14, మార్చి 2026, శనివారం

ఫలాలలోకెల్లా ఉత్తమం ద్రాక్ష

 ఆయుర్వేదంలో ద్రాక్షను ఫలోత్తమం అని ప్రశంసించడం జరిగింది. ద్రాక్షలో అనేక పోషక విలువలు ఉండటమే దీనికి ముఖ్య కారణం. మన పురాతన గ్రంథాల్లో ద్రాక్షపళ్లను ద్రాక్ష మృద్విక, గోస్తని, మధురస అనే పేర్లతో పేర్కొన్నారు.

 ప్రస్తుతం మనకు ప్రధానంగా ఆకుపచ్చ ద్రాక్ష, నల్ల ద్రాక్ష, కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష లభిస్తున్నాయి. ఈ మూడింటికి గుణాలు దాదాపు ఒకేలా ఉన్న ,తీపి పులుపు నిష్పత్తులలో తేడాలు ఉన్నాయి. అందుకే వాటి గుణాల్లో కూడా స్వల్ప మార్పులు కనిపిస్తాయి. ఇక ద్రాక్ష వల్ల కలిగే ఆరోగ్య ఫలితాలు ఏమిటంటే ..

ద్రాక్ష శరీరానికి చలవనిస్తాయి. దద్దుర్లు తగ్గించడంలో సహాయపడతాయి .అలసటతో కూడిన నొప్పులను, అరికాళ్ళు, అరిచేతులలో కలిగే మంటలను తగ్గిస్తాయి. మూత్ర విసర్జనకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ద్రాక్ష వల్ల తొలగిపోతాయి .

నల్ల ద్రాక్ష ,ఆకుపచ్చ ద్రాక్షల మధ్య గుణాలలో తేడా ఉండదు. అయితే ఔషధాలు తయారీలో నల్ల ద్రాక్షను ఎక్కువగా వాడుతారు. నల్ల ద్రాక్ష మగత, బద్ధకం, ఆవులింతలు, అలసటలను తగ్గిస్తుంది .

బాగా పండిన నల్ల ద్రాక్ష దప్పికను, అలసటను తగ్గించి శరీర వేడిని ఉపశమింప చేస్తుంది. శరీరానికి బలం, మృదుత్వాన్ని ఇస్తుంది. ఉబ్బసం, గ్యాస్, ఉబ్బరాలను తగ్గించడంలో కూడా దోహదం చేస్తుంది.

 పచ్చి ద్రాక్ష ఎక్కువ పుల్లగా ఉండి వగరు రుచిని కలిగిస్తుంది. అది శరీరాన్ని వేడెక్కించి, రక్తస్రావాన్ని పెంచే అవకాశం ఉంది. అందువల్ల బాగా పండిన ద్రాక్షనే తినాలని ఆయుర్వేద గ్రంథాలు సూచిస్తాయి..

ఎండు ద్రాక్ష మలబద్ధకాన్ని తగ్గించి ,విరేచనాన్ని సులభంగా జరిగేలా చేస్తుంది. జ్వరము, ఊపిరితిత్తుల సమస్యలు, వాంతులు, కీళ్ల నొప్పులు, లివర్ వ్యాధులు, అరికాళ్ళ మంటలు ,చర్మం ఎండిపోవడం, కండరాల బలహీనత వంటి సమస్యల నివారణకు ఈ ద్రాక్ష ఉపకరిస్తుంది.

 నెలసరి సమయంలో మహిళలు ద్రాక్ష తినటం అలవాటు చేసుకోవడం మంచిది. నోరు చేదుగా ఉండడం, అజీర్తి ఉన్నప్పుడు వాటిని తగ్గించడంలో ద్రాక్ష ఉపకరిస్తుంది. మేలు చేస్తుంది .

ద్రాక్ష ఉపిరితిత్తులకు రక్షణ నిస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. ద్రాక్ష రసం తాగటం వల్ల మద్యపానం చేయాలని కోరిక కూడా తగ్గుతుంది.

9, ఫిబ్రవరి 2026, సోమవారం

అలనాటి.. అలసందల కూర.. ఉపయోగాలు

 నొసట చుట్టలు చుట్టలుగా తిరుగుతూ జీరాడే ముంగురుల వలయ ఆకారాన్ని సంస్కృతంలో అల్ అని పిలుస్తారు. సాంద్రత అంటే దట్టంగా ఉండటం .అల్ సాంద్ర గా ఉన్న కాయలు అలసంద కాయలు అయ్యాయి. మినుముల కన్నా ఎక్కువ సమయం బలకరమైనవిగా ఉండడంతో వీటికి రాజమాష అనే గౌరవనామం వచ్చింది. 

