18, సెప్టెంబర్ 2026, శుక్రవారం

పొడి దగ్గుకు.. ఆయుర్వేద పరిష్కారాలు..

 ఘాటైన వాసనలు, కొన్ని పదార్థాలలోని రసాయనాలు ఊపిరి తిత్తులు, గొంతులో ఇబ్బంది కలిగించి అవి దగ్గు రూపంలో బయటకు వస్తాయి. ఒక్కోసారి అలర్జీ, ఇన్ఫెక్షన్ , హృద్రోగాలతోనూ వచ్చే ఆస్కారం ఉంటుంది. 

కడుపులో మంట, ఊపిరి తిత్తులు,గొంతులో వాపు గడ్డలున్నా పొడి దగ్గు వస్తుంది. 

చల్లటి నీళ్ళు తాగ కూడదు,వాడిన నూనెలు , కాలుష్యం, వేపుళ్లు , ఘాటైన సువాసన ద్రవ్యాలు , మానసిక ఒత్తిడి వంటివి సమస్యను రెట్టింపు చేస్తాయి. అలానే ఒక్కొక్కసారి బాగా పండిన అరటి పండు, పెరుగు లాంటివి కఫాన్ని పెంచి దగ్గుకు కారణమవుతాయి. కాబట్టి వీటిని మిరియాల పొడితో కలిపి తీసుకోవాలి. సమస్య త్వరగా తగ్గుతుంది . దగ్గుతో పాటు కడుపులో మంట కూడా ఉంటే చింతపండునూ పరిమితంగా వాడాలి. 

నానబెట్టిన రెండు బాదం గింజలను తేనెతో కలిపి తింటే ఉపశమనం లభిస్తుంది. అలర్జీ కారణం వల్ల దగ్గు వస్తుంటే మాత్రం దంచిన వెల్లుల్లిని గ్లాసు నీటిలో ఉడికించి రాత్రిళ్ళు తాగాలి. పావు కప్పు నీటిలో ఉల్లి రసం, తేనె, చెంచా చొప్పున వేసుకుని భోజనం చేసిన తర్వాత తాగాలి. 

అర కప్పు గోరు వెచ్చని నీటిలో చిటికెడు ఆవ పొడి వేసి రోజుకి రెండు చెంచాలు స్వీకరించాలి. గ్లాసు పాలలో చెంచా తేనె , చిటికెడు చొప్పున నల్ల మిరియాలు , జీలకర్ర పొడి వేసి తాగాలి. అర కప్పు నీటిలో 5 చుక్కల లవంగ నూనె కలిపి రోజుకి రెండు సార్లు తీసుకోవాలి. దగ్గు సమస్య పరిష్కారమవుతుంది. 

ఉసిరి.. ఆరోగ్య సిరి..

 కార్తీక మాసం శిశిర ఋతువు వచ్చిందంటే పుల్లగా వగరుగా ఉండే ఉసిరి కాయలు నోరూరిస్తాయి. పూర్వం నుంచి ఆయుర్వేద అద్భుత ఔషధం గా ఉపయోగించే ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

శ్రీ ఫలం,ధాత్రి, ఆమ్ల ఫలం .. పేర్లతో పిలిచే ఉసిరి కాయల లో సి విటమిన్ అధికంగా లభిస్తుంది. అదెంత శాతమంటే .. ప్రకృతిలోని మరే పండు , కాయలో లభించనంత. ఉసిరి ఎండినా దీనిలో విటమిన్ సి శాతం ఏ మాత్రం తగ్గదు. అందుకే నిత్యం పది గ్రాముల ఉసిరి రసం, పొడి తీసుకునే వారికి ఇతర మార్గాల్లో సీ విటమిన్ అవసరం లేదంటారు. రోగులకు పత్యం ఆహారంగా దీనిని ఇస్తారు. ఉసిరిలో మధుర, ఆమ్ల, కటు, తిక్త , కషాయ రసాలుంటాయి. గాలిక్, ఆస్కార్బిక్ ఆమ్లాల కారణంగా పులుపు ఏర్పడుతుంది. 

