ఆరోగ్యాన్ని దెబ్బ తీసే వాటిలో నాలుగు ముఖ్యమైన అంశాలను పరిగణించాలని ఆయుర్వేదం చెబుతోంది. 1. వాతావరణపు గాలి . 2.త్రాగే నీరు. 3.నివసించే ప్రదేశం. 4.కాలం ( ఋతువు, వయస్సు ).రోగాలను కలిగించే విషయంలో ఇవి ఒకదానికంటే ఒకటి బలమైనవిగా ఉంటాయి.ఒకదానికంటే మరొకటి తప్పించుకోలేని విధంగా దాడి చేస్తాయి.కాలం అనేది ఎవరి మీదైనా దాడి చేయగలదు,ఏమైనా చేయగలదు.ముఖ్యంగా శీతాకాలం .ఈ కాలంలో మనమందరమూ , జలుబు , దగ్గు , ముక్కు దిబ్బడలాంటి సమస్యలు ఎదొర్కొంటూ ఉంటాము.మనలో చాలా మంది ఈ సమస్యల నుండి తప్పించుకోలేరు.ఎలాంటి వ్యాయామాలు కాని, జీవన శైలిలో మార్పులు కాని ఈ సమస్యల నుండి మనల్ని రక్షించలేవు.ఎందుకంటే ఈ వ్యాధికారక క్రిములు ఒకసారి గాలిలో చేరితే ఎవరైనా వాటికి గురికావాల్సిందే.కావున అన్ని సమయాల్లోనూ ముందు జాగ్రత్తలు తీసుకోవడం ,శుభ్రత పాటించడం చాలా ముఖ్యం.ఈ చిన్న సమస్యలకు వెంటనే చికిత్స తీసుకోకపోతే అవి ప్రాణాంతక సమస్యలుగా మారే అవకాశం ఉంది.ఈ కాలంలో ఆస్త్మా వంటి వ్యాధులు కూడా తీవ్రమౌతాయి.
జలుబు - శ్వాస మార్గాలకు చెందిన వైరస్ ఇన్ ఫెక్షన్ వల్ల జలుబు వస్తుంది. మొదటి మూడు రోజుల్లో ఇది ఇతరులకు వ్యాపించే గుణం కలిగి ఉంటుంది.దీనిని అశ్రద్ధ చేస్తే చెవి నొప్పి రావచ్చు.పిల్లి కూతలు రావచ్చు.సైనసైటిస్ రావచ్చు.ఊపిరితిత్తులు రోగగ్రస్తమై న్యుమోనియాలోకి దారితీయవచ్చు.
జలుబు రావడానికి కారణాలు - ప్రధాన కారణం వైరస్ .దగ్గటం,తుమ్మటం,మాట్లాడటం ద్వారా నీటి తుంపరలు విడుదలౌతాయి.వీటి ద్వారా ఇన్ ఫెక్షన్ వ్యాపిస్తుంది.ఒకరు వాడిన వస్తువులు మరొకరు వాడటం, కరచాలనం ద్వారా కూడా వ్యాపిస్తుంది.
వ్యాధి లక్షణాలు - ముక్కు కారడం,ముక్కు బిగేయడం,దగ్గు , గొంతులో నస ,గొంతులో కఫం చేరడం,తుమ్ములు , ఒళ్ళు నొప్పులు ,తల నొప్పి , కళ్ళ నుండి నీరు కారడం , జ్వరం , అలసట ,చెవి నొప్పి.
నివారణ పద్ధతులు - జలుబుకు కారణమయ్యే క్రిములు ప్రతి చోటా ఉంటాయి.బొమ్మల నుండి గాలి వరకు ఇవి విస్తరించి ఉంటాయి.జలుబును నివారించాలంటే కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
తరచుగా కళ్ళను ,ముక్కును తాకకండి.చేతులను తరచుగా కడుక్కోవడం ద్వారా సమస్యను చాలా వరకు నివారించవచ్చు.ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం,ఇంట్లో ఎవరికైనా జలుబు ఉంటే జాగ్రత్తగా ఉండడం అవసరం.
జలుబుకు ఆయుర్వేద చికిత్సలు -
1. శొంఠి చూర్ణం పావు టీ స్పూన్ ,పిప్పళ్ళ చూర్ణం పావు టీ స్పూన్ ,మిరియాల చూర్ణం పావు టీ స్పూన్ , అరకప్పు వేడి నీళ్ళు .
పై అన్నింటిని కలిపి తాగండి.జలుబు సమస్య తగ్గుతుంది. జలుబు తీవ్రతను బట్టి రోజుకు రెండు పూటలు లేదా మూడు పూటలు వరుసగా నాలుగైదు రోజులు వాడండి.
2. గుప్పెడు తులసి ఆకులు ,ఒక టీ స్పూన్ మిరియాలు ,ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు , రెండు కప్పుల నీళ్ళు.
పై అన్నింటినీ కలిపి స్టవ్ మీద పెట్టి ఒక కప్పు కషాయం మిగిలే వరకు మరిగించండి.తర్వాత వడపోసుకొని సగం కప్పు కషాయం ఉదయం ,సగం కప్పు కషాయం రాత్రి గోరు వెచ్చగా తాగండి.సమస్య తీవ్రతను బట్టి నాలుగైదు రోజులు వాడండి జలుబు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.