28, అక్టోబర్ 2011, శుక్రవారం

అనారోగ్యాలకు మూలం.. మల బద్ధకం..

డాక్టర్ గారు కడుపు బరువుగా ఉంది సరిగ్గా విరేచనం ఐదు రోజులు అయింది. బద్ధకంగా బరువుగా ఉంది ఒళ్ళు ఇది ఒకరిద్దరి సమస్య కాదు ప్రపంచ జనాభాలో ప్రతి రెండో వ్యక్తి తన భాషలో ఇదే చెబుతుంటాడు. మన దేశంలో ఆసేతు హిమాచలం తినే ఆహారం ఏదైనా సమస్య మాత్రం ఇదే. మీకు తెలియదు కానీ ఈ విరేచనం  సరిగా కాకపోవడం మనకు వచ్చే చాలా వ్యాధులకి కారణమవుతుంది. ఇది ఇప్పటి సమస్య కాదు వేదకాల నుంచి రోమన్ సంస్కృతి నుంచి ఇప్పటిదాకా ఉన్న అవస్థ ఇది. 
ఆధునిక ప్రజలు ఈ పరిస్థితిని, ఈ మలబద్ధకాన్ని కాన్స్టిపేషన్ అంటారు.  జీర్ణం తర్వాత మలవిసర్జన సరిగా జరగకపోవడం
 లేదా కష్టంగా జరగడం లేదా పూర్తిగా జరగకపోవడాన్ని మలబద్ధకం అంటారు.
సాధారణంగా జీర్ణం తర్వాత మనం తిన్న ఆహారంలో జీర్ణం కాక మిగిలిపోయిన అవసరం లేని పదార్థాన్ని మలం అంటారు. ఇది రోజుకు ఒకటి రెండు సార్లు బయటకు వెళ్ళిపోతుంది. మలబద్ధకం ఉన్న వాళ్ళలో ఇది అలా
 వెళ్లిపోకుండా ,రెండు నుంచి ఏడు రోజుల వరకు ఉండిపోతుంది .కొంతమందిలో మలం పూర్తిగా వెళ్లకుండా ఉండలు ఉండలుగా కొద్దికొద్దిగా వెళుతూ ఉంటుంది. ఆయుర్వేదం ఈ మలబద్ధకానికి దూషించబడిన వాతం కారణం అంటుంది. వాతం అంటే మన శరీరంలో కదిలే కదిలించే శక్తి.అది మార్పు చెందితే ఈ మలబద్ధకం అనే సమస్య ఏర్పడుతుంది. ఒక్కొక్కప్పుడు మలం గట్టిపడి, ఎండిపోయి వస్తూ ఉంటుంది.అది మన జీర్ణ రసాల సామర్థ్యం తగ్గడం వల్ల వస్తూ ఉంటుంది. ఇది పిత్త దోషము. అలాగే మలం బయటకు వెళ్ళేటప్పుడు కడుపులో నొప్పి రావడం, మలం జిగురుగా అంటుకుంటూ ఉండడం కఫ దోషం. దీంట్లో జిగురు కలిగిన మలపదార్థం మలద్వారాన్ని అడ్డుకోవడం వలన మలబద్ధకం కలుగుతుంది. 
మన బద్ధకం ఎలా వస్తుంది అంటే..
మన జీర్ణాశయం నోటి నుండి ప్రారంభమై గుదం దాకా వివిధ అవయవాలతో ,కొన్ని జీర్ణరసాలతో, కొన్ని నరాల కదలికలతో ఉండే ఒక ఫ్యాక్టరీ లాంటిది. నోటి గుండా మనం తీసుకున్న ఆహారం ఈ ఫ్యాక్టరీలో కదిలి, వివిధ మార్పులకు లోనై ,మన జీవ కణాలు తృప్తి చెందడం కోసం రక్తంలో కలవడానికి తగ్గ సూక్ష్మ పదార్ధంగా మారి చిన్న ప్రేవుల ద్వారా
 రక్తంలోకి చేరడం జరుగుతుంది. మిగిలిన వ్యర్థ పదార్థం పెద్ద ప్రేగుల ద్వారా కదులుతున్నప్పుడు ఆ ప్రేగు గోడలు దానిలోని నీటిని పీల్చేస్తాయి .ఆ మిగిలిన గట్టి పదార్థాన్ని మలం అంటాము. అదే ప్రేగు తన గోడల్ని కదల్చి, దానిని క్రిందికి గుదం దాకా నెడుతుంది. అప్పటికి అది గట్టిపడి ఉంటుంది. 
ఆ నీరు మరీ ఎక్కువగా పీల్చ బడితే అది రాయిలా మారి కిందికి జారదు. దానివల్ల మలం కిందికి రావడానికి చాలా ఆలస్యం అవుతుంది. అతి మలబద్ధకం. అప్పుడు మలం ఎండి ,రాయిలా గట్టిపడి బయటకు రావడం చాలా కష్టం అవుతుంది.

