మర్రి చెట్టును వట వృక్షం అని అంటారు.దీని నీడలో వేరొక మొక్క బతకదు.కాండం,కొమ్మల నుండి ఊడలు పెరుగుతుంటాయి.కిందికి వాలి నేలలోకి దిగిపోతుంటాయి.ఈ విధంగా మర్రి చెట్టు అలా విస్తరించుకుంటూ పోతుంది.ఇది మొరేసి కుటుంబానికి చెందిన మహా వృక్షం.చెట్టు పెద్దగా ఉండి,ఫలాలు చిన్నగా ఉంటాయి.దీనిని ఇంగ్లీషులో బనియన్ ట్రీ అంటారు.సంస్కృతంలో వట ,వ్యగ్రోధ్,జాగ్రిలా,విటపి ,బహుపాద్ అనే పేర్లున్నాయి.హిందీ లో బబాధ,బర్గద్ అంటారు.దీని శాస్త్రీయ నామం ఫైకస్ బెంగాలెన్సిస్ .
దీని వేర్లలో,కాండంలో టానిన్ 10 శాతం ఉంటుంది.ఇదికాకుండా గ్లూకోసిడె,బాంగోలినోసైడ్,టాల్బుటమైస్,గ్లాక్టోసైడ్ ఉన్నాయి.
భౌతిక ధర్మాలు - కఫ,పిత్త దోషాలను హరిస్తుంది.రక్తదోషాలను,నొప్పులను,అల్సర్లను కూడా తగ్గిస్తుంది.వాపులు తగ్గుతాయి.కండ్లకు ఇది మంచిది.రక్తం కారే పైల్స్ ను ఇది నయం చేస్తుంది.వీర్య వృద్ధిని కలిగిస్తుంది.గర్భాశయ సమస్యలను తొలగిస్తుంది.దీని వాడకం వల్ల మనిషికి బలం పెరుగుతుంది.అతిదాహం తొలగిస్తుంది.వాంతులు ఆగిపోతాయి.
వైద్యపరమైన ఉపయోగాలు -
* ముఖ వర్చస్సు పెరగడానికి -
మర్రి లేత ఆకులు లేదా వూడల చిగుళ్ళు - 5 లేదా 6
మసూర్ పప్పు / ఎర్ర కందిపప్పు - 10-20 గ్రాములు
పై వాటిని మంచినీటితో మెత్తగా నూరాలి.ఈ ముద్దను ముఖానికి రాసుకుంటే చర్మరోగలు తగ్గి,వర్చస్సు పెరుగుతుంది.
* ఎండి పసుపురంగులోకి మారిన మర్రి ఆకులు ,మల్లె ఆకులు , రక్త చందనం అన్నీ సమంగా తీసుకుని నీటితో కలిపి మెత్తగా నూరి ముఖానికి రాసుకోవాలి.ముఖ వర్చస్సు పెరగడమే కాకుండా ,చర్మ రోగాలు నశిస్తాయి.
* నిర్గుండి గింబ్జల పొడి, పండిన మర్రి ఆకులు ,దాని పూలు , ప్రియాంగు ,అతిమధురం వేరు ,తామర పువ్వు , లోధ్ర,కుంకుమ పువ్వు,లక్క సమపాళ్ళలో తీసుకుని నీటితో కలిపి మెత్తగా నూరి ముఖానికి రాసుకోవాలి.చర్మం కాంతివంతంగా ఉంటుంది.
చెవి నొప్పి మరియు ఇతర సమస్యలు -
చెవిలో నొప్పి లేదా, చెవిలో పురుగులు ఉంటే అవి పోవడానికి మర్రి ఆకుల పాలు,ఆవాల నూనె కలిపి ,2 చుక్కలు చెవిలో వేయాలి.చెవిలో గడ్డలుంటే అవి నయమౌతాయి,పురుగులుంటే అవి నశిస్తాయి.
మర్రి పాలు మూడు చుక్కలు, మేకపాలు పచ్చివి కలిపి చెవిలో వేయాలి.
తల వెంట్రుకలు ఊడిపోతుంటే -
1. మర్రి ఆకులను కాల్చి దాని భస్మాన్ని 20-25 గ్రాములు తీసుకుని దాన్ని అవిశెల తైలంతో కలిపి తలకు మర్దనా చేయాలి.