ఔషధ ఉపయోగాలు..ఉబ్బసం,జలుబు , ఊపిరి తిత్తుల సమస్యలతో బాధపడేవారు రోజుకి అర చెంచా ఉసిరి రసం పొడి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. నోటి పూత, రక్తాల్పత ఉన్నవారు దీనిని గుంట గలగర ఆకు రసం, తేనెతో కలిపి పుచ్చుకోవాలి. 

ముక్కు, నోటి నుంచి రక్తం పడుతుంటే .. రోజుకి రెండు మూడు సార్లు ఒకటి రెండు చెంచాల ఉసిరి రసం స్వీకరిస్తే ఫలితం ఉంటుంది. 

అధిక ఋతు స్రావం,బహిష్టు సక్రమంగా రాని వారు రెండు చెంచాల ఉసిరి పొడిని బియ్యం కడిగిన నీటితో కలిపి తాగుతుంటే మంచిది. ఎముకలు బలహీనంగా ఉన్నవారు పాలు, పండ్ల తో పాటు ఉసిరి పొడి కలిపి తీసుకోవాలి. 

మధుమేహ వ్యాధి స్వల్ప స్థాయిలో ఉన్నవారు ఉసిరి పొడిని నాలుగు చెంచాల కాకర కాయల రసం , అర చెంచా పసుపులో కలిపి పుచ్చుకుంటే సమస్య తగ్గు ముఖం పడుతుంది. 

నెలసరి సక్రమంగా రావాలంటే అరటి ఆకు రసం , అరటి పూల కషాయంలో ఉసిరి పొడిని కలిపి తాగితే ఫలితం ఉంటుంది. 

దీర్ఘ కాలికంగా వేధించే రుమాటిక్ నొప్పులు , కీళ్ల వాతము తో బాధ పడే వారు ఇతర ఔషధాలతో పాటు ఉసిరి కాయ చూర్ణం కలిపి స్వీకరిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 

క్యాన్సర్ ప్రారంభ దశలో దీనిని ప్రతి రోజూ తీసుకుంటే శరీరంలో శక్తి పెరిగి జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగవుతుంది.

కడుపులో మంట కు పాలలో ఉసిరి పొడిని కలిపి తీసుకోవడం చక్కటి పరిష్కారం. చూపు తగ్గడం,నరాల బలహీనత వంటి కంటి సమస్యలకు ఉసిరి పోషకంగా సహాయపడుతుంది.

ఉసిరి, వేప పొడిని కలిపి పండ్లు తోమితే నోటి పూత, పళ్ళ తీపి, చిగుళ్ల వాపు తగ్గుతాయి.

జాగ్రత్తలు..

ఉసిరి కాయలను ఎక్కువగా వేడి చేసి తినకూడదు.ఉసిరిని నీడలో ఆర బెడితేనే విటమిన్ సి కోల్పోకుండా ఉంటుంది. 

పచ్చి రసం అధికంగా తీసుకుంటే గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉంది.

ఒక్క చెంచాడు ఉసిరి రసం.. రెండు కిలోల జామ పండ్లు, 18 కిలోల ద్రాక్షలు , మూడు కిలోల మామిడి పండ్లు, 180 కప్పుల ఆవు పాలలో ఉండే .. విటమిన్ సి కు సరిసమానం. 

ప్రతి 100 గ్రాముల పచ్చి ఉసిరిలో తేమ 81.8 గ్రాములు , పీచు 3.4 గ్రాములు , పిండి పదార్థాలు 14 గ్రాములు , పోషకాలు 0.5 గ్రాములు , కొవ్వు 0.1 గ్రా., క్యాల్షియం 15 మి. గ్రా, ఫాస్ఫరస్ 21 మి. గ్రా, ఇనుము 1 గ్రా. విటమిన్ బి 20 మైక్రో గ్రా., విటమిన్ సి 650 నుంచి 900 మి. గ్రా. వరకు ఉంటుంది. 

