Friday, 30 January 2026

తిండి తగ్గించినా బరువు తగ్గడం లేదా?

 బరువు తగ్గడానికి ఆహారంలో కేలరీలు తగ్గించారు. మొదట్లో కాస్త బాగానే బరువు తగ్గారు. కానీ ఆ తర్వాతే పెద్దగా మార్పు కనిపించడం లేదు. బరువు తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తే చాలా మది ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి కారణం లేకపోలేదు. కేలరీలు మరీ ఎక్కువగా తగ్గిస్తే శరీరం ఆకలితో మాడే స్థితిలోకి వెళ్తుంది. దీంతో జీవక్రియల వేగం నె మ్మదిస్తుంది. కొవ్వును ఇంధనంగా వాడుకోవడానికి బదులు నిల్వ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ సదరన్ డెన్మార్క్ పరిశోధకులు కొత్త పరిష్కారాన్ని కనుగొనడం మీద దృష్టి సారించారు. జీవ క్రియల వేగం మందకించకుండా చూసే మందుతో పరువు తగ్గడాన్ని కొనసాగించుకోవచ్చని భావిస్తున్నారు.

రోజుకు ఎంత నూనె వాడాలి?

మనిషికి రోజుకు 20 మిల్లీలీటర్లు అంటే నాలుగు టేబుల్ స్పూన్లు మించకుండా చూసుకోవాలి .అంటే నలుగురు సభ్యులు ఉన్న కుటుంబం నెలకు రెండున్నర లీటర్లకు మించి  ఉపయోగించకూడదు. ఐ సి ఎం ఆర్ సిఫారసు ప్రకారం చూసినా నాలుగు లీటర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ మించకూడదు.

మనదేశంలో ఒక్కో మనిషి సగటున ఏకంగా ఏడాదికి 23½ లీటర్ల వంటనూనె వాడేస్తున్నాడని అంచనా. 2001లో వంటనూనెల తలసరి వాడకం 8.2 లీటర్లు ఉంటే నాలుగేళ్లలో మూడింతలు అయింది. భారత వైద్య పరిశోధన మండలి ఐసిఎంఆర్ సిఫారసు ఏడాదికి 12 లీటర్లు మాత్రమే. ఏ లెక్కన చూసినా మన వినియోగం చాలా ఎక్కువ అన్నమాట .ఆహార పదార్థాల్లో నూనె ఎక్కువైతే ఊబకాయం ,గుండె సంబంధ సమస్యలు తలెత్తుతాయని నిపుణులు సూచిస్తున్నారు .అంటే నూనెలకు అధిక మొత్తంలో ఖర్చు చేయడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా కొని తెచ్చుకుంటున్నాం.

ఎందుకింత వాడుతున్నాం అంటే..

గతంతో పోలిస్తే ప్రస్తుతం కుటుంబ ఆదాయాలు బాగా పెరిగాయి. ప్రజలు భిన్న రుచులకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటి వంట కంటే బయట తిండి పెరిగింది. ఆన్లైన్ ఆర్డర్లు పెరుగుతున్నాయి. 

మరి ఏ నూనె మేలు అంటే..

ఆవనూనె, వేరుశనగ నూనె, కొబ్బరి నూనె శ్రేష్ఠం. నెల నెలా మార్చి వాడుకోవచ్చు. ఒకదానికి ఒకటి కలిపి ఉపయోగించుకోవచ్చు .రిఫైండ్ కంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ వినియోగించడం మేలు .నూనె ఎంత వాడాం అనేదే కాదు.. దాని నాణ్యత కూడా ముఖ్యమే .నూనెకు బదులుగా రోజుకు 20 మిల్లీలీటర్ల నెయ్యి వాడొచ్చు.

ఇలా అయితే అనారోగ్యాన్ని కొనుక్కున్నట్లే..

 సిఫారసు కు మించిన నూనె వాడటం ద్వారా అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. కడుపుబ్బరం తదితర సమస్యలు తలెత్తుతాయి. జీర్ణక్రియ పై ప్రభావం పడుతుంది . ఇన్సులిన్ సమస్య లను పెంచుతుంది. షుగర్ వ్యాధి కి దారి తీస్తుంది. ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులకి కారణం అవుతుంది. క్యాన్సర్ కు దారి తీసే ప్రమాదం ఉంది.

పదే పదే మరిగిస్తే..

ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడకూడదు. పొంగుతున్నా ,రంగు మారినా దాన్ని అసలే ఉపయోగించకూడదు. రోడ్డుపక్క బళ్ళపై వాడే నూనె చూస్తే నల్లగా జిగురుగా ఉంటుంది .దాన్నే మళ్ళీ ఉపయోగించి ఆహార పదార్థాలు తయారుచేస్తారు. వాటినే తింటుంటాం. ఇలా ఉపయోగించిన నూనెలను తిరిగి మళ్లీ వాడి కూరలు ఆహార పదార్థాలను వేయించొద్దు.

వంట నూనెను ఒకటి రెండు సార్లు వేడి చేయాలి. ఎక్కువసార్లు మరిగిస్తే హానికర సమ్మేళనాలను విడుదల చేస్తుంది. నూనె వేడి చేసినప్పుడు గాలిలోని ఆక్సిజన్తో సంకర్షణ చెంది అందులోని కొవ్వు ఆమ్లాలు విచ్ఛిన్నమైపోయి పెరాక్సైడ్ ఇతర ఆక్సీకరణ ఉత్పత్తులు ఏర్పడతాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడతాయి . ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఆక్రోలిన్ , ఆల్టిహైడ్స్ వంటి విషపూరిత సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయి .ఇవి దీర్ఘకాలంలో అవయవాలపై ప్రభావం చూపిస్తాయి. పదే పదే వేడి చేయడం వల్ల నూనెలోని విటమిన్ ఈ , పాలీ అన్ శాచూరేటెడ్ కొవ్వు ఆమ్లాలు ,ఆంటీ యాక్సిడెంట్లు,ఇతర పోషక విలువలు నాశనం అవుతాయి. నూనె రుచి మారుతుంది .ఆహార పదార్థాల రుచి చేదుగా తయారవుతుంది. 

వాడకం తగ్గించుకుంటే ఖర్చు ఆదా.. ఆరోగ్యం కాపాడుకోవచ్చు..

నెలకు నలుగురు సభ్యులు ఉన్న కుటుంబం.. నాలుగు లీటర్ల వంటనూనెకు బదులు కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఖరీదైనా రెండు లీటర్లు వాడుకోవడం మేలు. నూనె వాడకం సగం తగ్గించుకుంటే ఇంటి ఖర్చు ఆదా అవుతుంది. ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. కూరలు వేపుడు కాకుండా ఎయిర్ రోస్టెడ్ ఫ్రై విధానం అనుసరించవచ్చు .అవసరమైతే రుచి కోసం కొంత నూనె వేసుకోవచ్చు. మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ 60% , ప్రోటీన్లు 20 శాతం, ఫ్యాట్ 20 శాతం తీసుకోవాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ప్రోటీన్ తగ్గించుకొని 15% తీసుకోవచ్చు.