17, డిసెంబర్ 2011, శనివారం

ఆరోగ్య సమస్యలు.. ఏల్చూరి పరిష్కారాలు.

1 . ) సెగ రోగ సమస్య.. ఆయుర్వేద పరిష్కారం


అసలైన గంధపు చెక్క సంపాదించి దంచి పొడి చేసుకోవాలి. అలాగే ఎర్ర చందనపు చెక్కను కూడా సంపాదించి దంచి పొడి చేసుకోవాలి. ఆ రెండు పొడులను పల్చటి నూలు బట్టలో వస్త్ర ఘాలితము పట్టి మెత్తని చూర్ణం సిద్ధం చేసుకోవాలి. ఆ చూర్ణంలో తగినంత చాందిని అత్తరు కలిపి మెత్తగా నూరి కుంకుడు గింజలంత గోళీలు చేసి నీడలో గాలి తగిలే చోట ఎండబెట్టాలి.. అవి పూర్తిగా ఎండిన తర్వాత పూటకు ఒక గోలి చొప్పున రెండు పూటలా మంచి నీటితో సేవిస్తుంటే ఎంతో కాలం నుండి వేధించే అతి క్రూరమైన సెగ రోగాలు హరించి పోతాయి.

2 . ) అజీర్ణం, కడుపు నొప్పి, ఆకలి లేని సమస్యలు.. ఆయుర్వేద పరిష్కారాలు.

వంటింట్లో ఉండే ఆహార పదార్థాల ఔషధ గుణాలు తెలియక చాలా మంది ప్రతి చిన్న సమస్యకు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ అనవసరమైన మందులు వాడి చిన్న రోగాలను పెద్ద రోగాలుగా మార్చుకుంటున్నారు. ఈ కింది వాటిని విశ్వాసంతో ఆచరించాలి.

దానిమ్మ పండు గింజలను ఎండబెట్టి దంచి 100 గ్రాముల పొడిని తయారు చేయండి.అలాగే పుదినా ఆకులను ఎండబెట్టి 50 గ్రాముల పొడి తయారు చేయండి.25 గ్రాముల సైంధవ లవణం పొడిని తయారుగా ఉంచుకోండి. ఈ మూడు చూర్ణాలను కలిపి నూలుబట్టలో వస్త్ర ఘాలితము పట్టి నిలువ చేసుకోవాలి. రెండు పూటలా భోజనం తర్వాత మూడు వేళ్ళకు వచ్చినంత పొడి ఒక కప్పు మంచి నీటితో సేవిస్తూ ఉండండి.

పాలిష్ తక్కువగా పట్టిన పాత బియ్యం రెండు మూడు కేజీలు తెచ్చుకుని ఒక రాత్రి నానబెట్టి, ఒక పగలు ఎండించి దోరగా వేయించి రవ్వలాగా చేసుకుని రోజూ రెండు పూటలా తగినంత రవ్వను నీటితో కలిపి ఉప్మా లాగా వండండి.వండేటప్పుడు అందులో అల్లం ముక్క 2 గ్రాములు , జీలకర్ర పొడి 2 గ్రాములు, ధనియాల పొడి 2 గ్రాములు, కొద్దిగా సైంధవ లవణం వేసి పావు చెంచా ఆవు నేతితో గాని వంటాముదంతో గానీ లేక రెండు కలిపి గానీ తాలింపు పెట్టండి. ఈ ఆహారాన్ని ఆకుకూరలతో ,పలుచని మజ్జిగతో కలిపి సేవించండి.
ఈ సులభమైన మార్గాలతో పై సమస్యలు పరిష్కరించబడి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది.

3 .) కాలేయం బలహీన పడి రక్తం తగ్గిపోవడం , ప్లీహం దెబ్బ తినడం, బల్ల రోగం పుట్టడం..ఆయుర్వేద పరిష్కారాలు.

