25, సెప్టెంబర్ 2026, శుక్రవారం

ఉలవ పునుగుల కూర.. ఆయుర్వేద ఉపయోగాలు

 లైంగిక శక్తిని పెంచే వాటిని "వాజీకర ద్రవ్యాలు" అంటారు. వాజీ అంటే గుర్రం అని అర్థం. అంతటి లైంగిక శక్తిని ,ఆసక్తిని గుర్రానికీ మనుషులకూ కూడా కలిగించేవి ఉలవలు. అందుకే వాటిని హార్స్ గ్రామ్ అన్నారు.. హార్స్ పవర్ పెంచుతాయి అని. ఉలవలు తెలుపు, నలుపు , ఎరుపు రంగుల్లో ఉంటాయి. ఏ రంగు ఉలవలు దొరికినా వండుకోవచ్చు. 

ఉలవలు శరీరానికి బలాన్నిస్తాయి. వాత వ్యాధుల్లో ఉపయోగ పడతాయి. కఫాన్ని తగ్గిస్తాయి. కొద్దిగా వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. గుండెకు బలాన్నిస్తాయి. ఐతే ఉలవలు కాస్త కష్టంగా అరుగుతాయి. అందువల్ల జీర్ణ శక్తి తక్కువగా ఉన్నవారు మితంగా తీసుకోవడం మంచిది. 

మన ఇళ్లలో ఉలవ చారు కాచుకోవడం సాధారణం .ఉడికించిన ఉలవలతో గుగ్గిళ్ళు చేసుకుని తింటారు. పప్పుగా వండుకుంటారు. కంది పొడి లాగే ఉలవ పొడి కూడా చేసుకుంటారు. 

ఐతే నల మహా రాజు ఉలవలతో పునుగులు చేసుకునే విధానాన్ని వివరించాడు. వాటిని వేడి అన్నంలో చామ దుంపల వేపుడు కూరలాగా తినవచ్చు అన్నాడు. ఇలా తినడం రాజ భోజనం అని వివరించాడు. 

ఉలవ పునుగులు..

ముందుగా ఉలవలు బాగా మెత్తబడే వరకు ఉడికించి , నీటిని వార్చి ఒక పక్కన ఉంచుకోవాలి. ఉడికించిన ఉలవలు ముద్దగా చేసి అందులో సైంధవ లవణం, వెల్లుల్లి, అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చ కర్పూరం , వీటితో పాటు బూడిద గుమ్మడి వడియాలను నలిపిన ముక్కలు కూడా కలిపి , గోలీ కాయలంత చిన్న ఉండలు కట్టాలి. వాటిని పునుగుల మాదిరిగా నూనెలోనో, నెయ్యి లోనో వేయించాలి. 

మసాలా పునుగులు..

ఒక వేళ ఉలవ పునుగుల్లో కారం మసాలా ఘాటు చాలదనుకుంటే మసాలా పునుగులను వేరే వండుకునే విధానాన్ని కూడా నలుడు వివరించాడు. శనగ పప్పు, మినప పప్పు ఈ రెండిటిని నానబెట్టి , వాటిలో జీలకర్ర, ధనియాలు, మిరియాలు , అల్లం, ఇంగువ, వెల్లుల్లి వంటి సుగంధ ద్రవ్యాలు కలిపి మెత్తగా రుబ్బి ఆ పిండితో గోళీ కాయలంత పునుగులు వేయించాలి. ఇవి ఘాటైన రుచిని కలిగి ఉంటాయి. 

ఈ రెండు రకాల పునుగులనూ చెరొకటి తీసుకుని అన్నంలో  నంజుకుని తింటుంటే మరింత రుచికరంగా ఉంటాయని నలుడు సూచించాడు. ఈ మిశ్రమం శరీరానికి, మనసుకు సుఖాన్నిస్తుందని , శుభ ప్రదం అనీ అన్నాడు. శుభ కార్యాల సందర్భాలలో వండుకోదగిన ప్రత్యేక వంటకమిది . ఒక విధంగా ఈ పునుగులు రెండింటి మిశ్రమాన్ని ఉలవ పునుగుల వేపుడు కూరగా చెప్పుకోవచ్చు. ఇది అన్ని దోషాలను హరించే వంటకం. ఐతే ఉలవలు కష్టంగా అరుగుతాయని ఆయనకు తెలుసు. అందుకే బలమైన జీర్ణ శక్తి లేని వారు జాగ్రత్తగా తినాలని హెచ్చరించారు. 

ఉలవ చారు..

ఉలవలు ఉడికించిన తర్వాత వార్చిన రసంతో ఉలవ చారు కాచుకోవచ్చునంటూ నలుడు ఆ రసంలో మిరియాల పొడి, ఇంగువ , తగినంత సైంధవ లవణం, మనకు నచ్చిన సుగంధ ద్రవ్యాలు కలిపి కొద్ది సేపు మరిగించమన్నాడు. ఉలవ చారు పలుచగా ఉంటేనే రుచికరంగా ఉంటుందన్నాడు. ఈ ఉలవ చారు తో పైన చెప్పిన ఉలవల పునుగుల కూరను నంజుకుంటే ఆ రుచే వేరు. 

ఉలవలు శక్తి దాయకాలు, స్థూలకాయం తగ్గించదానికి తోడ్పడే  గొప్ప ఆయుధాలు. మంచి ప్రోటీన్ వనరు. పీచు పదార్థం ఎక్కువ. రక్తంలో చక్కెర నియంత్రణకు తోడ్పడుతుంది. మొలకలు కట్టించి తింటే కొన్ని పోషకాల లభ్యత పెరుగుతుంది. చలి కాలం లో ఉలవ చారు, ఉలవ గుగ్గిళ్ళు , ఉలవ పునుగుల్లాంటి వంటకాలు శరీరానికి వేడి, శక్తిని అందించే ఆహారంగా ఉపయోగపడతాయి. 

20, సెప్టెంబర్ 2026, ఆదివారం

జామకాయ.. సామాన్యుల అద్భుత పోషకాహారం

 ఆసేతు హిమాచలం ప్రతి గ్రామంలో,  పట్టణ వీధుల్లో విరివిగా దొరికే మంచి ఆహారం, అందుబాటులో ఉండే పోషకాహారం జామకాయ.. ఇది అడవుల్లోనే కాకుండా పల్లెల్లోనూ పట్టణాలలో తినే తియ్యటి ఆహారమే కాదు, కొంత మంది కి మందు కూడా.. 

అనన్యమైన పోషక విలువలు,అద్భుతమైన వైద్య లక్షణాలు కలిగినటువంటి సామాన్యుని ఆపిల్ తియ్యనైన జామకాయ. 

గుర్వా అని పిలవబడే ఈ జామకాయ సంప్రదాయంగా ఎన్నో యుగాల నుండి ఆహారంగానూ, ఓషధి గానూ గుర్తించబడింది. ప్రపంచమంతటా జరిగిన వివిధ పరిశోధనలు దీనిలో పోషక విలువలే కాకుండా రోగ నివారణ శక్తిని కూడా కలిగి ఉందని ధృవీకరించాయి. 

ముఖ్యంగా మన దేశంలో, మిగతా ఆసియా దేశాల్లో విరివిగా పెంచబడుతున్న ఈ జామ పచ్చగా ఉండే గుండ్రని గుండె కాయ లాంటి పండు. పూర్తిగా పండాక పసుపు పచ్చని రంగులో నిగనిగలాడుతుంది. 

జామ కాయలో ఎన్నో విటమిన్లు , మినరల్స్ తో పాటు మంచి పీచు పదార్థం ఉంది. ఇందులో ఉన్న ప్రత్యేక విటమిన్ వల్ల శుక్ర బీజం బలహీనంగా ఉన్న పురుషులకు ఇది తినడం చాలా మంచిది. 

జామ ఆకులకు పుండు,గాయం మాన్ప గలిగిన శక్తి ఉంది.ఏదైనా గాయమైనప్పుడో , రోడ్డుపై ఏదైనా గీసుకుంటేనో ఏమీ దొరకనప్పుడు జామ ఆకుల పసరు పూయండి. అది తాత్కాలిక చికిత్స. 

మంచి హితకారిణి..

జామలో రక్తాన్ని గడ్డ కట్టించే శక్తి ఉంది.ముక్కులోంచి , చిగుళ్ల నుంచి రక్తం స్రవించే వ్యాధి ఉన్నవారు జామకాయ తినడం, జామాకు పొడితో చిగుళ్ళను సున్నితంగా మర్దన చేసుకోవడం మంచిది. 

తరచూ జిగట విరేచనాలు అవుతున్న వారు జామ తింటే ఇందులో ఉన్న శక్తి కారణంగా చిన్న ప్రేవులలో క్రిమిని అడ్డగించి , జిగురు పదార్థాన్ని తొలగిస్తుంది. 

జామలో ఉన్న ఒక ప్రత్యేకమైన శక్తి వల్ల పెద్ద వయసులో వచ్చే మోకాళ్ళ నొప్పులు , తరచూ మరచిపోవడం వంటివి తగ్గుతాయి. అందుకే అరవై ఏళ్ళు పైబడిన వారు కొంచెం ఉప్పు రాసిన జామ కాయ ముక్కలను తినడం హితకరం. 

ఉత్తర భారతంలోనూ, పశ్చిమ తీరాన రోజూ విరేచనం కాకపోతే రాత్రి జామపండుతో చేసిన మురబ్బా తింటారు. జామ తరచూ తినడం వల్ల జీర్ణాశయం శక్తిని పుంజుకుంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ ను పెంచే పదార్థం లేదు. 

పచ్చి జామ కాయలు,లేత జామ ఆకులు కాచి తయారు చేసిన నీటితో స్నానం చేస్తూ దోర జామ కాయలు తింటుంటే చర్మ సౌందర్యం పెరుగుతుంది. 

జామ కాయలు, ఆకుల కషాయం, శొంఠి,పసుపు కలిపి తీసుకుంటే ఎప్పుడూ బాధించే దగ్గు , జలుబు తగ్గుతాయి. ఈ మధ్య జరిగిన పరిశోధనలో జామ పండ్లు తినే వారిలో క్యాన్సర్ తక్కువగా వస్తుందని తేలింది. 

జామ పండు. ఆస్తమా,మూర్ఛ, తల తిరగడం , రక్త పోటు, అధిక బరువు కలిగి ఉండటం , ఏ కారణం చేతనైనా శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేకపోవడం , చిగుళ్ళు వాయటం వంటి వాటిలో చాలా ఉపయుక్తం. దీంతో సహజమైన మందులు తయారు చేయవచ్చు. అందుకు ప్రయత్నాలు, పరిశోధనలు కూడా విరివిగా జరుగుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువ రోజులు ఆగకుండా ఉండే ఋతు స్రావానికి జామ చక్కటి మందుగా గుర్తించ బడింది. 

జామకాయలో పోషక విలువలు అపారం.అందుకే జామను సామాన్యుని నిండు ఆహారం అంటారు. ఇందులో కాల్షియం 50 mg, కార్బోహైడ్రేట్స్ 20 mg, ఫైబర్ 8.9 gm, ప్రోటీన్, విటమిన్ సి ల వంటివి ఉన్నాయి. ఇందులో కొవ్వు పదార్థం 0.9 gm మాత్రం ఉండటం వల్ల ఒళ్ళు పెరగదు. అందుకే దీన్ని అందరూ ఆప్యాయంగా తినవచ్చు. 