2 . లేత మర్రి ఆకుల రసానికి ఆవాల నూనె కలిపి దాన్ని వేడి చేసి సీసాలో నిలువ చేసుకోవాలి.దీనిని రోజూ జుట్టుకు రాసుకుంటే తల వెంట్రుకలు రాలడం,చుండ్రు పట్టడం లాంటి సమస్యలు పోతాయి.
3 . 25 గ్రాముల మర్రి ఊడల పొడి ,జటామాన్సి పొడి ,400 గ్రాముల నువ్వుల నూనె ,2 లీటర్ల తిప్పతీగ రసం ,అన్ని కలిపి ఎండలో ఉంచాలి .దానిలోని నీరు ఆవిరయ్యాక ,వడగట్టి ఆ నూనెను నెత్తికి రాసుకోవాలి.రోజూ ఇలా చేస్తే వెంట్రుకలు ఊడటం ఆగిపోతుంది.వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.
4 . సమపాళ్ళలో మర్రి ఊడలు , నువ్వులు తీసుకుని వాటిని కలిపి ,మెత్తగా నూరి నెత్తికి రాసుకోవాలి.గంట తర్వాత తల దువ్వుకోవాలి.దానితో నెత్తికి రాసింది ఊడిపోతుంది.ఆ తర్వాత గుంటగలగర,కొబ్బరి నూనె కలిపి మెత్తగా నూరి దానిని నెత్తికి రాసుకోవాలి.ఇలా కొన్ని రోజులు చేస్తే వెంట్రుకలు బలంగా ఉండటమే కాక పొడుగ్గా పెరుగుతాయి.
దంత రోగాలు తగ్గడానికి -
1 . 10 గ్రాముల మర్రి బెరడు 5 గ్రాముల కాచు / కిళ్ళీ లో వేసే పొడి దీనిని కవిరి అని కూడా అంటారు , 2 గ్రాముల మిరియాలు కూడా కలిపి మెత్తగా చూర్ణం చేసి దానితో పళ్ళు తోముకోవాలి.
2 . మర్రి పాలను నొప్పి ఉన్న పంటి కింద రాయాలి .నొప్పి తగ్గుతుంది.మర్రిపాలలో దూది ముంచి దానిని పంటికింద రాయాలి దీనితో పంటి నొప్పి ,నోటి దుర్వాసన పోతాయి.
3 .మర్రి చెట్టు ఊడ గట్టిది చూసి ,తెంపి దానితో పళ్ళు తోముకుంటే పళ్ళు తెల్లబడతాయి.నోటి దుర్వాసన,పయోరియా పోతుంది.
ముక్కులోంచి రక్తం కారడం -
మర్రి ఊడల పొడిని మజ్జిగతో తీసుకోవాలి.
నిద్ర లేమి , మత్తుగా ఉండడం తగ్గడానికి -
నీడలో ఆరబెట్టిన మర్రి ముదురు ఆకుల పొడిని 10 గ్రాములు తీసుకుని 1 లీటర్ నీటిలో కలిపి మరిగించాలి.నీరు 1/4 వంతుకు రాగానే దించి ,దీనికి 1 1/2 గ్రాముల ఉప్పును కలపాలి.ఈ నీటిని ఉదయం సాయంత్రం తాగుతుంటే నిద్ర బాగా పడుతుంది ,మత్తు వదులుతుంది.
జలుబుకు మర్రి ఆకుల కషాయం -
లేత మర్రి ఆకులను ఎండబెట్టి పొడి చేయాలి.1 1/2 చెంచాల పొడిని 1 లీటర్ నీటిలో వేసి మరిగించాలి.ఇది 1/4 వంతుకు రాగానే దించి , 3 చెంచాల చక్కెర కలిపి టీ లా తాగాలి.ఇలా రోజూ రెండు పూటలా మర్రి ఆకుల టీ తాగుతుంటే జలుబు , దగ్గు తగ్గుతాయి.మెదడుకు బలం చేకూరుతుంది.
కంటి వాపులు -
10 మి.లీ మర్రి పాలు ,125 మి.గ్రా పచ్చ కర్పూరం,2 చెంచాల తేనె కలిపి దీనిని ఐ లైనర్ తో కంటికి రాసుకోవాలి.దీని వల్ల కంటి వాపులు తగ్గుతాయి.
