30, అక్టోబర్ 2011, ఆదివారం

డైటింగ్ అంటే ఉపవాసం కాదు..

ఆధునిక సమాజంలో నాజూకుగా ఉండడం కోసం అన్నం మానేసి ,రకరకాల జిమ్స్ లో ఓలలాడుతున్నది యువత. ముఖ్యంగా ఎదుగుతున్న ఆడపిల్లలలో వాళ్ళకి తెలియదు కానీ అన్నం మానేయడం వల్ల కొద్ది బరువు తగ్గి, మళ్లీ తింటే మామూలుగా బరువు పెరుగుతారు. అంతేకాదు డైటింగ్ అంటూ తిండి మానేయడం వల్ల శారీరకంగానే కాక, మానసికంగా కూడా ఎన్నో సమస్యలని తెచ్చుకుంటున్నాము.

అనొరెక్సియా నెర్వోసా అనేది మనం అన్నం తినే ప్రక్రియలో వచ్చే ఒక వ్యాధి. ఈ వ్యాధి ఉన్నవాళ్లలో భోజనానికి ముందు కూర్చుంటే ఒళ్ళు వచ్చేస్తుందని భయం ముందుంటుంది .దాంతో భయం భయంగా అతి తక్కువగా తింటారు. సన్నగా అవుతారు కానీ శరీరంలో శక్తి కోల్పోయి, జీవకణాలకు తగినంత ఆహారసారం అందక నిర్వీర్యమై అనేక ఇతర బాధలకు లోనవుతారు. దీని వల్ల మానసిక  దౌర్బల్యం వచ్చి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

నిరాహారం కూడదు..

మానసిక వ్యాధుల వల్ల వచ్చే మరణాలలో తిండి తినకపోవడం ముఖ్య మూల కారణం. ప్రపంచంలో ఐదు నుండి 20% దాకా మానసిక దౌర్బల్యం కలగడానికి కారణం తిండి తినకపోవడమే..
మనం చేసే పద్ధతిలేని డైటింగ్ వల్ల ముందుగా దెబ్బ తినేది మన ఎముకలు. ఎదిగే వయస్సులో మనం తీసుకునే ఆహార సారం కొంత నిలవ చేయబడి మన ఎముకలు ఎదిగి గట్టిపడడానికి దోహదం చేస్తుంది. అది పెద్దయ్యాక చిరకాలం హాయిగా దృఢంగా జీవించడానికి కారణమవుతుంది. అందుకనే 25 ఏళ్ల లోపు వాళ్లు ఈ భయంతో అన్నం తినడం మానకూడదు.
 మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ,మీరు చేసే ఈ ఉపవాసాల వల్ల నీకు తెలియకుండానే నీ గుండె బలహీనమవుతుంది. పోషకాహార లోపం వల్ల క్రమంగా కండరాలు బలహీనమవుతాయి, ఆ క్రమంలో గుండె కండరాలు కూడా బలహీనమవుతాయి. దానివల్ల గుండె కొంచెం కొంచెం కుంచించుకుపోవడం ప్రారంభమవుతుంది. దానివల్ల రక్తపోటు, పల్స్ తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ శరీరంలో ప్రాణ శక్తి జీవ కణాలు ఉపయోగించుకునే ఆహారసారం ఏదైతే ఉందో దానిని రసం అంటుంది ఆయుర్వేదం.న్యూట్రియెంట్స్ అంటుంది ఆధునిక వైద్యం. ఆ శక్తిని తగ్గనివ్వకండి.
మీరు ..నేను లావుగా ఉన్నాను ,అన్నం తినకుండా డైటింగ్ చేయాలి ..అని ఒకేసారి ఆలోచించకండి. దానివల్ల లావు తగ్గడం కన్నా, శరీరం, మనసు బలహీనపడతాయి. మీ శరీరపు లావణ్య దారుడ్యాలను, సహజమైన ఆకృతిని మార్చేసుకుంటున్నారు. మీరు సన్నబడ్డారని మిమ్మల్ని చూసిన వాళ్ళు అనవచ్చు. అద్దంలో మిమ్మల్ని చూసుకుంటే నీరసపడ్డారని తెలుస్తుంది. ఒళ్ళు పెంచే, బరువు పెరిగే ఆహారం తినడం మానుకోవాలి. అలాంటి పనులు చేయకుండా ఉండాలి. అంతేకానీ డైటింగ్ పేర శరీరాన్ని ,ఆత్మని నీరసపరచకూడదు. పదో ఏట నుంచే ఈ డైటింగ్ చేయడం ప్రారంభిస్తే, మరో పదేళ్లు గడిచేటప్పటికి సన్నగా తయారై కండ లేక, ఎముకలు బలహీనమై కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

అనొరెక్సియా కి కారణాలు..

మన ఇంట్లో వాళ్ళు లావుగా ఉన్నారని, మనం భయపడి తిండి మానేయడం . మోడలింగ్, యాక్టింగ్ చేయాలనే తపనతో అతిగా డైటింగ్ చేయడం. ఎప్పుడూ పరిశుద్ధంగా ఉండాలని ,ఏదో దేవుడి పేరిట కటిక ఉపవాసం ఉండడం. మానసిక నిర్లిప్తత, విడాకులు పుచ్చుకోవడం, కావలసిన వాళ్ళు హఠాత్తుగా దూరం అవ్వడం..
 వంటి పరిస్థితుల వల్ల తిండి సహించక , అన్నం మానేయడం .స్కూల్ కి వెళ్లే పిల్లలు.. చదువు, ట్యూషన్స్, పరీక్షల ఒత్తిడిలో  అన్నం మానేయడం.

దీనిని గుర్తించడం ఎలా..

అధికంగా మీ బరువు తగ్గుతున్నప్పుడు.ఒళ్ళు పెరుగుతుందని అన్నం తినేటప్పుడు భయం వేస్తుంటే, అధిక వ్యాయామం చేస్తూ నీరసపడటం. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నిర్లిప్తంగా ,దూరంగా ఉండడం. ఉత్సాహం లేకుండా ఉండడం .చర్మం పొడిబారి, అధికంగా వెంట్రుకలు ఊడిపోతూ ,గోళ్ళు మార్పు చెందడం. నెలసరి బహిష్టు ఆగిపోవడం. ఎప్పుడూ చలిగా ఉంటూ ఉండటం. కాళ్లు చేతులు లాగుతూ ఉండడం. కాళ్లు, ముఖ్యంగా పాదాలు వాయడం. మనిషిలో ఆకర్షణ తగ్గిపోవడం.
కడుపులో ఆకలి ఉన్న, అన్ని తినాలని కోరిక ఉన్న, ఆహారం తీసుకోవడానికి ఆఇష్టపడుతుంటే దానిని ..అరోచకము.. అంటారు ఆయుర్వేదంలో. ప్రముఖ ఆయుర్వేద శాస్త్రజ్ఞులు ' వాగ్భటులు ' మనస్సంతాపన' వల్ల అన్నం తినకపోవడం వ్యాధిగా పేర్కొన్నారు .అదే మనం తెలియకుండా చేస్తున్న డైటింగ్. ఈ అరుచి వల్ల క్రమంగా జీర్ణ రసాలు మార్పు చెంది ,జీర్ణం కావడానికి కారణమైన జటరాగ్ని మందగించి శరీరం శోషించబడుతుంది. దానివలన నోరు వగరుగా తయారై, పండ్లు పులిసి, దాహం, మంటతో కూడుకుని ..క్రమంగా మనస్సు వ్యాకులత చెంది మోహము ,జడత్వము కలుగుతాయి అంటుంది ఈ జీవశాస్త్రము.

