AN EXCELLENT COLLECTION OF AYURVEDIC RECIPES OF EMINENT INDIAN AYURVEDIC PRACTITIONERS LIKE BABA RAMDEV , ELCHURI , CHIRUMAMILLA MURALIMANOHAR ,PEDDI RAMADEVI ETC FOR VARIOUS HEALTH PROBLEMS.EXPLAINED IN TELUGU .
9, ఆగస్టు 2012, గురువారం
పుదీనా ఆకులు.. అనేక ఉపయోగాలు
ఆకు కూరలా.. ఏముంది వాటిలో .. రుచా పచా, ఏం తింటాం.. చప్పచప్పగా .. అని కొట్టి పారేస్తుంటాం.. ఆకు కూరల పై చాలా చిన్న చూపే. మాంసాహారాలు, కాయ గూరలతో పోల్చితే ఇవి తక్కువ ధరలకే లభించే పోషకాల పెన్నిధులు. పౌష్టిక విలువలను, ఔషధ గుణాలను అందించే ఈ పచ్చని ఆకులు తోడుంటే ఆరోగ్యానికి ఏ లోటూ రాదు. నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆరోగ్యం తో జీవించేయవచ్చు.
మన దేశంలో ఆహారం కోసం ఉపయోగించే మొక్కలలో మూడొంతులు ఆకు కూరలే. మనకు తెలిసినవి వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. ఆకు కూరలంటే ముందుగా పాలకూర , తోటకూర , గోంగూర, చుక్క కూర, పొన్నగంటి , బచ్చలి, గంగ వాయిలి కూర, మునగ, చింత చిగురు, కొత్తిమీర, పుదినా గుర్తుకొస్తాయి.
ఆకు కూరలలో అగ్రగామి..
ఎంతో ఉపశమనం, ఎంతో స్వాస్థ్యము, ఎంతో ఉల్లాసం, ఎలా చూసినా పుదినా రుచి , పరిమళం, పోషక విలువలు , ఔషధ గుణాలు అమోఘం. చలువ చేసే పుదీనా ఆకు కూరల లో అగ్రగామి. వేటితో జత కలిపినా పుదినా తన ప్రత్యేకతను నిలుపుకునే ఒక విజేత. ప్రపంచంలో ఎందరో ఇష్టపడే అమోఘమైన రుచులలో, అద్భుతమైన పరిమళాలలో పుదినా ఒకటి. ఇది శరీరానికి ఎంతో చలువ చేసే, మనసును సేద తీర్చేలా , ఎంతో ఉల్లాసాన్ని , ఉత్సాహాన్నిచ్చే మధుర పరిమళం.
మౌత్ రిఫ్రెషనర్ గా పుదీనా అందరికీ సుపరిచితమే. పుదీనా పరిమళం గల టూత్ పేస్ట్ లు , చూయింగ్ గమ్ లు, బ్రీత్ ఫ్రెషనర్ లు , క్యాండీలు, ఇంకా ఎన్నో పుదీనా ఆధారిత ఉత్పత్తులు మార్కెట్ లో కనిపిస్తుంటాయి.
అందరూ ఎంతో ఇష్టపడే మింట్ చాక్ లెట్లు, ఐస్ క్రీములు మరువ లేము. పుదీనా గురించి తెలిసింది కొంత, తెలుసుకోవలసింది ఎంతో. పుదీనా ఎన్నో రూపాలలో, ఎన్నో రుచులలో దొరుకుతుంది. మనకు స్పియర్ మింట్, పెప్పర్ మింట్ , తోటల్లో పెరిగే ఆకుల రూపంలో పుదీనా లభిస్తుంది. డెజర్టులలో ఒక రకం పుదీనా, డ్రింక్ ల కైతే ఒక ప్రత్యేక రకం, అదే మామూలు వంటింట్లో అయితే దేశవాళీ రకం లేదా తోటల్లో పెరిగిన పుదీనా ఆకులను వాడతారు.
సలాడ్స్ లో వాడడానికి పైనాపిల్ మింట్ బాగుంటుంది. మింట్ మన దేశంలో పుదీనా గా అందరికీ బాగా తెలుసు. మనకు మామూలుగా దొరికే రకాలలో సాదా పుదీనా ఒకటి కాగా పెప్పర్ మింట్ మరొకటి. పుదీనా ను చాలా మంది పచ్చడి రూపంలో కానీ, సలాడ్లలో లేదా పుదీనా నిమ్మ రసం రూపంలో తీసుకుంటుంటారు. మన దేశంలో నడి వేసవిలో ఈ పుదీనా వాడకం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల లోని వారు పుదీనా ను అనేక రూపాలలో విరివిగా వాడుతుంటారు. అక్కడ వారి వంట గదిలోకి అడుగు పెట్టగానే ఈ పుదీనా వాసన మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. విలక్షణమైన ఆ పరిమళం మనల్ని పరవశింప చేస్తుంది.
