30, ఆగస్టు 2026, ఆదివారం

భయం.. ఒక మానసిక సమస్య

 భయ పడడం అన్నది ఒక రకమైన మానసిక స్థితి. ఈ భయం ఎప్పుడైనా, ఎవరికైనా రావచ్చు. ఏ వయసులోనైనా రావచ్చు. అసంకల్పితంగా మన స్మృతిలో ఉన్నప్పుడు కానీ, తెలియని స్థితి లో కానీ హఠాత్తుగా ఏర్పడ్డ భావన మనస్సులో స్థిరపడి ఈ భయాలకు కారణం అవుతున్నది. 

అలాగే పాముని చూసి భయం ఉండవచ్చు. పాము ఏం చేయకపోయినా ఆ భయం వల్ల వచ్చే షాక్ వల్ల ప్రమాదం రావచ్చు. కాలేజీలో చదువుకునే ఓ  అమ్మాయికి తనని అద్దంలో చూసుకోవాలంటే భయమట. ఎందుకంటే మిగతా అమ్మాయిల కన్నా తాను అందంగా ఉండననే సంకుచిత భావం క్రమంగా పెరిగి తనని తాను అద్దంలో చూసుకోవడానికి భయం ఏర్పరచుకుంది. 

ఇది ఒక మానసిక న్యూనతా భావం నుంచి వచ్చిన ఒక రుగ్మత. దీన్ని " ఇసోట్రో ఫోబియా " అంటారు. 

ఈ మధ్య ఒక కాలేజీ అబ్బాయి వచ్చి సార్ నాకు ఇంగ్లీషులో పెద్ద పెద్ద వాక్యాలంటే భయం, చదవలేక పోతున్నాను అన్నాడు. ఇది కూడా మానసిక న్యూనత భావం నుంచి వచ్చిన రుగ్మతే . 

రకరకాల భయాలు..

నిజానికి మనమంతా భయం తోనే పుడతాం. భయం తోనే పెరుగుతాం. తెలియని, రాబోయే ప్రమాదాన్ని ఊహించుకుని దాన్ని ఆపడం తెలియక మనం పడే మానసిక వేదన ' భయం '. మరో రకంగా చెప్పాలంటే మనల్ని మనం రక్షించుకునే ఒక కవచం లాంటిది ' భయం '.

అది నిజం కాకపోవచ్చు,కానీ ఆ భయంలో ఉన్నప్పుడు మనని ఇతరులు బలవంతంగా ఏదైనా చేయిస్తే ఆ భయం నిజమై ప్రమాదం కావచ్చు. ఉదాహరణకు ఊగుతున్నప్పుడు ఎత్తుకు వెడితే భయం పుడుతుంది. అది అసంకల్పితంగా, స్వభావంగానే వచ్చే భయం. అప్పుడు అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. హాస్యానికైనా అప్పుడు అతన్ని ఎత్తుకు ఊపకూడదు. 

ఆ భయంతో ఏదైనా జరగవచ్చు. అసలు ఈ భయాలకు అర్థం ఏమిటి.. ఏదో ఒక స్థితిలో మనసులో ఏర్పడ్డ భావన వల్ల తెలియని భయం ఏర్పడి అది స్థిరపడి పోయి కలిగే ఒక మానసిక స్థితి. 

ఆ స్థితి ఊహించనంతగా పెరిగి పెద్దదై భయాన్ని మరీ ఉధృతం చేస్తుంది. అది ఎంతవరకు వెడుతుందంటే కొందరు గడ్డిలో నడవటానికి భయ పడతారు. . పాములు ఉంటాయేమోనని. కొంత మంది ఒంటరిగా ఉండటానికి, మరి కొంత మంది వెలుగుని చూసి భయ పడతారు. 

ఇదొక రకమైన విచిత్రమైన మానసిక బలహీనత. గ్రీకు భాష లో ఫోబియా అంటే భయం. మరో విచిత్రమేమిటంటే మనలో చాలా మందికి ఎంతో కొంత ఈ బలహీనత ఉంటుందన్నది నిజం. ఎవరైనా చనిపోతే అక్కడికెళ్లి వచ్చి కొంత సేపు భయంతో ఉండిపోతాం. కొంత మంది నదిలో స్నానం చేస్తే భయ పడతారు. దీన్ని అబూటో ఫోబియా అంటారు. కొంత మంది దయ్యాలున్నాయని భయ పడతారు. 

ఈ శతాబ్దంలో మరో విచిత్రమైన భయాలు పుట్టుకు వస్తున్నాయి. తమ సెల్ ఫోన్లు పోతాయేమోనని. విమానంలో పైకి వెళ్తున్నప్పుడు భయం. కారులో వేగంగా వెడుతుంటే భయం. మన కారు తలుపులు బిగుసుకు పోయాయని భయం. . ఇలాంటి విచిత్రమైన, వాస్తవం కాని భయాలు ఆధునిక సమాజంలో నేడు వస్తున్నాయి. 