బాగా పండిన జామ పండ్లు అలాగే తినవచ్చు లేదా జామ్ లు, జెల్లీ ల రసం పానీయాల రూపం గానూ తీసుకోవచ్చు.ఉత్తర దేశాలలో జామ పళ్లతో చేసిన జెల్లీ లు పిల్లలు, పెద్దలు మంచి ఆహారం గా వాడతారు. 

పూర్వం జామ ఆకుల రసం విరేచనాలు అరికట్టడంలో మంచి ఫలితాలు ఇచ్చేదని , పిల్లలకు కూడా ఇవ్వ వచ్చునని భావించే వారు. ప్రపంచమంతా వివిధ పరిశోధనలలో శాస్త్రజ్ఞులు దీనిపై విశిష్ట పరిశోధనలు జరుపుతున్నారు. 

కాళ్లు లాగుతుంటే చాలా బాధ పడతాం.సాయంత్రం అయ్యేసరికి మోకాళ్ళ కింద పిక్కలు లాగుతున్నప్పుడు పిల్లల చేత నొక్కించుకుంటాం. ఎన్ని నొప్పి మాత్రలు వేసుకున్నా ఫలితం ఉండదు. అటువంటప్పుడు పది, పది హేను జామ ఆకులు ఒక కప్పు నీళ్లలో వేసి 20 నిమిషాలు కాచి వడపోయండి. ఆ నీళ్ళు రోజూ మూడు సార్లు తాగండి. పూర్తిగా తగ్గిపోతుంది. 

ప్రకృతి ప్రసాదం..

క్రీడా కారుల్లో ముఖ్యంగా టెన్నిస్ ఆటగాళ్లలో మోచేయి నొప్పి ఎక్కువగా ఉంటుంది. దాన్ని టెన్నిస్ ఎల్బో అంటారు. దానికి కూడా ఈ జామ ఆకులతో తయారు చేసిన టీ అద్భుత నివారిణి. 

నోటి చిగుళ్ల నుంచి రక్తం వస్తుంటే జామ ముక్కలపై ఉప్పు రాసుకుని కొంచెం కొంచెం కొరుకుతూ తినండి. ఎంతో ఉపకరిస్తుంది. 

జామ చెట్టు బెరడు,ఆకులు,కాయలు,పండ్లు అన్నీ కూడా జీర్ణాశయం పై చక్కటి ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా నేటి సామాన్య వ్యాధి gastro enterities  అనబడే గృహాణి లో జామ ప్రభావం మంచి ఫలితాలు సూచిస్తుంది. 

అలాగే దానిమ్మ రసం,దానిమ్మ బెరడు చూర్ణం, జామ రసం జిగట విరేచనాలు నివారించడంలో  మంచి ఫలితాన్ని ఇస్తాయి. సామాన్యంగా అందుబాటులో దొరికే జామ కాయ ముక్కలు ఉప్పు అద్దుకుని కానీ, పండు ముక్కలు తినటం కానీ అందరికీ మంచిది. 

షుగరు వ్యాధి ఉన్నవారు దోర జామ కాయలు తినడం మంచిది.జీవనానికి జవసత్వాలు , జీర్ణాశయానికి జీర్ణ శక్తిని ఇచ్చేటువంటి అద్భుత ప్రకృతి ప్రసాదం జామ కాయ అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

19, సెప్టెంబర్ 2026, శనివారం

సొరియాసిస్ వ్యాధికి .. ఆయుర్వేద పరిష్కారాలు.

 పొట్ట మీద, తొడల పైన, చంకల దగ్గర కాళ్ళు చేతుల పైన ఎర్రని పెద్ద పెద్ద మచ్చలు , విపరీతమైన మంట, దురద , తల దువ్వుకుంటే తెల్లని పొట్టు రాలుతూ ఉంటుంది. చూసుకుంటున్న తనకు, చూస్తున్న ఇతరులకు ఒక రకమైన విచారం.. అదే " సొరియాసిస్ ". ఇది మగవారిలోనే కాదు, స్త్రీలలో కూడా రావచ్చు. దురదృష్టమేమిటంటే ఇది ఆరంభంలో ఏదో చిన్న చర్మ వ్యాధి అని అశ్రద్ధ చేయడం వల్ల పెరుగుతుంది. పూర్తి స్థాయికి వచ్చిన తర్వాత దీనికి శాశ్వత పరిష్కారం ఉండదు.

కారణమేమంటే ఇంతవరకూ జరిగిన పరిశోధనల వల్ల వ్యాధి కారణమే పూర్తి అవగాహనకు రాలేదు. క్రిమి వల్ల కాదు, రక్తం చెడిపోయి కాదు, వైరస్ వల్ల కాదు , అంటువ్యాధి కాదు. కానీ కొన్ని కుటుంబాలలో ఇది వస్తుంది. 

చర్మం పై ఉన్న కణాల్లో తెలియని తీవ్రమైన మార్పు ఈ వ్యాధికి కారణమని అంతర్జాతీయంగా విశ్వసించ బడుతోంది. ఈ వ్యాధి నెమ్మదిగా ప్రారంభమైనా తొందరగానే తీవ్ర స్థితికి చేరుతుంది. 

ఇది ఏదో అసాధారణమైన వ్యాధి కాదు,సామాన్యమైన చర్మ వ్యాధి. మోకాళ్ళ పైన, మోచేతుల పైన , చంకల్లో, గజ్జల్లో, ఎర్రటి పెద్ద మెరుస్తున్న మచ్చలు ఏర్పడి తెల్లటి ద్రవంతో కారుతూ , ఎండిన ఆ తెల్లటి పొడి పొట్టులా రాలుతూ ఉబ్బి, మంట, నొప్పి, దురదలతో ఉంటుంది. 

వంశ పారంపర్యమే కానీ..

తలపైన ముఖ్యంగా తల మధ్య భాగంలోను, తొడల పైన బొడ్డు చుట్టూ పొట్ట భాగంలో ఇవి ఏర్పడతాయి తర్వాత చాతి పైన ముఖం పైన వ్యాపిస్తాయి. 

బాధలు రాత్రిపూట ఈ ఎండాకాలంలోనూ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా guttate  అనే  సొరియాసిస్ వ్యాధి పిల్లల్లో వస్తుంది. అది చీము, వాపులతో కూడుకుని మరీ బాధ పెడుతుంది. మరో ముఖ్య విశేషమేమంటే ఈ వ్యాధి ఏ వయసులోనైనా రావచ్చు. 

వంశ పారంపర్యము కానీ , కాల మాన పరిస్థితులు కాని, దేశ నైసర్గిక వైరుధ్యాలు కానీ , పరిసరాల కాలుష్యం కానీ ఈ చర్మ వ్యాధికి కారణం కావు. లావుగా ఉన్న వారిలో ఇది మరీ బాధ పెడుతుంది. 

ముఖ్యంగా చంకల్లోనూ, రొమ్ముల పైన వస్తే అది సామాన్యమైన చికిత్సకు కూడా తగ్గినట్లు కనిపించదు. Plaque psoriasis, guttate psoriasis, pustular psoriasis, inverse psoriasis, erythro dermic psoriasis అని ఈ వ్యాధి ఐదు రకాలుగా ఉంటుంది. 

తలలో దురద,మంట,జుట్టు రాలిపోవడం , ఒళ్ళంతా గాయాలు, అందులోంచి నీరు కారడం , చేప పై పొట్టు లాగా పొట్టు రాలడం. గోరు చుట్టూ, మోకాళ్ళు, మోచేతుల నొప్పి, అర చేతిలో, అరి కాళ్ళలో పగుళ్లు. చర్మం లేచి పోవడం, ఒక్కొక్కప్పుడు జ్వరం గాలి తగిలినా, చెమట పట్టినా మంటగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. 

మరో విశేషం ఏమిటంటే అందరిలో అన్ని లక్షణాలు ఉండకపోవచ్చు.కొన్ని ప్రస్ఫుటంగా ఉంటాయి . మరో దురదృష్టం ఏమిటంటే రక్త పరీక్షలలోనూ ఎక్కడా చెడు కనిపించదు. ఏ కారణం కనిపించదు. నిండు ఆరోగ్యంగా ఉన్న వారిలో ఈ వ్యాధి వస్తే విపరీత పరిణామాలు చూపిస్తుంది. మరో విశేషం.. ఇది అంటువ్యాధి కాదు. 

ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. ఈ వ్యాధి ఉన్న వాళ్ళ పిల్లలకు ఈ వ్యాధి రాదు. గర్భిణీ కాలంలో ఈ వ్యాధి ఉండడం వల్ల శిశువుకు కానీ ఆమె ఆరోగ్యానికి కానీ పెద్ద హాని ఉండదు. 

ఆయుర్వేద రీత్యా ఇది ఆగంతుక వ్యాధి.అంటే ఏ కారణం లేకుండా హఠాత్తుగా వచ్చే వ్యాధి. విసర్ప వ్యాధులలో తీవ్రమైన విసర్ప వ్యాధిగా దీన్ని భావించవచ్చు. 

శరీరంలో పిత్త శక్తి దూషించడం వల్ల ఈ వ్యాధి వస్తుంది.మిగతా వాత, కఫ శక్తులు కూడా ఈ వ్యాధిలో దూషించ బడతాయి. చర్మం, రక్తం, లసిక మాంసం .. ఈ ధాతువులు చెడడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. 

ఇది కష్ట సాధ్యమైనది కనుక పూర్తిగా తగ్గదు.కానీ మంచి ఉపశమనం ఇచ్చే చక్కటి చికిత్సలు ఆయుర్వేదంలో ప్రతిపాదించ బడ్డాయి. పసుపు కలిపిన నెయ్యి, వేపాకుతో కాచిన నీటితో స్నానం, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ప్రతి రోజూ చేయవలసిన ప్రక్రియలు. 

ఉపశమన చికిత్సలు..

ఈ వ్యాధి ఉన్న వారు ఎక్కువ పులుపు, శెనగ పిండితో చేసిన వస్తువులు , వేరు శనగ నూనె, వంకాయ, కోడి మాంసం, గుడ్డు, చేప, పీతలు , పుట్ట గొడుగులు తీసుకోకూడదు. నువ్వులు, మినుములు, ఉలవలు , వెల్లుల్లి తగ్గించడం మంచిది. 

వ్యాధి హరణ రసాయనం శారీభాద్యాసవం , చంద్రనాసవం,మంజిష్ట, హరిద్రాకల్పం , వంటి చక్కటి మందులు ఉన్నాయి. శరీరాన్ని శుద్ధి పరిచే శోధన చికిత్సలు , పంచ కర్మ చికిత్సలు చాలా ఉపకరిస్తాయి. ఈ చికిత్సలో అంతర్ శుద్ధి చేసి చర్మ కణాలను జాగృత పరిచే మందులతో  శమన చికిత్స చేయించుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వైద్యుని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. 

ఆయుర్వేదంలో ఈ సొరియాసిస్ పై అనేక ద్రవ్యాలు , వాటి ఉపయోగాలు ప్రస్తావించబడ్డాయి. దేశ విదేశాల్లో,కేరళ, వారణాసి విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరుగుతున్నాయి. 

హరిద్ర ఆమ్లకి, విష్ణు క్రాంత, గోక్షుర , తులసి, గుడూచి, పిప్పలి వంటివి వివిధ పరిమాణాల్లో తయారు చేస్తే చక్కని ఫలితాలు ఉన్నాయని గుర్తించబడింది. 

ప్రశాంతతే నివారణ..

ఇవి వ్యాధి మీద సూటిగా కాకుండా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడం వల్ల సొరియాసిస్ లో వచ్చే చీము , నీరు చేరడం, ఎలర్జీ, వాటి వల్ల వచ్చే జ్వరం, నొప్పి తగ్గడానికి చాలా ఉపకరిస్తుంది. తులసి, చిత్రకం ఎలర్జీని తగ్గించే శక్తి గలవని అనేక పరిశోధనల్లో గుర్తించబడింది. 