గుండె దడ తగ్గడానికి -
10 గ్రాముల లేత మర్రి ఆకులను తీసుకుని 150 మి.లీ నీటితో కలిపి మెత్తగా నూరి ద్రావణాన్ని వడగట్టి దానికి పటిక బెల్లం కలిపి రోజూ ఉదయం ,సాయంత్రం తీసుకోవాలి.ఇలా 15 రోజులు చేస్తే గుండె చలనం సక్రమంగా ఉంటుంది.
దగ్గు తగ్గడానికి - లేత మర్రి కొమ్మలను విరిచి 20 గ్రాముల మేర దంచి చల్లటి నీటిలో కలిపి తాగాలి.దీనివల్ల కఫం బయటకు వచ్చి దగ్గు తగ్గుతుంది.
స్త్రీలకు రొమ్ముల బలానికి - లేత మర్రి ఊడల కొసలను కత్తిరించి వాటిని మెత్తగా నీటితో కలిపి నూరి రొమ్ములపై రాసుకోవాలి.ఇలా కొంతకాలం చేస్తే వక్షోజాలు బలంగా తయారవుతాయి.
రక్తం కారని పైల్స్ తగ్గడానికి -
మర్రి చెట్టు బెరడు 20 గ్రాములు ,400 మిల్లీ లీటర్ల నీటిలో వేసి మరిగించాలి.నీరు సగం ఆవిరయ్యాక దించి ,దాన్ని వడగట్టి ,కాస్త చక్కెర నెయ్యి కలిపి తాగాలి.ఇలా కొన్ని రోజులు చేస్తే పైల్స్ నయమవుతాయి.
రక్తం కారే పైల్స్ తగ్గడానికి -
20 గ్రాముల లేత మర్రి ఆకులను ,200 మి.లీ నీటిలో కలిపి మెత్తగా నూరి ఆ నీటిని తాగాలి.ఇలా రెండు మూడు రోజులు చేస్తే రక్తం కారడం ఆగిపోతుంది.పండిన మర్రి ఆకులను కాల్చి భస్మం చేసి ,దానిని గడ్డలపై రాస్తే ఉపశమనం లభిస్తుంది.త్వరగా మానిపోతాయి.
10 మర్రి మొగ్గలను 10 మి.లీ మేక పాలు,100 మి.లీ నీటిలో కలిపి మరిగించాలి.నీరు ఆవిరై కేవలం పాలు మిగిలిన తర్వాత ,వడగట్టి తాగాలి.పైల్స్ నుంచి రక్తం కారడం,రక్త విరేచనాలు తగ్గిపోతాయి.
ఎండిన మర్రి చెక్క ముక్కలను నీడలో కాల్చి,అవి బాగా కాలిన తర్వాత వాటిపై నీళ్ళు చల్లి మెత్తగా నూరాలి.ఈ పొడిని రోజూ రెండు పూటలా నీటితో కలిపి తాగాలి.పైల్స్ నయమవుతాయి.
గడ్డలు పోవడానికి ఈ భస్మాన్ని , 21 సార్లు కడిగిన వెన్నలో కలిపి గడ్డలపై పూయాలి.దీనివల్ల గడ్డలు త్వరగా నయమవుతాయి.నొప్పి ఉండదు.
రక్తంతో కూడిన నీళ్ళ విరేచనాలు తగ్గడానికి -
విరేచనానికి ముందు రక్తం పడినా,లేదా తర్వాత పడినా దాన్ని తొలగించుకోవడానికి 20 గ్రాముల మర్రి మొగ్గలను మెత్తగా నూరి దాన్ని రాత్రంతా నీటిలో నానబెట్టాలి.మరునాడు దాన్ని వడగట్టి 100 గ్రాముల నెయ్యి కలిపి వేడి చెయ్యాలి.కేవలం నెయ్యి మాత్రం మిగిలిన తర్వాత దానికి 20 - ం25 గ్రాముల తేనె ,కాస్త చక్కెర కలిపి తినాలి.
వాంతులు తగ్గుటకు -
లేత మర్రి ఆకుల కషాయాన్ని తయారు చేసి దానిలో కొద్దిగా చక్కెర కలిపి తాగితే వాంతులు ఆగిపోతాయి.లేదా మర్రి లేత ఊడలు నీటితో కలిపి మెత్తగా దంచి నీటిలో కలిపి తాగాలి.