ముఖం పై మచ్చలు.. ఆయుర్వేద పరిష్కారాలు

చెంపలు,ముక్కు,నుదురు భాగంలో నల్లని,ముదురు గోధుమ రంగులో మచ్చలు .. ఆయుర్వేద పరిష్కారాలు 

హార్మోన్ల అసమతుల్యత, గర్భ నిరోధక సాధనముల వాడకం,రక్తపోటుకు వాడే మందులు, థైరాయిడ్, కాలేయం, ఊపిరితిత్తుల వ్యాధులు వంటివన్నీ ఇలాంటి మచ్చలకు కారణం కావచ్చు. జుట్టుకు కృత్రిమ రంగు వేసుకునే వారికీ ఇలాంటి సమస్య ఎదురు కావచ్చు. ఐతే అతి నీల లోహిత కిరణాల ప్రభావానికి ఈ సమస్య మరింత రెట్టింపు అయ్యే ఆస్కారం ఉంటుంది. అందుకే సమస్య మొదట్లో ఉన్నప్పుడే తగ్గించుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 

చర్మానికి సహజ మెరుపు.. తరచూ మంచి నీరు, పళ్ళ రసాలు,మజ్జిగ తీసుకుంటే పోషకాహార లోపాలు తగ్గుతాయి. చర్మ రంగూ మెరుగవుతుంది. క్యారెట్, బీట్రూట్, టమాటా వంటి రసాలూ, ఆ కూర గాయలు చర్మ రంగును సాధారణ స్థితికి తెస్తాయి. అలాగే దానిమ్మ, ద్రాక్ష, పుచ్చకాయ రసాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మచ్చలు తగ్గుముఖం పడతాయి. క్యాబేజీ రసం కూడా మేనుకు మేలు చేస్తుంది. ఎండు ఫలాలు, బాదం, వాల్ నట్లు, ఎండు ద్రాక్ష వంటి వాటిని తరచూ తీసుకుంటూ ఉండాలి. పాలు, చేపలు , చిక్కుడు గింజలు తింటే హార్మోన్ల పనితీరు మెరుగవుతుంది. ఫలితంగా మచ్చలు తగ్గుతాయి. 

బచ్చలి కూర.. ఆయుర్వేద ఉపయోగాలు..

 కేవలం బచ్చలి కూర తిన్నప్పుడు చర్మం పై దద్దుర్లు , దురద వంటి సమస్యలు రావు. ఐతే బచ్చలి కూర తీసుకున్నప్పుడు ఇతర ఆహార పదార్థాలు ఏం తీసుకుంటున్నారో గమనించాలి. అంతే కాదు కొన్ని కాయ గూరలు, పండ్లు సరిగా కడిగి తీసుకోకపోయినా సమస్య వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 

బచ్చలి కూరలో విటమిన్ ఏసి కాలయం పీచు పదార్థాలు ఉంటాయి. ఆకుల్లోని జిగురు పేగు పూతను దూరం చేస్తుంది. శరీరానికి చలువనిచ్చ మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. పైత్యం ,దగ్గు,శ్లేష్మం వంటి వాటిని తగ్గిస్తుంది. 

ఆకులను నూరి కాలిన గాయాల మీద కట్లు కడితే మంటలు తగ్గుతాయి. తలలో వేడి, తల నొప్పి, నిద్రాల్పత,చిరాకు  ఉన్నపుడు దీని ఆకులను కాసేపు తలమీద పెట్టీ కాసేపు ఉంచితే తలలోని వేడి , అలసట తగ్గి నిద్ర పడుతుంది. 

బచ్చలి ఆకులను బాదం జిగురులో కలిపి చిన్న చిన్న మాత్రలుగా చేసి ప్రతి రోజూ ఒక గ్రాము చొప్పున పుచ్చుకుంటే నోటి నుండి రక్తం రావడం, చిగుళ్ల సమస్యలు తగ్గిపోతాయి.ఐతే బచ్చలి ని అధికంగా తీసుకుంటే శరీరంలో నీరు పేరుకు పోతుంది.అజీర్ణం తలెత్తుతుంది. దీనికి విరుగుడు ఆవాలు,జీలకర్ర ,మజ్జిగ,ఇంగువ.