వేసవిలో ఇంటికి వచ్చే అతిథులకు పుదీనా వేసిన నిమ్మ రసం పానీయం ఇవ్వడం రివాజు. డైనింగ్ టేబుల్ మీద పుదీనా పెరుగు పచ్చడి ఖచ్చితంగా ఉంటుంది. పుదీనా పెరుగు పచ్చడి లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది.
చలువ చేసే పుదీనా ఆకులను వేసవిలో తరచుగా వాడతారు. ఇది ఆహార పదార్థాలకు అదనపు రుచిని, కమ్మని వాసనను జోడిస్తుంది. పుదీనా ఆకులు వేసి తయారు చేసిన అనేక రసాలు వేసవిలో తనువుకు ,మనసుకు పెను సాంత్వన ఇస్తాయి. దూర ప్రయాణాలు చేసేముందు పచ్చి మామిడి కాయలతో , పుదీనా రసం కలిపిన పానీయం తీసుకోవడం మంచిది. ఈ రసాన్ని ఉత్తరాది వారు ఆమ్ పన్నా జ్యూస్ అంటారు. ఇది వడ దెబ్బ తగలకుండా బాగా పనిచేస్తుంది.
అలాగే పుదీనా ఆకులు వేసి తయారు చేసిన మజ్జిగ లేదా పుదీనా వేసిన చల్లటి జల్ జీరా రసం తనువును సేద తీరుస్తాయి. జీర్ణ క్రియను మెరుగు పరిచి వికారాన్ని తగ్గిస్తుంది. పుదీనా అద్భుతమైన జీర్ణకారి.
పానీపూరి లో వాడే రసాన్ని తయారు చేయడానికి పుదీనా ను విరివిగా వాడతారు. టీ,క్యాండీలు, జెల్లీ లు, కూల్ డ్రింకుల తయారీలో పుదీనా ను ఉపయోగిస్తారు. పుదీనా వేసి తయారు చేసిన చల్లటి ఐస్ టీ లేదా హెర్బల్ టీ శరీరానికి చలువదనాన్ని అందిస్తుంది.
చలి కాలం లో పుదీనా వేసుకుని తయారు చేసిన టీ తాగుతుంటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. పుదీనా టీ ని చాలా మంది ఇష్ట పడతారు. పుదీనా ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది, మంచి జీర్ణ కారి. ఇది ప్రభావ వంతమైన మూత్ర వర్ధినిగా పని చేస్తుంది. రోజూ కొన్ని ఆకులు నమిలితే తాజాదనం,ఉత్సాహం కలుగుతాయి.
ఇది నోటి దుర్వాసనను పోగొట్టి శ్వాస ను తాజాగా ఉంచే మంచి మౌత్ ఫ్రెషనర్.శతాబ్దాలుగా కమ్మని సువాసనను,వంటకాలకు అదనపు రుచిని ఇస్తూ స్వాస్థ్య శక్తిని అందించడంలో పుదీనా పేరెన్నిక గన్నది.
ఉదర సంబంధిత ఇబ్బందులను తొలగించే శక్తి పుదీనా లో ఉన్నదన్నది చాలా కాలంగా తెలిసిన విషయమే. ఒక ఔషధంగా పుదీనా వాడకం మన బామ్మల కాలం నుంచి ఉన్న చిట్కా వైద్యం. ఇవే కాక పుదినాలో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
ఉదర సంబంధిత వ్యాధులకు పుదీనా దివ్యౌషధం. ఎండ బెట్టిన పుదీనా ఆకులను నీళ్లలో వేసి మరిగించి తయారు చేసిన కషాయం తీసుకుంటే జీర్ణక్రియ వ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది. కడుపు నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది. పుదీనా వేసి తయారు చేసిన హెర్బల్ టీ తాగితే కడుపులో గడబిడ తగ్గుతుంది.
కడుపులో మంట కు పుదీనా మంచి ఔషధంగా పని చేస్తుంది. పుదీనా లోని ఔషధ గుణాలకు ప్రాచీన కాలం నుంచి గుర్తింపు ఉంది. ప్రాచీన గ్రీకులు మందులలో ఉపయోగించే దరిమిలా పుదీనా ను ఇండోనేషియా ,పశ్చిమాఫ్రికా దేశాలకు పరిచయం చేశారని , మన దేశంలో ని హిమాలయ ప్రాంతాలలో పుదీనా పంట బాగా పండుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఇది శక్తివంతమైన మూత్ర వర్ధకం కాబట్టి ఒంట్లో నీరు చేరడాన్ని నివారించవచ్చు.శరీరంలోని విష పదార్థాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. తీసుకునే ఆహారంలో క్రమం తప్పకుండా పుదీనా ను ఏదో ఒక రూపంలో చేర్చుకో గలిగితే అది శరీరంలోని బ్యాక్టీరియా,ఫంగస్ ల పెరుగుదలను బాగా తగ్గిస్తుంది.