దాహం -
సమపాళ్ళలో మర్రిమొగ్గలు ,దూబ గడ్డి , లోధ్ర,దానిమ్మ మొగ్గ,అల్లం వేరు కలిపి మెత్తగా నూరి దానికి కాస్త తేనె కూడా చేర్చి ఈ మిశ్రమాన్ని బియ్యం కడిగిన నీటితో కలిపి తాగాలి.దీనివల్ల వాంతులు ఆగిపోతాయి,అతిదాహం తగ్గుతుంది.
వికారం తగ్గడానికి -
20 గ్రాముల పచ్చని మర్రి ఆకులు ,7 లవంగాలు కలిపి మెత్తగా నీటిలో వేసి నూరి దాన్ని వడ గట్టగా వచ్చిన ద్రవాన్ని తాగాలి.
నీళ్ళ విరేచనాలు తగ్గడానికి -
బొడ్డు చుట్టుతా మర్రి పాలు వేయాలి.
6 గ్రాముల మర్రి మొగ్గలను ,100 మి.లీ నీటిలో కలిపి మరిగించి దాన్ని వడబోసి ,దానికి కాస్త పటిక బెల్లం కలుపుకొని తాగాలి.ఆ తర్వాత మజ్జిగ కూడా తాగాలి.ఇలా చేస్తే నీళ్ళ విరేచనాలు ఆగిపోతాయి.
మర్రి చెట్టు బెరడు పొడి 3 గ్రాములు ,బియ్యం కడిగిన నీటిలో కలిపి తాగాలి.విరేచనాలు వెంటనే ఆగిపోతాయి.లేదా 9 - 10 గ్రాముల మర్రి మొగ్గలను నూరి పెరుగుతో కలిపి తాగాలి.
డయాబెటిస్ / చక్కెర వ్యాధి తగ్గుటకు -
మర్రి చెట్టు బెరడు దాని లేత ఊడలు ,కలిపి మెత్తగా పొడి చేయాలి.20 గ్రాముల పొడిని అర లీటర్ నీటిలో వేసి మరిగించి అది 1/8 వ వంతుకు దిగగానే దాన్ని వడగట్టి రోజూ రెండు పూటలా తాగాలి.ఇఉలా నెల రోజులు చేస్తే డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
మూత్ర సంబంధిత సమస్యలు తగ్గడానికి -
మర్రి బెరడును మెత్తగా పొడి గొట్టి దానిలో సమంగా చక్కెర కలిపి ఈ మిశ్రమం నుంచి 4 గ్రాములు నీటిలో కలిపి తాగాలి.మూత్రం నుంచి పదే పదే వీర్యం పోతుంటే చక్కెర వాడరాదు.
డిస్ యూరియా,గనేరియా కు చికిత్స -
400 గ్రాముల తాజా లేత మెత్తటి మర్రి ఆకులు ,200 గ్రాముల చోప్ చిన్ని వేర్ల చూర్ణం కలిపి నీటిలో వేసి మెత్తగా నూరి వడగట్టి , కళాయి వేసిన ఇత్తడి పాత్రలో వేసి వేడి చేయాలి.లోపలి ద్రవం చిక్కబడగానే దానికి కొద్దిగా వంశలోచన పొడి లేదా చింత గింజల పొడి కలిపి చల్లర్చి దాన్ని 125 - 300 మి.గ్రా పరిమాణంలో మాత్రలుగా చేసుకోవాలి.వీటిని రోజూ ఒకటి, లేదా రెండు ఆవు పాలతో తీసుకోవాలి. లేదా గనేరియా తగ్గడానికి మర్రి వేరు బెరడును నీడలో ఎండబెట్టి దాన్ని చూర్ణం చేసి షర్బత్ లాగా నీటితో తీసుకోవాలి.