సన్నబడాలంటే..

లావుగా ఉండడం తప్పు కాదు, కాని తగ్గడం చాలా అవసరం. దానికి ఉపవాసం కాదు ఒళ్ళు పెంచే ఆహారం తినకూడదని మనం విశ్వసించాలి.
శరీరపు బరువు సమతుల్యమై ,వ్యక్తి ఆకృతి పాడవకుండా, మనిషి మనసు నీరసించకుండా, ఆత్మస్థైర్యం నిలబడేటట్టు చేసే సహజ ప్రక్రియలను అనుసరించడం మంచిదనే భావన రావాలి.
శరీరపు బరువును పెంచే  తీపి పదార్థాలు, నెయ్యి, పెరుగు మాంసం ,వేపుడు కూరలు,
 నూనె వస్తువులు ముఖ్యంగా వేరుశనగనూనె, దుంప కూరలు ,మినుముతో చేసే పదార్థాలు తినకండి. 
అన్నం తినే ముందు కనీసం నాలుగు గంటలు రాగి చెంబులో నిలువ ఉంచిన నీటిని కొంచెం తాగండి. రోజు ఉదయం పరగడుపున అర గ్లాసు గోరువెచ్చని నీళ్లలో చెంచాన్నర తేనె కలుపుకొని తాగండి. మధ్యాహ్నం నిద్రపోకండి రాత్రి అన్నం తిన్నాక కనీసం వంద అడుగులు నడిచి అప్పుడు పడుకోండి. మజ్జిగ మీ ఒళ్ళు ను పెరగనివ్వదు .రోజుకు కనీసం రెండుసార్లు అయినా మజ్జిగ తాగండి .గంటసేపు నడవడం, బస్కీలు తీయడం, ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేయడం మంచిది. మిరియాలు, అల్లం ,పిప్పలి, ఉసిరికాయ, నిమ్మకాయ, జీలకర్ర ,ధనియాలు, వాము ఇవి మీ ఆహారంలో చారులోనో, కూరలోనో ,పుదీనా పచ్చడిలోనో ఉంచడం మంచిది. అలాగే ఉపవాసాల వల్ల నీరసించి మనసు జడత్వం పొందితే.. జటామాంసి, శంఖపుష్పి, వచ, బ్రాహ్మి వంటి మేధో రసాయనాలు కలిగిన అవలేహ్యం తీసుకోవడం హితకరం. అగ్నితుండ వటి, లశునది వటి, చిత్రవాది వటి, శంఖవటి, హింగ్వాష్టక చూర్ణం వంటివి మీ జీర్ణ క్రియని తిరిగి సమర్థవంతంగా చేస్తాయి. చ్యవనప్రాసలేహ్యము , అశ్వగంధది లేహ్యము, పంచామృత పర్పటీ వంటివి మళ్లీ మీకు శక్తినిస్తాయి. మీ ప్రవర్తనలో మార్పు ,మీ ఆలోచనల్లో మార్పు చాలా అవసరం .అందుకు సమాజ సంభాషణ, వ్యక్తిగత వివరణ, కుటుంబ హితోక్తి వైద్యునిచే /ఫ్యామిలీ డాక్టర్ చే పొందడం అవసరం. అతి బలహీనత వల్ల గుండె వంటి ప్రాణావయవాలను రక్షించుకోవడం కోసం లక్ష్మీ విలాస రసం ,ద్రాక్షారిష్ట, అర్జునా రిష్ట, అమృతారిష్ట వంటివి తీసుకోవడం అవసరం. ఈ జీవితం దేవుడిచ్చిన అపూర్వ వరము .అది మంగళకరమై, మనోజ్ఞమై మనుమడ సాగించడానికి ఈ శరీరము, మనసు నీరసించకూడదు. డైటింగ్ పేరుతో ఉపవాసాలు చేయకండి. హితమైన ,మితమైన సమతుల్య ఆహారంతో, కనీస వ్యాయామంతో సుఖంగా జీవించండి.



గుండె ఆరోగ్యం..వివరాలు..

మన గుండె సుమారుగా మన గుప్పెడంత ఉంటుంది.కానీ మన అనంతమైన ఆశలకు,ఆలోచనలకు అన్నిటికి మించి మన శరీరంలోని సర్వ చైతన్యానికి దాని కదలిక మూలం.
పక్కటెముకలు స్పెరణమ్ అనే గట్టి ఎముకతో ఎదర వెన్నుపూసతో వెనక అతికి నిర్మించ బడ్డ ఒక గట్టి పంజరం లో  రెండు ఊపిరితిత్తుల మధ్య, కొంచెం ఎడమ వైపున కు వంగి కూర్చున్న యోగి మీ గుండె. 
తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆరవ నెల నుండి ప్రారంభించి కడదాకా నిరంతరం నినదించే లబ్ డబ్ ల స్వరంతో సర్వ శరీరపు మూలమూలల తో సందింపబడిన యోగేశ్వరుడు మీ గుండె. 
మనం ఎలా ఉన్నా, మన ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా ,నిరంతరం మనం మెలకువ ఉన్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు కూడా తాను ముకిలిస్తూ ,వికసిస్తూ ఉండే ఈ గుండెలో ఏ మాత్రం మార్పు వచ్చిన ,మన జీవితం అస్తిత్వం కోల్పోతుంది.
మన గుండె స్థూల నిర్మాణం జరిగి కొట్టుకొనడం తల్లి గర్భంలో ఆరవ మాసంలో ప్రారంభమవుతుంది అప్పుడు తల్లి ద్రౌహృది, అంటే రెండు గుండెలు కలది అని అర్థం. ఈ గుండె ఒక్క అవయవం కాదు, దాని నుంచి వచ్చే రక్తనాళాలు ,తన దగ్గరకు వచ్చి చేరిన రక్తనాళాల సముదాయము. దీనిని కార్డియో వ్యాస్క్యులర్ సిస్టం అని అంటారు.
ఇంత చిన్న గుండె మీ శరీరంలోని 600 మిలియన్ల జీవ కణాలకు పోషణ అందిస్తోంది.
60 మైళ్ళ దూరం దాకా  ఈ నాళాల నుండి రక్తం ప్రయాణించడానికి కేవలం 90 సెకండ్ లు పడుతుంది. మీ గుండె తన కదలికలతో ,నిరంతరం పంపే రక్తమే శరీరంలోని అన్ని జీవకణాలకి పోషక పదార్థాన్ని, ప్రాణవాయువు ను అందిస్తుంది. అక్కడ ఉండిపోయిన చెడు పదార్థాన్ని తీసుకొని కాలేయం మూత్రపిండాలు ఊపిరితిత్తుల ద్వారా బయటకు పంపిస్తుంది.