పుదీనా లో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నందున అది ఉబ్బసాన్ని నియంత్రించడానికి తోడ్పడుతుంది. పుదీనా ఆకులు వేసి బాగా మరిగించిన నీటిని ఆవిరి పట్టినట్లయితే జలుబు ,సైనస్ ఇన్ఫెక్షన్స్ వంటి కొన్ని కంజేషన్ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
తల నొప్పులు ,మైగ్రేన్ తగ్గడానికి పుదీనా దోహదం చేస్తుంది. తల నొప్పి వేధిస్తుంటే వేడి వేడి పుదీనా టీ తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. దీని ఎసెన్షియల్ తైలాన్ని వాసన చూస్తే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది.మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. సుగంధ తైల చికిత్సలో పుదీనా తైలాన్ని విరివిగా ఉపయోగిస్తారు. పుదీనా లోని ఔషధ విలువలు రక్త ప్రసరణను క్రమ బద్ధం చేస్తాయి.
రోజూ కొన్ని పుదీనా ఆకులు నమిలితే తాజాదనం ,ఉత్సాహం రోజంతా నిలిచి ఉంటాయి. ఇవి యాంటీ సెప్టిక్ టూత్ పేస్ట్ లా పని చేస్తాయి. నోటి దుర్వాసన పోగొట్టడంతో పాటు పళ్ళు పుచ్చి త్వరగా రాలి పోకుండా కాపాడుతాయి.కాసిన్ని పుదీనా ఆకులను నీళ్లలో వేసి స్నానం చేస్తే శరీరం ఎంతో ఫ్రెష్ గా ఉంటుంది.
తాజా పుదీనా ఆకులు,ఉప్పు కలిపి మరిగించిన నీటిని పుక్కిలించడం వలన గొంతులోని ఇబ్బందులు తొలగుతాయి. పుదీనా కషాయం గొంతు నొప్పికి మంచి మందులా పని చేస్తుంది. పుదీనా ఆకులను నమలడం వలన పళ్ళు తల తలా మెరుస్తాయి.అందువల్లనే ఔషధ తయారీ సంస్థ లు మెంథాల్ ( పుదీనా నుంచి తీసిన సారం )ఎన్నో రకాల ఔషధాలలో కీలకమైన భాగంగా ఉపయోగిస్తున్నాయి .
పుదీనా లో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. పుదినాలోని ఫైటో న్యూట్రియెంట్స్ పెద్ద ప్రేవులు,ఊపిరితిత్తుల ,చర్మం క్యాన్సర్లను నిరోధించగలవని విశ్వసిస్తున్నారు.
పుదీనా లో విటమిన్ ఎ, సీ తో పాటు తగినంత పీచు పదార్థం ,ఫోలేట్,ఇనుము,విటమిన్ బి 2 వంటి పోషకాలు ఉన్నాయి.
మీరు ఎంతో ఇష్టపడి తాగే కాఫీ, టీ లలోని టానిన్ , కెఫిన్ ల దుష్ప్రభావాలను తగ్గించడానికి తాజా పుదీనా ఉపయోగించడం మంచిదని ఇటీవలి అధ్యయనాలు వెల్లడిస్తున్నాయ్. స్పియర్ మింట్ లేదా పెప్పర్ మింట్ చిన్న కొమ్మల నుండి ఆకుపచ్చని ఆకులు కోసి మీ టీ పాట్ లో వేయండి. మీకు ఇష్టమైన పుదీనా టీ తాగడానికి వాటిని బాగా మరగ నివ్వండి. మరింత ప్రభావ వంతమైన, ఇంపైన రుచి , పరిమళం వచ్చేందుకు 2 నిమిషాలు లేదా అంతకన్నా ఎక్కువ సేపు మరగ నివ్వండి.
గ్రీకు పౌరాణిక గాథ..
పుదీనా గురించి ప్రాచుర్యంలో ఉన్న పౌరాణిక గాథలలో ప్రాచీన గ్రీకుల నమ్మకాలకు సంబంధించిన వృత్తాంతం ఒకటి ఉంది. పుదీనా గొంతులోని ఇబ్బందులను తొలగించి స్ఫుట గాత్రాన్ని ఇస్తుందని , ఎక్కిళ్ళకు మంచి మందుగా పనిచేస్తుంది అని గ్రీకుల నమ్మిక.నిజానికి పుదీనా గ్రీకు పౌరాణిక గాథ లలో ఒక అంతర్భాగం.
