Sunday 8 June 2014

మోదుగ చెట్టు - ఆయుర్వేద ఉపయోగాలు. / MODUGA CHETTU - AYURVEDIC USES.


దీనిని సంస్కృతంలో ఫలాశ , యాజ్ఞిక,కింశుక అనీ, హిందీలో ఫలాశ్ అనీ,తెలుగులో మోదుగ చెట్టు అని , లాటిన్ లో  బ్యూటియా ఫ్రొండోసా అని అంటారు.

రూప గుణ ప్రభావాలు - దీని చెక్క రసం లేదా కషాయం కారం,చేదు , వగరు రుచులతో కూడి ఉంటుంది.క్రిములను,ప్లీహరోగాలను ,మూల రోగాలను,వాత శ్లేష్మాలను ,యోని వ్యాధులను హరించి వేస్తుంది.

1.మోదుగాకు విస్తరిలో భోజనం - మన తెలుగునాట మోదుగ విస్తర్లు ఉపయోగించడం ఎప్పటినుండో వాడుకలో ఉంది.ఈ విస్తరిలో భోజనం చేస్తే వాత రోగాలు,కఫ రోగాలు హరించిపోతాయి.కడుపులో గడ్డలు , రక్తంలో వేడి పైత్యం అణగిపోతాయ్.జఠరాగ్ని పెరిగి సుఖవిరేచనం అవుతుంది.

2. అండ వృద్ధి అణగిపోవుటకు - మోదుగ పూలను బట్టలో వేసి  అవి వృషణాలకు తగిలేటట్లుగా గోచిగుడ్డ కట్టుకుంటుంటే అండవృద్ధి అద్భుతంగా తగ్గిపోతుంది.

3. మృత్యువును జయించాలంటే - తెల్ల మోదుగ చెట్టు ఆకులు , పూలు ,పై బెరడు , వేరు పై బెరడు ,కాయలు వీటిని సమాన భాగాలుగా చూర్ణాలు చేసుకొని కలిపి ఉంచుకోవాలి.ముందుగా ఉదరాన్ని వృద్ధి చేసుకొని ఈ చూర్ణాన్ని ఒక చెంచా మోతాదుగా ఒక చెంచా మంచి తేనెతో కలిపి పరగడుపున సేవిస్తుంటే సర్వ వ్యాధులు సం హారమై మృత్యుంజయత్వం కలుగుతుంది.

4. మంచి సంతానం కొరకు - సంతానం కావలసిన స్త్రీలు బహిష్టు స్నానం చేసిన రోజున లేత మోదుగాకు ఒకటి తెచ్చి దాన్ని మెత్తగా దంచి ఒక కప్పు నాటు ఆవు పాలలో కలుపుకొని పరగడుపున సేవించి ఆ తర్వాత భర్తతో సంభోగం జరుపుతూ ఉంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది.

5. స్త్రీలకు మూత్రం బంధించబడితే -
లోపలకి - మోదుగ పూల పొడి - 3 గ్రా,కండ చక్కెర - 10 గ్రా .కలిపి పావు లీటర్ నీటిలో వేసి పూటకు ఒక మోతాదుగా 3 సార్లు తాగుతుంటే బిగించిన మూత్రం విడివడి ధారాళంగా బయటకు వస్తుంది.

పైకి - మోదుగ పూలను మంచినీటితో మెత్తగా ముద్దలాగా నూరి ఆ ముద్దను బొడ్డు చుట్టూ పొట్టపైన పట్టించాలి.5,6 నిమిషాలలోనే మూత్రం ధారాళంగా బయటకు వస్తుంది.

6 . ముట్టు నొప్పి తగ్గుటకు - మోదుగ గింజలను దంచి జల్లించి  నిలువ ఉంచుకోవాలి.ఈ చూర్ణం 1 గ్రా మాత్రమే తీసుకొని 5 గ్రా బెల్లం తో కలిపి నూరి పరగడుపున తింటూ ఉంటే ముట్టు నొప్పి తగ్గిపోతుంది.

7. వీర్య వృద్ధికి,వీర్య స్థంభనకు - మోదుగ గింజలను నానబెట్టి,పొట్టు తీసి ,ఆరబెట్టి,దంచి పొడిచెయ్యాలి.అదేవిధంగా చింత గింజలను,తుమ్మ గింజలను కూడా నీటిలో నానబెట్టి పై పొట్టు తీసివేయాలి.ఈ మూడు గింజల పప్పులను సమభాగాలుగా ఎండించి,దంచి,పొడి చేసి దానికి సమంగా కండచక్కెర పొడిని కలిపి నిలువచేసుకోవాలి.