మరి ఈ గుండె ఎలా ఉంటుంది ..ఎలా పని చేస్తుంది అంటే..

ఎర్రని ఆపిల్ పండు చుట్టూ దారాలు కట్టి ఉన్నట్లు ఉంటుంది గుండె. గుండె  కుడి భాగం శరీరం నుండి రక్తాన్ని తీసుకొని లంచ్ కు పంపిస్తుంది. అక్కడ మనం ఊపిరి ద్వారా తీసుకున్న గాలిలో ప్రాణవాయువును రక్తం తనలోకి తీసుకుంటుంది. ఈ  ప్రాణ వాయు సహిత రక్తం అక్కడి నుండి గుండె ఎడమ భాగానికి చేరి అక్కడి నుండి సర్వ శరీరానికి పంపు చేయబడుతుంది ఒకే క్రమంలో గుండె చేత.
గుండె ఇరువైపులా పైన కింద రెండు గదులుంటా యి. పై గదిని ఏట్రియం అంటారు. ఇది శరీరం నుండి చెడు రక్తాన్ని తీసుకుంటుంది. కింది గదిని వెంట్రికల్ అంటారు. మంచి రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు పంపిస్తుంది. మొదట గుండె కుడివైపు గదికి మలిన రక్తం చేరుతుంది. ఆ గది గోడలు ఒక్కసారి దాన్ని నొక్కికింది గది కుడి వెంట్రికల్ కు పంపుతుంది.అది మళ్ళీ బలంగా నొక్కి దాన్ని ఊపిరి తిత్తులకు పంపుతుంది.
ఎడమవైపు పై గది మంచి రక్తాన్ని అంటే ప్రాణ వాయువైన ఆక్సిజన్ ను కలుపుకున్న రక్తాన్ని లంగ్స్ నుండి తీసుకుంటుంది.దాని గోడలు ఆ రక్తాన్ని కింద గది లెఫ్ట్ వెంట్రికల్ లోకి తోస్తుంది. తిరిగి ఈ గది ముకిలించుకుని మంచి రక్తాన్ని శరీరానికి పంపు చేస్తుంది.
మన గుండెకున్న ఈ లెఫ్ట్ వెంట్రికల్ శరీరనికంతటికి రక్తాన్ని పంపు చేస్తుంది.
మొత్తం దీనంతటిని ఒక ఎలక్ట్రికల్ వ్యవస్థ నిర్వర్తిస్తుంది.


మరి గుండె జబ్బు అంటే ఏమిటి..

గుండె జబ్బులు అనేకం ఉండడం వల్ల నిర్వహించడం కష్టము. గుండెకి రక్తప్రసరణ ఆగుతుంది అనుకోండి దానిని హార్ట్ ఎటాక్ అనవచ్చు. అలాగే ఈ గుండె కావాల్సినంత రక్తాన్ని పంపు చేయడంలో విఫలమవుతుంది అప్పుడు దానిని హార్ట్ ఫెయిల్యూర్ అంటాము. వాల్వులు చెడిపోవడం ,గుండె వాయడం ,గుండెకున్న రక్తనాళాలలో చెడు చేరడం వంటి గుండె వ్యాధులు గుండెకు రావచ్చు. గుండె జబ్బులు రావడానికి రెండు రకాల కారణాలున్నాయి.గుండె లోపలి కారణాలు,గుండె బయటి కారణాలు.
గుండె సొంత కారణాలు.. పుట్టుకలో లోపాలు..గుండె కుడి వైపున ఉండడం... గుండె కవాటాలు లోపంగా పుట్టడం.. గుండె పొరలలో లోపాలు.
వివిధ కారణాల వల్ల గుండెకు రక్తాన్ని అందించే కరోనరీ ఆర్టరీలు చెడిపోవడం. గుండెలో కొద్ది భాగం కొంత సేపు కదలడం, ఆగిపోవడం..
బయట కారణాలు.. తగ్గని బ్లడ్ ప్రెషర్, షుగర్ వ్యాధి, అతిగా లావుగా ఉండడం, ఆస్తమా లాంటి తగ్గని ఊపిరి తిత్తుల వ్యాధులు కలిగి ఉండడం.

కాస్త నడిస్తే ఆయాసం రావడం, మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గడం గుండె బలహీనతకు గుర్తు.
కాళ్ళకు నీరు పట్టడం, ఛాతీ బరువుగా ఉండడం,కడుపు ఉబ్బరించినట్లు ఉండడం , పెదవులు నీలంగా మారడం, తల బరువుగా ఉండడం గుండె జబ్బులకు సూచనలు.

మనం ఏం చేయాలి.. 

గుండెను పదిలంగా చూసుకోవాలి. మనం బరువు పెరగకుండా జాగ్రత్త పడితే సగం గుండె జబ్బులను ఆపుకున్నట్లే... విపరీతమైన మత్తు పానీయాలు తాగడం, మితిమీరిన సెక్స్ చేయడం, మితిమీరి కొవ్వు పదార్థాలు తినడం మానేయాలి. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులుంటే జాగ్రత్తగా నయం చేసుకోండి. అది కూడా గుండెకు చేటు చేస్తుంది.. మీకున్న డయాబెటిస్, బీపీ, ఊపిరితిత్తుల జబ్బులను తగ్గించుకోండి.మానసికమైన ఒత్తిడులు లేకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి.మలమూత్ర వేగాలను అదుపు చేసుకునే ప్రయత్నం చేయకండి. కాకర కాయల రసం ఒక ఔన్స్ ప్రతి రోజూ ఉదయం పూట తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది.. పెద్ద ఉసిరికాయ ల రసం ఒక ఔన్స్ ప్రతి ఉదయం తీసుకుంటే గుండె జబ్బుల నుండి ఉపశమనం కలుగుతుంది. ప్రతి ఉదయం పావు గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక చెంచా తేనె కలుపుకొని తాగడం మంచిది. . ద్రాక్ష పళ్ళు, కరక్కాయ పెచ్చులు, పటిక బెల్లం సమాన భాగాలుగా తీసుకుని ముద్దగా నూరి ఉదయం ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర మంచి నీళ్ళతో తీసుకుంటే గుండె ప్రశాంతంగా, పదిలంగా ఉంటుంది. సుగంధిపాలు, శొంఠి, ధనియాలు వీటి కషాయం ప్రతి రోజూ తీసుకుంటుంటే గుండె జబ్బులు ప్రమాద భరితం కాకుండా ఉంటాయి.


