9, ఫిబ్రవరి 2026, సోమవారం

అలనాటి.. అలసందల కూర.. ఉపయోగాలు

 నొసట చుట్టలు చుట్టలుగా తిరుగుతూ జీరాడే ముంగురుల వలయ ఆకారాన్ని సంస్కృతంలో అల్ అని పిలుస్తారు. సాంద్రత అంటే దట్టంగా ఉండటం .అల్ సాంద్ర గా ఉన్న కాయలు అలసంద కాయలు అయ్యాయి. మినుముల కన్నా ఎక్కువ సమయం బలకరమైనవిగా ఉండడంతో వీటికి రాజమాష అనే గౌరవనామం వచ్చింది. 

అలసందలు పొడవుగా ఉంటాయి, బొబ్బర్లు మాత్రం చిన్నవిగా ఉంటాయి. నవధాన్యాలలో వీటి గింజలు కూడా ఉన్నాయి. వగరుగా ఉండడం వల్ల షుగరు ,స్థూలకాయం నియంత్రణకు ఉపకరిస్తాయి .పురుషుల జీవకణాలను మరియు బాలింతలలో తల్లిపాలను పెంచుతాయి. అలసందలు తినిన వెంటనే పొట్ట బరువుగా, ఎసిడిటీ పెరిగినట్టుగా అనిపించినా.. జీర్ణ ప్రక్రియ పూర్తయ్యేసరికి అదే ఎసిడిటీని తగ్గిస్తాయి. తిన్న తర్వాత చాలాసేపు ఆకలి వేయనీయకుండా, పొట్ట దండిగా ఉండడంతో ఉదయం పూట షుగర్ మాత్రలు వేసుకునే వారికి అలసందల సలాడ్ చాలా  అనుకూలమైనది. ప్రోటీన్లు సమృద్ధిగా ఉండటం వల్ల దేహానికి పుష్టిని ,మనసుకు సంతోషాన్ని ఇస్తాయి.

అలసందల కూర ఎలా చేయాలి అంటే..

 నల మహారాజు పాకదర్పణంలో అలసందలను కూరగా వండుకోవడాన్ని వివరంగా చెప్పాడు. ఇది రాజ భోజనం, అంటే పోషక విలువల సంపన్నతను పెంపు చేసుకునే ఉపాయం కూడా..

1. అలసందలను ముక్కలుగా తరిగి ఉప్పు కలిపిన నీటిలో వేసి పది నిమిషాలు ఉంచి నీటిని వార్చేయాలి. 

2.పసుపు ,ఇంగువ ,ధనియాల పొడి కలిపి, మంచినీళ్లు పోసి ముక్కలు మెత్తబడేదాకా ఉడికించి, నీటిని వార్చేయాలి .

3.కొబ్బరి తురుము, తెల్ల నువ్వులు ..వీటిని పాలతో మెత్తగా నూరి ముద్దగా చేసి ఈ ముక్కలలో కలపాలి.

 4.కొద్దిగా పాలు పోసి పాలు ఇగిరే దాకా మళ్ళీ మృదువుగా ఉడికించి ,నెయ్యి వేసి పొయ్యి మీద నుండి దించేయాలి.

 5.కూర చల్లారాక ..పచ్చ కర్పూరం ,కస్తూరి, కుంకుమ పువ్వు ,ఆవాలు ,మిరియాలపొడి లను చిటికెడంత కలపాలి .నిమ్మ ముక్కలు ,మొగలిరేకులు ఇలాంటి పరిమళాలను కూడా చేర్చి మూత పెట్టి పక్కన ఉంచాలి.

 6.తినబోయే ముందు నిమ్మ ,మొగలి రేకులను తీసేసి ఈ కూర మొత్తాన్ని ఒక తెల్లని వస్త్రంలో మూటగట్టి కాగే నెయ్యిలో ఈ మూటని కాసేపు ఉంచి వడ్డించాలి.


