Saturday, 16 January 2016

VUPMA AND AYURVEDAM


ఉప్మా రోజూ తినదగినదేనా?

తెలుగు, తమిళ, కన్నడ మలయాళ తదితర ద్రావిడ ప్రజలు కొన్ని ఉత్తరాది
రాష్ట్రాల వాళ్లు కూడా వందలాది ఏళ్లుగా వండుకుని తింటున్న ప్రాచీన వంటకం ఇది!
ఉప్మా మనందరిది!
నీళ్లు పోసి గానీ, లేదా నీళ్ల ఆవిరి మీద గానీ ఉడికించిన పిండిని 'ఉప్పిండి'
అంటారు. దీన్నే ఉప్పుడు పిండి, ఉప్పిండి,
ఉప్పిడి, ఉప్పుమావు అని కూడా పిలుస్తారు.
ఇడి అంటే పిండి. ఉప్పడి అంటే ఉడికించిన
పిండి లేదా రవ్వ. మావు అనేది పిండికి
పర్యాయపదం. శరీరాన్ని శుష్కింప చేసుకో
వటం కోసం కేవలం ఉడికించిన ఉప్పిండిని
తిని పడుకోవడాన్ని ఉప్పడి ఉపవాసం
అంటారు. కమ్మని తాలింపుతో చేసిన
'ఉప్పుమావు' ఆంగ్లేయుల ఉచ్ఛారణలో ఉప్మాగా మారిపోయింది.
డురమ్ అనే రవ్వ గోధుమ గింజ లోపలి నడిభాగాన్ని 'సెమోలినా' అంటారు. ఏ
ధాన్యపు గింజలోంచైనా సెమోలీనా తీయవచ్చు. కానీ, ఈ గోధుమ 'సెమోలీనా' రవ్వ
ఉప్మా తయారీకి బాగా అనుకూలంగా ఉంది. బొంబాయి రవ్వని దక్షిణాది ప్రజలు
గొప్పగా సద్వినియోగపరచుకున్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉప్మా, ఉప్పుమావు,
ఉప్పట్టు, ఉపీత్ పేర్లు వినిపిస్తాయి. బొంబాయి రవ్వతోనే కాకుండా గోధుమరవ్వ
ఉప్మా, మొక్కజొన్న రవ్వ ఉప్మా, పెనర రవ్వ ఉప్మా, నవధాన్యాల ఉప్మా, ఉలవల రవ్వ
ఉప్మాలు ప్రసిద్ధి. దేని గుణాలు దానివి. జీర్ణశక్తి ననుసరించి ఏ ధాన్యపు
రవ్వతో ఉప్మా చేసుకోవాలో నిర్ణయించుకోగలగాలి. ఉప్మా ప్రభావం దాని
వంటలో కాకుండా దాని కోసం వాడే రవ్వ మీద ఆధారపడి ఉంది. తక్కువ
కేలరీలు కలిగిన ఉప్మా కావాలంటే రవ్వ గోధుమల రవ్వ, జొన్న రవ్వ,
సజ్జ రవ్వ ఉత్తమం. రాగి పిండితో కూడా ఉప్మా చేసుకోవచ్చు. అన్ని
వ్యాధుల్లోనూ తినదగినదిగా ఉంటుంది. ఇతర ఉప్మాల కన్నా ఇది తేలిగ్గా
ఆరుగుతుంది. స్థూలకాయం తగ్గడానికి ఉలవ రవ్వ, జొన్న రవ్వ ఉప్మాలు
ఉపయోగపడతాయి. అతి ఆకలిని తగ్గించడానికి పెసర రవ్వ తోడ్పడు
తుంది. ఘనమైన జీర్ణశక్తి ఉన్నప్పుడే బొంబాయి రవ్వ ఉప్మా
తినటం మంచిది.