రోజూ రెండు పూటలా పూటకు 6 గ్రాముల మోతాదుగా మంచి నీటితో సేవిస్తుంటే అపారమైన వీర్యవృద్ధి,అంతులేని వీర్య స్థంభన కలుగుతాయి.

8. శీఘ్ర స్ఖలన నివారణకు -

మోదుగ చిగుర్లు - 70 గ్రాములు
పాత బెల్లం - 10 గ్రాములు

పై రెండింటిని కలిపి రోటిలో వేసి మెత్తగా దంచి కుంకుడు గింజలంత మాత్రలు చేసి నీడలో బాగా ఎండబెట్టి నిలువ చేసుకోవాలి.

రోజూ రెండు పూటలా ఒక గోళి మంచి నీటితో వేసుకొని ఒక కప్పు పాలు తాగుతుంటే శీఘ్ర స్ఖలనం హరించి,చక్కటి వీర్య స్థంభన కలుగుతుంది.

9. మూల వ్యాధి తగ్గుటకు - గింజలను మంచి నీటితో మెత్తగా నూరి కుంకుడు గింజలంత మాత్రలు చేసి ,నీడలో గాలికి ఆరబెట్టి నిలువచేసుకొని రెండు పూటలా మంచినీటితో ఒక్కొక్క మాత్ర వేసుకొంటే మూల వ్యాధి తగ్గుతుంది.

10. మూర్చ తగ్గుటకు - మోదుగ చెట్టు వేరును సానరాయిపై మంచినీటితో అరగదీసి ఆ గంధాన్ని నాలుగు చుక్కలు ముక్కులో వేస్తుంటే వెంటనే మూర్చ నుండి తేరుకుంటారు.

11. ప్రేగులలో క్రిములకు మోదుగ గింజలు -

మోదుగ గింజలు - 10 గ్రా,
కొడిశపాల చెక్క పొడి - 10 గ్రా,
వాయు విడంగాల పొడి - 20 గ్రా,

పై వాటిని కలిపి నిలువ ఉంచుకోవాలి.

రోజూ రెండు పూటలా పూటకు 5 గ్రా . చొప్పున ఒక కప్పు వేడినీటిలో కలిపి తాగుతుంటే విరేచనం ద్వారా ప్రేగులలోని ఏలిక పాములు ,నులి పురుగులు మొదలైన క్రిములు పడిపోతాయి.

12. గజ్జి తామర తగ్గుటకు - మోదుగ గింజలను , నిమ్మ పండు రసంతో మెత్తగా నూరి పైన పూస్తే ఒక్క రోజులోనే తామర రోగం హరించుకు పోతుంది.

13. గర్భ నిరోధం కొరకు - మోదుగ గింజలను నీటిలో నానబెట్టి పై తోలుతీసేసి ,పప్పును నీటితో మెత్తగా నూరి ,కుంకుడు గింజలంత మాత్రలు చేసి ,గాలికి ఆరబెట్టి నిలువ ఉంచుకోవాలి.

స్త్రీలు బహిష్టు స్నానం చేసిన రోజు నుండి వరుసగా 3 రోజుల పాటు ఉదయం పరగడుపున 2 మాత్రలు మంచినీటితో వేసుకుంటే గర్భ నిరోధం కలుగుతుంది.

14. తేలు విషం దిగుటకు - మోదుగ గింజలను ,జిల్లేడు పాలతో గంధం తీసి తేలు కుట్టిన చోట పైన పట్టు వేస్తే ఆ పట్టు ఆరేటప్పటికి విషం దిగిపోతుంది.

15. చలి జ్వరం తగ్గుటకు - మోదుగ గింజలు,కానుగ గింజల పప్పును సమభాగాలుగా తీసుకుని కొంచెం నీరు కలిపి మెత్తగా నూరి శనగ గింజలంత మాత్రలు చేసి నీడలో గాలికి ఆరబెట్టి ,బాగా ఎండిన తర్వాత నిలువచేసుకోవాలి.చలిజ్వరం వచ్చిన వారు పూటకు రెండు గోళీల చొప్పున గోరువెచ్చని నీటితో రెండు పూటలా సేవిస్తుంటే చలి జ్వరం తగ్గిపోతుంది.

16. నీల్ల విరేచనాలు తగ్గుటకు -

మోదుగ బంక పొడి - 10 గ్రాములు ,
దాల్చిన చెక్క పొడి - 10 గ్రాములు,
 పై వాటిని కలిపి ఈ మిశ్రమాన్ని మూడు భాగాలు చేసి పూటకు ఒక భాగం,ఒక చెంచా ఆవు నేతితో కలిపి మూడు పూటలా సేవిస్తే రెండు ,మూడు రోజులలో నీళ్ల విరేచనాలు కట్టుకుంటాయి.