2.5 కిలోల పసుపు పచ్చని ఆకులను 15 లీటర్ల నీటిలో మూడు నాలుగు రోజులు నాన బెట్టాలి.ఆ తర్వాత ఆ నీటిని మరిగించి అది 1/4 వ వంతుకు రాగానే దించి దాన్ని వడ గట్టి మళ్ళీ దానిలోని ఆకులను మెత్తగా దంచి తిరిగి వేడి చేయాలి.అది చిక్కబడగానే దానికి 3 - 6 గ్రాముల గుడూచి ,ప్రవాళ పిష్తి , రెండు ఏలకుల పొడి కలిపి 250 మి.గ్రా పరిమాణంలో మాత్రలు చేయాలి.ఈ మాత్రలను రోజూ ఒకటి చొప్పున పొద్దున ఆవుపాలతో గాని నీటితో గాని మింగాలి.ఈ వైద్యం వల్ల అన్ని మూత్రసంబంధిత వ్యాధులు తగ్గుతాయి.
వీర్య బలహీనత , ఇతర మూత్రసంబంధిత వ్యాధుల నివారణకు ,
మర్రి ఆకుల లేత ఊడల పొడిని రోజూ 4 గ్రాములు రెండు పూటలా నీటితో తీసుకోవాలి.
10 - 20 గ్రాముల మర్రి పండ్లను పటిక బెల్లంతో కలిపి ,పాలతో కలిపి తీసుకోవాలి.ఇది చాలా పోషకం,బలవర్ధకరమైనది.దీనిలో చాలా పోషకాలు, ఖనిజాలు ఉంటాయి.
స్త్రీలలో అధిక ఋతుస్రావం ,ఇతర సంస్యలు తగ్గడానికి -
10 గ్రాముల లేత మర్రి ఊడలు ,100 మి.లీ పాలలో కలిపి ,నూరి దానిని వడగట్టి తాగాలి.దీనివల్ల సంస్య నివారణ అవుతుంది.
మర్రి మొగ్గలు 4, 5 గ్రాములు తీసుకుని నీటిలో వేసి కషాయంగా కాచి రోజూ రెండు పూటలా తాగాలి.
బహుమూత్ర వ్యాధి తగ్గడానికి -
మర్రి గింజలను మెత్తగా నూరి దాన్ని రోజూ ఒకటి రెండు గ్రాములు ఆవుపాలతో రెండుపూటలా తీసుకోవాలి.
సిఫిలిస్ తగ్గడానికి -
సుఖవ్యాధి తగ్గడానికి మర్రి లేత ఊడలు ,అర్జున చెట్టు బెరడు ,లోధ్ర ,కరక్కాయ , పసుపును నీటితో కలిపి మెత్తగా నూరి దాన్ని సిఫిలిస్ వ్యాపించిన చోట పూయాలి.
స్త్రీలకు అధిక రక్తస్రావం సమస్య నిరోధానికి -
మర్రి చెట్టు బెరడు 4 గ్రాములు , మజ్జిగతో కలిపి తీసుకోవాలి.
మర్రి చెట్టు బెరడు కషాయం చేసి దానిలో 2.5 గ్రాముల లోధ్ర గుజ్జు కొద్దిగా తేనె కలిపి రెండు పూటలా తాగాలి.దీనివల్ల స్త్రీలకు మంచి ఉపశమనం లభిస్తుంది.అధిక రక్త స్రావం ఆగిపోతుంది.స్త్రీలకు బహిష్టులో అధిక రక్తస్రావాన్ని అరికట్టడానికి మర్రిచెట్టు బెరడు కషాయంలో ఒక గుడ్డ ముంచి దాన్ని యోనిలో ఉంచుకోవాలి.
రెండు మర్రి ఆకులను 250 మి.లీ నీరు ,250 మి.లీ పాలలో కలిపి దాన్ని సన్నని సెగపై వేడి చేయాలి.నీరు పూర్తిగా ఆవిరయ్యాక పాలను తాగితే అధిక రక్తస్రావం తగ్గుతుంది.
గర్భ ధారణకు చికిత్స -
శుక్ల పషంలో పుష్యమి నక్షత్రం రోజున మర్రి మొగ్గలను తెంపి వాటిని నీటితో కలిపి తినాలి.ఇది కూడా బహిష్టు మూడు రోజులు గడిచిన తర్వాత తీసుకోవాలి.ఇలా నాలుగైదు రోజులపాటు వరుసగా తినాలి.దీనివల్ల గర్భ ధారణకు అవకాశం లభిస్తుంది.