చర్మం పై వచ్చే ప్రతీ పెద్ద మచ్చని సొరియాసిస్ అనుకోకూడదు.చిరకాలం నుండి ఉండి ఏ కారణం లేకుండా ఎర్రగా ఉండి తెల్లని పొట్టు రాలుతుంటేనే సొరియాసిస్ అని అనుకోవాలి. ఇది సాంక్రమిక వ్యాధి కాదు. ప్రమాదాన్ని కలిగించే వ్యాధి కాదు. ఒకరి తువాలు, దువ్వెన లాంటివి వాడడం వల్ల మరొకరికి ఇది వ్యాపించదు. ఇది తగ్గడానికి మందులతో పాటు మానసిక ప్రశాంతత చాలా అవసరం. ఈ వ్యాధి మనశ్శరీరాలకు సంబంధించినది. 

మీ ఆహారంలో పులుపు,సెనగ పిండి, వేరు శనగ నూనె , మసాలా వస్తువులు తగ్గించుకుంటే ఈ బాధలు తగ్గుతాయి. మంచి గంధం పొడి, వేప పొడి కలిపి పైన రాసుకోవడం హితకరం. జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఉండడం సహజం . వాటికి విచారించేకన్నా, నయం చేసుకుని జీవితాన్ని ఆనంద మయంగా చేసుకోవాలి. 

అల్లం, శొంఠి.. అమోఘం..

 ఆయుర్వేదంలో అల్లం వినియోగం ఎక్కువ. కొందరు దాన్ని అలాగే తినడానికి ఇష్ట పడతారు. అల్లాన్ని సున్నపు నీటిలో ఉడికించి ఎండబెడితే శొంఠి గా మారుతుంది. ఆమ్ల గుణం ఉండే శొంఠిలో పీచు పదార్థాలు , ఘాటైన ద్రవ్యాలు వేడిగా మారి శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తాయి. అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. 

కొబ్బరి నీటిలో అల్లం రసం కలిపి తీసుకుంటే మూత్ర విసర్జన సమయంలో మంట కలుగదు. భోజనానంతరం చిన్న అల్లం ముక్క తింటే కడుపులో వాయువు పెరగదు. తీసుకున్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది. అరగ్లాసు పాలలో అల్లం, పుదీనా రసం సమ పాళ్ళలో కలిపి తాగితే కడుపులో మంట సమస్య పరిష్కారమవుతుంది. అదే మాంసాహారం అరగక ఇబ్బంది పడుతుంటే పాలకు బదులు కొద్దిగా నిమ్మ రసం చేర్చితే సరిపోతుంది. 

చెంచా అల్లం రసం లో పావు చెంచా జీలకర్ర,తేనె కలిపి తీసుకుంటే తల తిరగడం , పైత్యం , వికారం వల్ల అయ్యే వాంతులు , దురద, కాలేయ సమస్యలు నియంత్రణలో ఉంటాయి. నెలసరి నొప్పితో బాధపడే వారు పది రోజుల ముందు నుంచి వేడి నీటిలో అల్లం రసం వేసి తీసుకోవాలి. 

గొంతు ఇన్ఫెక్షన్ , నోటి పూత ఉన్నవారు బియ్యం కడిగిన నీటితో అల్లం రసం, తేనె కలిపి తాగాలి. తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్ ఉన్నవారు ఈ రసంలో మెంతి కూర, తులసి రసం, తేనె కలిపి ఇస్తే త్వరిత ఉపశమనం కలుగుతుంది. 

శొంఠితో సమస్యలు దూరం ఇలా..

కఫం,ఎక్కిళ్ళు,గొంతునొప్పి,ఉన్నవారు గోరువెచ్చని నీటితో శొంఠి పొడి వేసి తీసుకోవాలి. గోరు వెచ్చని నీటిలో చిటికెడు శొంఠి పొడి , సైంధవ లవణం వేసి తీసుకుంటే అజీర్ణ సమస్య బాధించదు. 

బరువు తగ్గాలనుకునే వారు దీన్ని పిప్పళ్ల చూర్ణంతో సమానంగా కలిపి రోజూ తేనెతో తీసుకోవాలి. బాలింతలకు పొద్దుటే భోజనంలో శొంఠి పొడి నెయ్యితో కలిపి ఇస్తే ఆకలి పెరిగి పాలు పడతాయి. అజీర్ణం బాధిస్తున్నప్పుడు మొదటి అన్నం ముద్దలో శొంఠి పొడి నెయ్యితో తింటే ఎంతో మార్పు ఉంటుంది. 

నెలసరి సమస్యలు ఉన్నవారికి ఈ పొడిలో చిటికెడు చొప్పున పిప్పళ్లు, ఇంగువ వేసి రెండు మూడు వారాల ముందు నుంచే తినిపించాలి. 

కొబ్బరి నూనెలో ఈ పొడిని కలిపి పూతలా రాస్తే కీళ్ళు, మడమల నొప్పికి పరిష్కారం లభిస్తుంది. 

జాగ్రత్తలు..

రక్త పోటు, కాళ్ళు చేతుల నొప్పులు , నెత్తురు త్వరగా పలచబడే వారు వైద్య నిపుణులను సంప్రదించి తీసుకోవాలి. వేడి వాతావరణం ఉంటే కొబ్బరి నీళ్లు లేదా చందనంతో కలిపి వాడుకోవచ్చు. అల్లాన్ని ఇతర మసాలా దినుసులతో కలిపి వాడితే దాని గుణం మారి కడుపులో మంట, అజీర్ణం , మల బద్ధకం వంటివి బాధిస్తాయి. 

దీనికి మజ్జిగ ,వెన్న ,తేనె విరుగుడుగా పని చేస్తాయి.

అపోహలు.. వాస్తవాలు..

 1. ) అపోహ.. 

గ్రీన్ టీ ప్రతి రోజూ తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు.. 

వాస్తవం..

ప్రత్యేకంగా గ్రీన్ టీ తీసుకుంటేనే బరువు తగ్గుతారనే దానిలో వాస్తవం లేదు.ఐతే క్రమ పద్ధతిలో ఆహార నియమాలు పాటిస్తూ ,వ్యాయామాలకు ప్రాధాన్యమిస్తూ ఈ టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ లభించే గ్రీన్ టీ శరీరానికి మేలు చేస్తుంది.

2.) అపోహ..

అల్పాహారం మానేస్తే బరువు నియంత్రణలో ఉంటుంది..

వాస్తవం..

ప్రతి రోజూ అల్పాహారం తీసుకోని వారికంటే తీసుకున్నవారే త్వరగా బరువు తగ్గుతారని చాలా అధ్యయనాలు రుజువు చేశాయి.ఎలాగంటే ఉదయాన్నే ఆహారం తీసుకోవడం వల్ల జీవక్రియ చురుగ్గా జరుగుతుంది. పనులు చేసుకోవడానికి శరీరం ఉత్సాహంగా సహకరిస్తుంది.దాంతో త్వరగా కెలోరీలు ఖర్చవుతాయి కూడా .

3.) అపోహ..

ఆలస్యంగా భోజనం చేసినా బరువు పెరగం..

వాస్తవం..

ఎప్పుడైనా ఆలస్యంగా చేసే పనులు ఆరోగ్యానికి అంత  మంచిది కాదు.దినచర్య పాటించడం దగ్గర నుంచి రాత్రి పూట నిద్రించే వరకు ప్రతి పనిని క్రమ పద్ధతిలో చేయడం అలవాటు చేసుకోవాలి. రాత్రి నిద్రకు రెండు గంటల ముందే భోజనం చేయడం మంచి అలవాటు.

అందులో భాగంగా నూనె పదార్థాలు , మసాలా తో చేసిన ఘాటైన వంటకాలు లేకుండా తేలిగ్గా జీర్ణమయ్యే వాటిని ఆలస్యంగా కాకుండా ముందుగా తీసుకుంటే మంచిది.లేదంటే బరువు పెరిగే ప్రమాదం లేకపోలేదు.



18, సెప్టెంబర్ 2026, శుక్రవారం

జిలకర.. నమలండి కరకర..

 వంటింటి పోపు సామానులలో జిలకర తప్పని సరిగా ఉంటుంది. ఇది విరేచన కారి, జీర్ణకారి, మంచి సువాసన దీని నుండి వస్తుంది. 

ప్రసవం తర్వాత తల్లికి పాలు ఎక్కువగా పడడానికి తెల్ల జీలకర్రను బెల్లం తో కలిపి తినాలి. 

మూత్ర సంబంధిత సమస్యల పరిష్కారానికి జిలకర పొడి ని చక్కెర తో కలిపి తినాలి.అజీర్ణం,గ్యాస్, కడుపు నొప్పి, అరుచి ,వాంతులు ,ప్రేవులలో పురుగులు పోవడానికి జీలకర్రను వేయించి పొడి చేసి దానిలో తేనె కలిపి తినాలి. రోజూ 5 గ్రాముల పొడి తింటే చాలు.

స్త్రీలకు వచ్చే తెల్ల బట్ట తగ్గడానికి ,తల్లికి పాలు పడడానికి జిలకర చూర్ణాన్ని పాలతో కానీ, నెయ్యితో కానీ తీసుకోవాలి.తీవ్రమైన జ్వరం తగ్గడానికి వారం రోజుల పాటు జిలకర పొడి ని నీటిలో కలిపి తాగాలి.

జీలకర్ర ను నీటితో తడిపి మెత్తగా నూరి దాన్ని వాపులపై, పైల్స్ పై,చర్మ రోగం ఉన్న చోట రాస్తే అవి నయం అవుతాయి.నీటిలో జిలకర వేసి మరిగించిన తర్వాత ఆ నీటిని చల్లబరచి ముఖాన్ని కడుక్కోవడం వల్ల ముఖ వర్చస్సు పెరుగుతుంది. చర్మం పై దద్దుర్లు,దురద ఉన్న చోట జిలకర నీటిని పోసి కడగాలి.గాయాలను కడగటానికి కూడా ఈ నీటిని వాడవచ్చు.ఇది యాంటీ సెప్టిక్ గా పని చేస్తుంది.

అతి మూత్రంతో బాధ పడేవారు జిలకర కషాయం తాగితే మంచి ఫలితం ఉంటుంది.


ఇంటింటా ఆరోగ్యం.. వంటింటి దినుసులతో..

 వంటింట్లో తాలింపు మోత వినకుండా వంట సంపూర్ణం అయినట్లుండదు. పోపుల పెట్టేతో మహిళలకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అంతే కాదు, ఆ పోపుల పెట్టె లోనే మహిళల అనారోగ్య సమస్యలను నివారించే పోషకాలూ ఉంటాయి. దగ్గు, జలుబు వంటి సమస్యలు మొదలుకొని నెలసరి సమస్యలకూ ఉపశమనం లభించే ఆ పదార్థాల గురించి..

 ముత్యమంత పసుపుతో మేలు ఎంతో.. 

ఇంటింటా ఉండే సుగుణాల ఔషధి..పసుపు..మేనికి మేలు ఛాయ ను ఇచ్చే ఈ అద్భుత ఔషధంలో క్యాల్షియం, ఫాస్ఫరస్, థయామిన్ వంటి పోషకాలతో పాటు మహిళల్లో రక్త హీనతను తొలగించే ఇనుమూ , ఎ విటమినులు పుష్కలంగా ఉంటాయి. దీనిలోని కర్కుమిన్ అనే ప్రత్యేక పదార్థానికి క్యాన్సర్ ను ఎదురించి పోరాడే శక్తి ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయ్. చిన్న పిల్లల్లో నులి పురుగులు సమస్యకు గ్లాసు నీటిలో అర చెంచా పసుపు వేసి ఇస్తే ఫలితం ఉంటుంది. 