మలబద్ధకానికి కారణాలు ..

అర్థంపర్థం లేని ఆహారపు అలవాట్లు, వేళాపాళా లేకుండా ఆదరాబాదరాగా తినడం, అవసరానికి మించి తినడం. మన ఆహారంలో పీచు పదార్థాలు అంటే తోటకూర కాడలు చిక్కుడు ఆకుకూరలు తక్కువగా తినడం. శరీరానికి తగిన వ్యాయామం కొంచమైనా లేకపోవడం. ఇది ముఖ్యంగా పెద్దవాళ్లు తిని కూర్చోవడం. కొన్ని రకాల మందులు వాడటం, జీవనశైలి మారడం. వేగనిరోధం అంటే వస్తున్నట్లున్నా ఆపుకోవడం. ఏ కారణం చేతనైనా ద్రవం శరీరంలో ఇంకిపోవడం .అలాగే ఈ క్రింది వ్యాధులు కూడా మలబద్ధకం రావడానికి కారణం అవుతాయి. 
పక్షవాతం ,నరాల బలహీనత వంటి వ్యాధులు. తలలో నరాల కేంద్రంలో లోపాలు, కంప వాతం ,వెన్నుపూసకు దెబ్బలు తగలడం, లేదా వాటి వ్యాధులు. ఆహారం వంట పట్టని వ్యాధులు, షుగర్ వ్యాధి, మూత్ర సంబంధిత వ్యాధులు, థైరాయిడ్ వ్యాధులు .శరీరంలో క్యాల్షియం ఎక్కువ కావడం.
మలబద్ధకంలో సహజమని క్రియాత్మకమని రెండు రకాలు ఉన్నాయి. జన్మతః కొద్ది మందిలో నాలుగైదు రోజులకు ఒకసారి అవుతుంది .కారణం తెలియదు. దీనిని సహజమంటారు.కొద్దిమందిలో పెద్దప్రేగులు, గుధ మార్గం అన్ని బాగుంటాయి.కానీ వాటి క్రియా సామర్థ్యం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. దీనిని క్రియాత్మకం అంటారు.

మల బద్ధకం వల్ల కలిగే నష్టాలు ఏమిటంటే..
నోటి పూత, వికారం, వాంతులు,నాలుక తెల్లగా అవ్వడం, బెరడు కట్టినట్లుగా ఉండడం. ముఖ్యంగా కడుపులో గాలి చేరి ,పొట్ట ఉబ్బి ,పైకి తన్ని ,గుండె కింద ,పై కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. గుదం దగ్గర పగులు ,అర్షమొలలు ఏర్పడతాయి. క్రింది భాగంలో చర్మం ముడతలు పడుతుంది. చాలాకాలం బాధపడితే మిగిలిన ఈ మలం విషం గా మారుతుంది, కీళ్ల నొప్పులు, కాళ్లు లాగటం వంటివి వస్తాయి. గుండెల్లో మంట ,ఎసిడిటీ, త్రేన్పులు. నిద్ర పట్టకపోవడం ,ఆదుర్దా, మానసిక గ్లాని. చర్మం సహజ కాంతిని కోల్పోవడం వంటి నష్టాలు కలుగుతాయి.

