లడ్డూ అంటే తెలుగువారికెంతో భక్తి ,పవిత్రం , శుభం.ఇవి మన సంస్కృతిలో ఒక భాగం.సుఖ సంతోషాలకు లడ్డూ పర్యాయపదం.లడ్డూ చేసుకోవడం అంటే తెలుగు వారికి పండగ చేసుకోవడమే.పెళ్ళిళ్ళలో తొలి వడ్డన లడ్డు.తిరుపతి లడ్డు లాగా బందరు లడ్డు / తొక్కుడు లడ్డు కూడా ఎంతో ప్రసిద్ధికెక్కింది.
లడ్డూలను శనగపిండితోనే చేయాలని నియమం ఏమీ లేదు.సున్ని ఉండలు , కొబ్బరి ఉండలు ,నువ్వుండలు ఇవన్నీ లడ్డూలే.మహారాష్ట్ర , బెంగాళీల ప్రభావంతో స్వాతంత్రోద్యమ కాలంలో శనగ పిండి వంటకాలు మనకు ఎక్కువ అలవాటయ్యాయి.అంతకు పూర్వం మినప,జొన్న,సజ్జ,వరి ,గోధుమ,ధాన్యం వంటి చిరుతిళ్లన్నీ వండుకునే వాళ్లు.ఇటీవలి కాలంలో శనగ పిండి వాడకం వేలం వెర్రి అయింది.లడూకి ఆ రుచినిస్తుంది శనగ పిండి మాత్రమే కాదు అందులో చేర్చిన నెయ్యి , పటిక బెల్లం,పచ్చ కర్పూరం,జీడి పప్పు , కిస్మిస్ , యాలకులూ వగైరా.ఇవి సమృద్ధిగా ఉంటే ఏ పిండితో చేసినా రుచిగానే ఉంటాయి.
" ద " అనే అక్షరంలో ఉండే చిర్రి శనగలు లేదా దేశవాళీ శనగలతో చేసినదైతే శనగ పిండి మంచిదే.శనగ పప్పుని మర పట్టించిన శనగ పిండిని వాడుకోవడం మంచిది.బలకరం,కానీ కష్టంగా అరుగుతుంది.జీర్ణశక్తి బలకరంగా లేనివారికి అపకారం చేస్తుంది.పర్వతాలు ఫలహారం చేయగలవారికి శనగ పిండి మేలు చేస్తుంది.శనగ పిండి తిని తట్టుకోగలగాలి.అంతేకాని శనగ పిండి మంచిది కాదు అని ముద్ర వేయడం సరికాదు.