28, అక్టోబర్ 2011, శుక్రవారం

అనారోగ్యాలకు మూలం.. మల బద్ధకం..

డాక్టర్ గారు కడుపు బరువుగా ఉంది సరిగ్గా విరేచనం ఐదు రోజులు అయింది. బద్ధకంగా బరువుగా ఉంది ఒళ్ళు ఇది ఒకరిద్దరి సమస్య కాదు ప్రపంచ జనాభాలో ప్రతి రెండో వ్యక్తి తన భాషలో ఇదే చెబుతుంటాడు. మన దేశంలో ఆసేతు హిమాచలం తినే ఆహారం ఏదైనా సమస్య మాత్రం ఇదే. మీకు తెలియదు కానీ ఈ విరేచనం  సరిగా కాకపోవడం మనకు వచ్చే చాలా వ్యాధులకి కారణమవుతుంది. ఇది ఇప్పటి సమస్య కాదు వేదకాల నుంచి రోమన్ సంస్కృతి నుంచి ఇప్పటిదాకా ఉన్న అవస్థ ఇది. 
ఆధునిక ప్రజలు ఈ పరిస్థితిని, ఈ మలబద్ధకాన్ని కాన్స్టిపేషన్ అంటారు.  జీర్ణం తర్వాత మలవిసర్జన సరిగా జరగకపోవడం
 లేదా కష్టంగా జరగడం లేదా పూర్తిగా జరగకపోవడాన్ని మలబద్ధకం అంటారు.
సాధారణంగా జీర్ణం తర్వాత మనం తిన్న ఆహారంలో జీర్ణం కాక మిగిలిపోయిన అవసరం లేని పదార్థాన్ని మలం అంటారు. ఇది రోజుకు ఒకటి రెండు సార్లు బయటకు వెళ్ళిపోతుంది. మలబద్ధకం ఉన్న వాళ్ళలో ఇది అలా
 వెళ్లిపోకుండా ,రెండు నుంచి ఏడు రోజుల వరకు ఉండిపోతుంది .కొంతమందిలో మలం పూర్తిగా వెళ్లకుండా ఉండలు ఉండలుగా కొద్దికొద్దిగా వెళుతూ ఉంటుంది. ఆయుర్వేదం ఈ మలబద్ధకానికి దూషించబడిన వాతం కారణం అంటుంది. వాతం అంటే మన శరీరంలో కదిలే కదిలించే శక్తి.అది మార్పు చెందితే ఈ మలబద్ధకం అనే సమస్య ఏర్పడుతుంది. ఒక్కొక్కప్పుడు మలం గట్టిపడి, ఎండిపోయి వస్తూ ఉంటుంది.అది మన జీర్ణ రసాల సామర్థ్యం తగ్గడం వల్ల వస్తూ ఉంటుంది. ఇది పిత్త దోషము. అలాగే మలం బయటకు వెళ్ళేటప్పుడు కడుపులో నొప్పి రావడం, మలం జిగురుగా అంటుకుంటూ ఉండడం కఫ దోషం. దీంట్లో జిగురు కలిగిన మలపదార్థం మలద్వారాన్ని అడ్డుకోవడం వలన మలబద్ధకం కలుగుతుంది. 
మన బద్ధకం ఎలా వస్తుంది అంటే..
మన జీర్ణాశయం నోటి నుండి ప్రారంభమై గుదం దాకా వివిధ అవయవాలతో ,కొన్ని జీర్ణరసాలతో, కొన్ని నరాల కదలికలతో ఉండే ఒక ఫ్యాక్టరీ లాంటిది. నోటి గుండా మనం తీసుకున్న ఆహారం ఈ ఫ్యాక్టరీలో కదిలి, వివిధ మార్పులకు లోనై ,మన జీవ కణాలు తృప్తి చెందడం కోసం రక్తంలో కలవడానికి తగ్గ సూక్ష్మ పదార్ధంగా మారి చిన్న ప్రేవుల ద్వారా
 రక్తంలోకి చేరడం జరుగుతుంది. మిగిలిన వ్యర్థ పదార్థం పెద్ద ప్రేగుల ద్వారా కదులుతున్నప్పుడు ఆ ప్రేగు గోడలు దానిలోని నీటిని పీల్చేస్తాయి .ఆ మిగిలిన గట్టి పదార్థాన్ని మలం అంటాము. అదే ప్రేగు తన గోడల్ని కదల్చి, దానిని క్రిందికి గుదం దాకా నెడుతుంది. అప్పటికి అది గట్టిపడి ఉంటుంది. 
ఆ నీరు మరీ ఎక్కువగా పీల్చ బడితే అది రాయిలా మారి కిందికి జారదు. దానివల్ల మలం కిందికి రావడానికి చాలా ఆలస్యం అవుతుంది. అతి మలబద్ధకం. అప్పుడు మలం ఎండి ,రాయిలా గట్టిపడి బయటకు రావడం చాలా కష్టం అవుతుంది.

మలబద్ధకానికి కారణాలు ..