అలర్జీకి మూడు వారాల పాటు పసుపు రెండు చిటికెలు ,జీలకర్ర మూడు చిటికెలు ,30 ml గోరు వెచ్చని పాలలో కలిపి పుచ్చుకుంటే తగ్గిపోతాయి.


పాతికేళ్లకే కీళ్ల నొప్పులు.. ఆయుర్వేద పరిష్కారాలు

 వయసు పై బడిన వారిలో కీళ్ల నొప్పులు సహజం. కానీ ముప్పైల్లోనే ఈ సమస్య కనిపిస్తుందంటే శరీరానికి సరియైన వ్యాయామం అందక , లావుగా ఉండి ఎక్కువ సమయం పని చేయడం వల్ల కావచ్చు. ఊబకాయం తో బాధపడే వారు వైద్యుల సలహాలు తీసుకోకుండా అదే పనిగా వ్యాయామాలు చేస్తుంటారు. దాంతో నరాలు ఒత్తిడికి లోనై నొప్పి అనిపిస్తాయి. ఇవి సాధారణ సమస్యలుగా పరిగణించవచ్చు. కొన్ని సార్లు, రుమాటిక్, గౌట్ సమస్యల  వల్ల నొప్పి బాధించే ప్రమాదం ఉంటుంది.హార్మోన్ల అసమతుల్యత, టీబీ వల్ల కూడా సమస్య రావచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. 

వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి.. అరటి, అనాస, ఆకు కూరలు,టమాటా, దంపుడు బియ్యం, ఖర్జూరాలు, బాదం తీసుకోవచ్చు. కటిక ఉపవాసాలు చేయకూడదు. రోజుకి 10 నుంచి 12 గ్లాసుల మంచి నీటిని తాగాలి. 

ముద్ద కర్పూరాన్ని పొడి చేసి కొబ్బరి నూనె లో కలిపి కీళ్ళకు రాస్తుంటే ఎముకల మీద ఉన్న నరాలు మెత్తబడి నొప్పి తగ్గి త్వరగా ఉపశమనం కలుగుతుంది. భోజనానంతరం తేనెలో తగినంత శొంఠి పొడి కలిపి తీసుకుంటే నొప్పి నియంత్రణలో ఉంటుంది. 

తిప్ప తీగ వేరును నీళ్లలో ఉంచి ఆ నీటిని వడకట్టి వచ్చిన పొడిని ఆరబెట్టి తేనెతో పాటు అరచెంచా చొప్పున రెండు మూడు వారాలు పుచ్చుకుంటే గుణం ఉంటుంది. వ్యాయామం పరిమితంగా చేయాలి. 

శరీరంలో యూరిక్ ఆమ్లం మాములు స్థితికి వచ్చే వరకు ఆహారపరంగా జాగ్రత్తలు తప్పనిసరి. చిక్కుడు, పుట్ట గొడుగులు, క్యాలీఫ్లవర్, కాఫీ, టీ, మటన్ వంటి వాటికి దూరంగా ఉండాలి . చింత పండు, నిమ్మ జాతి పండ్లు , పాల ఉత్పత్తులను తగ్గించాలి. 

పాలతో చేసిన స్వీట్లు,జున్ను తినకపోవడం మంచిది. పప్పు దినుసులు మితంగా తీసుకోవాలి. పప్పు ఉడికేటప్పుడు వచ్చే తేటను కొన్ని రోజులు తీసుకుంటే యూరిక్ యాసిడ్లు నియంత్రణలో ఉంటాయి. 

17, సెప్టెంబర్ 2026, గురువారం

కుంకుమ పువ్వు.. విశిష్ట ప్రయోజనాలు..