అలసందలు పొడవుగా ఉంటాయి, బొబ్బర్లు మాత్రం చిన్నవిగా ఉంటాయి. నవధాన్యాలలో వీటి గింజలు కూడా ఉన్నాయి. వగరుగా ఉండడం వల్ల షుగరు ,స్థూలకాయం నియంత్రణకు ఉపకరిస్తాయి .పురుషుల జీవకణాలను మరియు బాలింతలలో తల్లిపాలను పెంచుతాయి. అలసందలు తినిన వెంటనే పొట్ట బరువుగా, ఎసిడిటీ పెరిగినట్టుగా అనిపించినా.. జీర్ణ ప్రక్రియ పూర్తయ్యేసరికి అదే ఎసిడిటీని తగ్గిస్తాయి. తిన్న తర్వాత చాలాసేపు ఆకలి వేయనీయకుండా, పొట్ట దండిగా ఉండడంతో ఉదయం పూట షుగర్ మాత్రలు వేసుకునే వారికి అలసందల సలాడ్ చాలా  అనుకూలమైనది. ప్రోటీన్లు సమృద్ధిగా ఉండటం వల్ల దేహానికి పుష్టిని ,మనసుకు సంతోషాన్ని ఇస్తాయి.

అలసందల కూర ఎలా చేయాలి అంటే..

 నల మహారాజు పాకదర్పణంలో అలసందలను కూరగా వండుకోవడాన్ని వివరంగా చెప్పాడు. ఇది రాజ భోజనం, అంటే పోషక విలువల సంపన్నతను పెంపు చేసుకునే ఉపాయం కూడా..

1. అలసందలను ముక్కలుగా తరిగి ఉప్పు కలిపిన నీటిలో వేసి పది నిమిషాలు ఉంచి నీటిని వార్చేయాలి. 

2.పసుపు ,ఇంగువ ,ధనియాల పొడి కలిపి, మంచినీళ్లు పోసి ముక్కలు మెత్తబడేదాకా ఉడికించి, నీటిని వార్చేయాలి .

3.కొబ్బరి తురుము, తెల్ల నువ్వులు ..వీటిని పాలతో మెత్తగా నూరి ముద్దగా చేసి ఈ ముక్కలలో కలపాలి.

 4.కొద్దిగా పాలు పోసి పాలు ఇగిరే దాకా మళ్ళీ మృదువుగా ఉడికించి ,నెయ్యి వేసి పొయ్యి మీద నుండి దించేయాలి.

 5.కూర చల్లారాక ..పచ్చ కర్పూరం ,కస్తూరి, కుంకుమ పువ్వు ,ఆవాలు ,మిరియాలపొడి లను చిటికెడంత కలపాలి .నిమ్మ ముక్కలు ,మొగలిరేకులు ఇలాంటి పరిమళాలను కూడా చేర్చి మూత పెట్టి పక్కన ఉంచాలి.

 6.తినబోయే ముందు నిమ్మ ,మొగలి రేకులను తీసేసి ఈ కూర మొత్తాన్ని ఒక తెల్లని వస్త్రంలో మూటగట్టి కాగే నెయ్యిలో ఈ మూటని కాసేపు ఉంచి వడ్డించాలి.


 ఇది కేవలం వంట విధానం మాత్రమే కాదు.. రుచి, పరిమళం, జీర్ణశక్తి ,పోషణ ఈ నాలుగింటిని సమన్వయం చేసిన ప్రాచీన రాజస ఆహార శాస్త్రం. వేడివేడిగా అన్నంలో తింటే కమ్మగా, శక్తిదాయకంగా ఉంటుంది. వాతం, కఫం, ఎసిడిటీలు కలగకుండా ఉంటాయి. 

ఈ కూరని ఇలా ఎనిమిది అంచలుగానే చేయాలా లేక ఉడకబెట్టి తాలింపు పెడితే చాలదా అనే సందేహం రావచ్చు. మామూలు కూరలోని గుణ దోషాలను సరిచేసి శక్తి సంపన్నమైనదిగా తయారు చేసుకునే ఉపాయాలు తెలియజెప్పటమే పాకశాస్త్ర ప్రయోజనం. పచ్చ కర్పూరం, ఆవపిండి వీటిని చాలా కొద్దిగా మాత్రమే కలపాలి. ఎక్కువైతే చేదు వస్తుంది. కూర బాగా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని కలపాలి. పచ్చ కర్పూరం పరిమళభరితమే కాకుండా కూరలోని పోషకాలు త్వరగా శరీరానికి వంట బట్టేలా చేస్తుంది. ఈ గుణాన్ని యోగ వాహి అని అంటారు. ఆవపిండి, మిరియాల పొడి కూడా పోషకాలను అవి పని చేసే అవయవానికి వేగంగా తీసుకువెళ్లేందుకు సహకరిస్తాయి. అంతేకాదు పచ్చ కర్పూరం పరిమళం తగలగానే ఆ వంటకం పట్ల మనకు పవిత్రమైన భావన కలుగుతుంది .అందువలన అది వంటబట్టే తీరు వేరుగా ఉంటుంది . అలాగే ఆవపిండి స్వల్ప మోతాదులోనే కలిపినా జీర్ణశక్తిని పెంచి వాతాన్ని పోగొడుతుంది. ఇలా అలసందలతో ఎన్నో రకమైన ఉపయోగాలు ఉండట వలన దానిని మనం చక్కగా సద్వినియోగం చేసుకొని మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి.