రక్త హీనత నివారించే జీలకర్ర..

ఉప్మా,పులిహోర,కూర ..పదార్థమేదైనా జీలకర్రతోనే నోరూరించే రుచి. కేవలం రుచిని మాత్రమే కాదు మగువల ఆరోగ్యానికి అవసరమయ్యే ఫోలిక్ , ఇనుము లను అందించే శక్తి దీని సొంతం. శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమయ్యే సెలీనియం వంటి ఖనిజాలనూ జీలకర్ర అందిస్తుంది. పైత్యం, కఫం, వాతం, జ్వరం , కడుపు నొప్పి, తల తిరగడం వంటి సమస్యలకు ఇది చక్కటి వైద్యం. కడుపులో వాయువులను నియంత్రిస్తుంది. తక్షణ ఉపశమనం కోసం జీలకర్రను పొడి కొట్టి కషాయంగా కాచి తాగొచ్చు. నిమ్మ రసంలో కలిపి తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఐతే అర చెంచా మించకుండా తీసుకోవాలి.

 అధికంగా తీసుకుంటే పంచదార విరుగుడుగా పని చేస్తుంది. 


కొవ్వును తగ్గించే ఆవాలు..

పోపులో చిటపట మంటూ సందడి చేసే ఆవాలు .. శరీరంలోని వ్యర్థాలను బయటికి నెట్టి కొవ్వును తగ్గించే గుణం ఉంది. మహిళలు తరచూ ఎదుర్కునే నెలసరి సమస్యలు దూరం చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎముక బలానికి ఉపయోగపడే క్యాల్షియం , రక్త హీనతను నివారించే ఇనుము ఆవాలలో అధికం. వీటిని ముద్దలా నూరుకుని వేడి నీరున్న బకెట్ లో వేసి స్నానం చేస్తే ఒంటి నొప్పులు మాయమవుతాయి. ఆవ నూనె శరీరంలోని అనవసర కొవ్వు పెరగకుండా కాపాడుతుంది. 

ఆవాలకు విరుగుడు పాలు. 


అజీర్ణం తగ్గించే మెంతులు..

పచ్చళ్లలో, తాలింపులో రుచి కోసం ప్రత్యేకంగా వాడే మెంతుల ఉపయోగం అటు మధుమేహ రోగులకు మొదలుకొని ఇటు గర్భిణుల వరకు ఎంతో ఉంది. ఇది పేగుల పని తీరును మెరుగు పరిచి .. అజీర్ణ సమస్యలు తొలగిస్తుంది. చెంచాడు మెంతులను నీటిలో నానబెట్టి మరునాడు తీసుకుంటే రక్తం శుభ్ర పడుతుంది. కొవ్వు, చక్కెర శాతం కొంత వరకు నియంత్రణలోకి వస్తాయి. దీనిలో శరీరానికి మేలు చేసే బీటా కెరోటిన్లు సమృద్ధిగా లభిస్తాయి. గర్భిణులు మితంగా తీసుకుంటే మేలు. 

దీనికి విరుగుడు మంచి నీరు.. 

నెలసరి వెతలు.. ధనియాలతో దూరం..

తల తిరగడం, అధిక ఋతు స్రావం వంటి సమస్యలతో బాధ పడేవారు , వీటిని కషాయంగా కాచి తాగితే ఫలితం ఉంటుంది . జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మిరియాలతో పాటు వీటిని తీసుకోవాలి. ఆకలి తగ్గిన వారు వీటిని తీసుకుంటే ఫలితం ఉంటుంది. ధనియాలను రాత్రి నీటిలో కాచి పొద్దుటే తీసుకుంటే మూత్ర సంబంధ సమస్యలు తగ్గిపోతాయి.. 

కఫం పోగొట్టే మిరియాలు..

శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచే మిరియాలు కఫ దోషాలు ఉన్నవారికి బాగా ఉపకరిస్తాయి. రోజూ పాలలో లేదా నీటిలో పొడి వేసి తాగాలి. వీటిలో ఇనుము, ఫోలిక్ ఆసిడ్, కాల్షియం, ఫ్లెవనాయిడ్ లు ఉంటాయి. ఇవి శరీరంలో తేమను పెంచి కఫాన్ని బయటకు నెడతాయి. ఇవి ఉదరంలో వాయువులు పెరగకుండా చూస్తాయి. రక్త ప్రసరణ ను మెరుగు పరుస్తాయి. కొవ్వును తగ్గిస్తాయి. అధికంగా దాహం వేసినప్పుడు వీటిని నేతిలో వేయించి మజ్జిగలో కలిపి తీసుకోవాలి. 

వీటికి విరుగుడు మజ్జిగ..

చర్మ వ్యాధులకు.. దాల్చినీ..

రుచిలో తియ్యగా ,వగరుగా , ఘాటుగా అనిపించే దాల్చినీ వల్ల ఎన్నో ఉపయోగాలు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. చెక్క, పొడి ఏ రూపంలో తీసుకున్నా .. దీనిలోని సుగుణాలు చర్మ వ్యాధులు ఉన్న వారికి ఇతర ఔషధాలతో పాటు కలిపి వైద్యంగా ఇస్తుంటారు . కఫ, పైత్య సమస్యలతో బాధ పడేవారికి పొడిగా ఇస్తే ఫలితం ఉంటుంది. బ్యాక్టీరియాను వృద్ధి చెందకుండా చేస్తుంది. జలుబు, దగ్గుతో బాధ పడేవారికి దీనిని మిరియాలు, యాలకుల పొడిని సమ పాళ్ళలో కలిపి, పటిక బెల్లం పొడి కలిపి సేవిస్తుంటే సమస్య పరిష్కారమవుతుంది. నెలసరి ఇబ్బందులు ఎదుర్కునే వారు దాల్చిన చెక్క పొడి చేసి , తమలపాకు రసం లో కలిపి వారం ముందు నుంచి తీసుకుంటే ఇబ్బందులు ఉండవు. 

ఇంగువ.. దగ్గు నివారిణి..

పేగుల్లో పెరిగే క్రిములను ,హాని కారక వైరస్లను దూరం చేసే శక్తి ఇంగువకు ఉంది.ఆహారం తేలికగా జీర్ణం అవడానికి ,శరీరంలో వాయువులను నియంత్రించడానికి ఇది దోహదం చేస్తుంది. దీన్ని నెలసరికి ముందు శనగ గింజంత బెల్లం తో కలిపి తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. దగ్గు,ఆయాసంతో బాధ పడుతుంటే దీన్ని పెసర గింజంత తీసుకుని ఉల్లిపాయ రసం, తేనె తో కలిపి పుచ్చుకుంటే గుణం ఉంటుంది.

జలుబు తగ్గించే వాము..

నోట్లో వేసుకోగానే చిరు చేదుగా అనిపించే వాము ..శరీరంలో క్రిములు వృద్ధి చెందకుండా చూస్తుంది.అజీర్ణ సమస్యలను ,అతిసారాన్ని తగ్గిస్తుంది. వామును కాల్చినప్పుడు వచ్చే పొగ జలుబును తగ్గిస్తుంది.కడుపుబ్బరంగా ఉన్నప్పుడు చెంచాడు తింటే తక్షణ ఉపశమనం కలుగుతుంది.ముఖ్యంగా పాలు పడని వారికి దీని రసం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది.వామును , సైంధవ లవణం తో కలిపి తీసుకుంటే కడుపు నొప్పి త్వరగా తగ్గుతుంది.

వికారం నుంచి ఉపశమనం..

అనేక సుగుణాలు ఉండే వాముని భోజనానంతరం తీసుకుంటే ఆహారం తేలిగ్గా జీర్ణమవ్వడమే కాకుండా రక్త ప్రసరణ సాఫీగా జరిగేటట్లు చేస్తాయి.లవంగాలను దంచి నీళ్లలో ఉడికించి తాగితే వాంతులు,వికారం వంటి సమస్యలు తగ్గుతాయి.తలనొప్పి బాధలో లవంగాలను పాలలో కలిపి పుచ్చుకోవాలి.



పొడి దగ్గుకు.. ఆయుర్వేద పరిష్కారాలు..

 ఘాటైన వాసనలు, కొన్ని పదార్థాలలోని రసాయనాలు ఊపిరి తిత్తులు, గొంతులో ఇబ్బంది కలిగించి అవి దగ్గు రూపంలో బయటకు వస్తాయి. ఒక్కోసారి అలర్జీ, ఇన్ఫెక్షన్ , హృద్రోగాలతోనూ వచ్చే ఆస్కారం ఉంటుంది. 

కడుపులో మంట, ఊపిరి తిత్తులు,గొంతులో వాపు గడ్డలున్నా పొడి దగ్గు వస్తుంది. 

చల్లటి నీళ్ళు తాగ కూడదు,వాడిన నూనెలు , కాలుష్యం, వేపుళ్లు , ఘాటైన సువాసన ద్రవ్యాలు , మానసిక ఒత్తిడి వంటివి సమస్యను రెట్టింపు చేస్తాయి. అలానే ఒక్కొక్కసారి బాగా పండిన అరటి పండు, పెరుగు లాంటివి కఫాన్ని పెంచి దగ్గుకు కారణమవుతాయి. కాబట్టి వీటిని మిరియాల పొడితో కలిపి తీసుకోవాలి. సమస్య త్వరగా తగ్గుతుంది . దగ్గుతో పాటు కడుపులో మంట కూడా ఉంటే చింతపండునూ పరిమితంగా వాడాలి. 

నానబెట్టిన రెండు బాదం గింజలను తేనెతో కలిపి తింటే ఉపశమనం లభిస్తుంది. అలర్జీ కారణం వల్ల దగ్గు వస్తుంటే మాత్రం దంచిన వెల్లుల్లిని గ్లాసు నీటిలో ఉడికించి రాత్రిళ్ళు తాగాలి. పావు కప్పు నీటిలో ఉల్లి రసం, తేనె, చెంచా చొప్పున వేసుకుని భోజనం చేసిన తర్వాత తాగాలి. 

అర కప్పు గోరు వెచ్చని నీటిలో చిటికెడు ఆవ పొడి వేసి రోజుకి రెండు చెంచాలు స్వీకరించాలి. గ్లాసు పాలలో చెంచా తేనె , చిటికెడు చొప్పున నల్ల మిరియాలు , జీలకర్ర పొడి వేసి తాగాలి. అర కప్పు నీటిలో 5 చుక్కల లవంగ నూనె కలిపి రోజుకి రెండు సార్లు తీసుకోవాలి. దగ్గు సమస్య పరిష్కారమవుతుంది. 

ఉసిరి.. ఆరోగ్య సిరి..

 కార్తీక మాసం శిశిర ఋతువు వచ్చిందంటే పుల్లగా వగరుగా ఉండే ఉసిరి కాయలు నోరూరిస్తాయి. పూర్వం నుంచి ఆయుర్వేద అద్భుత ఔషధం గా ఉపయోగించే ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

శ్రీ ఫలం,ధాత్రి, ఆమ్ల ఫలం .. పేర్లతో పిలిచే ఉసిరి కాయల లో సి విటమిన్ అధికంగా లభిస్తుంది. అదెంత శాతమంటే .. ప్రకృతిలోని మరే పండు , కాయలో లభించనంత. ఉసిరి ఎండినా దీనిలో విటమిన్ సి శాతం ఏ మాత్రం తగ్గదు. అందుకే నిత్యం పది గ్రాముల ఉసిరి రసం, పొడి తీసుకునే వారికి ఇతర మార్గాల్లో సీ విటమిన్ అవసరం లేదంటారు. రోగులకు పత్యం ఆహారంగా దీనిని ఇస్తారు. ఉసిరిలో మధుర, ఆమ్ల, కటు, తిక్త , కషాయ రసాలుంటాయి. గాలిక్, ఆస్కార్బిక్ ఆమ్లాల కారణంగా పులుపు ఏర్పడుతుంది. 