అర్థంపర్థం లేని ఆహారపు అలవాట్లు, వేళాపాళా లేకుండా ఆదరాబాదరాగా తినడం, అవసరానికి మించి తినడం. మన ఆహారంలో పీచు పదార్థాలు అంటే తోటకూర కాడలు చిక్కుడు ఆకుకూరలు తక్కువగా తినడం. శరీరానికి తగిన వ్యాయామం కొంచమైనా లేకపోవడం. ఇది ముఖ్యంగా పెద్దవాళ్లు తిని కూర్చోవడం. కొన్ని రకాల మందులు వాడటం, జీవనశైలి మారడం. వేగనిరోధం అంటే వస్తున్నట్లున్నా ఆపుకోవడం. ఏ కారణం చేతనైనా ద్రవం శరీరంలో ఇంకిపోవడం .అలాగే ఈ క్రింది వ్యాధులు కూడా మలబద్ధకం రావడానికి కారణం అవుతాయి. 
పక్షవాతం ,నరాల బలహీనత వంటి వ్యాధులు. తలలో నరాల కేంద్రంలో లోపాలు, కంప వాతం ,వెన్నుపూసకు దెబ్బలు తగలడం, లేదా వాటి వ్యాధులు. ఆహారం వంట పట్టని వ్యాధులు, షుగర్ వ్యాధి, మూత్ర సంబంధిత వ్యాధులు, థైరాయిడ్ వ్యాధులు .శరీరంలో క్యాల్షియం ఎక్కువ కావడం.
మలబద్ధకంలో సహజమని క్రియాత్మకమని రెండు రకాలు ఉన్నాయి. జన్మతః కొద్ది మందిలో నాలుగైదు రోజులకు ఒకసారి అవుతుంది .కారణం తెలియదు. దీనిని సహజమంటారు.కొద్దిమందిలో పెద్దప్రేగులు, గుధ మార్గం అన్ని బాగుంటాయి.కానీ వాటి క్రియా సామర్థ్యం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. దీనిని క్రియాత్మకం అంటారు.

మల బద్ధకం వల్ల కలిగే నష్టాలు ఏమిటంటే..
నోటి పూత, వికారం, వాంతులు,నాలుక తెల్లగా అవ్వడం, బెరడు కట్టినట్లుగా ఉండడం. ముఖ్యంగా కడుపులో గాలి చేరి ,పొట్ట ఉబ్బి ,పైకి తన్ని ,గుండె కింద ,పై కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. గుదం దగ్గర పగులు ,అర్షమొలలు ఏర్పడతాయి. క్రింది భాగంలో చర్మం ముడతలు పడుతుంది. చాలాకాలం బాధపడితే మిగిలిన ఈ మలం విషం గా మారుతుంది, కీళ్ల నొప్పులు, కాళ్లు లాగటం వంటివి వస్తాయి. గుండెల్లో మంట ,ఎసిడిటీ, త్రేన్పులు. నిద్ర పట్టకపోవడం ,ఆదుర్దా, మానసిక గ్లాని. చర్మం సహజ కాంతిని కోల్పోవడం వంటి నష్టాలు కలుగుతాయి.

మలబద్ధకాన్ని నివారించే మార్గాలు..

అనాస, మామిడి ,సీతాఫలాలు మంచి విరేచన కారులు. మారేడు కాయలు పండిన తర్వాత గుజ్జు చక్కటి సహజ మలబద్దక నివారిణి. కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ కలిపిన త్రిఫల చూర్ణాన్ని రెండు చెంచాల చొప్పున రోజూ రాత్రి పరుండే ముందు వేడి నీళ్ళతో తీసుకుంటే సుఖ విరోచనం అవుతుంది.
బాగా ముగ్గిన అరటి పండును తొక్కతో సహా తీసుకుంటే ఎటువంటి మలబద్ధకమైన తగ్గుతుంది.ఒక స్పూన్ కరివేపాకు పొడితో ,తేనె కలిపి తీసుకున్నచో మలబద్ధకం పోతుంది. ఒక చెంచా ఆముదాన్ని వేడి చేసి రాత్రిపూట తీసుకుంటే ఎలాంటి మలబద్ధకమైన తగ్గిపోతుంది. కొందరు అన్నట్లు ఇది ఏ విధమైన చెడును కలుగచేయదు. మలబద్ధకానికి మరో మందు స్పినాక్ పచ్చిరసం. రాత్రి పరుండే ముందు నిల్వ ఉంచిన రాగి చెంబులోని నీళ్లు తాగి ఉదయాన్నే మళ్ళీ త్రాగితే మంచిది. ఎండు ద్రాక్షను రాత్రి నీటిలో నానబెట్టి, ఉదయాన్నే గింజలు తీసివేసి పరగడుపున ఆ నీటితో సహా తీసుకోవాలి.జామ, బొప్పాయి వంటి పళ్ళు పీచు పదార్థాన్ని కలిగి ఉండడం వల్ల మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. నువ్వులు, బెల్లము కలిపిన చిమ్మిలి ని ,నిమ్మకాయ అంత సైజులో ప్రతిరోజు రాత్రి పరుండే ముందు ఒక వారం తింటూ ఉంటే మలబద్ధకం పూర్తిగా తగ్గిపోతుంది .ప్రతిరోజు ఉలవల కషాయం కానీ ఉలవల్ల చూర్ణం కానీ తీసుకుంటే సుఖ విరోచనం అవుతుంది. గ్లాసు బార్లీ నీళ్లలో, రెండు చెంచాల తేనె కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటే సుఖ విరేచనమవుతుంది. ఉదయం సాయంత్రం రెండు పూటలా రెండు నిమ్మకాయల రసాన్ని, ఒక అర గ్లాసు నీళ్లలో కలుపుకొని తాగితే సుఖ విరోచనం అవుతుంది .

మన కొన్ని అలవాట్లు మారాలి ..

మసాలాలు ,వేపుళ్ళు ,ఫాస్ట్ ఫుడ్స్, డబ్బాలలో నిలువ ఉంచిన ఆహారం ,ఊరగాయలు మానేయాలి. కాఫీ, టీ, ధూమపానం, మద్యపానం తగ్గించాలి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని తాగాలి .రోజు తాజా పండ్లు లేదా పండ్ల రసాలు తాగాలి. నియమిత సమయానికి భోజనం, మలవిసర్జన ,నిద్రపోవడం, ఆదుర్దా, కంగారు తగ్గించుకోవడం, జాగ్రత్తగా పనులను ముందే ప్లాన్ చేసుకోవడం చేయాలి. ప్రతిరోజు ఉదయం చన్నీటి స్నానం, ఉదయం ఒకటి రెండు గ్లాసుల నీరు తాగడం ఇలాంటి అలవాట్లను పాటించాలి.

గర్భాశయ నీటి బుడగలు.. ఆయుర్వేద పరిష్కారాలు

PCOS వ్యాధి..గర్భాశయంలో నీటి బుడగలు ఉండడం.. ఆయుర్వేద పరిష్కారాలు..

