21, నవంబర్ 2011, సోమవారం

క్యారెట్..ఆరోగ్య ప్రయోజనాలు..

అనంతుడైన భగవంతుడు సమస్త ప్రాణుల ఆరోగ్యం కోసం, హితం కోసం మందులను సీసాలలోనో, క్యాప్సూల్స్ లోనో దాచలేదు .భూదేవి ఒడిలో కంద, కాయ ,ఆకు, పండు, గింజ, విత్తనం రూపాలలో మన ఎదురుగానే ఉంచాడు. పుడమి తల్లి తన ప్రకృతిలో అమూల్య భాండాగారాన్ని, ఔషధ తత్వాన్ని మనకందించింది. అందులో ఒక అద్భుత ఆహారాన్ని తనలోంచి ఇచ్చింది. అది క్యారెట్ దుంప. మంచి ఆరోగ్యం కోసం పచ్చిదైనా ,వండినదైనా సరే తినమన్నది.

 క్యారెట్ ఒక కమ్మని ఆహారం. క్యారెట్.. పోషక విలువలు, ఔషధ తత్వం కలిగిన ఒక దుంప. ఇందులో 87% నీరు కలిగినా బి, సి ,డి ,ఈ విటమిన్లు, ధాతువులు కలిగిన ఒక మంచి ఆహారము. ఉత్తర భారతంలో ప్రాక్ పశ్చిమ దేశాలలో దుంపని కడిగి పచ్చిగానే ఎక్కువగా తింటారు. ఎందుకంటే అందులో విటమిన్ ఏ మరియు సీ లు ఎక్కువగా ఉన్నాయి. అవి కంటిని, చిగుళ్ళని రక్షిస్తాయి.
దానిలో బి6, పోలిక్ యాసిడ్, ధయామిన్ వంటివి ఉండడం వల్ల రక్త క్షీణత కు అంటే ఎనీమియాలో అద్భుతమైన రక్త వర్ధక ఆహారము. వండిన క్యారెట్ లో విటమిన్ ఏ తో పాటు పొటాషియం ,మెగ్నీషియం వంటి మనకి అవసరమైన ధాతువులుంటాయి. అందుకే నడివయసులో ఉన్న వాళ్ళు, పెద్దవాళ్లు క్యారెట్ రసం తాగడం రక్త వృద్ధికి అవసరం. మరో ముఖ్యమైన విషయం క్యారెట్ అతి సూక్ష్మమైన ముఖ్యమైన బీటా కెరోటిన్, ఆల్ఫాకేరోటిన్ వంటివి విశేషంగా కలిగి ఉండడం వల్ల శరీరానికి పోషక ద్రవ్యంగా, రక్షణ ఆహారంగా ముఖ్యంగా చర్మ సౌందర్యానికి ప్రతీకగా ఉపయోగపడుతుంది. దీనిలో క్యాల్షియం రక్తంలోకి సులువుగా గ్రహించబడుతుంది, కనుక ఎముకల బలం లేని వాళ్ళు, ఏ మందులకి తగ్గని కీళ్ల నొప్పులు కలిగిన వాళ్లు ఇది తినడం మంచిది. ముఖ్యంగా ఈ క్యారెట్లు బీటా కెరోటిన్, విటమిన్ ఏ, ఫైటో కెమికల్స్ ముఖ్యంగా ఉన్నాయి. ఈ పదార్థాలు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా ఇది చర్మం, ఊపిరితిత్తులు, జీర్ణాశయాలను క్రమ పద్ధతిలో ఉంచుతాయి. జీవకణాల అభివృద్ధికి ఈ పదార్థాలు అవసరం. అందుకే ప్రపంచంలో అన్ని దేశాలలో ఈ క్యారెట్ అంగీకరించబడిన ఆహారము. పచ్చిముక్కలు సలాడ్ గానో, రసం గానో , కూరగాయ గానో , పచ్చడి గానో వాడుతున్నారు. 

జీర్ణశక్తిని పెంచుతుంది ఈ క్యారెట్..

