Friday 29 July 2016

పగటి నిద్ర ,రాత్రి డ్యూటీలు చేసేవారికి ఆయుర్వేద , ఆరోగ్య వైద్య సలహాలు. / PAGATI NIDRA - RATHRI DUTIES - HEALTH TIPS

పగటి నిద్ర ,రాత్రి డ్యూటీలు చేసేవారికి ఆయుర్వేద , ఆరోగ్య వైద్య సలహాలు.

జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవలి నివేదిక ప్రకారం 5,6 ఏళ్ళ పాటూ రాత్రిళ్ళు మేల్కొని పని చేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.ప్రకృతికి ఇలా విరుద్ధంగా జీవించటాన్ని సర్కాడియన్ రిథం డిస్రప్షన్ అంటారు .పాతికేళ్ళకు పైగా నైట్ డ్యూటీలు చేస్తున్నవాళ్ళు ఉన్నారు,వాళ్ళలో చాలామందికి పగటి డ్యూటీ వేస్తే చేయలేనంతగా రాత్రి డ్యూటీకి అలవాటు పడిపోయి ఉంటారు.కొన్ని తరాలపాటూ ఇలా జరిగితే అది జన్యుపరమైన మార్పులకు దారితీయవచ్చు కూడా.వీళ్ళు ఒక సామాజిక అవ్యవస్థకు / సోషల్ జెట్ లాగ్ గురవుతుంటారు.స్త్రీలలో ఈస్ట్రోజన్ లాంటి పునరుత్పాదక హార్మోనుల ప్రభావం తోడవడం వల్ల , నడివయస్సు దాటిన వారిలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.మన అవసరాలు గడవడం కోసం , బాహ్య ప్రకృతిని, పర్యావరణాన్నే కాకుండా , మన శరీర ప్రకృతులను కూడా మనం విధ్వంసం చేస్తున్నాము.అతిగా నిద్ర మేల్కోవడం వల్ల బుర్ర పని చేయడం తగ్గిపోతుంది.పనిలో నాణ్యత పడి పోతుంది.మనిషి పక్షవాతానికి, బీపీ,గుండె జబ్బులు,షుగరు,జీర్ణకోశవ్యాధులకు,కీళ్ళవాతానికి లోనవుతాడు.చీకట్లో మెలకువ, పగలు నిద్ర ప్రకృతి విరుద్ధాలే.తప్పనిసరిగా పనిచేసినపుడు శరీరంలో వాతం,వేడి పెరిగిపోతాయి.కావున ఆహారపదార్థాల ద్వారా వాతాన్ని తగ్గించి,చలువ చేసే వాటిని తీసుకోవాలి.రాత్రి జాగరణవల్ల వాతం వికారం చెందుతుందని ఆయుర్వేదం చెబుతుంది.ఇది పక్షవాతానికి కారణంకూడా కావచ్చని తాజా పరిశోధన తెలుపుతోంది.కాబట్టి చలువ చేసే ఆహారపదార్థాలకు ప్రాధాన్యతనివ్వాలి.పులుపులేని కూరగాయలు,ఆకుకూరలు అన్నీ మేలు చేస్తాయి.కానీ వాటిని అతిగా చింతపండుతోనో ,అల్లం వెల్లుల్లితోనో ,శనగపిండితోనో,నూనెతోనో వండినందువల్ల వేడి , వాతం చేసేవిగా మారిపోతాయి.

ఉదయాన్నే ఒక క్యారెట్, ఒక ముల్లంగి,ఒక ఆపిల్ / లెద పులుపు లేని ఒక పండు  ఈ మూడింటినీ కలిపి మిక్సీలో వేసి జ్యూస్ తీసి తాగాలి.వాతం , వేడి తగ్గుతాయి.శరీర అనుకూలత సాధించుకోవటానికి , వాతహరంగా, వేడిని రూపు మాపేదిగా ఉండే ఆహార పదార్థాల కోసం ప్రణాళిక వేసుకోవాలి. బూడిద గుమ్మడిని సోరకాయా పద్ధతిలో అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు.ఇది శరీరంలో నిద్రలేమి వల్ల కలిగే అలసటను పోగొడుతుంది.మర్నాడు నిద్రచాలక కలిగే ఇబ్బందులు తగ్గుతాయి.బార్లీ జావ , సగ్గు బియ్యం జావ , స్బజా గింజలు, సుగంధిపాల వేళ్ళ కషాయం, పల్లేరు కాయల కషాయం లాంటివి నైట్యూటీలు చేసేవారికి మేలు చేస్తాయి.అలసటను నివారిస్తాయి.
పెరుగు, మజ్జిగ చలవనిస్తాయి.రకరకాల కూరగాయల ముక్కలు వేసి చేసిన పెరుగు పచ్చడి జీర్ణకోశాన్ని బల సంపన్నం చేస్తుంది.ధనియాలు, జిలకర,శొంఠి లను సమానంగా తీసుకొని దంచిన పొడిని మజ్జిగలో కలుపుకొని , కొద్దిగా ఉప్పు వేసుకొని రోజూ ఒకటి రెండుసార్లు తాగాలి.

పొద్దున్నే నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకొని ఏమీ తినకుండా పడుకొని నిద్రపోవడం మంచిది.రాత్రి 10 గంటల తర్వాత ఎన్ని గంటలు మెలకువగా ఉన్నారో అందులో సగం సమయాన్ని ఇలాగే ఉదయం నిద్రపోతే నిద్రలేమి రాదు అని సుశ్రుతుడు చెప్పడం జరిగింది.పచ్చళ్లు, కారాలు, మసాలాలు మానేయాలి.మద్యం,సిగరెట్లు వాడడం రాత్రి డ్యూటీలు చేసేవారిలో అనారోగ్యాన్ని వేగవంతం చేస్తుందని గ్రహించాలి.