ఔషధ ఉపయోగాలు..ఉబ్బసం,జలుబు , ఊపిరి తిత్తుల సమస్యలతో బాధపడేవారు రోజుకి అర చెంచా ఉసిరి రసం పొడి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. నోటి పూత, రక్తాల్పత ఉన్నవారు దీనిని గుంట గలగర ఆకు రసం, తేనెతో కలిపి పుచ్చుకోవాలి. 

ముక్కు, నోటి నుంచి రక్తం పడుతుంటే .. రోజుకి రెండు మూడు సార్లు ఒకటి రెండు చెంచాల ఉసిరి రసం స్వీకరిస్తే ఫలితం ఉంటుంది. 

అధిక ఋతు స్రావం,బహిష్టు సక్రమంగా రాని వారు రెండు చెంచాల ఉసిరి పొడిని బియ్యం కడిగిన నీటితో కలిపి తాగుతుంటే మంచిది. ఎముకలు బలహీనంగా ఉన్నవారు పాలు, పండ్ల తో పాటు ఉసిరి పొడి కలిపి తీసుకోవాలి. 

మధుమేహ వ్యాధి స్వల్ప స్థాయిలో ఉన్నవారు ఉసిరి పొడిని నాలుగు చెంచాల కాకర కాయల రసం , అర చెంచా పసుపులో కలిపి పుచ్చుకుంటే సమస్య తగ్గు ముఖం పడుతుంది. 

నెలసరి సక్రమంగా రావాలంటే అరటి ఆకు రసం , అరటి పూల కషాయంలో ఉసిరి పొడిని కలిపి తాగితే ఫలితం ఉంటుంది. 

దీర్ఘ కాలికంగా వేధించే రుమాటిక్ నొప్పులు , కీళ్ల వాతము తో బాధ పడే వారు ఇతర ఔషధాలతో పాటు ఉసిరి కాయ చూర్ణం కలిపి స్వీకరిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 

క్యాన్సర్ ప్రారంభ దశలో దీనిని ప్రతి రోజూ తీసుకుంటే శరీరంలో శక్తి పెరిగి జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగవుతుంది.

కడుపులో మంట కు పాలలో ఉసిరి పొడిని కలిపి తీసుకోవడం చక్కటి పరిష్కారం. చూపు తగ్గడం,నరాల బలహీనత వంటి కంటి సమస్యలకు ఉసిరి పోషకంగా సహాయపడుతుంది.

ఉసిరి, వేప పొడిని కలిపి పండ్లు తోమితే నోటి పూత, పళ్ళ తీపి, చిగుళ్ల వాపు తగ్గుతాయి.

జాగ్రత్తలు..

ఉసిరి కాయలను ఎక్కువగా వేడి చేసి తినకూడదు.ఉసిరిని నీడలో ఆర బెడితేనే విటమిన్ సి కోల్పోకుండా ఉంటుంది. 

పచ్చి రసం అధికంగా తీసుకుంటే గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉంది.

ఒక్క చెంచాడు ఉసిరి రసం.. రెండు కిలోల జామ పండ్లు, 18 కిలోల ద్రాక్షలు , మూడు కిలోల మామిడి పండ్లు, 180 కప్పుల ఆవు పాలలో ఉండే .. విటమిన్ సి కు సరిసమానం. 

ప్రతి 100 గ్రాముల పచ్చి ఉసిరిలో తేమ 81.8 గ్రాములు , పీచు 3.4 గ్రాములు , పిండి పదార్థాలు 14 గ్రాములు , పోషకాలు 0.5 గ్రాములు , కొవ్వు 0.1 గ్రా., క్యాల్షియం 15 మి. గ్రా, ఫాస్ఫరస్ 21 మి. గ్రా, ఇనుము 1 గ్రా. విటమిన్ బి 20 మైక్రో గ్రా., విటమిన్ సి 650 నుంచి 900 మి. గ్రా. వరకు ఉంటుంది. 

ముఖం పై మచ్చలు.. ఆయుర్వేద పరిష్కారాలు

చెంపలు,ముక్కు,నుదురు భాగంలో నల్లని,ముదురు గోధుమ రంగులో మచ్చలు .. ఆయుర్వేద పరిష్కారాలు 

హార్మోన్ల అసమతుల్యత, గర్భ నిరోధక సాధనముల వాడకం,రక్తపోటుకు వాడే మందులు, థైరాయిడ్, కాలేయం, ఊపిరితిత్తుల వ్యాధులు వంటివన్నీ ఇలాంటి మచ్చలకు కారణం కావచ్చు. జుట్టుకు కృత్రిమ రంగు వేసుకునే వారికీ ఇలాంటి సమస్య ఎదురు కావచ్చు. ఐతే అతి నీల లోహిత కిరణాల ప్రభావానికి ఈ సమస్య మరింత రెట్టింపు అయ్యే ఆస్కారం ఉంటుంది. అందుకే సమస్య మొదట్లో ఉన్నప్పుడే తగ్గించుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 

చర్మానికి సహజ మెరుపు.. తరచూ మంచి నీరు, పళ్ళ రసాలు,మజ్జిగ తీసుకుంటే పోషకాహార లోపాలు తగ్గుతాయి. చర్మ రంగూ మెరుగవుతుంది. క్యారెట్, బీట్రూట్, టమాటా వంటి రసాలూ, ఆ కూర గాయలు చర్మ రంగును సాధారణ స్థితికి తెస్తాయి. అలాగే దానిమ్మ, ద్రాక్ష, పుచ్చకాయ రసాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మచ్చలు తగ్గుముఖం పడతాయి. క్యాబేజీ రసం కూడా మేనుకు మేలు చేస్తుంది. ఎండు ఫలాలు, బాదం, వాల్ నట్లు, ఎండు ద్రాక్ష వంటి వాటిని తరచూ తీసుకుంటూ ఉండాలి. పాలు, చేపలు , చిక్కుడు గింజలు తింటే హార్మోన్ల పనితీరు మెరుగవుతుంది. ఫలితంగా మచ్చలు తగ్గుతాయి. 

బచ్చలి కూర.. ఆయుర్వేద ఉపయోగాలు..

 కేవలం బచ్చలి కూర తిన్నప్పుడు చర్మం పై దద్దుర్లు , దురద వంటి సమస్యలు రావు. ఐతే బచ్చలి కూర తీసుకున్నప్పుడు ఇతర ఆహార పదార్థాలు ఏం తీసుకుంటున్నారో గమనించాలి. అంతే కాదు కొన్ని కాయ గూరలు, పండ్లు సరిగా కడిగి తీసుకోకపోయినా సమస్య వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 

బచ్చలి కూరలో విటమిన్ ఏసి కాలయం పీచు పదార్థాలు ఉంటాయి. ఆకుల్లోని జిగురు పేగు పూతను దూరం చేస్తుంది. శరీరానికి చలువనిచ్చ మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. పైత్యం ,దగ్గు,శ్లేష్మం వంటి వాటిని తగ్గిస్తుంది. 

ఆకులను నూరి కాలిన గాయాల మీద కట్లు కడితే మంటలు తగ్గుతాయి. తలలో వేడి, తల నొప్పి, నిద్రాల్పత,చిరాకు  ఉన్నపుడు దీని ఆకులను కాసేపు తలమీద పెట్టీ కాసేపు ఉంచితే తలలోని వేడి , అలసట తగ్గి నిద్ర పడుతుంది. 

బచ్చలి ఆకులను బాదం జిగురులో కలిపి చిన్న చిన్న మాత్రలుగా చేసి ప్రతి రోజూ ఒక గ్రాము చొప్పున పుచ్చుకుంటే నోటి నుండి రక్తం రావడం, చిగుళ్ల సమస్యలు తగ్గిపోతాయి.ఐతే బచ్చలి ని అధికంగా తీసుకుంటే శరీరంలో నీరు పేరుకు పోతుంది.అజీర్ణం తలెత్తుతుంది. దీనికి విరుగుడు ఆవాలు,జీలకర్ర ,మజ్జిగ,ఇంగువ.

అలర్జీకి మూడు వారాల పాటు పసుపు రెండు చిటికెలు ,జీలకర్ర మూడు చిటికెలు ,30 ml గోరు వెచ్చని పాలలో కలిపి పుచ్చుకుంటే తగ్గిపోతాయి.


పాతికేళ్లకే కీళ్ల నొప్పులు.. ఆయుర్వేద పరిష్కారాలు

 వయసు పై బడిన వారిలో కీళ్ల నొప్పులు సహజం. కానీ ముప్పైల్లోనే ఈ సమస్య కనిపిస్తుందంటే శరీరానికి సరియైన వ్యాయామం అందక , లావుగా ఉండి ఎక్కువ సమయం పని చేయడం వల్ల కావచ్చు. ఊబకాయం తో బాధపడే వారు వైద్యుల సలహాలు తీసుకోకుండా అదే పనిగా వ్యాయామాలు చేస్తుంటారు. దాంతో నరాలు ఒత్తిడికి లోనై నొప్పి అనిపిస్తాయి. ఇవి సాధారణ సమస్యలుగా పరిగణించవచ్చు. కొన్ని సార్లు, రుమాటిక్, గౌట్ సమస్యల  వల్ల నొప్పి బాధించే ప్రమాదం ఉంటుంది.హార్మోన్ల అసమతుల్యత, టీబీ వల్ల కూడా సమస్య రావచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. 

వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి.. అరటి, అనాస, ఆకు కూరలు,టమాటా, దంపుడు బియ్యం, ఖర్జూరాలు, బాదం తీసుకోవచ్చు. కటిక ఉపవాసాలు చేయకూడదు. రోజుకి 10 నుంచి 12 గ్లాసుల మంచి నీటిని తాగాలి. 

ముద్ద కర్పూరాన్ని పొడి చేసి కొబ్బరి నూనె లో కలిపి కీళ్ళకు రాస్తుంటే ఎముకల మీద ఉన్న నరాలు మెత్తబడి నొప్పి తగ్గి త్వరగా ఉపశమనం కలుగుతుంది. భోజనానంతరం తేనెలో తగినంత శొంఠి పొడి కలిపి తీసుకుంటే నొప్పి నియంత్రణలో ఉంటుంది. 

తిప్ప తీగ వేరును నీళ్లలో ఉంచి ఆ నీటిని వడకట్టి వచ్చిన పొడిని ఆరబెట్టి తేనెతో పాటు అరచెంచా చొప్పున రెండు మూడు వారాలు పుచ్చుకుంటే గుణం ఉంటుంది. వ్యాయామం పరిమితంగా చేయాలి. 

శరీరంలో యూరిక్ ఆమ్లం మాములు స్థితికి వచ్చే వరకు ఆహారపరంగా జాగ్రత్తలు తప్పనిసరి. చిక్కుడు, పుట్ట గొడుగులు, క్యాలీఫ్లవర్, కాఫీ, టీ, మటన్ వంటి వాటికి దూరంగా ఉండాలి . చింత పండు, నిమ్మ జాతి పండ్లు , పాల ఉత్పత్తులను తగ్గించాలి. 