క్యారెట్ నుంచి లేత పచ్చని ఆల్కహాల్ రూపంగా విటమిన్ ఏ వెలువడుతుంది. ఈ విటమిన్ ఏ చర్మానికి, లోపలి పొరలకి, కంటి చూపుకి, జననేంద్రియాల
 సమర్ధతకు చాలా అవసరం. ఈ విటమిన్ ఏ చిలకడ దుంపలలో కూడా ఎక్కువగా ఉంటుంది.

 క్యారెట్ అంతర్గత శక్తిని పెంచుతుంది. క్యారెట్ ఎండవేడికి/ఫోటో సేన్సిటివిటి , చర్మం పాడైపోకుండా కాపాడుతుంది. మద్యం తీసుకున్నంక వచ్చే చెడు లక్షణాలను అరికడుతుంది. చిన్న చిన్న పుండ్లని మాన్పడంలో సహాయపడుతుంది. హృదయానికి శక్తినిస్తుంది. బీపీని తగ్గిస్తుంది. లివర్ని శుభ్రపరుస్తుంది. ఆయాసం ఉన్నవాళ్ళకి చాలా హితం చేస్తుంది. మాంసం, కండరాలు, చర్మం, వాటి సామర్ధ్యాన్ని పెంచుతుంది. చర్మం పై ముడతలు, మొటిమలు క్యారెట్ రసంతో తగ్గుతాయి. కడుపు కడుపుబ్బరాన్ని, అజీర్ణాన్ని తగ్గిస్తుంది. కంటి చూపును పెంచుతుంది.

క్యారెట్లలో అనేక రకాలు ఉన్నాయి..

ఆరెంజ్ క్యారెట్.. ముఖ్యంగా యూరప్ లోను, తూర్పు దేశాలలోనూ దొరుకుతుంది.
 పచ్చని క్యారెట్ ..కంటికి మంచిది, ఇది కూడా తూర్పు దేశాల్లో దొరుకుతుంది.
 ఎర్రని క్యారెట్ ..హృదయానికి మంచిది. ఇది ఇండియాలోనూ ,చైనాలోనూ దొరుకుతుంది.
 లేత ఎర్రని క్యారెట్ ..శక్తినిచ్చే క్యారెట్, ఇది టర్కీ దేశంలో దొరుకుతుంది .
తెల్లని క్యారెట్ ..చర్మానికి మంచిది, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ దేశాలలో దొరుకుతుంది.
 క్యారెట్ జీర్ణాశయాన్ని పూర్తిగా పాడు చేసే చోన్స్ డిసీజ్ / chohns disease చాలా ఉపయోగపడుతుంది. క్యారెట్ నమ్ముతుంటే నోట్లో లాలాజలం అంటే సలైవా ఊరి జీర్ణశక్తికి తోడ్పడుతుంది .
క్యారెట్ సూప్ వేడివేడిగా పిల్లలకు ఇస్తూ ఉంటే వాళ్లకి టాన్సిల్స్ వ్యాధులు తగ్గుతాయి. పిల్లలకు సుమారుగా రెండు వేల ఇంటర్నేషనల్ యూనిట్స్,
 పెద్దవాళ్లకి 5,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ ఏ అవసరము. అది ముఖ్యంగా క్యారెట్ వల్ల లభిస్తుంది. ఆడవారికి క్యారెట్ తినడం చాలా అవసరం. వాళ్లలో వచ్చేటటువంటి రుతుక్రమ వ్యాధులను తగ్గించడంలో ఇది బాగా ఉపకరిస్తుంది. ముఖ్యంగా నెలసరికి ముందు వచ్చే నడుము నొప్పి వంటి వాటికీ క్యారెట్ తినడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఈ మధ్య జరిపిన పరిశోధనలో క్యారెట్ ఆహారంలో ఎక్కువగా ఉపయోగించే వాళ్ళలో క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు, కీళ్ల నొప్పులు తక్కువ వస్తాయని తేలింది. ప్రతిరోజు క్యారెట్ రసం తాగుతూ ఉంటే కడుపులో క్రిములు బయటకు వెళ్లిపోతాయి. క్యారెట్ శరీరంలో ఉన్న నీటిని బయటకు పంపుతుంది. అందువల్ల మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు క్యారెట్ తినడం మంచిది. క్యారెట్ కమ్మని కూర మాత్రమే కాదు ,కనిపించకుండా సహాయం చేసే మంచి నేస్తం కూడా..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...