చాలామంది బరువు పెరుగుతున్నానని ,ప్రతి చిన్న దానికి చికాకు పడుతున్నానని ,చర్మం జడ్డుగా ఉంటుందని బాధపడుతుంటారు. అది టీనేజర్స్ కి కాదు ఆ వయసుకు అటు ఇటు ఉన్న వారిలోనూ ఇలాగే ఉంటుంది. వాళ్లకి పిల్లలు ఉండరు, గర్భం రావడం లేదని బాధపడతారు. వాళ్ళు వెంటనే చూపించుకుంటే తెలుస్తుంది, వాళ్ళు కడుపులో నీటి బుడగల లాంటి కనితులు ఉన్నాయని.. వాటిని pcos అంటారు. ఈమధ్య జరిగిన పరిశోధనలలో 22 నుంచి 33 శాతం వరకు మహిళలు దీనితో బాధపడుతున్నా రని , మరికొంతమంది మహిళలు దీంతో పాటు వచ్చే మరికొన్ని వ్యాధుల వల్ల బాధపడుతున్నారు.

మీకు తెలుసా శిశువు జననంతో స్త్రీకి మాతృత్వం జనిస్తుంది. మహిళ జీవితానికి ఎన్ని అనుకున్నా మాతృత్వం ధ్యేయం. దీనికి ఆరోగ్యవంతమైన జననేంద్రియాల స్థితి ముఖ్య కారణం. హార్మోన్ల స్థితి, వారిలో ఆరోగ్యకరమైన బీజం, వాలం, వాళ్ల మంచి కలయిక, ప్రవేశించే ఆత్మ.. ఇవి గర్భానికి కారణమవుతాయి.
ఈ గర్భధారణ స్థితికి సామర్థ్యానికి గర్భాశయంలోని లేదా అండాశయంలోని నీటి బుడగలు పెద్ద అడ్డంకి. ఈ పిల్లలు కలగలేని స్థితికి గర్భధారణ కాలమైన 12 45 సంవత్సరాల మధ్య ఈ నీటి బుడగలే ప్రధాన అవరోధం చాలామంది ఈ నీటి బుడగలు ఉన్నాయన్న నిజాన్ని గ్రహించక ముందు తమ నెలసరి రుతుస్రావంలో హెచ్చు తగ్గులు ఉన్నాయని అనుకుంటారే కానీ పాము గర్భం ధరించలేక పోవడానికి ఇదే కారణమని ఊహించరు. క్రమంగా నెలసరి సరిగ్గా రాకుండా బరువు పెరుగుతూ ఉంటే తమ గర్భాశయంలో నీటి బుడగలు ఉన్నాయేమోనని చూపించుకోవడం అవసరం.

అండాశయాలు స్త్రీ కడుపులో రెండువైపులా ఉంటాయి ఇరువైపులా రెండు ఉంటాయి. ఇవి స్త్రీ గర్భధారణకి అవసరమైన స్త్రీ బీజాన్ని నెలకి ఒకసారి ఒకటి చొప్పున విడుదల చేస్తుంది.దాన్ని ఓవ్యులేషన్ అంటారు. ఇది ఈ నీటి బుడగలు ఉండడం వల్ల జరగదు.అందువల్ల గర్భం ఏర్పడదు. దీనికి కారణాన్ని పరిశోధించిన శాస్త్రజ్ఞులు హార్మోన్ ఇన్సులిన్ నియంత్రణ వల్ల ఈ వ్యాధి కలుగుతుందని నిర్ధారించారు .
పెరుగుతున్న ఇన్సులిన్ స్త్రీ జననేంద్రియ ఉత్పాదక హార్మోన్లను హెచ్చుతగ్గులు చేయడం వల్ల ఈ స్థితి ఏర్పడుతుంది. సాధారణంగా LH to FSH నిష్పత్తి 1:1 లో ఉండాలి. పి సి ఓ ఎస్ లో 2:1 కి మారి ఉపద్రవాలను కలుగజేస్తుంది.
అలాగే ఆ వయస్సులో ఉండకూడని మానసిక అశాంతిని, మెదడుపై ఒత్తిడిని ,తద్వారా శరీరంలోని హార్మోన్ల స్థితిని పాడుచేస్తాయి. 
ఈ పీసీఓఎస్ వంశపారంపర్యంగా కూడా ఉండవచ్చు. దీనికి కారణాలు స్థూలంగా.. లావుగా ఉండడం ,ఇన్సులిన్ నియంత్రణ ఎక్కువగా ఉండడం. మరో రకంగా చెప్పాలంటే పెరుగుతున్న ఇన్సులిన్ విలువలు స్త్రీ జనన కారణ గ్రంధులైన పిట్యూటరీ ,ఓవరీ గ్రంధులపై ప్రభావం చూపడం వల్ల ఈ నీటి బుడగలు ఏర్పడి వాటివల్లే స్త్రీ బీజ ఉత్పత్తి కుంటుపడి రుతుక్రమం తప్పి గర్భధారణని రానీయదు.

ఈ నీటి బుడగలు అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో కనబడతాయి నిజానికి ఇవి నీటి బుడగలు కూడా కావు. బయట ఉండిపోయిన పూర్తిగా తయారు కాని స్త్రీ బీజపు బుడగలు. స్కానింగ్ లో ఇవి చిన్న చిన్నవిగా చాలా కనిపించవచ్చు.
ఆయుర్వేద శాస్త్రం దీనిని ఒక యోని వ్యాపత్ గా గుర్తించింది. అంటే అర్థం ఏమిటంటే స్త్రీ జననేంద్రియ వికృతి అని. స్త్రీలో జడత్వం, విశ్రుంకలత్వం, ఋతుకాలంలో జాగ్రత్తగా ఉండకపోవడం, తల్లి నుండి వచ్చిన కొన్ని లక్షణాలు వీటికి కారణాలు.

ఈ వ్యాధిని ఆయుర్వేదంతో ఇలా తగ్గించవచ్చు..

శరీరంలోని మూడు ప్రధాన శక్తులు/ త్రిదోషాలు, రస, రక్త ధాతువులు. రుతు రక్తాన్ని తీసుకెళ్లే శ్రోతస్సులు. శరీరంలో దహించే శక్తి అగ్ని వంటిది వ్యాధిలో చెడి ఈ వంధ్యత్వానికి కారణం అవుతాయి. ముఖ్యంగా రోజురోజుకీ బరువు పెరగడం ,లావుగా ఉండటం, ఒంట్లో ఇన్సులిన్ స్థితి పెరగడం ,చర్మం రంగు మారడం, కోరిక తక్కువగా ఉండడం ,గర్భం ధరించలేకపోవడం, చర్మం జడ్డుగా ఉండడం, తలలో జుట్టుపల్చబడడం వంటి లక్షణాలు ఉంటాయి. దీనివల్ల తర్వాత షుగర్ వ్యాధి, బిపి ,గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్ వంటివి కూడా రావచ్చు . దీనిని చాలా కాలం చూసిన తర్వాత స్కానింగ్ కు వెళ్లడం వల్ల తెలుసుకుంటారు. చికిత్స ఆధునికంగా ఆశాజనకంగా లేకపోవచ్చు 
ఆయుర్వేదంలో జీర్ణశక్తిని, ధాతు శక్తిని పెంచి, స్త్రీ జననేంద్రియాలను నియంత్రించే అపాన వాత శక్తి సమపరచడం వల్ల ఈ వ్యాధిని తగ్గించవచ్చు .
పంచకోల చూర్ణం, చిత్రకాది వటి వంటి వాటి వల్ల జీర్ణాశయ అగ్ని పెరుగుతుంది .మెదడును శిరోవిరేచనం ద్వారా అను తైలం ఏడు రోజులు, క్షీర బల తైలం 101 ఆకృతులతో ఏడు రోజులు నస్య కర్మ చేయించాలి. అరి పతికర చూర్ణంతో ఒకరోజు విరేచనం చేయించాలి.