లేదా ,మర్రి మొగ్గలను మెత్తగా నూరి 21 మాత్రలు చేసుకుని రోజూ 3 మాత్రలను నెయ్యితో కలిపి తినాలి.
* కత్తిగాటు ,పదునైన వస్తువు వల్ల వంటికి గాయమై రక్తం కారుతుంటే రక్తం ఆగడానికి మర్రిపాలు దానిపై పూయాలి.
శారీరక బలానికి -
మర్రి ఫలాలను తెంపి వాటిని ఒక గుడ్డపై పరచి నీడలో ఎండబెట్టాలి .వాటికి ఇనుము తగలకుండా చూసుకోవాలి.అవి ఎండిన తర్వాత వాటిని మెత్తగా నూరి ,దానికి సమంగా పటిక బెల్లం కలిపి దాని నుంచి 6 గ్రాములు ఆవుపాలతో కలిపి పొద్దున్నే తీసుకోవాలి.ఇలా కొంత కాలం చేస్తే వంటికి బలం కలుగుతుంది.వీర్య వృద్ధికి తోడ్పడగలదు.
మర్రి పళ్ళు ,పిప్పళ్ళు మెత్తగా నూరాలి ,దీనికి 25 గ్రాముల నెయ్యిని కలిపి వేయించి హల్వా చేయాలి.చిన్న దూడగల ఆవు పాలతో కలిపి ఈ హల్వా తినాలి.ఇలా కొన్ని రోజులు చేస్తే వీర్య వృద్ధి కలుగుతుంది.స్త్రీ ,పురుషులు ఇద్దరు కూడా దీన్ని తినాలి.తద్వారా స్త్రీ గర్భం ధరించడానికి అవకాశం కలుగుతుంది.దానికి తగిన బలం మగాడికి వస్తుంది.
మర్రి మొగ్గలను ఆరబెట్టి పొడిచేసి దానికి సమంగా పటిక బెల్లం కలపాలి.దీన్ని రోజూ పరగడుపున 5 నుంచి 10 గ్రాములు తింటే మగవారికి వీర్యవృద్ధి కలుగుతుంది.
జ్ఞాపక శక్తి పెరగడానికి -
మర్రి చెట్టు బెరడును నీడలో ఎండనిచ్చి ,చూర్ణం చేయాలి.దానికి సమంగా పటికబెల్లం కలపాలి.దీన్ని రోజూ ఉదయం వేడిచేసిన ఆవుపాలతో తీసుకోవాలి.దీని వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
అల్సర్లు ,గాయాలు తగ్గడానికి -
గాయం మానకుండా దానినుంచి దుర్వాసన వస్తుంటే దాన్ని మర్రి బెరడు కషాయంతో కడగాలి.తర్వాత గాయంపై మర్రిపాలు పోయాలి.ఇలా చేయడం వల్ల గాయం త్వరగా మానుతుంది.ఇన్ ఫెక్షన్ రాదు.చిన్న గాయమైతే వాటిపై మర్రిపాలు నేరుగా పూయవచ్చు.
ఐతే చేదు పదార్థాలు,వేడి ఆహార పదార్థాలు తీసుకోరాదు.
ఓకవేల గాయానికి కుట్టు పడాల్సిన అవసరం ఉంటే చర్మం చీలిన చోట చర్మం దగ్గరకు లాగి దానిపై వెచ్చచేసిన మర్రి ఆకును ఉంచి కట్టుకట్టాలి.ఈ కట్టును మూడు రోజులవరకు తీయరాదు.నాలుగోరోజున ఎలాంటి కుట్టు అవస్రం లేకుండానే చర్మం అతుక్కుంటుంది.ఇదే విధంగా గడ్డలపైన ,పుండ్లపైనా వేడి చేసిన మర్రి ఆకును ఉంచి కట్టు కట్టాలి.గాయం త్వరగా ఎండిపోయి మానుతుంది.
మర్రి ఆకులను కాల్చి భస్మం తీసి దాన్ని నేతిలో కలిపి గాయాలపై రాస్తే అవి త్వరగా మానిపోతాయి.
వానాకాలంలో తడివల్ల చేతి వేళ్ళమధ్య పుండ్లు వస్తే వాటిపై మర్రి పాలు రాయాలి.పుండ్లు త్వరగా మానుతాయి.