మలబద్ధకాన్ని నివారించే మార్గాలు..

అనాస, మామిడి ,సీతాఫలాలు మంచి విరేచన కారులు. మారేడు కాయలు పండిన తర్వాత గుజ్జు చక్కటి సహజ మలబద్దక నివారిణి. కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ కలిపిన త్రిఫల చూర్ణాన్ని రెండు చెంచాల చొప్పున రోజూ రాత్రి పరుండే ముందు వేడి నీళ్ళతో తీసుకుంటే సుఖ విరోచనం అవుతుంది.
బాగా ముగ్గిన అరటి పండును తొక్కతో సహా తీసుకుంటే ఎటువంటి మలబద్ధకమైన తగ్గుతుంది.ఒక స్పూన్ కరివేపాకు పొడితో ,తేనె కలిపి తీసుకున్నచో మలబద్ధకం పోతుంది. ఒక చెంచా ఆముదాన్ని వేడి చేసి రాత్రిపూట తీసుకుంటే ఎలాంటి మలబద్ధకమైన తగ్గిపోతుంది. కొందరు అన్నట్లు ఇది ఏ విధమైన చెడును కలుగచేయదు. మలబద్ధకానికి మరో మందు స్పినాక్ పచ్చిరసం. రాత్రి పరుండే ముందు నిల్వ ఉంచిన రాగి చెంబులోని నీళ్లు తాగి ఉదయాన్నే మళ్ళీ త్రాగితే మంచిది. ఎండు ద్రాక్షను రాత్రి నీటిలో నానబెట్టి, ఉదయాన్నే గింజలు తీసివేసి పరగడుపున ఆ నీటితో సహా తీసుకోవాలి.జామ, బొప్పాయి వంటి పళ్ళు పీచు పదార్థాన్ని కలిగి ఉండడం వల్ల మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. నువ్వులు, బెల్లము కలిపిన చిమ్మిలి ని ,నిమ్మకాయ అంత సైజులో ప్రతిరోజు రాత్రి పరుండే ముందు ఒక వారం తింటూ ఉంటే మలబద్ధకం పూర్తిగా తగ్గిపోతుంది .ప్రతిరోజు ఉలవల కషాయం కానీ ఉలవల్ల చూర్ణం కానీ తీసుకుంటే సుఖ విరోచనం అవుతుంది. గ్లాసు బార్లీ నీళ్లలో, రెండు చెంచాల తేనె కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటే సుఖ విరేచనమవుతుంది. ఉదయం సాయంత్రం రెండు పూటలా రెండు నిమ్మకాయల రసాన్ని, ఒక అర గ్లాసు నీళ్లలో కలుపుకొని తాగితే సుఖ విరోచనం అవుతుంది .

మన కొన్ని అలవాట్లు మారాలి ..

మసాలాలు ,వేపుళ్ళు ,ఫాస్ట్ ఫుడ్స్, డబ్బాలలో నిలువ ఉంచిన ఆహారం ,ఊరగాయలు మానేయాలి. కాఫీ, టీ, ధూమపానం, మద్యపానం తగ్గించాలి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని తాగాలి .రోజు తాజా పండ్లు లేదా పండ్ల రసాలు తాగాలి. నియమిత సమయానికి భోజనం, మలవిసర్జన ,నిద్రపోవడం, ఆదుర్దా, కంగారు తగ్గించుకోవడం, జాగ్రత్తగా పనులను ముందే ప్లాన్ చేసుకోవడం చేయాలి. ప్రతిరోజు ఉదయం చన్నీటి స్నానం, ఉదయం ఒకటి రెండు గ్లాసుల నీరు తాగడం ఇలాంటి అలవాట్లను పాటించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...