 ఈ భూభాగంలో అత్యంత ఆకర్షణీయమైనది, ఖరీదైనది , అద్భుత ఔషధ గుణాలు కలిగినది కుంకుమ పువ్వు. ఆసేతు హిమాచలమే కాదు, సీమాంతర భూములలోనూ ప్రతిష్టాత్మకంగా వాడే ఖరీదైన మూలిక కుంకుమ పువ్వు. నాటి గ్రీకు సంస్కృతిలోనూ, అరబిక్ ఆచరణలోనూ , వేద కాలపు సంస్కృతిలోనూ ప్రాముఖ్యమైన సౌందర్య పోషణ ద్రవ్యమిది. నాటి రాచరిక కాలపు దర్పణానికి చిహ్నం కుంకుమ పువ్వు. 

రుచికరమైన వంటలలోనూ ,రమ్యమైన సౌందర్య సాధనము గానూ రసాయన ఔషధ ద్రవ్యంగానూ విశిష్టమైన ఈ కుంకుమ పువ్వు తనలో పెరగడం వల్ల మన శిఖరోజ్వల ప్రాంతం కాశ్మీరం అయింది. వేరు దుంప కలిగిన ఈ ఊదా రంగు పుష్పాలు గుత్తులు గుత్తులుగా ఈ కాశ్మీరంలోనే ఎక్కువగా పండుతాయి. 

ఈ పుష్పాలలోని కీల భాగమే కుంకుమ పువ్వు.పారశీక, బాహ్లిక దేశాలలో పండించినా కాశ్మీర కుంకుమ పువ్వే శ్రేష్ఠమైనది అని భావమిశ్రుడు అంటాడు. 

స్త్రీలలో ఇది శ్రోనితా స్థాపకం కనుక కవులు దీన్ని కమ్మ పుప్పొడి లోని మధుర లాలన అన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో , అన్ని వర్గాల ప్రజావళి తమ పిండి వంటలలో , సౌందర్య సాధనాలలో, మందు లలో దీన్ని వాడుతున్నారు. దీని దుంప, పువ్వు, కాండం, పై పొర , వేరు, ఆకులు, అన్ని వివిధ రకాలుగా వాడుతున్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో కుంకుమ పువ్వు ఒక భాగమైంది. 

వంటకాలకు రుచి..ముఖ్యంగా దీని పువ్వులలో కీల భాగం నుండి వచ్చే పరిమళ భరితమైన పుప్పొడిని తరతరాల నుండి ఈ దేశపు ప్రత్యేక వంటలలో వాడుతున్నారు. 

మన పూర్వులే కాదు, మొఘలాయిల అద్భుత మొఘల్ వంటకాలలో ఈ కుంకుమ పువ్వు ను ప్రత్యేకంగా వాడేవారు. చేదుగా, స్నిగ్ధంగా ఉండే ఈ పదార్థం తేనెలా కరిగి మధురమైన పదార్థాలకు, ప్రత్యేకమైన కూరలకు అద్భుతమైన ఆకర్షణ ఇస్తుంది. 

ఇది కలిస్తే పిండి వంటలకు లేత ఆరెంజ్ రంగు లాంటి ఛాయ వస్తుంది.అందుకే మధుర పదార్థాలకు,పానీయాలకు , మాంస వంటకాలకు దీన్ని కొంచెం కలుపుతారు. ఆదికాలం నుంచి ముఖ్యమైన వంటకాలలో ..ముఖ్యంగా భారత దేశపు బిర్యానీలో దీన్ని ప్రత్యేకంగా చేరుస్తారు.

హైదరాబాదీ ప్రత్యేక వంటకమైన పక్కీ బిర్యానీలో ఇది ముఖ్యంగా ఉంటుంది. జోధ్ పూరి లస్సీలో ఇది ముఖ్యంగా కలుపబడే ప్రత్యేక పదార్థం.అందుకే దాన్ని లేసన్స్ లస్సీ అంటారు.

భారతీయ ఆయుర్వేదంలో, అరబిక్ యునాని వైద్యంలో దీన్ని వాడతారు.

దివ్యమైన ఔషధం..