పాలతో చేసిన స్వీట్లు,జున్ను తినకపోవడం మంచిది. పప్పు దినుసులు మితంగా తీసుకోవాలి. పప్పు ఉడికేటప్పుడు వచ్చే తేటను కొన్ని రోజులు తీసుకుంటే యూరిక్ యాసిడ్లు నియంత్రణలో ఉంటాయి. 

17, సెప్టెంబర్ 2026, గురువారం

కుంకుమ పువ్వు.. విశిష్ట ప్రయోజనాలు..

 ఈ భూభాగంలో అత్యంత ఆకర్షణీయమైనది, ఖరీదైనది , అద్భుత ఔషధ గుణాలు కలిగినది కుంకుమ పువ్వు. ఆసేతు హిమాచలమే కాదు, సీమాంతర భూములలోనూ ప్రతిష్టాత్మకంగా వాడే ఖరీదైన మూలిక కుంకుమ పువ్వు. నాటి గ్రీకు సంస్కృతిలోనూ, అరబిక్ ఆచరణలోనూ , వేద కాలపు సంస్కృతిలోనూ ప్రాముఖ్యమైన సౌందర్య పోషణ ద్రవ్యమిది. నాటి రాచరిక కాలపు దర్పణానికి చిహ్నం కుంకుమ పువ్వు. 

రుచికరమైన వంటలలోనూ ,రమ్యమైన సౌందర్య సాధనము గానూ రసాయన ఔషధ ద్రవ్యంగానూ విశిష్టమైన ఈ కుంకుమ పువ్వు తనలో పెరగడం వల్ల మన శిఖరోజ్వల ప్రాంతం కాశ్మీరం అయింది. వేరు దుంప కలిగిన ఈ ఊదా రంగు పుష్పాలు గుత్తులు గుత్తులుగా ఈ కాశ్మీరంలోనే ఎక్కువగా పండుతాయి. 

ఈ పుష్పాలలోని కీల భాగమే కుంకుమ పువ్వు.పారశీక, బాహ్లిక దేశాలలో పండించినా కాశ్మీర కుంకుమ పువ్వే శ్రేష్ఠమైనది అని భావమిశ్రుడు అంటాడు. 

స్త్రీలలో ఇది శ్రోనితా స్థాపకం కనుక కవులు దీన్ని కమ్మ పుప్పొడి లోని మధుర లాలన అన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో , అన్ని వర్గాల ప్రజావళి తమ పిండి వంటలలో , సౌందర్య సాధనాలలో, మందు లలో దీన్ని వాడుతున్నారు. దీని దుంప, పువ్వు, కాండం, పై పొర , వేరు, ఆకులు, అన్ని వివిధ రకాలుగా వాడుతున్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో కుంకుమ పువ్వు ఒక భాగమైంది. 

వంటకాలకు రుచి..ముఖ్యంగా దీని పువ్వులలో కీల భాగం నుండి వచ్చే పరిమళ భరితమైన పుప్పొడిని తరతరాల నుండి ఈ దేశపు ప్రత్యేక వంటలలో వాడుతున్నారు. 

మన పూర్వులే కాదు, మొఘలాయిల అద్భుత మొఘల్ వంటకాలలో ఈ కుంకుమ పువ్వు ను ప్రత్యేకంగా వాడేవారు. చేదుగా, స్నిగ్ధంగా ఉండే ఈ పదార్థం తేనెలా కరిగి మధురమైన పదార్థాలకు, ప్రత్యేకమైన కూరలకు అద్భుతమైన ఆకర్షణ ఇస్తుంది. 

ఇది కలిస్తే పిండి వంటలకు లేత ఆరెంజ్ రంగు లాంటి ఛాయ వస్తుంది.అందుకే మధుర పదార్థాలకు,పానీయాలకు , మాంస వంటకాలకు దీన్ని కొంచెం కలుపుతారు. ఆదికాలం నుంచి ముఖ్యమైన వంటకాలలో ..ముఖ్యంగా భారత దేశపు బిర్యానీలో దీన్ని ప్రత్యేకంగా చేరుస్తారు.

హైదరాబాదీ ప్రత్యేక వంటకమైన పక్కీ బిర్యానీలో ఇది ముఖ్యంగా ఉంటుంది. జోధ్ పూరి లస్సీలో ఇది ముఖ్యంగా కలుపబడే ప్రత్యేక పదార్థం.అందుకే దాన్ని లేసన్స్ లస్సీ అంటారు.

భారతీయ ఆయుర్వేదంలో, అరబిక్ యునాని వైద్యంలో దీన్ని వాడతారు.

దివ్యమైన ఔషధం..

ఆయుర్వేదంలో మోకాళ్ళ నొప్పుల నుండి వంధ్యత్వం అంటే సంతానం లేకపోవడం దాకా ఎన్నో వ్యాధులలో మందుల రూపంగా దీన్ని వాడతారు.

కుంకుమ పువ్వు ఆస్తమా,జలుబు, ముఖం పై మొటిమలు,కడుపులో నొప్పి, మద్య పానం వంటి వాటికి బాగా పనిచేస్తుంది. దీంతో తయారైన క్రీములు ముఖం పై మచ్చలను పోగొట్టడమే కాకుండా ముఖాన్ని కాంతి వంతంగా చేస్తాయి. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం తాగితే ఒంట్లో ఉండిపోయిన నీరు పోతుంది.గర్భాశయ,మూత్రాశయ వ్యాధులలో దీన్ని బాగా వాడతారు.గర్భాశయం వాపులలో, పైనున్న చిన్న గడ్డలలో / ఫైబ్రాయిడ్స్ , దీన్ని తేనెతో కలిపి వాడడం మంచిది.దీన్నుంచి తీసిన నూనె గర్భాశయంపై వచ్చే గడ్డలలో చాలా బాగా ఉపకరిస్తుంది.

రాత్రి వేడి పాలలో పటిక బెల్లం,కుంకుమ పువ్వు వేసి తాగితే పురుషులలో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అది తాగితే స్త్రీలలో అనుభూతి కలుగుతుంది.పిల్లల్లో శరీరం కాంతి వంతంగా మారుతుంది.

ఒక సీసాలో మూడు ఔన్సుల 100 ప్రూఫ్ ఆల్కహాలు తీసుకుని అందులో మూడు చిటికెల కుంకుమ పువ్వు వేసి గట్టిగా మూత పెట్టండి. దాన్ని అలాగే మూడు వారాలు ఉంచండి. తర్వాత చల్లటి పొడి ప్రదేశంలో కొంత సేపు ఉంచి దాన్ని పావు కప్పు ఒక్కసారి తీసుకోండి.మనసులో వేదన,ఆందోళన పోయి చక్కటి ఉత్సాహం వస్తుంది. కానీ ఇది అలవాటుగా మార కూడదు.

ఆయువు వృద్ధికి..

క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలకు ముందే చరక సుశ్రుతాది సంహితలలో దీని గురించి ప్రస్తావన ఉంది.కండర గుండెకు బలాన్నిచ్చే ఈ కుంకుమ పువ్వు లేపం ' సంకోచ ' అని పిలవబడుతుంది. పాయసంలో, చక్కెర పొంగలిలో దీన్ని కలిపి తీసుకుంటే ఆయువు పెరుగుతుంది.

USDA ప్రకారం దీనిలో ఎనర్జీ 15.5% ,కార్బోహైడ్రేట్స్ 50%, ప్రోటీన్స్ 21% ఉన్నాయి.విటమిన్లు 77% , మినరల్స్ 37% ,ముఖ్యంగా విటమిన్ ఎ,ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి ఎక్కువగా ఉన్నాయి.

కుంకుమ పువ్వు తీసుకునేటప్పుడు దాని నియమ బద్ధతను చూడండి.ఇంట్లో ఉన్నప్పుడు గాలి వెళ్ళని గట్టి పాత్రలో భద్ర పరుచుకోండి. రోజూ రాత్రి గోరు వెచ్చని పాలలో రెండు చిటికెల కుంకుమ పువ్వు, పటిక బెల్లం పొడి కలిపి సేవిస్తుంటే గుండె జబ్బుల వారికి మంచిది. గర్భిణీ కాలంలో రోజూ చిటికెడు కుంకుమ పువ్వు,రెండు గులాబీ రేకులు పాలలో వేసి తాగుతుంటే అందమైన బిడ్డలు పుడతారు. ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.

ఈ  భారత భూమిని కీర్తించిన వారు ఈ అద్భుత కుంకుమ పువ్వును అందించిన కాశ్మీరాన్ని శీతాచల శిఖరోజ్వలం అని కీర్తించారు.


తల తిరుగుడుకు.. ఆయుర్వేదంలో విరుగుడు.

 తల తిరగడం చాలా మంది కి సర్వ సాధారణం. ఎక్కువ పని చేసినా, దిగులు, ఆందోళన , మానసిక అశాంతి ఉన్నా తిన్నది జీర్ణం కాకపోయినా , మందులు పడక పోయినా, నూనె సరుకులు తిన్నా తల తిరుగుతుంది. ఇది కొద్ది సేపు మాత్రమే ఉంటుంది. కొందరికి గది అంతా తిరుగుతున్నట్లు, గోడలు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. దీన్ని ఒళ్ళు తిరగడం అని కూడా అంటారు. ఇది పోవడానికి రోజూ భస్త్రిక ప్రాణాయామం చేయడం మంచిది. దాని వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. గుండెకు, మెదడుకు ఆక్సిజన్ లభిస్తుంది. వివిధ ప్రాణాయామాలు ఉన్నప్పటికీ వాటిని శిక్షకుని సహాయంతో చేయాలి. ఇక తల తిరుగుడు తగ్గడానికి ఆయుర్వేదంలో మంచి చికిత్సలు ఉన్నాయి. 

1. గ్లాసు నీటిలో రెండు లవంగాలు వేసి మరిగించి అది చల్లారిన తర్వాత తాగాలి. 

2. గ్లాసు నీటిలో రెండు ఎండు ఖర్జూరాలు, 5 లవంగాలు , 10 గ్రాముల మంచి నెయ్యి, 40 గ్రాముల పటిక బెల్లం కలిపి మరిగించి చల్లారిన తర్వాత తాగాలి. 

3. 25 గ్రాముల చక్కెర , 10 గ్రాముల శొంఠి పొడి, 20 గ్రాములు మంచి నెయ్యి కలిపి దాన్ని రెండు మోతాదులుగా చేసుకుని రెండు పూటలా తినాలి. ఇలా 15 రోజులు చేస్తే తల తిరగడం ఆగిపోతుంది.

4. మంచి నెయ్యి, గోధుమ పిండి, చక్కెర కలిపి ఉండలుగా చేసుకుని రోజూ తినాలి. తల తిరిగినపుడు నుదుటిపై గంధం లేదా పసుపును నీటిలో అద్ది రాసుకోవాలి. 

5. తల తిరిగినపుడు నిమ్మ రసం తాగాలి. మొలకెత్తిన ధనియాలు, రెండు చెంచాల సోంపు కలిపి నూరి దాన్ని గోరువెచ్చని నీటిలో వేసి తాగాలి. లేదా అర చెంచా తులసి రసానికి కొద్దిగా తేనె కలిపి తినాలి. 

6. నాలుకపై కొద్దిగా ఇంగువ , కొద్దిగా కర్పూరం ఉంచుకుని దాన్ని కొద్దికొద్దిగా పీల్చాలి. 

7. ఎండా కాలంలో కరక్కాయ చూర్ణం లేదా రసాన్ని తాగడం వల్ల తల తిరగదు. లేదా కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది. 