నల్ల జీలకర్ర..ఎంతో మేలు..

 సూపులూ,బ్రెడ్ ల పైన చల్లుకునే నల్లటి కళోంజి గింజలు తెలుసు కదా.. ఇది వంటకాలకి రుచి తీసుకురావడమే కాకుండా రక్తంలోని చెడు కొవ్వుని తగ్గించి గుండె జబ్బులు రాకుండా చూస్తాయట .నల్ల జీలకర్ర లేదా నైజల్లా అని కూడా పిలిచే ఈ గింజలని రోజువారి ఆహారంలో సుమారుగా ఒక ఐదు గ్రాముల వరకు తీసుకుంటే ఎనిమిది నుంచి పది వారాలలోపే రక్తంలోని చెడు కొవ్వు తగ్గుముఖం పడుతుందని అంటున్నారు జపాన్లోని ఒసాకా మెట్రోపాలిటన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. పరిశోధనలో భాగంగా కొంతమంది ఉబకాయులకు నల్ల జీలకర్ర గింజల్ని ఆహారంలో భాగం చేశారు. 8 వారాల్లోనే ఆ వ్యక్తుల్లో ట్రై గ్లిజరయిడ్లు, అంతర్గత వాపులు తగ్గడంతో పాటు బరువు కూడా నియంత్రణలోకి రావడం గమనించారు. ఈ గింజల్లోని థైమేక్వైనోన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కి శరీరంలో కొవ్వు పేరుకోకుండా చేసే శక్తి ఉందని ఈ పరిశోధనలో తేలింది. అయితే జీవనశైలి మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం, తగిన వైద్య సలహాలు తోడైనప్పుడే  వారిలో ఈ ఫలితాలు పూర్తిగా లభిస్తాయని సారాంశం.

30, జనవరి 2026, శుక్రవారం

తిండి తగ్గించినా బరువు తగ్గడం లేదా?

 బరువు తగ్గడానికి ఆహారంలో కేలరీలు తగ్గించారు. మొదట్లో కాస్త బాగానే బరువు తగ్గారు. కానీ ఆ తర్వాతే పెద్దగా మార్పు కనిపించడం లేదు. బరువు తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తే చాలా మది ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి కారణం లేకపోలేదు. కేలరీలు మరీ ఎక్కువగా తగ్గిస్తే శరీరం ఆకలితో మాడే స్థితిలోకి వెళ్తుంది. దీంతో జీవక్రియల వేగం నె మ్మదిస్తుంది. కొవ్వును ఇంధనంగా వాడుకోవడానికి బదులు నిల్వ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ సదరన్ డెన్మార్క్ పరిశోధకులు కొత్త పరిష్కారాన్ని కనుగొనడం మీద దృష్టి సారించారు. జీవ క్రియల వేగం మందకించకుండా చూసే మందుతో పరువు తగ్గడాన్ని కొనసాగించుకోవచ్చని భావిస్తున్నారు.

రోజుకు ఎంత నూనె వాడాలి?

మనిషికి రోజుకు 20 మిల్లీలీటర్లు అంటే నాలుగు టేబుల్ స్పూన్లు మించకుండా చూసుకోవాలి .అంటే నలుగురు సభ్యులు ఉన్న కుటుంబం నెలకు రెండున్నర లీటర్లకు మించి  ఉపయోగించకూడదు. ఐ సి ఎం ఆర్ సిఫారసు ప్రకారం చూసినా నాలుగు లీటర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ మించకూడదు.

మనదేశంలో ఒక్కో మనిషి సగటున ఏకంగా ఏడాదికి 23½ లీటర్ల వంటనూనె వాడేస్తున్నాడని అంచనా. 2001లో వంటనూనెల తలసరి వాడకం 8.2 లీటర్లు ఉంటే నాలుగేళ్లలో మూడింతలు అయింది. భారత వైద్య పరిశోధన మండలి ఐసిఎంఆర్ సిఫారసు ఏడాదికి 12 లీటర్లు మాత్రమే. ఏ లెక్కన చూసినా మన వినియోగం చాలా ఎక్కువ అన్నమాట .ఆహార పదార్థాల్లో నూనె ఎక్కువైతే ఊబకాయం ,గుండె సంబంధ సమస్యలు తలెత్తుతాయని నిపుణులు సూచిస్తున్నారు .అంటే నూనెలకు అధిక మొత్తంలో ఖర్చు చేయడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా కొని తెచ్చుకుంటున్నాం.