పుష్ప ,ధాన్య, రస వంటి మందుల వల్ల స్త్రీ బీజ ఉత్పత్తి సమస్థితికి చేరుతుంది. వరుణాధికషాయం మరియు సహచరాధికషాయం వంటివి కూడా వ్యాధి నివారణకు ఉపకరిస్తాయి. అశోకారిష్ట ఫలగృతాదులు ,వాంఛకార గుగ్గులు వంటి ఆయుర్వేద మందులు కూడా ఉపకరిస్తాయి... బాలా తైలంతో కానీ ఆయన తైలంతో కానీ ఉత్తరవస్తి చేయించుకోవడం మంచిది.
 నువ్వుల పొడి ప్రతిరోజు తీసుకోవడం, రజ ప్రవర్తికా వటి వంటివి వాడటం వల్ల రుతుక్రమం సరిగ్గా ఉండి పరిస్థితి చక్క బడుతుంది. తీపి పదార్థాలు తినకుండా ఉండటం, నూనె, నెయ్యి వంటివి తక్కువగా వాడటం, వేరుశెనగ వాడకుండా ఉండడం చాలా మంచిది.



ఆరోగ్యానికి.. ఆయుర్వేద ఆహారం.

ఆరోగ్యానికి ఆయుర్వేద ఆహారం

మనం తినే ఆహారం ఎన్ని రకాలు.. ఆ ఆహారాన్ని ఎలా తీసుకోవాలి..

ఆహారం ఆరు విధాలు.. ఒకటి).. పేయము అనగా తాగుటకు వీలుగా ఉండునది పాలు..etc..రెండు) .చోస్యము.. పీల్చదగినది ..చెరకు, ములక్కాడ లాంటివి. మూడు.) లేహ్యము.. నాకి భుజించ దగ్గది.. పులుసు, మజ్జిగ లాంటిది. నాలుగు.) భోజ్యము.. భుజింపదగినది ..అన్నం మొదలగునవి. ఐదు.) భక్ష్యము. తినదగినవి.. లడ్డు, జిలేబి వంటివి. ఆరు ) .సవ్యమ.
 నమలదగినది ..చెక్కిలంకాడలు వంటివి.

మిక్కిలి ఎక్కువ కానీ ,మరీ తక్కువ కానీ, అకాలంలో కానీ ఆహారం తీసుకుంటే విష మాశక మంటారు. కడుపులో మూడు భాగాలు ఆహారం ,మిగతా భాగం నీరు లాంటి ద్రవ పదార్థాలు ,కొంచెం ఖాళీ ఉంచి తినడం మంచిది.



లేచినప్పటి నుండి అర్ధరాత్రి దాకా పరిగెత్తే యాంత్రిక జీవనంలో చుట్టూ పొగ ధూళి రసాయనాలతో కలుషితమైన వాతావరణం లో సగటు మనిషి నుండి మేధావి దాకా మంచి ఆహారాన్ని గుర్తించడం కష్టమవుతున్నది.. రోడ్డుమీద ఫాస్ట్ ఫుడ్ వంటి వాటి వల్ల పొట్ట పెరగడం ,మలి వయస్సులోనే షుగర్ వ్యాధి వంటివి రావటం మినహా మంచి జరగడం లేదు. ఒక ప్రాంతాన్ని బట్టి, ఒక కాలాన్ని బట్టి కాకుండా విశ్వసనీయతతో ప్రకృతిని, పురుష తత్వాన్ని ఆకలింపు చేసుకుని ప్రకృతికి సమీపంగా అనుసంధానం చేసుకొని ఆహారాన్ని ,ఆహార నిర్మాణాన్ని ,ఆహార నియమాలని ప్రతిపాదించింది ఆయుర్వేద శాస్త్రం.. అందుకే మనిషి ఎక్కడున్నా ముంబైలో ఉన్న, బెంగళూరులో ఉన్న ,న్యూఢిల్లీలో ఉన్న ,న్యూయార్క్ లో ఉన్న ,అమ్మమ్మ దగ్గర ఉన్న ,ఒంటరిగా ఉన్నా మన శరీరం ప్రకృతిలో నుంచి వచ్చిన ,వండిన, సమగ్రమైన, సమతుల్యమైనఆహారాన్ని తీసుకోవాలి.

అన్నం ప్రాణమయం ..

 అమ్మ చేసిన సున్ని ఉండలో వీర్య బలవం ఉంది. నువ్వుల ఉండలు లో స్త్రీ హార్మోన్లను క్రమపరిచే శక్తి ఉంది. పాయసంలో తృప్తినిచ్చే గుణం ఉంది. పాలు, తేనె ,నెయ్యి మధుర పదార్థాలే కాదు ,నిత్య జీవ రసాయనాలు అంటే సప్త ధాతువులకు శక్తినిచ్చేవి. అందుకే ప్రపంచ సమగ్ర ఆహార చిత్రంలో ఆయుర్వేద ఆహారం ప్రాముఖ్యత సంతరించుకుంది .
అరటిపండు ,దోసకాయ తప్ప దానిమ్మ, చెరకు వంటివి ఆహారం ముందు తినాలి. నేరేడు, కొబ్బరి ,మామిడిపండు పనస, అరటి పండు ఉదయమే తీసుకోకూడదు. తీపి పిండి వంటలు, అటుకులతో చేసినవి భోజనానంతరమే తినాలి. ఇది పథ్యం అంటే..
 ఆరు రుచులు ఉండాలి.. ఆహారం కూడా మందు లాంటిదే. దానికి రసం అంటే రుచి ,వీర్యం అంటే బలం వంటివి ఉంటాయి. ఈ రుచులు ఆరు .తీపి ,కారం ,చేదు ,ఉప్పు వగరు, పులుపు. మన ఆహారంలో ఈ ఆరు రుచులు ఉండాలి.తీపి పదార్థాలు మనలో ఓజో శక్తి నీ పెంచుతాయి. కారం,పులుపు జీర్ణ శక్తిని ,చేదు జ్ఞాపకశక్తిని రక్త శోధనని కలుగచేస్తుంది, వగరు కఠిన పదార్థాలను ముక్కలు చేస్తుంది, ఉప్పు ఆహారానికి రుచిని ఇస్తుంది. గట్టిగా ఉండే రొట్టెలు ,చపాతీలు వంటివి అన్నీ కూరలతో ముందుగా తినాలి. అన్నం తర్వాత తినాలి .పల్చని మధుర పదార్థాలు అన్నం ముందు తినాలి. కారం, పులుపు పదార్థాలు మధ్యలో తినాలి. వగరు ,చేదు పదార్థాలు చివరన తిని మజ్జిగ ,పళ్ళ రసాలు ఆఖరున తినాలి .