శనగలు 50 గ్రాములు తీసుకుని తగినన్ని నీటితో ఉడక బెట్టి ఆ గుగ్గిళ్ళ పైన కొద్దిగా ఉప్పు చల్లి రోజూ పరగడుపున తింటుండాలి. ఇలా 15 రోజులు చేసిన తర్వాత ,50 గ్రాములు శనగలను వేయించి కొద్దిగా ఉప్పు చల్లి మరో 15 రోజులు తింటుండాలి. ఈ కాలంలో పొరపాటున కూడా కారం ఏ మాత్రం వాడకూడదు. ఈ చిన్న ప్రయత్నం వల్ల కాలేయం పూర్తి ఆరోగ్యాన్ని పొంద గలుగుతుంది.

నిమ్మ రసం 10 గ్రాములు, నీరుల్లి గడ్డల రసం 5 గ్రాములు ఆహారానికి గంట ముందు రెండు పూటలా తాగిస్తుంటే ప్లీహం బాగు పడుతుంది.

కుంకుడు కాయ పై పెచ్చులు 100 గ్రాములు, కరక్కాయ పై పెచ్చులు 200 గ్రాములు తీసుకుని మెత్తగా చూర్ణం చేసి తగినంత తేనె కలిపి ముద్దలాగా నూరి గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. ఈ ముద్దను 3 గ్రా. చొప్పున సేవిస్తుంటే పాండు రోగం అంటే రక్త హీనత , జలోదరం అంటే కుండ లాంటి పొట్ట , రక్త దోషం మటు మాయం అయి పోయి ఆరోగ్యం చేకూరుతుంది.

4 . ) కుడి వృషణం కిందికి జారి లావుగా మారడం, వాత పదార్థాలు తింటుంటే పోటు రావడం.. ఆయుర్వేద పరిష్కారాలు..

మన దేశంలో మగ వారు పంచె కట్టుకున్నంత కాలం బుడ్డ దిగే సమస్య ఉండేది కాదు. ఇంగ్లీష్ వారిని చూసి ఎప్పటి నుంచి ప్యాంట్లు వేసుకోవడం మొదలు పెట్టారో అప్పటి నుండి అధిక శాతం పురుషులకు అండ వృద్ధి రోగం మొదలైంది.

కోడి గుడ్డులోని సొన,మినుములు సమంగా కలిపి గుజ్జులా నూరి దానిని ఒక నూలు బట్టకు పట్టించి ఆ బట్టను వాచిన వృషణం పైన అంటించి ఊడిపోకుండా గోచి పెట్టుకుని నిద్రించి ఉదయం పూట తీసివేయాలి.

ఒక గ్లాసు మంచి నీటిలో ఒక చెంచా త్రిఫల చూర్ణం కలిపి ఒక కప్పు కషాయానికి మరిగించి వడ పోసి అది గోరు వెచ్చగా అయిన తర్వాత అందులో యవ క్షారం 2 గ్రాములు, సైంధవ లవణం 2 గ్రాములు కలిపి సేవిస్తుంటే క్రమంగా సమస్య పరిష్కారమవుతుంది.

5 . ) రక్త దోషం, మూల శంఖ, మల బద్ధకం సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..

ప్రాణం మలాధీనం అని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. రోజూ సుఖ విరేచనం కాకపోతే ఆ క్షణం నుండే మన వినాశనం ప్రారంభం అవుతుంది. మల బద్ధకం వల్ల మిగిలిన సమస్యలు కూడా కలుగుతాయి.

దేశ వాలీ ఆవు పేడ తెచ్చి పిడకలు చేసి ఎండబెట్టి కాల్చి బూడిద చేయాలి. దీనిని పలుచని నూలు బట్టలో వస్త్ర ఘాలితము చేసి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. రోజూ రెండు పూటలా పూటకు అర చెంచా మోతాదుగా మంచి నీళ్ల అనుపానం తో సేవిస్తుంటే పైన పేర్కొన్న సమస్యలు క్రమ క్రమంగా పరిష్కారం అవుతాయి.విశ్వాసంతో ఆచరించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...