ఈ చిన్న చిన్న భయాలు ఆందోళన కలిగించేవి కావు కానీ వీటి వల్ల వచ్చే ఆవేశం, మానసిక ఒత్తిడి, ఆందోళనల వల్ల వచ్చే మానసిక స్థితి , దాని వల్ల వచ్చే ప్రవర్తనలో మార్పులు వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. 

ఈ మధ్య ఒకాయన మరుగు దొడ్డి లో బల్లిని చూసి భయపడి దాంట్లోకి వెళ్ళడం మానేశాడట. అంతే కాదు, ఏ మరుగు దొడ్డి లోకీ వెళ్ళక నాలుగు రోజులకు కడుపు ఉబ్బరించి డాక్టర్ దగ్గరికి వెళ్ళ వలసి వచ్చిందట. బల్లిని, బొద్దింకలను చూసి భయపడి ఆకాశం , భూమిని, గోడలను చూడకుండా కళ్ళు మూసుకునే వారు కూడా ఉన్నారు. దీన్ని అరక్నో ఫోబియా అంటారు. 

చిన్న చిన్న భయాలు ఒక్కొక్కప్పుడు పెద్ద మానసిక సమస్యగా మారి మన జీవన విధానాన్ని భయ కంపితం చేసి బాధ పెట్టవచ్చు. మనలో చాలామందికి డెంటిస్ట్ దగ్గరికి వెళ్లాలంటే భయం. పళ్ళు లాగేస్తాడని. 

కొంత మందికి హాస్పిటల్ కి వెళితే తెలియని భయం వల్ల బీపీ పెరుగుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. బయటకు రాగానే తగ్గిపోతుంది. 

దైవ ధ్యానం చేయాలి..

కొంత మంది లో భయం మరోలా ఉంటుంది. ఒక రోగిని చూడడానికి వెళ్ళినపుడో , ఒక ప్రమాదం జరిగిన చోటుకి వెళ్ళినప్పుడో భయం అంతర్లీనంగా వస్తుంది. అప్పుడు తెలీకుండా కళ్లలో నీరు ఆగకుండా వస్తుంది. మాట రాదు, ఇది కొద్ది సేపే ఉంటుంది. 

ఇది ఒక మానసిక బలహీన స్థితి. అలా అని ప్రతీ భయం మానసిక రుగ్మత కానక్కరలేదు. మనో వికృత స్థితి కానక్కరలేదు. కానీ ఈ భయాలను మనం నియంత్రించుకోకపోతే జీవన యానం కుంటు పడుతుంది.

ఆరు బయట కూర్చోవాలంటే భయం.. అగోరో ఫోబియా, స్కూలు కెళ్ళటానికి భయం .. డిడాస్ కటైనో ఫోబియా, మూత్ర విసర్జన కు వెళ్లాలంటే భయం.. యూరో ఫోబియా, పెళ్ళి చేసుకోవడమంటే భయం .. గామో ఫోబియా, పాములంటే భయం.. ఒఫిడియో ఫోబియా, సెల్ ఫోన్లు పోతాయేమోనని భయం.. ఫోబియా ఫోనియా . 

ఈ భయాలు బలహీనతలుగా మారి మనిషిలో శాశ్వత మవుతాయి. కాని తాత్కాలికంగా ఉండి కాల ప్రభావంలో మరుగున పడి పోయి తొలగిపోతాయి. 

అందుకే ఆయుర్వేదంలో ఆచార్యులు సత్వ రజో తమోగుణాలైన మానసిక శక్తులను నియంత్రించి పోషక పరిచే జీవన విధానాన్ని సూచించారు. 

అవేమిటంటే.. ప్రతి వారం, తలకి, వెన్నుపూసకి , పాదాలకు నువ్వుల నూనెతో అభ్యంగనం. అంటే మసాజ్ చేసుకొని తలంటు పోసుకోవడం. మేధో రసాయనాలతో చేయ బడిన చక్కెర పొంగలి , బెల్లంతో చేసిన పాయసం తినడం, ఉదయం, రాత్రి పడుకునే ముందు మనస్సును ఒక్క క్షణమైనా ప్రశాంతంగా ఉంచుకొని ధ్యానించాలి. 

అపరిశుభ్రమైన , ప్రమాద కరమైన స్థలాల కెళ్ళినపుడు తిరిగి వచ్చిన వెంటనే తల స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని రెండు చిటికెల జీలకర్ర , కాస్త పసుపు నోట్లో వేసుకోమని చెబుతారు. ఇలా చేయడం వల్ల ఆ మానసిక బలహీనతకు కారణమైన వన్నీ తొలగిపోతాయి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...