అన్ని కూరలు వేసిన పులుసుని అమెరికాలో రిచ్ వెజిటబుల్ సూప్ అంటారు. దీన్ని వారానికి ఒక్కసారైనా తీసుకోవడం మంచిది.
మిరియాలు, ధనియాలు వేసిన చారుని ప్రతిరోజు తీసుకోవడం హితకరం.
అన్ని ఆహార పదార్థాలు కలిపి తీసుకోకూడదు, అది హాని చేస్తుంది. ఇటువంటి ఆహార పదార్థాన్ని విరుద్ధ ఆహారం అంటారు. ఉదాహరణకు పెరుగు, నెయ్యి కలిపి తీసుకోకూడదు .అరటి పండు, పాలు ఒకేసారి తీసుకోకూడదు. వేడి కాఫీ, టీలలో తేనె కలిపి తీసుకోకూడదు .వెన్నతో చేపని వండుకోకూడదు.
ఋతువులను అనుసరించి పండే పళ్ళను తీసుకోవడం హితకరం .అలా కాకుండా తీసుకుంటే ఆమం తయారవుతుంది. ఆమం అంటే జీర్ణం కాక నిలువ ఉండిపోయిన విష పదార్థం అన్నమాట. అదే మోకాళ్ళ నొప్పుల వంటి వ్యాధులకు కారణం అవుతుంది.
ఉదాహరణకి వేసవికాలంలో జీర్ణశక్తి మనలో తక్కువగా ఉంటుంది. అందువల్ల తేలికపాటి ఆహారం రెండు మూడు సార్లు తీసుకోవడం మంచిది. రాత్రి పెరుగు వేసుకోకూడదు. ఎందుకంటే అది పూర్తిగా జీర్ణం కాక శ్రోతస్సులను
 మూసేస్తుంది.

పిల్లలు ఎదిగే వయస్సు కనుక శరీరం ,మనసు ఎదిగే ఆహారాన్ని ఇవ్వాలి. యవ్వనంలో ఉండే వాళ్ళకి మెటబాలిజం , కెటబాలిజం సమానంగా ఉంటాయి కనుక  శక్తిని ఇచ్చే ప్రోటీన్లు ,విటమిన్లు ఉన్న ఆహారాన్ని ఇవ్వాల.

ఎవరు ఏం తినాలి అంటే..

 పెద్దవాళ్లలో కెటబాలిజం ఎక్కువగా ఉంటుంది .కావున తేలికగా జీర్ణం అయ్యే ఆహారం పాలు, తేనె ,నీళ్లు , బార్లీ నీళ్లు, మజ్జిగ లాంటివి ఎక్కువగా ఇవ్వాలి. గర్భవతులు తేలికైన బలమైన బలం కలిగించే ఆహారం మాసానుసారం తీసుకోవాలి. నవ మాసాలకు తగిన ఆహారం ఆయుర్వేదంలో సూచించబడింది.

మొదటి మూడు మాసాలలో.. విటమిన్లు కలిగిన పోషకాహారం ఇవ్వాలి. మద్యం ,మాంసం ,చేప వంటివి ఇవ్వకూడదు. ఆరు నెలల గర్భకాలంలో ఎముకలు, చర్మం, మేధస్సు పెంచే ఆహారం ఇవ్వాలి. సాత్వికాహారం అంటే పూర్తి శాకాహారం.. రాజసాహారమంటే మాంసాహారం , ఎక్కువ కారం మసాలా ఉన్నది. తామసాహారమంటే నిలువ ఉన్నది, చల్లారినవి. వీటిని బట్టి కూడా మన ప్రవర్తన మారుతూ ఉంటుంది. 
 అన్నిటికీ మించి ఎప్పుడు ముందు తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండా మళ్ళీ ఆహారం తీసుకోకూడదు. అన్నం మొదటి ముద్దలో పాత ఉసిరికాయ పచ్చడి కలుపుకొని తినడం హితకరం .ధనియాల పొడి తో మలి ముద్ద తినడం మరీ మంచిది. పిల్లలకి రాత్రి పరుండే ముందు పటిక బెల్లం పొడి కలిపిన పాలు ఇవ్వడం
అమృతం ఇవ్వడం లాంటిది. మీరు నిద్రించే సమయానికి మీరు తీసుకున్న ఆహారం ..అన్నం కొంచెం జీర్ణం అవడం చాలా మంచిది. అన్నం తిన్న వెంటనే సంసార సుఖం పొందకండి .తిన్న వెంటనే కనీసం 10 అడుగులు నడవండి.

దానిమ్మకాయను కానీ పండును గాని తొక్కతో సహా రసం తీసి నాలుగు చెంచాల చొప్పున 6 గంటలకు ఒకసారి తాగిస్తే జిగట విరేచనాలు తగ్గుతాయి. 
బియ్యపు కడుగులో తేనె కలిపి తాగిస్తే నీళ్ల విరోచనాలు తగ్గుతాయి.




27, అక్టోబర్ 2011, గురువారం

ఆరోగ్యం విలువ.. చాణక్య నీతి శాస్త్రం

ఆరోగ్యము యొక్క విలువ.. చాణక్య నీతి శాస్త్రం

 సర్వమేవ పరిత్యజ్య  శరీరమను పలయేత్ 
 శరీరస్య ప్రాణస్థస్య సర్వమేవా వినశ్యతి..

 అన్నిపనులనూ వదిలేసి ముందుగా శరీరాన్ని కాపాడుకోవాలి.  చతుర్విధ పురుషార్ధాలు అయిన ధర్మ అర్థ కామ మోక్షాలు సాధించాలంటే  ముందు ఆరోగ్యం కావాలి. శరీరం నశిస్తే దానిని ఆశ్రయించి ఉండేవి అన్నీ నశిస్తాయి..

-- చాణక్య నీతి శాస్త్రం..- 

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...