8. కర్బుజ గింజలను నేతిలో వేయించి చప్పరించాలి. లేదా మిరియాల పొడి , రెండు చెంచాల పసుపు, గోధుమ పిండి కలిపి నేతిలో వేయించి , దాన్ని నాలుగు చెంచాలు పాలల్లో కలిపి తాగాలి. అలసట వల్ల తల తిరిగినట్లుగా ఉంటే గ్లాసు పాలల్లో చెంచా నెయ్యి , కొద్దిగా పసుపు వేసుకుని తాగాలి 

9. 400 గ్రాముల పాలు, 5 లవంగాలు , 25 గ్రాముల నెయ్యి, 4 పొట్టు తీసిన బాదం కలిపి నూరి తాగాలి. 

10. నేతిలో అరకిలో గోధుమ పిండి ని వేయించి , దానికి ఏలకుల పొడి కలిపి ఉండలుగా చేసి బెల్లం పాకంలో వేసి రోజూ తినాలి. దీని వల్ల తల తిరుగుడు తగ్గిపోతుంది. 

16, సెప్టెంబర్ 2026, బుధవారం

ఆలివ్ ఆయిల్ తో ఆరోగ్యం..

 ఈనాడు ప్రపంచమంతటా ఆరోగ్య పరిరక్షణకు , దీర్ఘ కాలం ఆనందంగా జీవించడానికి ఏది మంచో , ఏది చెడో అన్న ఆలోచనలతో మానవ మేధస్సు ఎక్కువ ఆలోచిస్తోంది. పూర్వం దూరదృష్టితో చూసే పెద్ద వాళ్ళు మంచి, చెడు చెప్పేవారు. 

ఇప్పుడు శాస్త్రం మనిషి వ్యక్తిగతంగానూ మారి తన శ్రేయస్సుకు ఏది మంచో చూస్తున్నాడు. అలాగే ఆరోగ్యానికి ప్రసిద్ధి చెందింది ఆలివ్ ఆయిల్. 

ప్రపంచమంతటా ఇంత ప్రాచుర్యం పొందడానికి ఆలివ్ తో ఉన్న అనేక ప్రయోజనాంశాలు సమాజపరంగా, వైద్య పరంగా ముఖ్యంగా సహజ ఆహార పదార్థంలో ఉండే జీవ శక్తి వల్ల దీని ప్రాచుర్యం ఎక్కువైంది. 

మెడిటరేనియన్ లో ప్రజలు అనాది నుంచి ఒక ఆహార పదార్థంగానే కాకుండా మంచి మందులా, మంచి అద్భుతంలా సౌభాగ్యానికి, అధికారానికి , కీర్తికి సూచికగా భావిస్తారు, అభిమానిస్తారు. ఈ చెట్టుని అపరిమితమైన శక్తికి , కీర్తికి , శాంతికి చిహ్నంగా భావిస్తారు. 

ఈ చెట్టు విచ్చుకున్న ఆకులతో కూడిన ఆకృతిని స్నేహ పూర్వకంగా జరిగే ఆటలలో విజయ చిహ్నంగా ఉపయోగిస్తారు. రక్తం పారే యుద్ధాలలో శాంతికి ఆలవాలంగా పూర్వులు దీన్ని కీర్తించారు. దీని పండు నుంచి స్రవించే నూనె చరిత్రలో అసామాన్యులుగా కీర్తించబడ్డ చక్రవర్తుల తలలను అభ్యంగనం చేసింది. 

గ్రీకు నాగరికతలో..

ఆలివ్ ఆయిల్ ప్రత్యేకత ఏమిటంటే జీవశక్తిని హరించే వాటిని నిర్మూలించే శక్తి ( యాంటీ ఆక్సిడెంట్స్) విటమిన్ ఎ, ఇ లు ఉన్నాయి. ఇవి మన శరీరంలో కాన్సర్ కలిగించే కారణాలను నివృత్తి చేస్తాయి. 

ఇది మోనో అన్ సాచురేటెడ్ కనుక చెడును కలిగించే , LDL కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అదే సమయంలో మంచిని కలిగించే HDL ను తగ్గించదు. దీని వల్ల రక్త ప్రసారం సమగ్రంగా ఉండి బీపీ ని పెరగనివ్వదు. తద్వారా హృదయ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. 

ఈ మధ్య కాలంలో జరిగిన పరిశోధనల్లో ఆలివ్ ఆయిల్ రొమ్ము క్యాన్సర్, ఎముకల వ్యాధులు రాకుండా నివారించడంలో మంచి ఫలితాలు ఇస్తుందని తేలింది. ఇందులో ఉన్న అధిక ఒలియక్ యాసిడ్ మన రక్త వాహికలను ఆరోగ్యవంతంగా ఉంచేందుకు సహాయ పడుతుంది. అందువల్లనే పూర్వులు తమ ప్రత్యేక వంటలలో దీన్ని వాడేవారు. 

జీవితమే మారిపోతుంది..

మరో ముఖ్య విశేషం ఈ ఆలివ్ ఆయిల్ ఉష్ణ సహన శక్తి. దీని వల్ల ఒక్క వేపుడు కూరలు తప్ప అన్ని వంటకాలలోనూ దీనిని వాడచ్చు. ఆలివ్ ఆయిల్ తో చేసిన పదార్థాలు చల్లని చోట్ల అంటే రిఫ్రిజిరేటర్ లో ఉంచితే సుమారు సంవత్సరం దాకా పాడవకుండా ఉంటాయి. అందుకే గ్రీకు నాగరికతలో దీన్ని ప్రత్యేకంగా చూసే వారు. మరో విశేషం ఈ ఒలియక్ యాసిడ్ అసాధారణంగా వచ్చే ALD వ్యాధిని ఎదుర్కునే ఒకే ఒక మందు. తలలోని తెల్ల పదార్థం శిధిలమయ్యే అసాధారణ వ్యాధి. 

మీరు ఆలివ్ ఆయిల్ కొనేటప్పుడు శుద్ధమైనది కొనకండి. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కొనండి. ఎందుకంటే అది ఆలివ్ గింజలను నొక్కినప్పుడు వచ్చిన మొదటి నూనె కనుక. దానిలో చాలా తక్కువ ఆమ్లం ఉంటుంది. అలాగే ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. గుండెకు , జీవ శక్తి కి మంచిదైన ఈ ఆలివ్ ఆయిల్ మీ ఆహారంలో కొంచెమైనా చేర్చుకోండి. 

నాలుకకి దీని రుచిని అలవాటు చేస్తే అది మీ గుండెను , మెదడును మొత్తం మీ జీవనాన్ని ఆహ్లాద పరుస్తుంది. మీ మాంసాహారం, చేపలు, రొట్టెలలో ఇది వాడడం మంచిది. ఆలివ్ ఆయిల్ ను ఎప్పుడూ స్టౌ పక్కన, ఎండలో ఉంచకండి. పాడైపోతుంది. వేడి, ఎండ లేని చోట ఉంచండి. ఆలివ్ ఆయిల్ సుమారు 700 రకాల గింజల నుండి సేకరించ బడుతుంది. 

ఇది పచ్చగా ఉండవచ్చు,నీలంగా ఉండవచ్చు. దీని రుచి ఘాటుగా , తీయగా , జిడ్డుగా ఉండవచ్చు. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తొందరగా జీర్ణం అవుతుంది. కొవ్వుని కరిగిస్తుంది. విటమిన్లు ఏ, డి, కె వంటి వాటిని తొందరగా వంట పట్టిస్తుంది.  ఇది కొన్ని కూల్ డ్రింకుల లో రంగు , రూపు నిలవడానికి ఉపయోగపడుతుంది. 

మంచి రుచి కలిగిన ఆలివ్ ఆయిల్ అత్యుత్తమమైనది. ఇది సహజమైన ప్రకృతిలోని పళ్ళ నుండి నేరుగా తీసిన నూనె కనుక దాన్ని అలాగే వాడినా చెడు చేయదు. ఇంత వరకు జరిగిన పరిశోధనలో ఈ ఆలివ్ ఆయిల్ గుండె జబ్బులను నివారించడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తుందని తేలింది.ఎందుకంటే ఇంకా  ఏ ఇతర సహజమైన నూనెలలో దీనిలో ఉన్నంత మోనో అన్ సాచురేటెడ్ శక్తి లేదు కనుక.

మన ఆమాశయంలో ( stomach) ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది .అందులో ఉండే పుండ్లు( అల్సర్స్), చీము ( gastritis) ను తగ్గిస్తుంది. బైల్ ఉత్పత్తిని పెంచుతుంది, గాల్ స్టోన్స్ ను తగ్గిస్తుంది.

ఆలివ్ ఆయిల్ కు మన అన్నవాహిక లో వచ్చే క్యాన్సర్ ను నివారించే శక్తి ఉన్నదని దీన్ని ఆహారంలో చేరిస్తే మంచి ఫలితాలు ఇచ్చిందని స్పానిష్ శాస్త్రజ్ఞుల పరిశోధనలలో నిరూపించబడింది.

ఆలివ్ ఆయిల్ ఎక్స్ట్రా వర్జిన్,వర్జిన్, ప్యూర్, ఎక్స్ట్రా లైట్ అని నాలుగు రకాలుగా దొరుకుతుంది.అందులో మొదటిది మంచిది.మనం రోజూ వాడే నూనెల్లో వేరు శనగ నూనె హితం కాదు. నువ్వుల నూనె ఒళ్ళు తగ్గడానికి, కీళ్ల నొప్పులు రాకుండా ఉండడానికి హితకరం. నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్ తలంటుకోవడం కంటే అభ్యంగన స్నానానికి,ప్రత్యేక వంటకాలకు హితకరం. అందుకే మన పెద్దలు ఇలా అంటారు " హితమైనది మితమైనా అప్పుడప్పుడు తీసుకోవాలి " అని .


వాపులు, గడ్డలు, మర్మాంగ బలహీనత, రేచీకటి.. ఆయుర్వేద పరిష్కారాలు

 శరీరమంతా వాపులు , గడ్డలు.. ఆయుర్వేద పరిష్కారాలు.. 

రోజూ రెండు పూటలా 7 సార్లు వడపోసిన దేశవాళీ గోమూత్రం పావుకప్పు నుంచి అరకప్పు మోతాదుగా అరకప్పు మంచి నీళ్లు, ఒక చెంచా పటిక బెల్లం పొడి కలిపి సేవిస్తుంటే అతి త్వరగా రక్త శుద్ధి జరిగి కొత్త గడ్డలు పుట్టకుండా ఉంటాయి. 

తుమ్మ చెట్టు వేరుపై ఉండే బెరడు పొడి వస్త్ర ఘాలితము పట్టింది 50 గ్రాములు , మూసాంబరం పొడి 20 గ్రాములు , ముల్లంగి గింజల పొడి 20 గ్రాములు, ఆవాల పొడి 20 గ్రాములు, గుగ్గిలం పొడి 20 గ్రాములు సేకరించి అన్నింటిని వస్త్ర ఘాలితము పట్టి తయారుగా ఉంచుకోండి. ఈ చూర్ణంలో తగినంత మేలు రకమైన కొబ్బరి నూనె గానీ, నెయ్యి గానీ పోసి మెత్తని గుజ్జు లాగా నూరి నిలువ చేసుకోవాలి. ఈ మలాం ను పైన లేపనం చేస్తుంటే అన్ని రకాల వాపులు, గడ్డలు, పుండ్లు హరించిపోతాయి. 