 ఇది కేవలం వంట విధానం మాత్రమే కాదు.. రుచి, పరిమళం, జీర్ణశక్తి ,పోషణ ఈ నాలుగింటిని సమన్వయం చేసిన ప్రాచీన రాజస ఆహార శాస్త్రం. వేడివేడిగా అన్నంలో తింటే కమ్మగా, శక్తిదాయకంగా ఉంటుంది. వాతం, కఫం, ఎసిడిటీలు కలగకుండా ఉంటాయి. 

ఈ కూరని ఇలా ఎనిమిది అంచలుగానే చేయాలా లేక ఉడకబెట్టి తాలింపు పెడితే చాలదా అనే సందేహం రావచ్చు. మామూలు కూరలోని గుణ దోషాలను సరిచేసి శక్తి సంపన్నమైనదిగా తయారు చేసుకునే ఉపాయాలు తెలియజెప్పటమే పాకశాస్త్ర ప్రయోజనం. పచ్చ కర్పూరం, ఆవపిండి వీటిని చాలా కొద్దిగా మాత్రమే కలపాలి. ఎక్కువైతే చేదు వస్తుంది. కూర బాగా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని కలపాలి. పచ్చ కర్పూరం పరిమళభరితమే కాకుండా కూరలోని పోషకాలు త్వరగా శరీరానికి వంట బట్టేలా చేస్తుంది. ఈ గుణాన్ని యోగ వాహి అని అంటారు. ఆవపిండి, మిరియాల పొడి కూడా పోషకాలను అవి పని చేసే అవయవానికి వేగంగా తీసుకువెళ్లేందుకు సహకరిస్తాయి. అంతేకాదు పచ్చ కర్పూరం పరిమళం తగలగానే ఆ వంటకం పట్ల మనకు పవిత్రమైన భావన కలుగుతుంది .అందువలన అది వంటబట్టే తీరు వేరుగా ఉంటుంది . అలాగే ఆవపిండి స్వల్ప మోతాదులోనే కలిపినా జీర్ణశక్తిని పెంచి వాతాన్ని పోగొడుతుంది. ఇలా అలసందలతో ఎన్నో రకమైన ఉపయోగాలు ఉండట వలన దానిని మనం చక్కగా సద్వినియోగం చేసుకొని మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి.

నల్ల జీలకర్ర..ఎంతో మేలు..

 సూపులూ,బ్రెడ్ ల పైన చల్లుకునే నల్లటి కళోంజి గింజలు తెలుసు కదా.. ఇది వంటకాలకి రుచి తీసుకురావడమే కాకుండా రక్తంలోని చెడు కొవ్వుని తగ్గించి గుండె జబ్బులు రాకుండా చూస్తాయట .నల్ల జీలకర్ర లేదా నైజల్లా అని కూడా పిలిచే ఈ గింజలని రోజువారి ఆహారంలో సుమారుగా ఒక ఐదు గ్రాముల వరకు తీసుకుంటే ఎనిమిది నుంచి పది వారాలలోపే రక్తంలోని చెడు కొవ్వు తగ్గుముఖం పడుతుందని అంటున్నారు జపాన్లోని ఒసాకా మెట్రోపాలిటన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. పరిశోధనలో భాగంగా కొంతమంది ఉబకాయులకు నల్ల జీలకర్ర గింజల్ని ఆహారంలో భాగం చేశారు. 8 వారాల్లోనే ఆ వ్యక్తుల్లో ట్రై గ్లిజరయిడ్లు, అంతర్గత వాపులు తగ్గడంతో పాటు బరువు కూడా నియంత్రణలోకి రావడం గమనించారు. ఈ గింజల్లోని థైమేక్వైనోన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కి శరీరంలో కొవ్వు పేరుకోకుండా చేసే శక్తి ఉందని ఈ పరిశోధనలో తేలింది. అయితే జీవనశైలి మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం, తగిన వైద్య సలహాలు తోడైనప్పుడే  వారిలో ఈ ఫలితాలు పూర్తిగా లభిస్తాయని సారాంశం.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...