శీతాకాలంలో వాతవ్యాధులు తిరగబెడుతుంటాయి.మిరియాలు,వాము,జీలకర్ర ,దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా వాడుకోవడం మంచిది.వీటిలో ఏదైనా ఒక పొడిని ఒక గ్లాసు నీళ్లలో అర స్పూన్ మోతాదులో కలిపి మరిగించి చల్లార్చి వడగట్టి ఆ నీటిని తాగితే జీర్ణశక్తి పదిలంగా ఉంటుంది.జలుబు , ఉబ్బసం లాంటి ఎలర్జీ వ్యాధులున్నవారికి, కీళ్ళవాతం ఉన్నవారికి ఈ వాంవాటర్ , జీరా వాటర్ , ధనియా వాటర్ లేదా దాల్చిన వాటర్ చాలా మేలు చేసేవిగా ఉంటాయి. ఏ - విటమిన్ కలిగిన ఆహార పదార్థాలు , చలికాలంలో వచ్చే జబ్బులు , నొప్పులను నివారిస్తాయి.ఎక్కువ చలిని ఓర్చుకోవటానికి ఏ - విటమిన్ శరీరానికి బాగా తోడ్పడుతుంది.
ములక్కాడలు , మునగాకు , మామిడి , బొప్పాయి ,ఎర్ర గుమ్మడి పండు ,చిలగడ దుంపలు , కంద,పెండలం , క్యారెట్లు ,ఆకు కూరలు, కోడి గుడ్లు ,బఠానీలు చలి కాలంలో తినదగినవిగా ఉంటాయి.పిల్లలకు మిరియాలు , బెల్లం కలిపిన పాలు తాగిస్తూ ఉండాలి.
అల్లం , ఉప్పు కలిపి నూరిన ముద్దను అన్నంలో మొదటి ముద్దగా తింటే కడుపులో జఠర అగ్ని బలంగా ఉంటుంది.వాతం పెరగకుండా కాపాడుతుంది.ఈ కాలంలో పిల్లలకు అల్లం కానీ, వాము కానీ కలిపి శనగ పిండితో వంటకాలు చేసి పెట్టవచ్చు.సంక్రాంతి వంటకాలలో వాతం చేసే అరిసెల పక్కన నువ్వు పొడి వేసిన కజ్జి కాయల్లాంటి వేడి చేసే వంటకాలను ,చిలకల్లాంటి చలవ చేసే వాటినీ చేర్చేది సమతుల్యత కోసమే.