ఒక సాంప్రదాయ గాథ ప్రకారం ఫ్లూటో ప్రేయసి మెంథె సహజ లావణ్య సుందరి. ఆమె ఒకమారు ఫ్లూటో భార్య పేర్సే ఫ్లోమ్ పై పట్టరాని ఆగ్రహాన్ని ప్రదర్శించింది. దాంతో మండిపడ్డ ఫ్లూటో భార్య ఎంతో కోపంతో నలుగురి పాదాల కింద నలిగి పోయేలా మెంతే ను ఒక చిన్న మొక్కగా మార్చేసింది.
తిరిగి మనిషిగా మార్చడానికి శక్తి లేని ఫ్లూటో ఆ మొక్క పుదీనా ను ఒక తీయని పరిమళాన్నిచి ఎంతో మృదువుగా మలిచాడు. దానితో పుదీనా ఆకులు ఎక్కడ ఉంటే అక్కడ కమ్మని సువాసనలు విరజిమ్ముతాయి.
ఎయిర్ ఫ్రెషనర్ గా..
పుదీనా ను కుండీలలో పెంచుకోవచ్చు. ఇతర మూలికలతో పాటు దీన్ని నాటవచ్చు. ఇది చీమలను దూరంగా ఉంచే,ఎలుకలు, ఇతర పరుగులతో పోరాడే ఒక మంచి మూలిక. చీమల్ని,ఎలుకలను,పురుగులను పారద్రోలెందుకు కొన్ని పుదీనా ఆకులను ఆహార పదార్థాలకు , పడకకు, వార్డ్ రోబ్ ల దగ్గరలో ఉంచండి.
ఎయిర్ ఫ్రెషనర్ గా వాడచ్చు. ప్రతీ గదిలో ఓషధీ యుత పరిమళం పరివ్యాప్తమౌతుంది. ఇల్లంతా తాజా సువాసన నిండుతుంది. ఉత్సాహకరమైన మిశ్రమాన్ని తయారు చేసేందుకు రోజ్ మేరీ, నిమ్మ గడ్డిలతో పుదీనా ను చేర్చి ఒక పాత్రలో వేసి నీళ్లు పోసి బాగా ఉడికించాలి. తాజా ఆకులుగానో, రసం గానో , ఎండిన ఆకు గానో, తైలం గానో దొరికే పుదీనా ను ప్రత్యేక పద్ధతిలో ఉపయోగించడం వల్ల సరైన రుచి చేకూరుతుంది.
దాన్ని ఏ రూపంలో తీసుకున్నా పుదీనా ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేసే ఓషధి. మన పూర్వీకులు ఆరోగ్య ప్రయోజనాల కోసమే ఈ గాఢమైన ఓషధిగా పెంచారు. ఈనాటికీ పిత్తాశయంలో రాళ్ల దగ్గర నుంచి కడుపులో మంట వరకు , మామూలు జలుబు వరకు ఎన్నో వైద్య పరిస్థితులలో జంతు, వృక్ష శాస్త్రజ్ఞులు పెప్పర్ మింట్ ను ఉపయోగిస్తారు.
పుదీనా ను అన్ని రకాల కూరలలో కలగలుపుగా వాడుకోవచ్చు. తాజా పుదీనా ఆకు ఆకుపచ్చగా ఎంతో తాజాగా సువాసనా భరితంగా ఉంటుంది.
దీన్ని ఎన్నో రకాల వంటకాల్లో వాడుకోవచ్చు. పుదీనా తో సలాడ్లు,రైతాలు,జ్యూసులు , ఐస్ క్రీములు,తైలాలు తయారు చేసుకోవచ్చు. ఏ రూపంలో తీసుకున్నా పుదీనా చేసే మేలు ఇంతా అంతా కాదు. ఈ పచ్చని ఆకులు తోడుగా ఉంటే ఏ రోగమూ దరి చేరదు.కాబట్టి హాయిగా తినాలి,ఆరోగ్యంగా జీవించాలి.
5, ఆగస్టు 2012, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
Featured post
NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )
రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...
-
తెలుగు - తుమ్మ చెట్టు english - indian gum arabic tree హిందీ - బాబుల్ సంస్కృతం లో- బార్బరా మిత్రులారా తుమ్మ చెట్టుతో తయారుచేసిన నాగళ్...
-
మనం తినే ఆహార పదార్థాలలో మహా ఔషధ శక్తులు నుండి ఉన్న ముల్లంగి కూర కూడా ఒకటి. ఈ ముల్లంగి తల నుండి పాదాల వరకు వచ్చే సమస్త రోగాలను సర్వనాశనం...