పురుష మర్మాంగ బలహీనత సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు 

పుష్కర మూలం, బల వేళ్ళు, అతి బల వేళ్ళు, వస కొమ్ములు, పెన్నేరు గడ్డలు , గజ పిప్పళ్లు, ఎర్ర గన్నేరు వేళ్ళ పై బెరడు .. వీటిని సమ భాగాలుగా తీసుకుని, విడి విడిగా దంచి జల్లించి వస్త్ర ఘాలితము పట్టి అన్నింటినీ కలిపి గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు తగినంత చూర్ణం తీసుకుని అందులో వెన్న కలిపి గుజ్జులా నూరి ఆ మిశ్రమాన్ని మర్మాంగము ముందు భాగం విడిచి పెట్టీ వెనుక భాగానికి పైన రాసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం పూట కడుగుతూ ఉండాలి. ఇలా చేస్తుంటే బలహీన పడిన మర్మాంగము క్రమంగా దృఢంగా పూర్తి శక్తివంతంగా మారుతుంది. 

రేచీకటి సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..

సోంపు గింజల పొడి 100 గ్రాములు తీసుకుని దంచి జల్లించి వస్త్ర ఘాలితము పట్టి సిద్ధం చేసుకోవాలి. తగినన్ని తమలపాకులు ఆరబెట్టి పొడి చేసి పైన చెప్పిన పొడికి సమానంగా కలిపి ఉంచాలి. అదే మోతాదుగా ప్రశస్తమైన పట్టు తేనె సంపాదించుకుని మూడు పదార్థాలు కలిపి గరుకు లేకుండా మెత్తగా నూరి కాటుక డబ్బాలో నిలువ చేయాలి. రోజూ రాత్రి పడుకునే ముందు పెసర బద్దంత ఈ కాటుకను కళ్ళల్లో పెట్టుకొంటూ ఉంటే  ఆశ్చర్య కరమైన మార్పు ఒకటి రెండు వారాల్లోనే కనిపిస్తుంది. రేచీకటి సమస్య అంతమై దృష్టి శక్తి పెరుగుతుంది. 

దంతాలు , పేలు, చుండ్రు, సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు

పేలు, చుండ్రు సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు 

 గానుగలో తీసిన స్వచ్ఛమైన కొబ్బరి నూనె అర లీటర్ తీసుకుని ఒక పాత్రలో పోసి చిన్న మంట పెట్టండి. తర్వాత బాగా పండిన 5 నిమ్మ కాయలను గింజలు తీసి రసం తీసి నూనెలో పోయండి . క్రమంగా నిమ్మరసం పోయి నూనె మాత్రమే మిగిలే వరకు వేచి ఉండాలి. పాత్రను దించి నూనె వడ పోసి గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. 

ఈ తైలాన్ని రోజూ గోరు వెచ్చగా తలకు పట్టిస్తుంటే చుండ్రు, పేలు పోయి వెంట్రుకలు దృఢంగా మరి తలకట్టు అందంగా మారుతుంది. 


దంతాలు కదిలే సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..

నల్ల తుమ్మ చెట్టు బెరడు 20 గ్రాములు, దోరగా వేయించిన శొంఠి పొడి 3 గ్రాములు తీసుకోవాలి. తుమ్మ చెట్టు బెరడు కడిగి  చిన్న ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టి పొడి చేసుకోవాలి. శొంఠిని కూడా దోరగా వేయించి దంచి పొడి చేసి.. రెంటినీ కలపాలి.ఆ పొడికి తగినంత ఎవరికి ఎంత అవసరమో అంత సైంధవ లవణం పొడిని కలిపి నిలువ చేసుకోవాలి.

ఈ మిశ్రమ చూర్ణాన్ని ప్రతి రోజూ రెండు పూటలా పళ్ళు తోముకోవడానికి వాడుతుంటే కదులుతున్న దంతాలు గట్టి పడి దృఢంగా మారుతాయి. ఎంతో సులువుగా తయారు చేసుకునే ఈ చూర్ణాన్ని అందరూ వాడుకోవచ్చు.


కిడ్నీలో రాళ్లు, సంతాన సమస్య.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 మూత్రపిండాలలో రాళ్ల సమస్య ఆయుర్వేద పరిష్కారాలు.. 

ఉలవలు..8 గ్రా, సైంధవ లవణం 3 గ్రాములు, వెంపలి వేళ్ళు 2 గ్రాములు తీసుకుని వీటన్నింటినీ కచ్చా పచ్చగా దంచి ముప్పావు లీటర్ మంచినీటిలో కలిపి పొయ్యి మీద పెట్టాలి . చిన్న మంట పైన సగం కషాయం మిగిలే టట్లు మరిగించి దించి వడపోయాలి. ఈ కషాయాన్ని 3 భాగాలుగా చేసి, మూడు పూటలా కొంచెం కొంచెం తాగుతుంటే నాలుగైదు రోజుల లోనే మూత్ర పిండాలలోని , మూత్ర నాళంలోని రాళ్ళు కరిగి పడిపోతాయి. 

సంతాన ప్రాప్తి సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..

రావి చెట్టు పండ్లు సేకరించి కడిగి ముక్కలు చేసి నీడలో బాగా ఆరబెట్టి నిలువ చేసుకోవాలి. ఆ ముక్కలను దంచి మెత్తగా చూర్ణం చేసి పలుచని బట్ట లో వస్త్ర ఘాలితము పట్టి , దానికి సమానంగా పటిక బెల్లం పొడి కలిపి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. రోజూ రెండు పూటలా భార్యాభర్తలు ఇద్దరూ ఒక చెంచా మోతాదుగా చప్పరించి తిని, ఒక గ్లాసు గోరు వెచ్చని పాలలో పటిక బెల్లం పొడి కలిపి 40 రోజుల పాటు సేవిస్తూ పూర్తి బ్రహ్మ చర్యం పాటించాలి. తర్వాత దాంపత్య వేదంలో సూచించినట్లుగా సంసారం చేస్తుంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది. 

14, సెప్టెంబర్ 2026, సోమవారం

ఎముకలు, స్తనాల సమస్యలు.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 ఎముక విరిగి ,వాపు వచ్చి, ఒళ్ళు పెరిగిన సమస్యలకు.. 

1.) మేలైన తుమ్మ బంక తెచ్చి చిన్న ముక్కలు కొట్టి కొన్ని చుక్కల నెయ్యితో చిన్న మంట పైన వేయించి దంచి జల్లించి దానితో సమానంగా పటిక బెల్లం పొడి కలిపి నిలువ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని రెండు పూటలా ఒక చెంచా మోతాదుగా చప్పరించి తిని ఒక కప్పు గోరు వెచ్చని ఆవు పాలు తాగించాలి. దీనివల్ల విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. 2.) కరక్కాయ పొడి, ఉసిరి కాయ పొడి, తాని కాయ పొడి , శొంఠి పొడి, మిరియాల పొడి, పిప్పళ్లు పొడి, సైంధవ లవణం సమ భాగాలుగా కలిపి నిలువ చేసుకోవాలి. 

రెండు పూటలా ఆహారానికి అర గంట ముందు అర చెంచా పొడి ఒక చెంచా తేనె కలిపి తినిపించాలి. దీని వల్ల పెరిగిన కొవ్వు తగ్గడమే కాక దెబ్బ తిన్న కాలిలో చేరిన చెడు నీరు కూడా తగ్గి పోయి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. 

వక్షోజాలు కిందికి జారిన సమస్య..ఆయుర్వేద పరిష్కారాలు..

డిసెంబర్, జనవరి మాసాలలో పొలాలలో విరివిగా దొరికే  బోడ తరం మొక్కల పూలు , వేళ్ళు ఒక్కొక్కటి సమభాగాలుగా 200 గ్రాముల చొప్పున తీసుకుని అందులో పిప్పళ్లు 100 గ్రాములు కలిపి మెత్తగా నలగ గొట్టి పాత్రలో వేసి అందులో రెండు లీటర్లు నీళ్లు పోసి అర లీటర్ కషాయం మిగిలే వరకు మరిగించి వడ పోసుకోవాలి. ఆ కషాయంలో పావు లీటరు నువ్వుల నూనె పోసి, నూనె మాత్రమే మిగిలే వరకు చిన్న మంట పైన మరిగించి వడపోసి నిలువచేసుకోవాలి. 

ఈ తైలాన్ని పలుచగా దూదితో తడిపి ఆ దూదిని స్థనాల పైన వేసి పొడి దూదిని పైన పెట్టి ఊడిపోకుండా గుడ్డ కట్టి ఉదయం పూట తీసివేయాలి. దాంతో పాటు అదే తైలాన్ని రెండు మూడు చుక్కల మోతాదుగా ముక్కలలో వేసుకుని లోపలికి పీల్చాలి. ఇలా చేస్తుంటే స్తనాలు గట్టి పడి తగిన ప్రమాణంగా పెరుగుతాయి. 

చెవిలో హోరు, మూత్ర సమస్య.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 మూత్రం తక్కువగా నడుస్తూ ,శరీరం నీటితో ఉబ్బిన సమస్య , .. ఆయుర్వేద పరిష్కారాలు 

పుల్ల దానిమ్మ పండు రసం, చిన్న ఏలకులలోని గింజల పొడి , దోరగా వేయించి దంచిన జిలకర పొడి, సైంధవ లవణం పొడి .. వీటి ఒక్కొక్కరిని 3 గ్రా మోతాదుగా ఒక కప్పు మజ్జిగలో కలిపి రోజూ ఉదయం పరగడుపున తాగిస్తుండాలి. దీని వల్ల మూత్రం బాగా జారీ అవుతుంది. 

2. ) మోదుగ చెట్టు పూలను ఎక్కువగా తెచ్చుకొని నిలువ చేసుకోవాలి. రోజూ ఒక సారి పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు తగినన్ని పూలను మంచి నీటితో మెత్తగా గుజ్జులా నూరి బొడ్డు చుట్టూ పట్టించండి. ఈ పట్టు వేసిన 5,10 నిమిషాలలో మూత్రం ధారాళంగా బయటకు వస్తుంది. 

3.) దోస గింజల పొడి 50 గ్రాములు, అతి మధురం పొడి 50 గ్రాములు, మాను పసుపు పొడి 50 గ్రాములు కలిపి నిలువ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని రెండు పూటలా 3 గ్రాముల మోతాదుగా అర కప్పు బియ్యం కడిగిన నీటితో కలిపి తాగుతుంటే మూత్రం సాఫీగా జారీ అవుతుంది. 

చెవిలో హోరు సమస్యకు.. అన్ని చెవి రోగాలను అణచి వేసే అద్భుత కర్ణ తైలం..

ఆయుర్వేద అంగళ్లలో లభించే పిప్పలి కట్టె,సైంధవ లవణం,శొంఠి, తుంగ ముస్తలు, పుష్కర మూలం, వస కొమ్ములు, వెల్లుల్లి పాయలు ..ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకుని మెత్తగా దంచి జల్లించి ఆ చూర్ణాన్ని 300 గ్రాముల నువ్వుల నూనెలో వేయాలి. అలాగే ఆ నూనెలో జిల్లేడాకుల నుంచి దంచి తీసిన రసం కూడా 300 గ్రాములు కలిపి చిన్న మంట పైన మరిగించాలి.క్రమంగా నీరంతా ఇంకిపోయి నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి వడపోసి సీసాలో నిలువ చేసుకోవాలి.

ఈ తైలాన్ని రెండు పూటలా గోరు వెచ్చగా నాలుగైదు చుక్కలు చెవులలో వేస్తుంటే , చెవి హోరు మాత్రమే కాక మిగిలిన అన్ని రకాల చెవి సమస్యలు,చెవుడు కూడా క్రమంగా తగ్గిపోతాయి.


Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...