చెమటలు పట్టడానికి - చెమటద్వారా మలినాలు ఒంట్లోంచి వెడలిపోతాయి.చెమటపట్టకపోతే అవి పోవు.ఆటలు ఆడినా , కొద్దిసేపు నడచినా చెమటలు పడతాయి.కాని అలా చెమటలు పట్టని వారికి చెమటవచ్చేందుకు మర్రి చెట్టు పండిన పసుపుపచ్చని ఆకులను నీటిలో వేసి దానిలో కొన్ని బియ్యం కూడా వేసి ఉడికించాలి.ఉడికిన తర్వాత దాన్ని వార్చగా వచ్చిన ద్రవాన్ని తాగాలి.
తీవ్రమైన అల్సర్లు తగ్గడానికి -
మర్రి చెట్టు లేత ఆకులను ,మొగ్గలను నీటిల్కో కలిపి మెత్తగా నూరి ,వడగట్టాలి.వడగట్టిన ద్రవానికి సమంగా నువ్వుల నూనె కలిపి తిరిగి దాన్ని వేడి చేయాలి.నూనె మాత్రమే మిగిలిన తర్వాత దాన్ని చల్లార్చి ఆ నూనెను అల్సర్లపై రోజూ నాలుగైదు సార్లు 2, 3 చుక్కలు వేయాలి.ఈ చికిత్సను భగంధరం వ్యాధికి కూదా వాడవచ్చు.
మర్రిపాలను పామువిడిచిన కుబుసంతో కలిపి మెత్తగా నూరి దానిలో దూదిని ముంచి తీవ్రంగా ఉన్న అల్సర్లపై అద్దాలి.ఇలా పదిరోజులపాటు చేస్తే ఎంతటి మొండి అల్సర్లైనా మానిపోతాయి.ఈ చికిత్సను అల్సర్ల తొలి దశలో చేస్తే ఇంకా మంచిది.
చర్మ రోగాలు తగ్గడానికి -
మర్రి పాలను చర్మరోగం ఉన్నచోట రాత్రిపూట రాయాలి.ఆ తర్వాత మర్రి ఆకులను మెత్తగా నీటితో కలిపి నూరి ఆ ముద్దను చర్మరోగం ఉన్న చోట లేపనంగా వేయాలి.
గడ్డలు / బాయిల్స్ తగ్గడానికి -
గడ్డలు ఇంకా పగలకుండా ఉంటే అక్కడ మర్రిపాలు రాస్తే మానిపోతుంది.ఒకవేళ గడ్డ పగలడానికి సిద్ధంగా ఉంటే మర్రి పాలు రాయగానే అది పగిలి చీము బయటకు వస్తుంది.ఇక అది పూర్తిగా మానిపోవడానికి మర్రిపాలను లేపనంగా పుండుపై వేయాలి.
మర్రి ఆకులపై నువ్వుల నూనె రాసి వాటిని ట్యూమర్ ఉన్న చోట ఉంచి కట్టుకట్టాలి.దీనివల్ల త్వరగా గడ్డ పగులుతుంది.
కాలిన గాయాలకు -
లేత మర్రి ఆకులు ,లేదా మర్రి మొగ్గలను పెరుగుతో కలిపి మెత్తగా నూరి కాలిన చోట రాయాలి.దీనివల్ల వెంతనే ఉపశమనం కలుగుతుంది.
వాపులు తగ్గడానికి -
మర్రి ఆకులపై నెయ్యి రాసి వాటిని వాపులున్న చోట ఉంచి కట్టు కట్టాలి.దీని వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది.
వంటిపై దురదలు తగ్గడానికి -
అరకిలో మర్రి ఆకులను 4 లీటర్ల నీటిలో రాత్రంతా నానబెట్టి ,మర్నాడు ఆ నీటిని మరిగించాలి.నీరు మూడువంతులు ఆవిరైనాక ఆ నీటిలో అరలీటర్ ఆవాల నూనె వేసి మళ్ళీ వేడి చేయాలి.కేవలం నూనె మాత్రం మిగిలిన తర్వాత దాన్ని వడగట్టాలి.ఈ నూనెను దురదలున్న చోట గట్టిగా రాయాలి.ఈ చికిత్స వల్ల అన్ని రకాల వంటి దురదలు తగ్గుతాయి.
No comments:
Post a Comment