ఎందుకింత వాడుతున్నాం అంటే..

గతంతో పోలిస్తే ప్రస్తుతం కుటుంబ ఆదాయాలు బాగా పెరిగాయి. ప్రజలు భిన్న రుచులకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటి వంట కంటే బయట తిండి పెరిగింది. ఆన్లైన్ ఆర్డర్లు పెరుగుతున్నాయి. 

మరి ఏ నూనె మేలు అంటే..

ఆవనూనె, వేరుశనగ నూనె, కొబ్బరి నూనె శ్రేష్ఠం. నెల నెలా మార్చి వాడుకోవచ్చు. ఒకదానికి ఒకటి కలిపి ఉపయోగించుకోవచ్చు .రిఫైండ్ కంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ వినియోగించడం మేలు .నూనె ఎంత వాడాం అనేదే కాదు.. దాని నాణ్యత కూడా ముఖ్యమే .నూనెకు బదులుగా రోజుకు 20 మిల్లీలీటర్ల నెయ్యి వాడొచ్చు.

ఇలా అయితే అనారోగ్యాన్ని కొనుక్కున్నట్లే..

 సిఫారసు కు మించిన నూనె వాడటం ద్వారా అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. కడుపుబ్బరం తదితర సమస్యలు తలెత్తుతాయి. జీర్ణక్రియ పై ప్రభావం పడుతుంది . ఇన్సులిన్ సమస్య లను పెంచుతుంది. షుగర్ వ్యాధి కి దారి తీస్తుంది. ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులకి కారణం అవుతుంది. క్యాన్సర్ కు దారి తీసే ప్రమాదం ఉంది.

పదే పదే మరిగిస్తే..

ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడకూడదు. పొంగుతున్నా ,రంగు మారినా దాన్ని అసలే ఉపయోగించకూడదు. రోడ్డుపక్క బళ్ళపై వాడే నూనె చూస్తే నల్లగా జిగురుగా ఉంటుంది .దాన్నే మళ్ళీ ఉపయోగించి ఆహార పదార్థాలు తయారుచేస్తారు. వాటినే తింటుంటాం. ఇలా ఉపయోగించిన నూనెలను తిరిగి మళ్లీ వాడి కూరలు ఆహార పదార్థాలను వేయించొద్దు.

వంట నూనెను ఒకటి రెండు సార్లు వేడి చేయాలి. ఎక్కువసార్లు మరిగిస్తే హానికర సమ్మేళనాలను విడుదల చేస్తుంది. నూనె వేడి చేసినప్పుడు గాలిలోని ఆక్సిజన్తో సంకర్షణ చెంది అందులోని కొవ్వు ఆమ్లాలు విచ్ఛిన్నమైపోయి పెరాక్సైడ్ ఇతర ఆక్సీకరణ ఉత్పత్తులు ఏర్పడతాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడతాయి . ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఆక్రోలిన్ , ఆల్టిహైడ్స్ వంటి విషపూరిత సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయి .ఇవి దీర్ఘకాలంలో అవయవాలపై ప్రభావం చూపిస్తాయి. పదే పదే వేడి చేయడం వల్ల నూనెలోని విటమిన్ ఈ , పాలీ అన్ శాచూరేటెడ్ కొవ్వు ఆమ్లాలు ,ఆంటీ యాక్సిడెంట్లు,ఇతర పోషక విలువలు నాశనం అవుతాయి. నూనె రుచి మారుతుంది .ఆహార పదార్థాల రుచి చేదుగా తయారవుతుంది. 

వాడకం తగ్గించుకుంటే ఖర్చు ఆదా.. ఆరోగ్యం కాపాడుకోవచ్చు..

నెలకు నలుగురు సభ్యులు ఉన్న కుటుంబం.. నాలుగు లీటర్ల వంటనూనెకు బదులు కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఖరీదైనా రెండు లీటర్లు వాడుకోవడం మేలు. నూనె వాడకం సగం తగ్గించుకుంటే ఇంటి ఖర్చు ఆదా అవుతుంది. ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. కూరలు వేపుడు కాకుండా ఎయిర్ రోస్టెడ్ ఫ్రై విధానం అనుసరించవచ్చు .అవసరమైతే రుచి కోసం కొంత నూనె వేసుకోవచ్చు. మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ 60% , ప్రోటీన్లు 20 శాతం, ఫ్యాట్ 20 శాతం తీసుకోవాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ప్రోటీన్ తగ్గించుకొని 15% తీసుకోవచ్చు.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...