించి, మెత్తగా దంచిన కారప్పొడి తినడానికి అనుకూలంగా ఉంటుంది. తెలుగు వారికి బాగా అందుబాటులో ఉండే మొక్క ఇది. రైతులను గానీ, మొక్కల గురించి బాగా తెలిసిన వారిని గానీ అడిగితే ఖచ్చితంగా తెలుస్తుంది. చాలా సార్లు చూసిన మొక్కే ఇది. ఒక్కో కణుపు దగ్గర ఐదు ఆకుల చొప్పున ఉంటాయి. ఈ మొక్కను గుర్తు పట్టడానికి ఇదే కొండ గుర్తు. శనగ గింజంత నీలి రంగు పూలు పూస్తాయి.
కీళ్ల నొప్పులు, కీళ్ల వాతము, వాపులు తగ్గించే ఆయుర్వేద ఔషధాలలో వావిలి ని కూడా చేరుస్తారు. దీని ఆకులు చవకగా దొరుకుతాయి. వావిలి ఆకులు, పూలు, పండ్లు , గింజలు, వేళ్ళు.. వీటన్నింటికీ వాతాన్ని తగ్గించే శక్తి ఉంది. వీటితో కీళ్ల వాతము పైన పని చేసే నిర్గుండీ తైలాన్ని తయారు చేస్తారు.
వావిలి పూలకు ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఎక్కువ. " సింధు వారస్య పుష్పెణ బద్దో ముచ్యేత బంధనాథ్ " అని" పుష్ప చింతామణి" అనే గ్రంథం పేర్కొంది.
వావిలి పువ్వులు సమర్పిస్తే అన్ని అడ్డంకులు తొలగి , బంధనాల నుంచి విముక్తి పొందుతారని అర్థం. ఈ పూలు సూర్యుడికి ప్రీతి పాత్రమని , వావిలి వలన పుత్ర లాభం కూడా కలుగుతాయని ఈ గ్రంథం పేర్కొంది.
భోజన కుతూహలం వావిలి పూల ఆహార యోగ్యతను మాత్రమే సూచించింది కానీ, వీటిని ఎలా వండుకోవచ్చో చెప్పలేదు. ఐతే వేప పూలను ఏ విధంగా ఉపయోగిస్తామో వావిలి పూలను కూడా అలాగే వాడుకోవచ్చు.
చరకుడు వావిలి పూలను విష దోషాలు హరించేదిగా పేర్కొన్నాడు. ఎలర్జీ కారణంగా వచ్చే చర్మ రోగాలు , దురదలు, ఉబ్బసం, నీరు పట్టి ఉబ్బు ఏర్పడే వ్యాధుల్లో , ఊపిరి తిత్తులు, మూత్ర , స్త్రీల వ్యాధుల్లో వావిలి పని చేస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి