24, ఆగస్టు 2026, సోమవారం

శక్తి దాత.. సీతా ఫలం..

 సీతా ఫలం అనగానే తీయని మృదువైన గుజ్జు గుర్తుకు వస్తుంది. దీని లోపలి గుజ్జు కస్టర్డ్ లా మెత్తగా ఉంటుంది కాబట్టి దీనిని ఇంగ్లీష్ లో కస్టర్డ్ ఆపిల్ అని పిలుస్తారు. 

భోజన కుతూహలం గ్రంథంలో సీతా ఫలం గుజ్జును తియ్యని, చలవ చేసేదిగా , పైత్య దోషాలను తగ్గించేదిగా పేర్కొన్నారు. 

సీతా ఫలం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటంటే..

అన్నం సహించక, నోటికి రుచి తెలియని వారికి సీతా ఫలం రుచిని కలిగిస్తుంది. ఇది తినటం వలన ఎక్కువ కఫం పెరగదు. 

మిగల ముగ్గిన సీతా ఫలం లో సహజ చక్కెరలతో పాటు పిండి పదార్థాలు , పీచు, విటమిన్ సి, బి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలున్నాయి. వీటి వల్ల శరీరానికి త్వరగా శక్తి అందుతుంది. పీచు జీర్ణ ప్రక్రియకు తోడ్పడుతుంది. 

సీతా ఫలం పచ్చి కాయను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు.అతిసారం , నీళ్ల విరోచనం తగ్గటానికి దీనిని ఉపయోగిస్తారు. 

కొన్ని ప్రాంతాలలో పచ్చి కాయను బాగా ఎండబెట్టి దానిని పొడిగా దంచుతారు. చర్మ సమస్యలకు ఈ పొడి మంచి మందుగా పనిచేస్తుంది. 

సీతా ఫలం గింజలు నల్లగా మెరుస్తూ ఉంటాయి.అందుకే ఈ మొక్కకు " కృష్ణ బీజ" అనే పేరు కూడా వచ్చింది. ఇవి తినడానికి పనికి రావు. కానీ సంప్రదాయ వైద్యంలో ఈ గింజల పొడి ని చుండ్రు తగ్గించడానికి , పేలను తొలగించడానికి వాడతారు. 

సీతా ఫలం వేడి శరీర తత్వం ఉన్న వారికి చలవనిస్తుంది. దీనికి పిత్త వికారాలు, దాహం, మంట వంటి వాటిని శాంతింప చేసే గుణం ఉంది. 

సీతా ఫలాలు ఎక్కువగా తినటం మంచిది కాదు.ముఖ్యంగా మధుమేహం , స్థూల కాయం ఉన్న వారు వీటిని మితంగా తింటేనే మంచిది. 

16, ఆగస్టు 2026, ఆదివారం

సొర ఆకుల కూర.. ఆయుర్వేదం

 ఆనప్పాదు అనేది తెలుగులో ఒక అందమైన పద బంధము. శాక రాజము అనదగిన సొర కాయకు ఇది ఒక పర్యాయ పదం. ఆహార కొరతను తీర్చే ఒక ప్రకృతి వర ప్రసాదం కూడా ఇంటి పైకాపు మీదకి సురతీగ పాకి పైనుంచి కాయ ఒకటి తెగి జారీ వచ్చి కింద ఉన్న మేక నెత్తిన పడిందట పుటుక్కు జరజర డుబుక్కుమే అని జానపదలు సరదాగా చెప్పుకుంటున్నారు దీనిని. 

రావి కొండల రావు గారు అనప్పాదు గురించి తెలుగు మీస్టారి పాత్రలో సైలెన్స్ అంటూ చేసిన కామెడీ పాత తరానికి ఇంకా గుర్తుండే ఉంటుంది. పొడవుగా ఉండే వాటిని సొరకాయలని, గుండ్రంగా చిన్న కుండలా ఉండే వాటిని ఆనప కాయలు అని అంటారని కొందరు చెప్తారు. కానీ సొర, ఆనబ అని రెండింటిని పిలుస్తుంటారు. తుంబీ , కుంభ తుంబీ అని సంస్కృతంలో పిలుస్తారు వీటిని.

మనకు సొరకాయ వాడకం గురించి వేద కాలము కన్నా ముందు నుండే తెలుసు. 2024లో అమెరికాలోని కార్నల్ విశ్వవిద్యాలయంలో 197 రకాల సొరకాయల జన్యువు లను పరిశీలించడం జరిగింది. దక్షిణాఫ్రికాలో సుమారు 12000 సంవత్సరాల క్రితం పుట్టి అక్కడినుండి ఆసియా, అమెరికా ఖండాలకు సొరకాయ మొక్క వ్యాపించింది అని తేల్చారు. 

సొర మొక్క కాయగూరే కాదు, ఆకుకూర కూడా. వాన కాలంలోనూ, ఆ తర్వాత వచ్చే కార్తీకమాసం ఆహార కరువు కాలంలోనూ పూర్వం మనవాళ్లు ఈ అనబ ఆకులను కూరగా వండుకొని కమ్మగా తినేవారు. తినటానికి పనికొచ్చేది ,పోషకాలను కలిగి పుష్టి, రుచిని కూడా ఇచ్చేది అయినప్పుడు దానిని తినడానికి మనకు నామోషీ ఎందుకు..

ఆనబ ఆకులను సన్నగా తరిగి, ఒక బాండీలోకి తీసుకొని తగినంత ఉప్పు వేసి నీళ్ల మూత పెట్టి మగ్గనిచ్చి ఉల్లి ముక్కలు వగైరా చేర్చి దానిపైన కొంచెం పెరుగు, కొద్దిగా చింతపండు రసం ,కాసింత మినప పిండి కొద్దిగా పొడి బెల్లం కలిపి నెయ్యి వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మెంతులు, ఆవాలు ,జీలకర్ర ,నువ్వు, మినప్పప్పు లాంటివి విడివిడిగా వేయించి మెత్తగా దంచిన పొడిని తగినంతగా ఈ కూరలో కలిపి బాగా మగ్గనివ్వాలి. చివరలో ఇంగువ తాలింపు పెడితే సొర ఆకుల కమ్మని కూర సిద్ధం అయినట్లే. సోరలాంటి తీయ కూరలను అనవసరమైన మసాలాలు, అధికంగా చింతపండు రసాలు కలపకుండా తీపి, పులుపు, ఉప్పు ,కారం ,వగరు, చేదు ఆరు రుచులు ఉండేలాగా నలుడు చెప్పిన విధానం ఇది. 

పాలకూరతో చేసుకున్నట్లే పప్పు ,పులుసు కూర, రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు. పాలక్ లాంటివి గాని, పకోడీలు, పరోటాలు గాని వండుకోవచ్చు. బచ్చలాకు లాగా, జిగురు తోటకూర లాగా వగరు ఉండవు కాబట్టి సోరాకులతో అన్నీ వండుకోవచ్చు. కంద- బచ్చలి లాగానే ఆవపెట్టిన కూర బాగుంటుంది .సోరాకుల సలాడ్ తింటే ఎసిడిటీ ,కడుపులో మంట ,ఇరిటేషన్లు తగ్గుతాయి. 

చింతపండు వేయకుండా పెసర లేదా కందిపప్పుతో కాచిన కట్టులు, సన్నగా తరిగిన సొర ముక్కలను, సొర ఆకులను కూడా కలిపి కాచిన పప్పుచారు లేదా సూపు పొట్టకు మేలు చేస్తుంది. సొర ఆకులను జ్యూస్  తీసి అందులో చారు పొడి వేసి కాచిన చారు చాలా రుచికరంగాను జీర్ణశక్తిని పెంచేదిగాను ఉంటుంది. 

సొరకాయ కున్న గుణాలన్నీ సొర ఆకులకు ఉన్నాయి. ఈ ఆకులలో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము పుష్కలంగా ఉన్నాయి. ఖనిజ లోపాలతో బాధపడే వారికి ఈ ఆకులు వరప్రసాదం అని చెప్పవచ్చు. అమితంగా చలవ చేస్తాయి, శరీరానికి మృదుత్వాన్ని కలిగిస్తాయి .

పశ్చిమ బెంగాల్లో దీపావళికి ముందు జరిగే భూత చతుర్దశి సందర్భంగా చేసే చద్దోశాక్ అనే సంప్రదాయ వంటకంలో 14 రకాల ఆకుకూరలతో పాటు సొర ఆకును కూడా తప్పనిసరిగా కలుపుతారు. సొరాకు ముదిరే కొద్దీ దానిమీద నూగు, ముల్లలాంటి రోమాలు ఏర్పడతాయి. వాటిని తొలగించడం పెద్ద పని అందుకని బాగా లేత ఆకులను మాత్రమే ఎంచుకోవాలి. ఎండ పడే చోట కుండీలో  సొర విత్తులు నాలుగు పాతండి  చాలు, వారానికి ఒకటి రెండు సార్లు మీ ఇంటిల్లిపాది సొర ఆకులను కమ్మగా వండుకుని తినవచ్చు.

16, మే 2026, శనివారం

చిక్కిపోయే వారికి సార పప్పు

 సారపప్పునే చార పప్పు అంటుంటారు మన వాళ్ళు. మొరలి పండు గింజ లోపల ఈ సార పప్పు ఉంటుంది. మొరలి మొక్కనే చార మామిడి అని కూడా కొన్ని తెలుగు ప్రాంతాల్లో పిలుస్తారు. హిందీ వాళ్ళు చిరోంజీ అని,సంస్కృతంలో ప్రియాల అనీ అంటారు. సార చెట్టు అడవి మొక్క. తెలంగాణ,ఆంధ్ర, కర్ణాటక అటవీ ప్రాంతాల్లో ఎక్కువ గా పెరుగుతుంది.దీని పండును యాప్రికాట్ అంటారు. సార పండ్ల కు ఔషధ గుణాలు ఎక్కువ. తీపి, పులుపు రుచులతో జిగురుగా ఉంటుంది. వీటి గుజ్జుని శరీరం క్షీణించి పోయే వ్యాధుల్లో ఇస్తారు.బాదం బంక లాగానే ఈ చెట్టుకీ తుమ్మ లాంటి జిగురు వస్తుంది. ఈ జిగురుని ఎండ బెట్టి అమ్ముతారు. కముకు దెబ్బల్లోనూ , కీళ్ల వాపుల్లోనూ ఈ జిగురుని కడుపులోకి తీసుకుంటే వాతపు నొప్పులు తగ్గుతాయి.బాదం పప్పు లాగే సార పప్పు తియ్యగా ఉంటుంది.ఇది శరీరంలో శక్తిని పెంపొందింప చేస్తుంది. వాతాన్ని,వేడిని తగ్గిస్తాయి.గుండెకి మంచి చేస్తాయి. అతిగా తింటే మల బద్ధకం పెంచుతుంది.ఆలస్యంగా జీర్ణం అవుతాయి. అజీర్తి తో బాధ పడే వారు అతిగా తింటే కీళ్ల వాతం పెరుగుతుంది.వీటి వాడకం మిఠాయిల తయారీ పరిశ్రమలోనే ఎక్కువ.వక్కపొడి, బూందీ మిక్చర్ ,పాయసంలోనూ ఈ గింజల్ని కలుపుతుంటారు.

శరీరానికి మృదుత్వాన్ని ఇస్తాయి.పేగుల కదలికలను పెంచుతాయి.అందుకని సరైన మోతాదులో తీసుకుంటే విరేచనం అయ్యేలా చేస్తాయి.

వేరుశనగపప్పు లాగే ఇది కూడా నూనె గింజ దీని నుంచి తీసిన నూనెను చిరంజి నూనె లేదా సార పప్పు నూనె అంటారు ఈ నూనె తలకు రాసుకుంటే వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడతాయి. 

ఈ గింజలను కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేగించి మిక్సీ పట్టిన పొడిని మసాలాలతో పాటు కలిపి వాడుతుంటారు శుష్కించిపోయే పిల్లలకు వేయించిన గింజల పొడిని పావు చెంచా నుండి అర చెంచా మోతాదులో గ్లాసు పాలలో కలపాలి ఆ పాలను రోజు ఇస్తుంటే ఎదుగుదల బాగుంటుంది బరువు తగ్గటాన్ని నిరోధిస్తుంది అలాగని స్థూలకాయాన్ని కలిగించదు. సార పప్పు వేడి వలన వచ్చే అలసటను పేగుల్లో పెరిగిపోయిన ఉడుకును తగ్గిస్తుంది న్యూరోపతి లక్షణాలతో బాధపడే వారికి మేలు చేస్తుంది అరికాళ్ళలో మంటలు జ్వరం తగ్గుతుంది పొట్ట నిండినట్టుగా ఉంటుంది అందువల్ల ఆహార ఆహారాన్ని తక్కువగా తీసుకోవడానికి వీలవుతుంది ఇది పరోక్షంగా షుగరు ఊబకాయం వ్యాధులు ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది.

2, మే 2026, శనివారం

వృద్ధాప్యాన్ని జయించే ఉసిరి

 ఆమలకం కషాయామ్లం మధురం శీతలం లఘు.. దాహపిత్త వమీ  మేహా శోషజ్ఞంచ రసాయనం..

అమలకి అంటే పుట్టనిండా పోషకాలు నిండిన అమృతభాండం అని అర్థము. పూర్వం కార్తీక మాసం సమయంలోనే అందుబాటులోకి వచ్చేవి ఇప్పుడు వివిధ ప్రాంతాలకు చెందిన ఉసిరికాయలు ఏడాది పొడవునా మార్కెట్లకు వస్తున్నాయి కాబట్టి రకరకాల పద్ధతులను తాజా ఉసిరికాయలను అనునిత్యం వాడుకునే అవకాశం ఇప్పుడు ఉంది. 

ఆమ్లకిని ఆహారానికి ముందు ఆహారంతో పాటు కానీ ఆహారంగానూ ఆహారం తర్వాత కూడా తీసుకోవచ్చు. కీళ్ల నొప్పులు నడుము నొప్పి పక్షవాతంలాంటి వాత వ్యాధులు ఉన్నవారికి గ్యాస్ ఉబ్బరం ఉన్నవారికి ఆమ్లకి దివ్య ఔషధం దీని గుజ్జులు ఒక చెంచా స్వచ్ఛమైన నువ్వుల నూనె కలిపి తీసుకున తర్వాత వేడి నీళ్లు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. 

స్థూలకాయం షుగర్ వ్యాధి ఉబ్బసం ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు రోజు ఒక ఉసిరికాయ తినడం వలన మేలు జరుగుతుంది ఉసిరికాయ గుజ్జులు పసుపు అల్లం మిర్యాల పొడి కొత్తిమీర పుదీనా లాంటిది కలిపి టీ తయారు చేసుకుని ఉదయం తాగితే ఉపయోగకరంగా ఉంటుంది. 

కడుపులో మంట అల్సర్లు వాంతి వేడి చేసిన లక్షణాలతో బాధపడే వారికి ఉసిరికాయ గుజ్జుతో తేనె కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. 

ఉసిరికాయల గుజ్జు దాల్చిన చెక్క పొడి పసుపు ఒక కప్పు నీళ్లలో కలిపి మరిగించి రోజు తాగుతూ ఉంటే ఊపిరితిత్తుల వ్యాధులలో ఉపయోగకరం దగ్గు తీవ్రమైన జలుబు పడిశ భారానికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

ఉసిరికాయలు అమితంగా చలవనిస్తాయి వేసవిలో దప్పిక తీరుతుంది వడదెబ్బ నుండి రక్షణ కలుగుతుంది జీర్ణశక్తిని పెంపు చేస్తుంది వెన్నపూసతో తీసుకుంటే పేగులకు చలవతో పాటు మృతుత్వం కలుగుతుంది కొద్దిగా బెల్లం ఉసిరికాయ గుజ్జు కలిపి ఒక కప్పు నీళ్లు పోసి మిక్సీ పట్టి తాగితే వెంటనే ఉపశమనం కనిపిస్తుంది మూత్రశయానికి సంబంధించిన సమస్యలన్నిటికీ ఉపయోగపడుతుంది. 

రోజు ఒక ఉసిరికాయ తీసుకుంటే మూత్రపిండాలు లేవారు ఆరోగ్యవంతంగా ఉంటాయి కలబంద ఆమ్లాకి కలిపి జ్యూస్ తీసుకుని అరకప్పు చొప్పున రోజు తాగుతుంటే లివర్ బల సంపన్నం అవుతుంది. 

ఆమ్లకి తీపి క్యాండీలు బజార్లలో దొరుకుతాయి పిల్లలకు రోజు రెండు లేదా మూడు క్యాండిల్ ఇస్తుంటే వారి శారీరక మానసిక ఎదుగుదల బాగుంటుంది 

ఉసిరి మన ఆరోగ్య సిరి తేనెతోను బెల్లం తోను రోజు కొద్దిగా ఉసిరి చూసి ఇస్తూ ఉంటే పిల్లల్లో మేధా సంపత్తి పెరుగుతుంది దురదలు అకారణంగా వచ్చే జ్వరాలు దప్పిక అరికాళ్ళ మంటలు అజీర్తి అన్న హితవు లేకపోవడం మలబద్ధకం లాంటి సమస్యలన్నీ తగ్గటానికి ఉసిరికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది ఆమ్లకితో పప్పు రోటి పచ్చడి చేసుకోవచ్చు చారు కాచుకోవచ్చు ఆమ్లకు పులిహోర కమ్మగా ఉంటుంది ఉసిరికాయ అంటే పోషకం మాత్రమే కాదు ముసలితనం ముంచు కు రాకుండా శరీర కాంతిని కాపాడుతుంది.

29, ఏప్రిల్ 2026, బుధవారం

ఔషధ విలువల రావి చెట్టు

 రావి చెట్టు ...  శాంతి ,ఆయురారోగ్యాలకు సంకేతం అంటున్నది అధర్వణ వేదం. వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని నేనేన నీ, ఈ మహావృక్ష మూలాలు ఊర్ధ్వ లోకాలలో ఉన్నాయని, ఇది దివ్యమైన వృక్షం అని గీతాకారుడు నొక్కి చెప్పాడు. ఇందులో అతిశయోక్తి లేదని తాజా పరిశోధనలు నిరూపిస్తున్నాయి. అశ్వత్థం నీడన ధ్యానం వలన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అనడం వెనక శాస్త్రీయత ఉంది.

సిద్ధార్థుడనే రాకుమారుడు ఈ చెట్టు కింద కూర్చుని జ్ఞాన బుద్ధుడు అయ్యాడని ,రావి చెట్టుని బోధి వృక్షమని, జ్ఞాన వృక్షం అని బౌద్ధులు మతపరమైన నమ్మకంతో అన్నది కాదు ..అది మెదడు పనితీరును పెంచే ఔషధ విలువలు కలిగిన వృక్షం అని ఇప్పుడు రుజువయ్యింద.

అధికంగా ఆక్సిజన్ విడుదల చేసే పర్యావరణ మిత్ర వృక్షాలలో అశ్వద్ధం ముఖ్యమైనది కూడా ప్రతి ఊరికి ఎనిమిదిక్కుల రావి చెట్లు ఉండాలన్నది నియమంగా కావాలి. 

నరాలలో వాపు, ఆక్సిడేటివ్ ఒత్తిడి, కన సంకేత మార్గాల నియంత్రణ ఇవి ఆధునిక న్యూరో సైన్స్ లో ప్రధాన అంశాలు. రావి ఆకుల్లోనూ పండ్ల లోనూ సెరటోనిన్ సహా న్యూరో రసాయన మార్గాలను ప్రభావితం చేసే రసాయనాలు ఉన్నాయి. అది ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి మెదడు కణాలకు రక్షణనిస్తాయి. జ్ఞాపక శక్తిని మెరుగుపరిచే న్యూరో ప్రొటెక్టివ్ గుణాలు వీటికున్నాయి.

న్యూరానులు అనే మెదడు కణాల సంఖ్యలో పెరుగుదల కణ నిర్మాణ నాణ్యతల్ని గమనించారు.  ఆమ్నేషియని తగ్గించి జ్ఞాపక శక్తిని మెరుగుపరిచే గుణాల పైన అల్జీమర్స్ పార్కిన్ సోనిజం లాంటి న్యూరో డి జనరేటివ్ వ్యాధుల పైన దీని ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నారు ప్రస్తుతం. మెదడు పైన విష దోషం /న్యూరో టాక్సిసిటీ ప్రభావాన్ని తగ్గిస్తుందనేది సారాంశము .

మన పూర్వీకులు జ్ఞానముకు ప్రతీకగా భావించిన రావి చెట్టుకి మెదడును ఉత్తేజితం చేసే గుణాలు ఉన్నాయని కనుగొనడం గొప్ప పరిణామం అని చెప్పవచ్చు. 

మెకానిస్టిక్ ఇన్ సైట్స్ ఇన్ టు ది న్యూరో ప్రొటెక్టివ్ పోటెన్షియల్ ఆఫ్ సేక్రేడ్ ఫికస్ ట్రీ.. అనే పరిశోధన వ్యాసం ఎన్నో అద్భుత పరిశోధన అంశాలను అందించింది. 

జ్వరం , గ్యాస్ట్రిక్ అల్సర్ల నివారణ, క్యాన్సర్ నిరోధక శక్తి, మధుమేహ నియంత్రణ, కొలెస్ట్రాల్ తగ్గింపు గుణాలు రావి బెరడుకి ,ఆకులకి ,పండ్లకి ఉన్నాయని అంశం పైన ఇప్పుడు పరిశోధనలు కొనసాగుతున్నాయి. 

 దగ్గు ,ఆస్తమా, హృదయ రోగాలు ఉన్నవారికీ ఇది మేలు చేస్తుందని ,రక్తస్రావాన్ని అరికడుతుందని, రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రిస్తుందని ఆయుర్వేద గ్రంధాలు పేర్కొన్నాయి. గాయాలను మాన్పే హీలింగు గుణం దీనికి ఉన్నది .దీని బెరడు ,ఆకులు ,పండ్లను ఔషధాలలో విరివిగా వాడతారు. ఆకుల్ని, పండ్లని ఆహారంగా కూడా తీసుకోవచ్చు.

రావిపండ్లలో నరాలకు బలాన్ని ఇచ్చే సెరటోనిన్ వలన అవి మెంటాట్ లాంటి ఔషధాలతో సమానంగా పనిచేస్తాయని కూడా గుర్తించారు. ఈ పళ్ళు తియ్యగా ఉంటాయి, చలవచేస్తాయి, ఉద్రకాన్ని తగ్గిస్తాయి. పైత్యాన్ని ,అసిడిటీని, అల్సర్లను ,వాంతి వికారాలను తగ్గిస్తాయి. పండ్లను ఎండబెట్టి మెత్తగా దంచి రోజు టీ లాగా కాచుకుని తాగితే ఉబ్బసం తగ్గుతుంది. స్త్రీలలో గర్భాశయ దోషాలను, పురుషులలో వీర్య దోషాలను పోగొట్టి  సంతానయోగ్యతనిస్తాయి. గింజలకు కూడా ఇదే గుణాలు న్నాయి. 

గుండె ఆకారంలో ఉండే రావి ఆకులకు మెదడు వ్యాధులతో పాటు హృదయ దౌర్బల్యని తోలగించే ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ ఆకులు కూడా ఆహార పదార్ధంగ తీసుకోవచ్చు.

లేత రావి ఆకులకు సమానంగా చింతచిగురు లేదా చుక్కకూర కలిపి సన్నగా తరిగి మెత్తగా ఉడికించి పప్పు లేదా పొడి కూరగా చేసుకోవచ్చు. రావి ఆకులను ఇడ్లీ ప్లేట్ మీద పరచి వాటి మీద ఇడ్లీ పిండి వేసి పైన రావి ఆకులతో మూసి ఆవిరి మీద ఉడికిస్తే రావి ఆకు గుణాలు ఇడ్లీలకు అబ్బతాయి.

రావీ లేదా వేప చెట్టు కింద నాగదేవతా విగ్రహాలు ప్రతిష్టించుకుని పూజించడానికి రావి విష దోష హరం కావడం ఒక కారణం. మన సాంప్రదాయాలలోని సాంకేతికతను శాస్త్రీయతను అర్థం చేసుకొని వాటిని మెరుగుపరుచుకోగలడం మన విజ్ఞత. 