ఆయుర్వేదంలో మోకాళ్ళ నొప్పుల నుండి వంధ్యత్వం అంటే సంతానం లేకపోవడం దాకా ఎన్నో వ్యాధులలో మందుల రూపంగా దీన్ని వాడతారు.

కుంకుమ పువ్వు ఆస్తమా,జలుబు, ముఖం పై మొటిమలు,కడుపులో నొప్పి, మద్య పానం వంటి వాటికి బాగా పనిచేస్తుంది. దీంతో తయారైన క్రీములు ముఖం పై మచ్చలను పోగొట్టడమే కాకుండా ముఖాన్ని కాంతి వంతంగా చేస్తాయి. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం తాగితే ఒంట్లో ఉండిపోయిన నీరు పోతుంది.గర్భాశయ,మూత్రాశయ వ్యాధులలో దీన్ని బాగా వాడతారు.గర్భాశయం వాపులలో, పైనున్న చిన్న గడ్డలలో / ఫైబ్రాయిడ్స్ , దీన్ని తేనెతో కలిపి వాడడం మంచిది.దీన్నుంచి తీసిన నూనె గర్భాశయంపై వచ్చే గడ్డలలో చాలా బాగా ఉపకరిస్తుంది.

రాత్రి వేడి పాలలో పటిక బెల్లం,కుంకుమ పువ్వు వేసి తాగితే పురుషులలో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అది తాగితే స్త్రీలలో అనుభూతి కలుగుతుంది.పిల్లల్లో శరీరం కాంతి వంతంగా మారుతుంది.

ఒక సీసాలో మూడు ఔన్సుల 100 ప్రూఫ్ ఆల్కహాలు తీసుకుని అందులో మూడు చిటికెల కుంకుమ పువ్వు వేసి గట్టిగా మూత పెట్టండి. దాన్ని అలాగే మూడు వారాలు ఉంచండి. తర్వాత చల్లటి పొడి ప్రదేశంలో కొంత సేపు ఉంచి దాన్ని పావు కప్పు ఒక్కసారి తీసుకోండి.మనసులో వేదన,ఆందోళన పోయి చక్కటి ఉత్సాహం వస్తుంది. కానీ ఇది అలవాటుగా మార కూడదు.

ఆయువు వృద్ధికి..

క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలకు ముందే చరక సుశ్రుతాది సంహితలలో దీని గురించి ప్రస్తావన ఉంది.కండర గుండెకు బలాన్నిచ్చే ఈ కుంకుమ పువ్వు లేపం ' సంకోచ ' అని పిలవబడుతుంది. పాయసంలో, చక్కెర పొంగలిలో దీన్ని కలిపి తీసుకుంటే ఆయువు పెరుగుతుంది.

USDA ప్రకారం దీనిలో ఎనర్జీ 15.5% ,కార్బోహైడ్రేట్స్ 50%, ప్రోటీన్స్ 21% ఉన్నాయి.విటమిన్లు 77% , మినరల్స్ 37% ,ముఖ్యంగా విటమిన్ ఎ,ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి ఎక్కువగా ఉన్నాయి.

కుంకుమ పువ్వు తీసుకునేటప్పుడు దాని నియమ బద్ధతను చూడండి.ఇంట్లో ఉన్నప్పుడు గాలి వెళ్ళని గట్టి పాత్రలో భద్ర పరుచుకోండి. రోజూ రాత్రి గోరు వెచ్చని పాలలో రెండు చిటికెల కుంకుమ పువ్వు, పటిక బెల్లం పొడి కలిపి సేవిస్తుంటే గుండె జబ్బుల వారికి మంచిది. గర్భిణీ కాలంలో రోజూ చిటికెడు కుంకుమ పువ్వు,రెండు గులాబీ రేకులు పాలలో వేసి తాగుతుంటే అందమైన బిడ్డలు పుడతారు. ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.

ఈ  భారత భూమిని కీర్తించిన వారు ఈ అద్భుత కుంకుమ పువ్వును అందించిన కాశ్మీరాన్ని శీతాచల శిఖరోజ్వలం అని కీర్తించారు.


Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...