ఇన్ని అద్భుత గుణాలున్న రావి చెట్టు నుండి మనము ప్రయోజనాలను పొంది ఆరోగ్యంగా ఉండాలి.


14, మార్చి 2026, శనివారం

ఫలాలలోకెల్లా ఉత్తమం ద్రాక్ష

 ఆయుర్వేదంలో ద్రాక్షను ఫలోత్తమం అని ప్రశంసించడం జరిగింది. ద్రాక్షలో అనేక పోషక విలువలు ఉండటమే దీనికి ముఖ్య కారణం. మన పురాతన గ్రంథాల్లో ద్రాక్షపళ్లను ద్రాక్ష మృద్విక, గోస్తని, మధురస అనే పేర్లతో పేర్కొన్నారు.

 ప్రస్తుతం మనకు ప్రధానంగా ఆకుపచ్చ ద్రాక్ష, నల్ల ద్రాక్ష, కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష లభిస్తున్నాయి. ఈ మూడింటికి గుణాలు దాదాపు ఒకేలా ఉన్న ,తీపి పులుపు నిష్పత్తులలో తేడాలు ఉన్నాయి. అందుకే వాటి గుణాల్లో కూడా స్వల్ప మార్పులు కనిపిస్తాయి. ఇక ద్రాక్ష వల్ల కలిగే ఆరోగ్య ఫలితాలు ఏమిటంటే ..

ద్రాక్ష శరీరానికి చలవనిస్తాయి. దద్దుర్లు తగ్గించడంలో సహాయపడతాయి .అలసటతో కూడిన నొప్పులను, అరికాళ్ళు, అరిచేతులలో కలిగే మంటలను తగ్గిస్తాయి. మూత్ర విసర్జనకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ద్రాక్ష వల్ల తొలగిపోతాయి .

నల్ల ద్రాక్ష ,ఆకుపచ్చ ద్రాక్షల మధ్య గుణాలలో తేడా ఉండదు. అయితే ఔషధాలు తయారీలో నల్ల ద్రాక్షను ఎక్కువగా వాడుతారు. నల్ల ద్రాక్ష మగత, బద్ధకం, ఆవులింతలు, అలసటలను తగ్గిస్తుంది .

బాగా పండిన నల్ల ద్రాక్ష దప్పికను, అలసటను తగ్గించి శరీర వేడిని ఉపశమింప చేస్తుంది. శరీరానికి బలం, మృదుత్వాన్ని ఇస్తుంది. ఉబ్బసం, గ్యాస్, ఉబ్బరాలను తగ్గించడంలో కూడా దోహదం చేస్తుంది.

 పచ్చి ద్రాక్ష ఎక్కువ పుల్లగా ఉండి వగరు రుచిని కలిగిస్తుంది. అది శరీరాన్ని వేడెక్కించి, రక్తస్రావాన్ని పెంచే అవకాశం ఉంది. అందువల్ల బాగా పండిన ద్రాక్షనే తినాలని ఆయుర్వేద గ్రంథాలు సూచిస్తాయి..

ఎండు ద్రాక్ష మలబద్ధకాన్ని తగ్గించి ,విరేచనాన్ని సులభంగా జరిగేలా చేస్తుంది. జ్వరము, ఊపిరితిత్తుల సమస్యలు, వాంతులు, కీళ్ల నొప్పులు, లివర్ వ్యాధులు, అరికాళ్ళ మంటలు ,చర్మం ఎండిపోవడం, కండరాల బలహీనత వంటి సమస్యల నివారణకు ఈ ద్రాక్ష ఉపకరిస్తుంది.

 నెలసరి సమయంలో మహిళలు ద్రాక్ష తినటం అలవాటు చేసుకోవడం మంచిది. నోరు చేదుగా ఉండడం, అజీర్తి ఉన్నప్పుడు వాటిని తగ్గించడంలో ద్రాక్ష ఉపకరిస్తుంది. మేలు చేస్తుంది .

ద్రాక్ష ఉపిరితిత్తులకు రక్షణ నిస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. ద్రాక్ష రసం తాగటం వల్ల మద్యపానం చేయాలని కోరిక కూడా తగ్గుతుంది.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...